Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 27th may to 2nd june

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వరప్రసాద రావు

sahiteevanam
పాండురంగ మాహాత్మ్యము

తెనాలి రామకృష్ణుడు పాండురంగమాహాత్మ్యంలో
కాశీ పట్టణాన్ని వర్ణిస్తున్నాడు, కావ్య ప్రథమాశ్వాసంలో.
ఒక్కసారి కాశీ దర్శనం చేసుకుని, కాశిలో తనువును 
వదిలిపెట్టినవారికి లభించే ప్రసాదం ఏమిటో 
చెబుతున్నాడు.

ఆనందకాననంబున
నా  నందకపాణి కేశవాహ్వయమునఁ బెం
పానందగు, ముక్తిప్రమ
దానందిత హారనీల తరళోపముడై              (కం) 

కాశీలో మరణిస్తే, ఆ ఆనందవనమున(కాశీలొ) ఆ కేశవనామధేయుడైన నందకపాణి  (శ్రీమహావిష్ణువు) సన్నిధి అనే  ఆనందం లభిస్తుంది, ఆయన రక్షణ కలుగుతుంది. ముక్తికాంత ముచ్చటపడే ముత్యాలహారంలోని నీలపు కొలికిపూస, నీలమణిలాగా  శోభించే అదృష్టం కలుగుతుంది. కాశీలో మరణించేవారికీ సాక్షాత్తూ ఆ కాశీపురాధీశుడే చెవిలో శ్రీరామనామతారకమంత్రాన్ని ఉపదేశిస్తాడు అని ప్రతీతి. కనుక ముక్తి ఖాయం! ఆ రాముడే ఆ  శ్రీహరి కనుక నందకపాణి ఐన కేశవుని సన్నిధి కలుగుతుంది అనలేదు  తెనాలి రామకృష్ణుడు. ఒక ఆధ్యాత్మికమైన రహస్యాన్ని ధ్వనించాడు. 'సర్వదేవ  నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి' అని శృతి. కేశవుడు అంటే త్రిమూర్త్యాత్మకమైన 
పరతత్త్వము అని నిర్వచనము. 'క'కార 'శ'కార 'వ'కారములకు త్రిమూర్తులు అని  సూచన, కనుక శివుని పట్టణములో మరణం, రామనామ బోధ, విష్ణులోక ప్రాప్తి, అదీ  హైందవ సమన్వయసారదృష్టి అని చెప్పడంకోసం 'కేశవాహ్వయము' అని అన్నాడు  రామకృష్ణుడు.

శ్రీకరోదయ వధూలోకాననప్రభా / నాటిత బహుచంద్ర నాటకంబు 
సమ్మర్దగళిత భూషారత్న మంజరీ / యోజిత రథ్యా ప్రపూజనంబు 
కైలాసశైలసంకాశ సౌధనివేశ / కౌముదీ కవచిత గగనతలము 
విస్తీర్ణవిపణి విన్యస్త వస్తువ్రజ / ప్రకటిత రత్నగర్భా జఠరము               (సీ)

విపుల పవమానతాండవ వేపమాన 
లాంఛనధ్వజ పట్టపల్లవలలామ 
మౌళిరచిత కళాకృత్య హేళిహయము 
దీపితంబగు శ్రీకాశికా పురంబు                (తే)

ఎక్కడైనా ఒక్కడే చంద్రుడు, ఆకాశంలోనైనా, కైలాసంలోనైనా, కానీ, కాశీలో ఎందఱో  చంద్రులు! శ్రీకరములైన అక్కడి స్త్రీల వదనములనే వేల చంద్రుల ప్రభలు నటించే నాటకరంగస్థలము కాశీ. జనసమ్మర్దంచేత క్రిక్కిరిసిపోయిన వీధులలో ఒకరినొకరు  తోసుకుంటూ నడవడంతో జారి, రాలిపడిన నగల, రత్నాల రాశులతో పురవీధులకు పూజ జరుగుతున్నదా అన్నట్టున్న బహుజనవాసభూమి కాశి.  కైలాస పర్వత శిఖరములాగా  ఆకాశాన్ని అంటే సౌధముల కాంతులు అనే వెన్నెలలతో నిండిన గగనతలము గలది కాశి. విశాలములైన విపణి వీధులలో ఉన్న రత్నాలచేత అది రత్నగర్భ అని ప్రకటమౌతున్న పట్టణము కాశి. గంగాతరంగిణులమీదుగా వీస్తున్న గాలులకు కదిలి నాట్యమాడుతున్న సౌధాగ్రములమీది  పట్టుజెండాలు సూర్యుని రథాన్ని లాగే గుర్రాలను అదిలించడానికి ఝళిపిస్తున్న  కొరడాలలాగా ప్రకాశించే దివ్యమైన పట్టణము కాశీ.  యిది సరే, ఆ జెండాలు సూర్యుడి రథాశ్వాలను అదిలించే కొరడాలు అన్నట్టు ఉండడం  ఏమిటి? సూర్యుడు సాక్షాత్తూ నారాయణుడు కదా, అంటే, ఒక  చిన్ని ఐతిహ్యాన్ని ధ్వనించడానికే, ఉద్దేశ పూర్వకంగా ఈ పోలికను తెచ్చాడు రామకృష్ణుడు అని ఈ వ్యాసకర్త  ఊహ. ఒకప్పుడు సూర్యుడు శివభక్తుడు ఒకరికి హానిచేసి, శివుని ఆగ్రహానికి గురి అయినాడు. కోపించిన పరమశివుడు ఫాలనేత్రాన్ని తెరిచి 'సూర్యుడిని దహించాడు'. సూర్యుడు కూడా  తట్టుకోలేని వేడి చూపులవాడు, వేడినవారిని ఎవరినైనా కరుణతో చూసే చల్లని చూపులవాడు  పరమశివుడు. ఆ వేడిమికి తాళలేని సూర్యుడు ఆకాశంనుండి రాలిపడి, గంగాతీరంలో బాధతో 
పొర్లింతలు పెట్టిన స్థలమే 'లోలార్కగుండం'గా పిలువబడుతుంది. మరొక ఐతిహ్యం ప్రకారం  శివుని ఆజ్ఞమేరకు కాశీపట్టణాధీశుడైన 'దివోదాసు' అనే మహాధార్మికుడిని పరీక్షించి, భ్రష్టుడిని  చేసి, ఆ పాపకారణంగా కాశీ పట్టణాన్ని నిర్జనంగా చేయడానికి వచ్చిన సూర్యుడు కాశీపట్టణాన్ని  విడువలేక కాశీలోలుడై తిరిగి తిరిగి అక్కడే ఉండిపోయాడు. కనుక అలా కూడా కాశీకి,  కాశీపురాధీశుడికి వశుడు, లోలుడు సూర్యుడు, కనుక ఆయన గుర్రాలూ లోకువే అంటే  ఆశ్చర్యమేముంది?   

జలజపరాగ రాగరస సంగతమౌ పరిఖాజలంబు లో
పలఁ బ్రతిబింబితంబులగు బంగరుకోటకుఁ బెట్టినట్టి కొ
మ్మల చెలువంబునం బురిరమారమణీమణియొప్పు, రావియా
కులమొలనూలు వెట్టెననఁ గోరి కనుంగొనువారు మెచ్చగన్         (చ)

ఆ  పట్టణంచుట్టూ అగడ్త ఉన్నది. ఆ అగడ్తలో నిండుగా నీరు ఉన్నది. ఆ కొలనువంటి నీటిలో తామరపూవులు ఉన్నాయి, మొసళ్ళకు బదులు, బహుశా! ఆ తామరపూవుల పుప్పొడి రేణువులు దట్టంగా కలిసి నీరు పచ్చబడ్డది. ఆ నీళ్ళలో బంగారపు రంగులో మెరిసిపోతున్న కోట కొమ్మలు బురుజులు ప్రతిబింబిస్తున్నాయి. యింతవరకూ మంచికవి ఎవడైనా ఊహానేత్రాలతో చూసి  వర్ణిస్తాడు, విచిత్రమేమీ లేదు. కానీ తెనాలి రామకృష్ణుడు మహాకవి. రసద్రుష్టితో చూసి వర్ణచిత్ర రచనచేస్తున్నాడు పలుకుల కుంచెతో! నీటిలో ప్రతిబింబించే వస్తువులు చూసేకంటికి అద్దంలో చూస్తున్నట్టు, అటువి యిటుగా,  తలక్రిందులుగా కనిపిస్తాయి. పైకి తలలు లేపిన కోటకొమ్మలు, నీళ్ళలో క్రిందికి చూస్తున్న  శిఖరాలతో, బురుజులతో కనిపిస్తున్నాయి. కోటబురుజులు ఆ శిఖరాల మధ్యన ఖాళీలతో  ఉంటాయి పహరా కాసేవారికి వీలుగా, గాలి వీయడానికి వీలుగా, యుద్ధసమయాలలో  ఫిరంగులు, శతఘ్నులు ఉంచడానికి వీలుగా. నీళ్ళలో అవి తలక్రిందులుగా బిళ్ళలు బిళ్లలుగా,  రావియాకులలాగా కనిపిస్తాయి కనుక, బంగారు రంగులో ఉన్న కోట బంగారురంగులోనున్న  'ఆ పట్టణము అనే సుందరి యొక్క కటిభాగములాగా' ఉన్నది. మొలనూలుకు, మొలత్రాడుకు  రావి ఆకు మాదిరి ఉన్న, నగిషీలు చెక్కిన బంగారపు బిళ్ళలు, అలంకారాలు ఉంటాయి కనుక,  నీళ్ళలో ప్రతిబింబించి, తలక్రిందులుగా కనిపిస్తున్న కోట శిఖరాలు మొలనూలుకు ఉన్న  రావి  ఆకులలాగా కనిపిస్తున్నాయి. ఎంత సరసమైన, నిశితమైన, సహజమైన పరిశీలన, వర్ణన!  యింతటి ప్రతిభ, వ్యుత్పత్తి, పాండిత్యం ఉన్న తనను కేవలం ఒక విదూషకునిగా, వికటకవిగా  భావించినవారికి చెంపదెబ్బగా పట్టు సడలకుండా, మొదటినుండీ చివరిదాకా సమాన ప్రతిభతో,
రసపోషణంతో, బిగితో కొనసాగించాడు రామకృష్ణుడు పాండురంగమాహాత్మ్యాన్ని. తన జన్మతహా  సహజసిద్ధమైన వ్యంగ్యము, మొహం పగులగొట్టే విమర్శనా రీతిని ప్రక్కనబెట్టి చేసిన గంభీరమైన  రచనలలో తెనాలి రామకృష్ణుడి కవన విశ్వరూపం కనబడుతుంది, కట్టిపడేస్తుంది. యింతటి  ఉన్నతమైన వర్ణన చేసినవెంటనే వచ్చే పద్యంలో ఆయన చమత్కార, హాస్య దృష్టి కనిపిస్తుంది!

పెరిగిన త్రివిక్రమేశ్వరు 
చరణ తులాకోటి యతఁడు సంహృతదేహ 
స్ఫురణుండగునపుడూడిన 
కరణిం బురికోటయొప్పుఁ గనకమయంబై     (కం)

శ్రీహరి వామనావతారంలో త్రివిక్రముడై పెరిగినప్పుడు ఆయన కాలికి ఉన్న బంగారు కడియము  అదీ పెరిగింది, ఆ కాలికి తగినట్టు. ఆయన ఒక్కసారిగా మళ్ళీ వామనుడిగా మారేప్పటికి ఆ  పెద్దకడియము వదులై జారి నేలకు పడిపోయిందా అన్నట్టు అంతటి ప్రకాశముతో దివ్యంగా  మెరిసిపోతున్నది కాశీపట్టణం. త్రివిక్రముని కంకణం వామనుని కాలికి తగినట్టు చిన్నగా మారడం  మానేసింది, ఆ వంతున పెరిగేప్పటికి కళ్ళు బైర్లుకమ్మాయో, ఆవిశ్వరూపవీక్షణానందపారవశ్యంతో   మైమరిచిపోయిందో! 'భారతీయుల' అత్యుత్తమ చలనచిత్రాలలో ఒకటి ఐన 'మాయాబజార్'లో  ఘటోత్కచుడు శరీరాన్ని బాగా పెంచి, 'వివాహభోజనంబు' చేసి, తన గదకోసం ప్రక్కన అటూ  యిటూ తడుముకుంటాడు. శరీరముతోపాటు గద పెరగలేదు కనుక, ఎక్కడో బుల్లిగా 'గింతంత' ఉన్న గద చిన్న పుల్లలాగా కనిపిస్తుంది అతని కంటికి, హాయిగా నవ్వుకుంటాడు, అదేరకమైన  హాస్య ప్రస్తావన, చమత్కారం దాదాపు నాలుగువందల సంవత్సరాలక్రితం సాహిత్యపరంగా  యిలా చేశాడు తెనాలి రామకృష్ణుడు!   

(కొనసాగింపు వచ్చేవారం)

***వనం వేంకట వరప్రసాదరావు 
మరిన్ని శీర్షికలు
White Hair? | Grey Hair?