Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kadali serial

ఈ సంచికలో >> సీరియల్స్

అతులిత బంధం

 

గతసంచికలో ఏం జరిగిందంటే....http://www.gotelugu.com/issue161/459/telugu-serials/atulitabandham/atulitabandham-serial/

          తెలతెలవారుతుండగా మధు వాళ్ళ ఊరి పొలిమేరలలోకి ప్రవేశించింది, కార్తీక్ కారు. “ఐశూ, నిద్ర లే... వచ్చేసాం...” ఫ్రంట్ సీట్ లో వెనక్కి తల వాల్చి నిద్రపోతున్న ఐశ్వర్య భుజమ్మీద తట్టి లేపాడు.

          నిద్రభారంతో వాలిపోతున్న కనురెప్పలను ఓ సారి తెరచి అతని వైపు చూసి మళ్ళీ కళ్ళు మూసేసుకుంది, ఐశ్వర్య. కోరా రంగు కాటన్ డ్రెస్ లో వాలు జడలో సోలిపోయిన పూలమాలతో, రేగిన జుట్టుతో ఉన్న ఐశ్వర్యను చూస్తే ఎంతో ఇష్టంగా అనిపించింది అతనికి. కారు స్లో చేసి ఒక పక్కగా ఆపాడు.

          “ఐశూ... చూడు, లే... ఇదిగో ఈ నీళ్ళతో కళ్ళు కడుక్కో... వచ్చేసాం మధూ వాళ్ళ ఊరికి...” అని వాటర్ బాటిల్ అందించాడు. తెలివిలోకి వచ్చిన ఐశ్వర్య, నుదుటిపై పడుతున్న శిరోజాలనుపైకి తోసుకుంటూ అతన్ని చూసి చిరునవ్వు నవ్వింది.  ఇద్దరూ కారు దిగి బ్రష్ చేసుకున్నారు.

          “హమ్మయ్య... హాయిగా ఉంది కదూ!” అంది ఫ్రెష్ కాగానే...

          “అవును...” నవ్వాడు కార్తీక్, ఆమెను దగ్గరకు తీసుకుని చెక్కిలి ముద్దాడుతూ...

          “ఎంత బాగుందో కదా ఇక్కడ? ఇంకా సూర్యోదయం కాలేదు... పైరు పాపలు చిరుగాలికి తలలూపుతూ ఆడుకుంటున్నాయి... ఆహా... ఆ చెట్టు నిండా ఎర్రటి పువ్వులు చూడు కార్తీ... అద్భుతం కదా... అల్లదిగో అక్కడ చూడు ఆ తెల్లావు, దాని దూడా... చెట్టు కింద... ఎంత బాగున్నాయి?”

           “మనం ఇలా ఇక్కడే ప్రకృతిని చూస్తూ మురిసిపోతూంటే, అక్కడ మధూకి పెళ్ళి అయిపోతుంది... మరి మనం వెళ్లొద్దూ?”

          “అమ్మో వెళ్ళాలి... పద పద! అవునూ... బాగా అలిసిపోయావు కదూ డ్రైవింగ్ లో?”  అతని మీదికి వంగి, నుదుట ముద్దు పెట్టింది...

          నవ్వి, కారు స్టార్ట్ చేసాడు, కార్తీక్.

***

          పెద్ద తాటాకు పందిరి వేసి ఉంది ఆ ఇంటి ముందు. పందిరి రాటలకు కట్టి ఉన్న పచ్చని తోరణాలు అతిథులకు స్వాగతం పలుకుతున్నట్టు గాలికి తలలూపుతున్నాయి. పందిరి కింద వేసి ఉన్న పెద్ద ఎర్రని తివాచీ మీద కుర్చీలు వరసగా వేసి ఉన్నాయి.

కార్తీక్ కారు సరాసరి వచ్చి పందిరి పక్కనే ఆగింది.

          అప్పటికే నిద్రలేచి, ముఖం కడుక్కుని కాఫీ తాగుతూ కూర్చుంది మధుబాల.  గుమ్మం ముందు కారాగగానే, అరుగు మీదున్న  సోఫాలో కూర్చుని ఉన్న మధుబాల ఒక్క ఉదుటున అరుగు దిగి,   కారులోంచి దిగిన ఐశ్వర్యను రెండు చేతులతో చుట్టేసింది... ఇద్దరి కళ్ళూ చెమ్మగిల్లాయి. చెలి కౌగిలి విడిపించుకొని, కార్తీక్ వైపు చూస్తూ, “రండి...ప్రయాణం బాగా జరిగిందా?”  అంది మధుబాల  ఆహ్వానిస్తూ.

          చిన్నగా నవ్వి, తలపంకించి, లోపలి వచ్చాడు కార్తీక్ తమ సూట్ కేసులతో. ఈలోగా వచ్చిన గిరి వారిని లోపలి తీసుకువెళ్ళి గదిలో సామాన్లు పెట్టించాడు.

          “ఐశూ, ప్రయాణం బాగా జరిగిందా? ముఖాలు కడుక్కుని ఫ్రెష్ అవండి లోపల...” అంది మధుబాల.

          “ఉహు, ముందు నిన్ను బాగా చూసుకోనీ...” అంటూ పక్కనే కూర్చుని మధును వాటేసుకుంది మళ్ళీ. పరీక్షగా చూస్తూ, “ఎంత బాగున్నావే! పెళ్లి కళ అంటే ఇదే కాబోలు...” అంది బుగ్గలు పుణుకుతూ.

          స్వల్పంగా సిగ్గు పడింది మధుబాల.  “బుగ్గలు మరీ ఎర్రబడుతున్నాయి... నేనే అబ్బాయిని అయుంటేనా? వేణూకి దక్కనిచ్చే దాన్ని కాదు...” అంది మేలమాడుతూ...

          “ఐశ్వర్యా, కబుర్లు తర్వాత కానీ, ముందు లోపలికి రామ్మా... మీరు ఆ గదిలో ఫ్రెష్ అవండి...” పూర్ణమ్మ నవ్వుతూ చెప్పింది.

          మరో అరగంట తరువాత చక్కగా రెడీ అయి వచ్చి కుర్చీల్లో కూర్చున్నారు, కార్తీక్, ఐశ్వర్య. ఫలహారం వేడి వేడి పొంగల్, మినపగారెలు వాళ్ళ దగ్గరకి వచ్చేసాయి...

          టిఫిన్లు అవగానే “అమ్మా ఐశ్వర్యా, నేను మధూ చిన్నక్కను. నీకు కాఫీ యా, టీ యా? మీ ఆయన ఏం తాగుతారు?” అని అడిగింది చారుశీల.

          ‘అబ్బే మా ఆయన కాదు...’ అని చెప్పబోయి నవ్వుకుని మానేసింది ఐశ్వర్య.  “ఇద్దరం కాఫీయే తాగుతాం చిన్నక్కా...” అంది వరస కలిపేస్తూ...

          చిరునవ్వుతో కాఫీలు అందజేసింది చారుశీల.

          మధ్యాహ్నం ఖాళీ దొరికినప్పుడు, అన్నపూర్ణ అందజేసిన కానుకను మధుబాలకు ఇచ్చింది ఐశ్వర్య. ఆ చీరను కళ్ళకు అద్దుకుని జాగ్రత్తగా తన పెట్టెలో దాచుకుంది మధుబాల.

          “తల్లి మనసు అందరికీ ఉండదు ఐశూ... ఆవిడ అందరినీ తన వాళ్లుగా ప్రేమిస్తారు. దానికి నోచుకున్న మనం అదృష్టవంతులం... ముఖ్యంగా నీ గురించి నాకు ఇదివరలో చాలా భయాలు, బెంగలూ ఉండేవి... కానీ ఇప్పుడు అవి లేవు... నీకు అండగా పిన్నిగారున్నారు... ఎట్టి పరిస్థితులలోనూ ఆవిడని దూరం చేసుకోవద్దు ఐశూ...” చెమ్మగిల్లిన కళ్ళు రుమాలుతో అద్దుకుంటూ చెప్పింది మధుబాల.

          “నిజం మధూ... ఆవిడే లేకపోతే నేను ఏమై పోయేదాన్నో!” తనలో తాను అనుకుంటున్నట్టుగా చెప్పింది ఐశ్వర్య.

***

          “ఏమిటమ్మా ఇది? ఇలాంటి చీరలు నేనైతే ఎప్పుడూ కట్టలేదు..” విడిదింట్లో చీరను మంచం మీదికి విసిరి కొడుతూ అన్నది వినత, ఉక్రోషంగా  ముక్కు ఎగబీలుస్తూ...

          “ష్! ఏమిటే ఈ అల్లరి? తప్పు కదూ?? చక్కగా ఉన్నాయి చీరలు... వంక పెట్టేందుకు లేదు... ప్లీజ్ గొడవ చేయకు...” సముదాయించింది సురేఖ.

          “అమ్మా,  ముదినాప సానీ... నీకు నచ్చితే నువ్వు కట్టుకో... నాకు నచ్చలేదు... పెద్దాళ్ళ చీరలా ఉంది... అమ్మా, నాకు పెట్టిన ఈ పట్టుచీరను తిరగ్గొట్టి మంచిది తెప్పించవే!” హఠం చేస్తూ, తల్లితో  అన్నది వినత.

          “చిన్నపిల్లవా విన్నూ? మనం పట్నం వాళ్ళమనీ, మనకి సంస్కారం ఎక్కువనీ అనుకుంటున్నారు వాళ్ళు. ఆఫ్టర్ ఆల్ చీర కోసం పిచ్చి గోల చేస్తే మనం వాళ్లకి చులకన అయిపోతాం... నీకు ఎన్ని చీరలు కావాలో, ఎలాంటివి కావాలో అన్నీ నేను కొనిస్తానురా... నా మాట వినురా బంగారు తల్లీ...” బుజ్జగించింది సుగుణమ్మ.

          ఎలా అయినా గొడవ చేయాలని అనుకున్న వినత ఆటలు సాగలేదు.

          “నేను అన్నం తిననమ్మా ఈ రోజు... మరీ ఓవర్ చేస్తున్నారు మీరు... ఏంటి ఆ పెళ్ళి వాళ్ళని వెనకేసుకు వస్తారు?” అంది కోపంగా.

          “పిచ్చి తల్లీ... వాళ్ళు పరాయి వాళ్ళు కాదమ్మా... మీ అన్నయ్యకి అత్తారు... వాళ్ళ పరువు తీయాలని అనుకుంటే, మన పరువే పోతుంది కదమ్మా? నా బంగారు తల్లి కదూ? ఇదిగో నువ్వు అడిగావని ప్రత్యేకంగా పూరీ కూరా పంపించారు... రా.. కాస్త నోట్లో వేసుకుందూ...” మళ్ళీ చెప్పింది సుగుణమ్మ.

          “ఏమిటి, మా యువరాణి వినతా దేవిగారి ఆగ్రహానికి కారణాలు తెలుసుకోవచ్చునా?” అప్పుడే స్నానం చేసి వచ్చిన వేణు అడిగాడు నవ్వుతూ.

          ముఖం కందగడ్డలా చేసుకుని కూర్చున్న వినత మాట్లాడలేదు.

          “ఏమిటి ఇంకా అలాగే కూర్చున్నారు? అందరూ టిఫిన్లు కానివ్వండి... చాలా పనులున్నాయి...” అంతా గమనిస్తున్న గోవర్ధనరావు వరండాలోంచి లోపలికి  వస్తూ గట్టిగా చెప్పటంతో, ఏమీ చేయలేక టిఫిన్ ప్లేట్ చేతిలోకి తీసుకుంది వినత.

          “అద్భుతంగా ఉన్నాయి టిఫిన్స్... అరె... ఇదేమిటీ, నీకు స్పెషలా?” పక్కనే కూర్చుని అడిగాడు పవన్. “ఊ, చాల్లెండి... టిఫిన్ల మొహం ఎరగనట్టు...” తగ్గుస్వరంతో ఈసడింపుగా అన్నది వినత.

          ‘ఈ బ్రహ్మ జెముడు మొక్క పెళ్ళయే వరకూ ఏమీ గొడవ చేయకుండా ఉంటే బాగుండును...’ మనసులోనే వేయి దేవుళ్ళకు మొక్కుకున్నాడు పవన్.

***

          రాత్రి భోజనాలు అయ్యాక, పెళ్ళి ఏర్పాట్లు కొనసాగాయి. ఐశ్వర్య, కార్తీక్ కుతూహలంగా ప్రతీ తంతునూ గమనిస్తున్నారు.

          మధుబాలకు పూల జడవేసి, నుదుట కళ్యాణ తిలకం దిద్ది, దానిపైగా బాసికం అలంకరించారు. కుంకుమ రంగు పట్టు చీరలో, జరీ బుటాల మధ్య మిలమిలా మెరిసిపోతోంది మధుబాల. బుగ్గన చుక్క ఆమె అందానికి దిష్టి తీసే బాధ్యతను తాను స్వీకరించింది. గోరింట పండిన అరచేతులలో పచ్చని కొబ్బరి బొండాన్ని పట్టుకున్న ఆమెను, మేనమామలు బుట్టలో కళ్యాణ వేదిక దగ్గరకు తీసుకువచ్చారు.

          సిగ్గు తెరల మేలిముసుగు చాటుగా మధుబాల ముఖారవిందం, నీలి మేఘ మాలల మధ్యన భాసిస్తున్న చంద్రబింబంలా అనిపిస్తోంది...

          వధువు లోని  ఆ సోయగాన్ని కన్నార్పకుండా తిలకిస్తోంది ఐశ్వర్య... ‘ఆడపిల్లకు వివాహమన్నది ఒక మధుర ఘట్టమే సుమీ...’ అనుకోకుండా ఉండలేకపోయింది ఆమెలోని కన్నె మనసు.

అనుకున్న ముహూర్తానికి నిర్విఘ్నంగా పెళ్ళి జరిగిపోయింది. బంధుమిత్రుల ఆశీర్వచనాలు, అక్షింతల మధ్య మధుబాల పచ్చని మెడలో మూడు ముళ్ళూ వేసాడు, వేణుగోపాల్.

*** 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nagalokayagam