Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> సార్ధకత

sardhakata

ఆ రోజు ఏప్రియల్ 22వ తారీఖు.ప్రపంచ ధరిత్రి దినోత్సవం.ఆ సందర్భంగా ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుల,ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ధరిత్రి దినోత్సవ సభ ఏర్పాటు చేయబడింది.ఆ సభలోఆ రోజు ప్రాముఖ్యత గురించి విద్యార్ధులను ప్రసంగించమని సభాధ్యక్షులైన ప్రధానోపాధ్యాయులు విద్యార్ధులను కోరారు.   అంతేకాకుండా చక్కగా ప్రసంగించిన వారికి మంచి బహుమతులు ఉంటాయని తెలిపారు.ఆ సందర్భంగా ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది,ఆ దినోత్సవం చేసుకోవటంలో గల ముఖ్య ఉద్దేశ్యమేమిటి,

పుడమికి జరుగుతున్న హాని గురించి,అదే విధంగా రోజురోజుకి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు గురించి,ఇట్లా ఉష్ణోగ్రతలు పెరిగిపోవటానికి గల కారణాలు,పర్యావరణకు జరుగుతున్న హాని గురించి,పర్యావరణాన్ని పరిరక్షించుకోవడమెలా,అలాగే ప్లాస్టిక్ విపరీతంగా వాడటం వల్ల కలుగుతున్న పరిణామాలు,జల,నీటి,వాయు కాలుష్యాల వల్ల పర్యావరణ సమతుల్యత ఎంతగా దెబ్బతింటుంది, గాలిలోకి విడుదల అవుతున్న క్లోరోఫ్లోరోకార్బన్స్,వాటి వల్ల ఓజోన్ పొర దెబ్బతినటం,పర్యవసానంగా సూర్యుని నుంచి అతినీలలోహిత కిరణాలు సరాసరి భూమిపై ప్రసరించడం ద్వారా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడమే కాక అనేకరకాల చర్మవ్యాధులు,ఎలర్జీలకు కారణమవడం,అలాగే తరిగిపోయే శక్తివనరులు అయిన పెట్రోల్,సహజవాయువు భూమిలోపలనుంచి విపరీతంగా వెలికితీయటం ద్వారా అవి కొంతకాలానికి పూర్తిగా అడుగంటడేమేకాక భూకంపాలకు ఆస్కారం ఏర్పడటం,వృధాగా త్రాగునీరు వాడకం,చెట్లను విచక్షణా రహితంగా కొట్టివేయడం గురించి చక్కగా కొంతమంది ప్రసంగిస్తే,కొంతమంది వీటి నివారణ చర్యల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు చేపట్టవలసిన చర్యలు,నీటి సంరక్షణకై ఇంకుడుగుంతల తవ్వకం,ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ పద్దతులు గురించి,ఎప్పటికి తరగని శక్తి అయిన సౌరశక్తి వినియోగం గురించి,ఇందన కాలుష్యనివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి చక్కగా ప్రసంగించి ఉపాధ్యాయుల ,ప్రధానోపాధ్యాయుల మన్ననలు పొందడమేకాక వీరికే బహుమతులు ఖాయం అని అందరూ అనుకొన్నారు.

చివరగా రవి అనే విద్యార్ధి లేచి ఈ విధంగా ప్రసంగించడం ప్రారంభించాడు.

వేదిక నలంకరించిన ప్రధానోపాధ్యాయులకు,ఉపాధ్యాయులకు నమస్కారములు మరియు ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు.తోటి విద్యార్ధినివిద్యార్ధులకు ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు.నా తోటి విద్యార్ధులు చాలా మంది ఈ రోజు కి గల ప్రాముఖ్యత , ధరిత్రికి జరుగుతున్న హాని గురించి,పర్యావరణ సమతుల్యత దెబ్బతినటం గురించి,వివిధ రకాలైన కాలుష్యాల గురించి,విచక్షణా రహితంగా చెట్ల నరికివేత గురించి,అదే విధంగా వీటన్నింటి విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి చాలా చక్కగా వివరించారు. నేను వీటి గురించి ఏమి మాట్లాడుకోదలుచుకోలేదు అనే సరికి ఒక్కసారిగా ఉపాధ్యాయులలోను,విద్యార్ధులలోను ఒకటే కలకలం.అపుడు తిరిగి మాట్లాడటం ప్రారంభించాడు. 

మనం ఇట్లా ఎన్నో దినోత్సవాలు జరుపుకొంటున్నాము.ప్రతి దినోత్సవానికి ఎంతో ఆర్భాటంగా ఆ రోజు ప్రాముఖ్యత గురించి,చేపట్టవలసిన కార్యక్రమాలు గురించి ప్రసంగిస్తున్నాము.ఆచరణలో మాత్రం శూన్యం.అందుకే ఇటువంటి దినోత్సవాలు ఎన్ని జరుపుకొన్నా మార్పు శూన్యం.ఉదాహరణకు ఈ రోజే తీసుకొండి.ఉపాధ్యయులకు ఇచ్చిన తేనీరు ప్లాస్టిక్ గ్లాసులలో ఇచ్చాము.కాగితపు గ్లాసులలో ఇవ్వొచ్చుకదా!మనపాఠశాల ఆవరణలో గల చేతిపంపు దగ్గర నీళ్ళు తాగేటపుడు ఎన్ని నీళ్ళు వృధా చేస్తున్నాం,

ఆ వృధాగా పోయే నీటికి మార్గం చేసి ఇంకుడు గుంత చేసే ప్రయత్నమేమన్నా చేసామా!మన తరగతి గదులలో డస్ట్ బిన్ గా ప్లాస్టిక డబ్బాలనే ఉపయోగిస్తున్నాం,వాటి బదులు ఖాళీ అట్టపెట్టెలు ఉపయోగించవచ్చు కానీ అలా చేయటంలేదు.అలాగే బజారుకెళ్ళే ప్రతిసారి వాళ్ళిచ్చే ప్లాస్టిక్ కవర్లలలో సరుకులు వేసుకొని తీసుకొచ్చేస్తున్నాము,అలా కాకుండా ఒక జనపనార సంచి కొనుక్కొని ఆ సంచి పట్టుకెళ్ళి ప్రతిసారి ఆ సంచిలో తెచ్చుకోవచ్చుకదా,కానీ అలా చేస్తున్నామా!ఆయా దినోత్సవాలలో మొక్కలు నాటుతున్నాం,ఆ తర్వాత వాటి గురించి పట్టించుకొంటున్నామా,అందుకే ప్రతి మొక్క నాటేటపుడు ఆ మొక్కను ఒక్కో విద్యార్ధి దత్తత తీసుకోవాలి.

పాఠశాల నుంచి బయటకు వెళ్ళేంతవరకు ఆ మొక్క సంరక్షణ బాద్యత ఆ విద్యార్దే తీసుకోవాలి,ఆ విధంగా ఏమన్నా చేస్తున్నామా! ఇటువంటి చిన్నచిన్న పనులు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు మన వంతు సహాయం చేద్దాం , చేసి చూపిద్దాం, మీరు కూడా మీ వంతు సహాయసహాకారాలు అందిస్తారని ఆశిస్తూ చేతలలో చూపిద్దాం అని మరొకసారి మీ అందరికి విన్నవించుకొంటూ ఏమీ ప్రసంగించకుండానే ముగిస్తున్నా అనేసరికి సభా ప్రాంగణం కరతాళధ్వనులతో మార్మోగింది. ఆ తర్వాత రవి చెప్పినవి విద్యార్ధులందరూ తూ.చ తప్పకుండా పాటించి పాఠశాలలో ఆహ్లదకరమైన వాతావరణాన్ని నెలకొల్పారు. ఆ విధంగా రవి ప్రసంగానికి సార్ధకత చేకూరింది.

 

మరిన్ని కథలు
shobhayamana shobhanam