Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sookshmamlo moksham

ఈ సంచికలో >> కథలు >> ముందడుగు

mundadugu

ఎండలు మండిపోతున్నాయి. సిటీలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోతున్నాయి. కిటికీ గుండా వీచే వేడిగాలులకు చెంపలు మండిపోతున్నాయి. ఏ సీ లు; కూలర్లు చాలడం లేదు. పగలు పదినుంచి సాయంత్రం అయిదు దాకా బయటికెళ్ళడానికి ధైర్యం చాలడం లేదు.వడగాడ్పులు...భానుని భగభగలు...అగ్నిగుండంలాగా సెగలు... వడదెబ్బకు రోజూ పదుల సంఖ్యలో మృతులు. పైన సెగ; కింద సెగ; చుట్టూ వేడిగాడ్పులు...శరీరంలో మంటలు.'రెడీ అయ్యారా? టైమవుతోంది...మీ పల్లెకి పోవడానికి...   ఎండ ముదరకముందే బయలుదేరండి.  " అరగంటనుంచి తొందర చేస్తోంది  మా ఆవిడ.  ఎండ తీవ్రతకు తను రానంది.

ఈ వేడికి నాకూ వెళ్ళాలని లేదు కానీ పూర్ణ మరీ మరీ చెప్పాడు. అదీ కాక ఎప్పుడో వదిలేసిన నా పుట్టిన పల్లెను చూడాలని ఉబలాటంగా వుంది.  పాత మిత్రుల్నీ కలవవచ్చు. పల్లెను వీడి చాలా కాలమే అయినా; ఇప్పుడు తల్చుకుంటే ఎందుకో ” నాపల్లె” అన్న భావన కలుగుతోంది. ఆ భావనే మధురంగా ఉంది. బహుశా ఆ పల్లెలో పుట్టాననే అభిమానమే అందుకు కారణం కావచ్చు."జనని - జన్మభూమి" సెంటిమెంట్ కావచ్చు.   అందుకే కాబోలు; మా ఆవిడ రానన్నా, హుషారుగానే బయలుదేరాను. ఈ వేళ మా పల్లెలో "ద్రౌపది కల్యాణం" హరికథ. ప్రతి వేసవిలో మావూరి గుడిలో పద్దెనిమిది  రోజులుపాటు “మహాభారతం” హరికథ చెప్పడం పరిపాటి.  ఈ కార్యక్రమం చేస్తే వర్షాలు పుష్కలంగా కురిసి; పంటలు బాగా పండుతాయని గ్రామస్థుల నమ్మకం.  అందులో ద్రౌపది కల్యాణానికి విశిష్టత వుంది. ఆ  కార్యక్రమాన్ని చాలా గొప్పగా చేస్తారు.  అంతే కాదు. ద్రౌపదమ్మ ఆ రోజు తమ ప్రత్యేక కోరికలు తీరుస్తుందని భక్తుల నమ్మకం. అందుకే మిగతా రోజులుకంటే ఈ రోజు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

అసలు ఆ పల్లెకు నాకు బంధం తెగిపోయి సుమారు నాలుగు దశాబ్దాలయిపోయాయి. నా చదువులకోసం వున్న పొలం; ఇల్లు-వాకిలి అమ్ముకుని పట్నానికి వచ్చేసి చాలా కాలమయింది. పట్నంలోనే నా చదువులు; ఆ తర్వాత వివిధ ప్రాంతాల్లో వుద్యోగం… ఆ పల్లెకు వెళ్ళాల్సిన అవసరం లేకపోయింది. ఆ వూరికి  వి. ఏ. ఒ. గా వున్న మా నాన్న పోవడంతో ఆ వూరితో బంధం పూర్తిగా తెగిపోయిందనే చెప్పాలి.     నేను గత సంవత్సరమే రిటైరయి; పట్నంలోనే సెటిలయిపోయాను.

కానీ వున్నట్టుండి నా పాత మిత్రుడు - పూర్ణ  నిన్న బజార్లో   కనపడి పల్లెలో     రేపు  “ ద్రౌపదికళ్యాణం “ హరికథ జరుగుతోందని రమ్మని ఆహ్వానించాడు.  పాతమిత్రుల్ని కలవ వచ్చునని; అదీ కాక నేను పుట్టిన పల్లెను ఒకసారి చూడాలనిపించి సరే నన్నాను. బస్ ముందుకు కదుల్తుంటే; నా   ఆలోచనలు వెనక్కి వెళ్తున్నాయి. నలభైయేళ్ళ క్రితం  పల్లె రూపురేఖలు నా కళ్ళ ముందు కదలాడుతున్నాయి. అప్పటి నాపల్లె...వూరి బయటి ఆ మర్రి చెట్టు; వూరవతల పెద్ద చెరువు; మరో పక్క ఏటిగట్టు; చుట్టూ పచ్చని పొలాలు...మరోపక్క ఎత్తైన గుట్టలు - ఆ మనోహర దృశ్యం ఇప్పటికీ నా కళ్ళ ముందు సజీవంగా నిలబడుతున్నాయి.

ఆ మర్రిచెట్టు నీడలో మేమాడుకున్న ఆటలు;    ఊడల్తో వూగిన వుయ్యాలలు; ఎండాకాలంలో ఆ చెట్టు నీడలో సేదదీరిన రోజులు గుర్తుకొస్తున్నాయి. ఆ చెరువుగట్టున కూర్చొని సూర్యాస్తమయాల్ని చూస్తూ ముచ్చటపడేవాళ్ళం. ఎండాకాలం   సెలవులొస్తే మాకు పండగే. ఏట్లో ఈతకొట్టేవాళ్ళం. చేపలు పట్టేవాళ్ళం. పక్కింటి దొడ్లో జామకాయల్ని కొట్టేసేవాళ్ళం. మామిడికాయల్ని దొంగిలించి ఉప్పుకారంతో నంజుకొని తింటూ చెరువుగట్టూ చుట్టూ పచార్లు చేసేవాళ్ళం. దొంగచాటున చెరుకు గడలు ఇంచుకొని; ఎవరికి కనబడకుండా ఏటివారకు వెళ్ళిపోయేవాళ్ళం.   వేరుశనిక్కాయల చెట్లను పీక్కుపోయే దొంగతనంగా తినేవాళ్ళం.  ఎవరికంటైనా పడితే అందకుండా పరిగెత్తేవాళ్ళం. అదో కాలం. అందమయిన బాల్యం.  తీపి గుర్తులు. ఆ రోజులే వేరు.  తిరిగిరాని మధురమైన ఙాపకాలు.

ఊరి మధ్యలో మంచినీళ్ళ బావి వుండేది. ఆ బావి నీళ్ళు కొబ్బరినీళ్ళలా తేటగా; తియ్యగా ఉండేది. ఎంత కరువొచ్చినా ఆ బావి ఎండిపోయేది కాదు.

ప్రతి ఇంట పాడి సమృద్ధిగా ఉండేది. ఇంటికై మిగిలిన పాలను డైరీకి పోసేవారు. అలా  ఆదాయాన్ని పెంచుకునేవారు. .  ఆ సహకార డైరీ కూడా లాభాల్లో నడిచేది. ఆ సంస్థ పాల ఉత్పత్తులకు ఇతర రాష్ట్రాలలో మంచి డిమేండ్ ఉండేది. వందమందికి పైగా ఉపాధి ఉండేది. ఇంటికి ఎవరొచ్చినా చెంబుతో చల్లని మజ్జిగ ఇచ్చేవారు.

ఎండాకాలమయితే మజ్జిగ, అంబలి చలివేంద్రాలు ఏర్పాటయ్యేవి. ఒక్కొక్కసారి ఆ అంబలి తాగేసి బావుల్లోనో; ఏట్లోనో; చెరువులోనో ఈతకొట్టేవాళ్ళం. ఎంతసేపు కొట్టినా తనివి తీరేది కాదు.ఎండకు చల్లని నీళ్ళల్లో భలే మజాగా వుండేది. కనుచూపుమేరలో కొబ్బరి, టేకు, అరటి, తాటి, చెరకు, మామిడి తోటలతో పచ్చ పచ్చగా ఎంతో కనువిందుగా ఉండేది. ఎప్పుడూ ఊరంతా ఏవో పంటలతో కళకళలాడుతూ ఉండేది. వ్యవసాయ పనుల్లో; పశువులతో అందరూ బిజి బిజీగా వుండేవారు. కులవృత్తులవారికి చేతినిండా పని వుండేది. అందరూ పగలంతా కష్టపడి; రాత్రంతా కంటినిండా నిద్రపోయి ఆరోగ్యంగా ఉండేవారు.

అలాంటి సుభిక్షమైన నా పల్లె ఇప్పుడెలా ఉందో...? ఈ లిబరలైజేషన్; గ్లోబలైజేషన్ తర్వాత రూపురేఖలు ఎలా మారిపోయాయో?  చూడాలి- అనుకుంటూ నా మనసంతా ఆందోళనగా ఉంది. ఊరు దగ్గర పడింది. నాలో కూడా టెన్షన్ మొదలయింది. అదిగో...సహకార డైరీ...ఏదీ? అప్పట్లో సహకార రంగంలో  స్థాపించి   ఆది నుంచి లాభాల బాటలో నడిచి జిల్లాకే తలమానికమైన  ఆ  "డైరీ" ఏదీ?  మొండి గోడలు; తుప్పుపట్టిన వాహనాలు; విరిగిపోయి గాలికి వూగుతున్న బోర్డ్... దర్శనమిస్తున్నాయి అక్కడ.

"డైరీకి ఏమయింది?"   ఆతృత నణుచుకోలేక పక్కాయన్నడిగాను.

"ఇంకా ఏం డైరీ. ఎప్పుడో మూతపడింది" అన్నాడతను. ఆశ్చర్యపోయాను.  నేనాశ్చర్యం నుంచి తేరుకోకముందే వూర్లో  బస్సాగింది.

"అరె! ఇక్కడ పెద్ద మర్రిచెట్టుండాలే."      బస్ దిగి చుట్టూ పరికిస్తూ అడిగాను. .

"మర్రిచెట్టా...?  ఎప్పటి మాట... రోడ్ వెడల్పు  చేసేటప్పుడు అడ్డమని  కొట్టేసి చాలా కాలమయింది. " అన్నారెవరో.

మళ్ళీ షాక్కు గురయ్యాను.     ఎంత విశాలమైన చెట్టు. ఎంత నీడనిచ్చేది. ఎంత గాలినిచ్చేది. మనసు బరువెక్కింది. ఎండ తీవ్రంగా ఉంది.     సూర్యుడు పగబట్టినట్లు నిప్పులు చెరుగుతున్నాడు.  నోరెండిపోతోంది. ఇంతలో "భానూ! బాగున్నావా?" భుజంపైన చేయి వేశాడు  పూర్ణ.

"బాగున్నాను రా" అన్నాను చేయి కలుపుతూ. 

"రావనుకున్నాను. వచ్చావు. సంతోషం. రా. ఇంటికి పోదాం." అంటూ ముందుకు కదిలాడు. నేనూ అనుసరించాను. ఫర్వాలేదు. వూరు బాగా డెవలప్ అయినట్లుంది.  కరెంట్ వచ్చింది. రెండంతస్తుల బిల్డింగ్స్ బాగా పెరిగాయి. షాపులు; హోటెల్స్ పెద్దవయ్యాయి. రోడ్లు వెడల్పయ్యాయి. ఆటోలు పడ్డాయి. టూ వీలర్స్ బాగా పెరిగాయి. కార్లూ కనిపించాయి. ప్రతి చేతిలో సెల్ పోన్లు; ప్రతి ఇంట టీ వీ లు, ఇంటర్నెట్లు ఉన్నాయి. ప్రతి ఇంటికి ట్యాప్   కనెక్షన్స్ వున్నాయి. రెండు;మూడు ఫ్యాక్టరీలు పడ్డాయి. నా పల్లె ఎంతో అభివృద్ధి అయింది. మాటల్లోనే పూర్ణ ఇంటికి చేరుకున్నాం.  ఫ్యాన్లు తిరుగుతున్నా చెమటలు పడుతున్నాయి. గాలి పూర్తిగా  స్థంభించిపోయింది. ఉక్కపోతలోనే    చిన్ననాటి కబుర్లు చెప్పుకుంటూ భోజనం కానిచ్చాం. 

భోంచేసి "ఎండ విపరీతంగా ఉంది. కొంతసేపు రెస్ట్ తీసుకో. నేనలా పౌల్ట్రీ ఫార్మ్ దాకా పోయివస్తాను" అన్నాడు  పూర్ణ.   వాడికి పౌల్ట్రి ఫార్మ్ ఉంది.

" ఊర్ని  చూడాలి. నేనూ వస్తాన్ రా?" అన్నాను. ఎండ తీవ్రంగా ఉన్నా ఉబలాటం కొద్దీ బయలుదేరాను.

అక్కడక్కడా కొంతమంది ముసలివారు విసనకర్రలతో విసురుకుంటూ ఇళ్ళ ముందు అరుగులమీద ఉసూరుమంటున్నారు. ఊరి  మధ్యకి వచ్చేసరికి బావి విషయం అడిగాను. అది ఎండిపోతే పూడ్చేశామన్నాడు. ఊరుదాటి మా ప్రయాణం సాగే కొద్దీ నాకు షాకుల మీద షాకులు. కనుచూపు మేరలో పచ్చదనం అనే మాటే లేదు. అంతా బీళ్ళు. బీటలు వారిన బీళ్ళు. నీటికోసం నోళ్ళు తెరుచుకున్నట్లు బీటలు. చెట్లు లేవు. పంటలు లేవు. ఎడారిలా ఉంది.   బోర్లు ఎండిపోయాయి. బావులు పూడిపోయాయి. చెరువు బీటలు వారింది. పూర్తిగా పూడిపోయింది. దాన్లో అక్కడక్కడా కొన్ని గుడిసెలు లేచాయి.    ఎవరెవరో ఆక్రమించేసి కంచెలు వేసేసుకున్నారు.కొండ కరిగి నేలమట్టమై పోయింది.  అక్కడ ఒక కెమికల్ ఫ్యాక్టరీ వుంది. దాని వ్యర్థాలతో ఏరు నిండిపోయింది. ఎక్కడా నీటి చుక్క లేదు. బావులు, చెరువులు, దొరువులు, ఏర్లు ఎండి బీటలు వారిపోయాయి.  సాగుకు కాదు కదా... కనీసం గొంతు తడుపుకోవడానికి కూడా నీళ్ళు దొరకడం లేదు.  పది పదిహేను కిలోమీటర్లనుంచి ట్యాంకర్ల ద్వారా రెండురోజుల కొకసారి నీళ్ళు సప్లయి చేస్తున్నారు పంచాయతీవారు.

"నో ...ఇది నేను చూసిన నా పల్లె కాదు. కానే కాదు." గొంతు చించుకుని అరవాలనిపించింది.

కానీ వాస్తవం.  కళ్ళముందు కఠినంగా కనిపిస్తుంటే ... నా కళ్ళను నేనే నమ్మలేక నిలువ గుడ్లేసుకొని చూస్తుండిపోయాను. ఎండ తీవ్రతకు; వేడిగాడ్పులకు   చెమటతో నా బట్టలు తడిసి ముద్దయిపోయాయి. కానీ ఆ బాధ కన్నా కళ్ళ ముందున్న వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను.

అంతలోనే పూర్ణ కోళ్ళ ఫార్మ్ చేరుకున్నాం.  షెడ్ బయట కొన్ని వందల సంఖ్యలో చచ్చిన కోళ్ళు పడివున్నాయి. షెడ్ లో కూలర్లు ఏర్పాటు చేసినట్లుంది కానీ ఈ ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక కోళ్ళు మృత్యువాత పడుతున్నాయి. కడుపు తరుక్కుపోతోంది.   నాకే అంత బాధగా ఉంటే; వాడికెలా ఉండాలి. అలా పరిశీలిస్తూ తలపట్టుకుని కూర్చుండిపోయాడు. మెల్లగా తేరుకుని ఇలా అన్నాడు.

"చూస్తున్నావుగా!  ఈ తాపానికి వందలకొద్దీ  కోళ్ళు చనిపోతున్నాయి. నా పెట్టుబడి అంతా సర్వ నాశనం అయిపోయింది. నేనొక్కడినే ఇక్కడ ప్రాకులాడుతున్నాను. మన ఫ్రెండ్స్ అంతా బెంగుళూరు, చెన్నై లలో సెటెలయిపోయారు.      రవి బెంగుళూరులో బిజినెస్ చేస్తున్నాడు. రాము అక్కడే సాఫ్ట్ వేర్ ఇంజనీర్. సుబ్బు చెన్నైలో సెటెలయిపోయాడు. యువతంతా బతుకుతెరువు కోసం వలస వెళ్ళిపోయారు. ముసలీ;ముతక మాత్రమే ఇళ్ళల్లో ఉన్నారు. ఫ్యాక్టరీలలో అరకొర జీతాలిచ్చి; కార్మికుల జీవితాల్తో ఆడుకుంటున్నారు. విధిలేక చేస్తున్నవారు చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ కాలుష్యం; ఆ  క్వారీ   ధూళి వల్ల  గాలి; నీరు కలుషితమయిపోయాయి.  ఆరోగ్యాలకు కూడా హానికరంగా ఉంది. ఈ వాతావరణం కోళ్ళకు కూడా అయ్యేట్లుగా లేదు. ఈ వేడికి రోజూ వందలకొద్దీ కోళ్ళు చనిపోతున్నాయి. ఈ నష్టాలు భరించలేకపోతున్నాను.  బ్రతకడానికి వేరే మార్గం లేక; భారంగా నెట్టుకొస్తున్నాను. ." అన్నాడు పూర్ణ నిస్సహాయంగా.

నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నా పల్లె కన్నీటి గాథను విని నేను తట్టుకోలేక పోతున్నాను.

నా పల్లెకి విశాలమయిన రోడ్లొచ్చాయి. ఫ్యాక్టరీలొచ్చాయి. బస్సులొచ్చాయి. కార్లొచ్చాయి. సెల్ పోన్లొచ్చాయి. టీ వీ లొచ్చాయి. ఇంటర్నెట్లొచ్చాయి. అన్నీ వచ్చాయి. అభివృద్ధి అంటే ఇదేనా? అయితే జనం ఏరీ?  ఈ అభివృద్ధి జనం కోసమే అయితే  జనం వలసలు ఎందుకు పోతున్నారు?     ఇంకేం కావాలి వారికి?

కడుపుకింత కలుషితంలేని సురక్షితమైన కూడు; చేతినిండా పని; పనికి తగిన కూలి; తలపై  ఇంత గూడు. ఆరోగ్యవంతమైన జీవితం, స్వచ్ఛమైన నీరు; గాలి.  సామాన్య మానవుడికి ఇదికూడా అత్యాశే అవుతుందా? 

ఆలోచిస్తూ గుడిలోకొచ్చాం. అప్పటికే చాలా మంది వచ్చేశారు. పాత మిత్రుల్ని  ఒక్కొక్కర్నే పరిచయం చేశాడు పూర్ణ. ముఖ కవళికల్ని బట్టి కొంతమందిని నేనే గుర్తుపట్టగలిగాను. కొంతమంది వారే గుర్తుపట్టి పలకరించారు. వారి సంతానం పెద్దవారైపోయి ఉద్యోగాల్లో ఎక్కడెక్కడో సెటెలయిన వారు కూడా వచ్చారు. తండ్రి; తాతలు పుట్టిన వూరిని మర్చిపోకుండా సంవత్సరానికి ఒకసారి ఇలా కార్యక్రమాన్ని తలకెత్తుకుని చేయడం నాకెంతో నచ్చింది. అంతా పండగ వాతావరణంగా ఉంది.    తిరనాళ్ళా ఉంది. ఊరంతా ఒకచోట చేరి కుటుంబ సభ్యులతో పండుగ చేసుకున్నంత సంబరంగా ఉంది. సంవత్సరమంతా  పనిచేసి ఆటవిడుపుకు వచ్చినట్లుంది. పెద్ద ఉద్యోగాల్లో వున్న వారు సైతం హోదాలు మరిచి పల్లెటూరి వాతావరణంలో ఎంజాయ్ చేయడం; త్రుళ్ళుతూ హుషారుగా కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపడం నాకెంతో నచ్చింది. ఆ యువతలో చాలా మంది నాకు తెలియదు. కానీ ఒక కామన్  ఫ్యాక్టర్ - ఆ పల్లెతో వారి తాత; తండ్రుల అనుబంధం- ఒక్కటే మమ్మల్ని కలిపింది. చాలా మంది యువతకి ఆ పల్లెతో  ప్రత్యక్ష  సంబంధమే లేదు.    అయినా వేల లెక్కన చందాలు వేసుకుని ప్రతి సంవత్సరం  కార్యక్రమాన్ని  నిర్వహిస్తున్నారు.

ఎవర్ని పలకరించినా " మా తలిదండ్రులు; తాతలు ఈ ఊర్ని వదిలి దశాబ్దాలయినా ఇది మా ఊరు. దాని కోసం ఖర్చుపెట్టడంలో మాకానందం వుంది. మా కోసం ఖర్చు పెడుతున్నాం. మా వారి కోసం ఖర్చు పెడుతున్నాం. మా ఊరి కోసం ఖర్చుపెడుతున్నాం. ఇందులో మాకానందం ఉంది." అంటున్నారు.

"ఈ ద్రౌపదమ్మ తల్లి దయవల్లే మేమింత వారమయ్యాం. మా కోరికలన్నీ ఆమె తీరుస్తుంది." అన్నారు మరికొంతమంది. ఆ యువతలో చాలామంది వారికి వారే పరిచయం చేసుకొని నాతో మాటలు కలిపి నిమిషాల్లోనే ఆత్మీయంగా కలిసిపోయారు. "మన ఊరు" అన్న భావమే అందర్నీ దగ్గరికి చేర్చింది. ప్రదీప్, అవినాష్, ప్రతాప్, కన్నయ్య, రాజగోపాల్ ఇలా అందరి ఉత్సాహం చూస్తుంటే నాకూ ఉత్సాహం రెట్టింపయింది.

చుట్టుపక్కల పల్లెల జనం కూడా బాగా పోగయ్యారు.    ఇంతలో హరికథ మొదలయింది. అంతా శ్రద్ధగా  వింటున్నారు.;  చక్కని అభినయంతో శ్రావ్యమయిన కంఠంతో అప్పుడప్పుడు సినిమా హిట్ సాంగ్స్ తో ఉత్సాహపరుస్తోంది భాగవతారిణి. జనమంతా భయభక్తులతో హరికథను ఆలకిస్తున్నారు. మహాభారతంలో ద్రౌపది స్వయంవరం ఒక రసవత్తరమయిన ఘట్టం.      జనం ఎంత భయభక్తులతో; ఏకాగ్రతతో వింటున్నారంటే; ఉక్కపోతతో శరీరాలు తడిసి ముద్దవుతున్నా  ఎవరూ పట్టించునే ధ్యాసే లేదు.

అంతగా కధలో లీనమైపోయారు. 

ఇంతలో వాతావరణంలో పెనుమార్పు చోటు చేసుకుంది. ఆకాశం మేఘావృతమయి జల్లులతో ప్రారంభమయి హోరున ఏకధాటిగా అరగంట వర్షం కురిసింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. జనంలో ఆనందం పెల్లుబికింది. విపరీతమయిన భక్తి పారవశ్యంతో భక్తులు చిందులు వేశారు.  వైభవోపేతంగా ద్రౌపది కల్యాణం కధ పూర్తయిపోయేంతవరకు  జనం   శ్రద్ధాశక్తులతో విన్నారు.        వర్షం లో తడిసినా ఎవరూ కట్టుకదలలేదు.  చివరికి కార్యక్రమం చాలా విజయవంతంగా ముగిసింది. జనం తీర్థ ప్రసాదాలు తీసుకుని తిరుగుప్రయాణమయ్యారు.

"ప్రసాదం తీసుకోండి అంకుల్" అని ప్రసాద్ తెచ్చి ఇచ్చాడు. తనూ తీసుకుంటూ పక్కనే కూర్చున్నాడు. 

"చూడండి అంకుల్ అమ్మవారి మహత్యం.  పెళ్ళి సమయానికి మంచి వర్షం పడింది." అంటూ వచ్చాడు ప్రతాప్.

"అమ్మవారి పెళ్ళిరోజు ప్రతిసారి వర్షం పడాల్సిందే. అదీ ఆమె గొప్పతనం" పూర్ణ అన్నాడు.

"అరగంట వర్షం వాతావరణం లో ఎంత మార్పు తెచ్చిందో చూశారా?" అన్నాడు ప్రదీప్.

ఒక్కొక్కరుగా అందరూ మా చుట్టూ చేరారు.

"గంటక్రితం ఎంత ఎండగా వుందో; ఇప్పుడు అంత చల్లబడింది. శరీరానికి ఎంతో హాయిగా ఉందిప్పుడు" మాట కలిపాడు అవినాష్.

"అవినాష్! ఈ వైరుధ్యానికి తేడా ఏమిటంటావు?" అడిగాను  కుతూహలంగా.

"వర్షం పడిందిగా ...అందుకే!" అన్నాడు అవినాష్.

"అంటే సూర్యుని ప్రతాపానికి కారణం వర్షాలు లేకపోవడమేనా?"

"కారణాలేవయినా...వర్షం దానికి విరుగుడని ఋజువయిందిగా!" అన్నాడు ప్రతాప్.

"ఈ విపరీత వైపరీత్యాలకు ముఖ్య కారణం మనమే అంకుల్" అన్నాడు ప్రదీప్.

అందరూ ప్రదీప్ వైపు చూశారు.

ప్రదీప్ కొనసాగిస్తూ " నానాటికి భూతాపం పెరిగిపోతోంది. అంటే భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. నీరే ప్రాణికోటికి జీవనాధారం. దానిపై మనం కానీ; మన ప్రభుత్వాలు కానీ తగిన శ్రద్ధ చూపడం లేదు."

"అంటే వివరంగా చెప్పు ప్రదీప్!" అన్నాను.

అందరూ శ్రద్ధగా ప్రదీప్ వైపు చూశారు.

"పర్యావరణంలో భారీ మార్పులకు ముఖ్య కారణం - భూతాపం విపరీతంగా పెరిగిపోవడం. భూతాపం పెరిగిపోవడానికి కారణం తగినంత వర్షాలు లేకపోవడం. తగినంతగా వర్షాలు లేకపోవడానికి కారణం మనం నిత్యం చెట్లని; అడవుల్ని నాశనం చేయడం. అంకుల్! మీకొకటి చెప్పనా?" ఆగాడు ప్రదీప్.

అందరూ శ్రద్ధగా వింటున్నారు. ప్రదీప్ మళ్ళీ మొదలెట్టాడు.

"ఒక సర్వే ప్రకారం ...చెట్ల; మనిషి నిష్పత్తి ప్రపంచంలోనే ఇండియాదే లీస్ట్. అంటే కెనడాలో ఒక మనిషికి 8953 చెట్లుంటే; రష్యాలో అది 4461; అమెరికాలో 716, చైనాలో 102, ఇండియాలో 28.  ప్రపంచ సరాసరి తీసుకుంటే అది 422. "

"అంటే మనం యావరేజ్ కన్నా చాలా తక్కువలో  ఉన్నామా?." అవినాష్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

"దానికీ...దీనికీ సంబంధమేమిటి?" పూర్ణ సందేహం వెలిబుచ్చాడు.

"చాలా వుంది. మనం చెట్లే కదా  అనుకుంటాం. కానీ చెట్లు వాతావరణ సమతుల్యతకు దోహదపడుతాయి. తత్ ద్వారా మానవ మనుగడకు తోడ్పడుతున్నాయి.  వర్షాలనిస్తాయి. మనం విడిచే కార్బన్ డై ఆక్ష్సైడ్ గ్రహించి మనకు కావాల్సిన ఆక్సిజన్ ఇస్తాయి. చల్లని నీడనిస్తాయి.  భూసారాన్ని పరిరక్షిస్తాయి. భూతాపాన్ని తగ్గిస్తాయి. “

"ఓ! ఇన్ని ఉపయోగాలున్నాయా?"

"అవును. మానవాళికి ఇంతగా ఉపయోగపడే చెట్లను మనమేం చేస్తున్నాం? అడ్డొస్తుందని నిర్దాక్షిణ్యంగా నరికేస్తున్నాం. అడవుల్ని నాశనం చేస్తున్నాం. ఫలితంగా వర్షాలు తగ్గిపోతున్నాయి. భూమిలో తేమ తగ్గిపోతోంది. వాతావరణంలో గాలి పరిమాణం తగ్గిపోతోంది. గాలిలో కార్బన్ డై ఆక్షైడ్ పెరిగిపోతోంది. మరోవైపు జనాభా పెరుగుతోంది. ఫలితంగా లభ్యమవుతున్న నీరు; గాలి పైన ఒత్తిడి పెరిగి కలుషితమైపోతున్నాయి.  కాలుష్యం రోజు; రోజుకీ పెరిగి వాతావరణం అస్తవ్యస్తమవుతోంది. ఫలితమే ఈ భరింపరాని ఉష్ణోగ్రతలు; అకాల వర్షాలు; భూకంపాలు; జలప్రళయాలు. " ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు ప్రదీప్.

"ఫైన్. చాలా బాగా చెప్పావు. అయితే దీనికి పరిష్కారం లేదా?" అన్నాను.

"ఎందుకు లేదంకుల్. వుంది. ఇప్పటికైనా మనం మేలుకోకపోతే వచ్చే తరం మనల్ని క్షమించదు.    అభివృద్ధి పేరుతో మనం చేస్తున్న విధ్వంసాన్ని ఆపాలి. పర్యావరణాన్ని రక్షించాలి. నీటిని ఒడిసిపట్టాలి. చెరువుల్ని; బావుల్ని నింపాలి. జలసిరిని పెంచుకోవాలి. చెట్లను నాటడం; సం రక్షించడం ఒక ఉద్యమంగా చేపట్టాలి. పచ్చదనం పెంచాలి. వర్షాల్ని ఆకర్షించాలి. భూతాపాన్ని తగ్గించాలి. అప్పుడే సూర్యుని ప్రతాపం తగ్గుతుంది.  వాతావరణంలో సమతుల్యత ఏర్పడి స్వచ్ఛమయిన నీరు; గాలి అందుబాటులోకి వస్తుంది.  అన్నిటికీ ఏకైక మార్గం పర్యావరణాన్ని రక్షించడమే. అది ఒక ఉద్యమంగా సాగాలి. నిరంతరం సాగాలి. అందుకు మనమే ముందడుగు వేయాలి." అన్నాడు ప్రదీప్  ధృడంగా.

ఈ తరం యువతరానికి ప్రతీకలా కనిపించాడు ప్రదీప్.     అందరూ తేరుకొని "అయితే మనమేం చేయాలి?" అన్నారు ముక్తకంఠంతో.

"నీటిని పొదుపు చేయాలి.  ఎక్కడి నీటిని అక్కడే ఒడిసిపట్టాలి. చెరువుల్ని పూడికతీసి వాటి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలి. ఎక్కడికక్కడ ఇంకుడు గుంతల్ని ఏర్పాటు చేసుకోవాలి. చెక్ డ్యాంలను నిర్మించాలి. వర్షపు నీరు వృధా కాకుండా ఎక్కడికక్కడ భూమిలోకి ఇంకిపోయే ఏర్పాట్లు చేసుకోవాలి. భూగర్భ నీటి మట్టం పెరగాలి. భూతాపం చల్లారాలి. దీనితో పాటు చెట్ల పెంపకం యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. చెట్లు నాటటమే కాదు ...వాటి సం రక్షణ కూడా చేపట్టాలి.  అడవుల విస్తీర్ణం పెంచాలి. ప్రచారం కోసమో; టీ వీ ల్లో ఫోటోల కోసమో కాకుండా చిత్తశుద్ధితో ఒక ఉధ్యమంగా సాగాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి.    పరిమితమైన ప్రకృతి వనరుల్ని పొదుపుగా వాడుకొని; సం రక్షించి ముందు తరాలకి అందించాలి.  అప్పుడే వచ్చే తరాలవారికి మేలు చేసిన  వారమవుతాం."  ముగించాడు ప్రదీప్.

"అయితే మనం మన వూరితోనే ప్రారంభిద్దాం." అన్నాడు ప్రతాప్.

"పూర్ణ గారూ! మీకు కావల్సిన సహాయ సహకారాలు మేమందిస్తాం. మీరు ముందుండి నడిపించండి. అవసరమయితే ప్రభుత్వ అధికారుల సహాయం తీసుకోండి. మన సాయాన్ని ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేయండి.  మన వూరి కోసం కలిసి పనిచేద్దాం. " అన్నాడు అవినాష్.

“మీరూ తోడుగా ఉండండి భానుగారూ!" అన్నాడు ప్రదీప్. చేతనైన సహాయం చేయడానికి; ఆ విధంగానైనా పుట్టిన వూరు ఋణం తీర్చుకోవడానికి  నేనూ ముందడుగు వేశాను.

"ఇప్పుడే ద్రౌపది కల్యాణమయింది. ఇదే సుముహూర్తం. ఇక లోక కల్యాణం కోసం మనమే మొదటి అడుగేద్దాం." అంటూ పూర్ణ చేయి కలిపాడు.

ఇప్పుడు వాతావరణం ఎంతో  చల్లగా, హాయిగా, ఆనందంగా,  ఆహ్లాదకరంగా ఉంది.

యువతలో చైతన్యం వచ్చింది.  వారికి అసాధ్యమేదైనా ఉంటుందా? కోరుకున్న మార్పు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది.*

మరిన్ని కథలు
oka cheruvu atma katha