Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
avee - ivee

ఈ సంచికలో >> శీర్షికలు >>

వీక్షణం - పి.యస్.యమ్. లక్ష్మి

 

కొలరాడో – 2

గార్డెన్ ఆఫ్ గాడ్స్ 

 

అమెరికాలో కూడా గార్డెన్ ఆఫ్ గాడ్స్ పేరుతో ఒక పార్కు వుండటం, ఎన్నో సంవత్సరాల క్రితమే ఆ ప్రదేశం ఇది గాడ్స్ వుండే ప్లేస్ అని శ్లాఘించబడటం కొంచెం ఆశ్చర్యంగా వుంటుంది కదూ!!   కొలరాడో స్ప్రింగ్స్ లోని పబ్లిక్ పార్కు గార్డెన్ ఆఫ్ గాడ్స్.  ఇది పైక్స్ పీక్ సమీపంలోనే వున్నది.  పైక్స్ పీక్ నుంచి వస్తూ ఈ పార్కుకి వెళ్ళాము.  విశాలమైన ప్రదేశం.  నిటారుగా నిలచిన ఎఱ్ఱటి రాళ్ళు.  వివిధ ఆకారాలు సంతరించుకున్న ఈ రాళ్ళల్లో 300 అడుగుల ఎత్తున్నవి కూడా వున్నాయి.  మనసు పెట్టి చూడాలిగానీ, రాళ్ళల్లో కూడా ఎన్ని అందాలుంటాయండీ!!?   ఈ రాళ్ళల్లో కూడా అందాలు చూస్తున్నాముకదా, మరి వాటి చరిత్ర కూడా కొంచెం తెలుసుకుందాము.

ఈ స్ధలానికి గార్డెన్ ఆఫ్ గాడ్స్ అనే పేరు రాక ముందున్న పేరు రెడ్ రాక్ కోరల్.  కొలరాడో సిటీ నిర్మిచేటప్పుడు ఇద్దరు సర్వేయర్స్ ఈ ప్రదేశాన్ని సర్వే చేశారు.  అందులో ఒకరు ఈ ప్రదేశం బీర్ గార్డెన్ కి ( ఓపెన్ ప్లేస్ లో వుండే రోడ్ సైడ్ రెస్టారెంట్ లాంటిది) బాగుంటుందని అంటే  ఇంకొకాయన, అక్కడ రాళ్ళల్లో అందాలు చూసి బీర్ గార్డెన్ ఏమిటి  ఈ ప్రదేశం చాలా అద్భుతంగా వున్నది.  దేవతలందరూ ఇక్కడ సమావేశమయ్యారా అన్నట్లున్నది, అందుకే ఇది గార్డెన్ ఆఫ్ గాడ్స్ అన్నాడు.  చూశారా మనిషి ఆలోచన్లల్లో వ్యత్యాసం.  ఆ సదాలోచన వలననే నేడిది బీర్ గార్డెన్ నుంచి అందరూ దర్శించే గార్డెన్ ఆఫ్ గాడ్స్ అయింది!

ఈ రాక్ ఫార్మేషన్స్ కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితంవి.  పురావస్తు పరిశోధన సంస్ధ వారి ప్రకారం నాగరికత నేర్వక ముందే, అంటే 1330 బి.సి. లోనే ఇక్కడ ప్రజలు వున్నారు.  250 బి.సి. లో ప్రజలు ఇక్కడ వున్న అడవులలో నివసించి, ఈ రాక్ ఫార్మేషన్స్ ని తమ నివాస స్ధలాలుగా ఉపయోగించుకున్నట్లు వారి సర్వేలో తెలిసింది.

ఇక్కడ 300 అడుగుల ఎత్తున్న సేండ్ స్టోన్ రాక్ ఫార్మేషన్స్, బేలన్సింగ్ రాక్ ఫార్మేషన్స్, ఇంకా అనేక అందమైన రాక్ ఫార్మేషన్స్, దూరంగా కనిపించే పైక్స్ పీక్ చూపరులను కట్టి పడేస్తాయి.  విజిటర్స్ సెంటర్ లో ప్రతి 20 ని. కొకసారి ఈ రాక్ ఫార్మేషన్స్ గురించి ఫిల్మ్ చూపిస్తారు.

ఇక్కడ నిటారుగా వుండే అద్భుతమైన రాక్ ఫార్మేషన్స్ రాక్ క్లైంబర్స్ ని  విశేషంగా ఆకర్షిస్తాయి.  అయితే ఈ నిటారుగా వుండే రాళ్ళు ఎక్కటానికి పర్మిషన్ తీసుకోవాలి.  గార్డెన్ రూల్స్ పాటించాలి.

హైకింగ్ చేసేవారు, రోడ్, మౌంటెన్ బైకింగ్ చేసేవారు, గుఱ్ఱం మీద సవారీ చేసేవారు ఈ గార్డెన్ ని చాలా ఇష్టపడతారు.  సంవత్సరానికి రెండు మిలియన్లకన్నా ఎక్కువ సందర్శకులు ఈ గార్డెన్ ని సందర్శిస్తారు.

1871లో బర్లింగ్ టన్ రైల్ రోడ్డు నిర్మాణ సంస్ధ డెన్వర్ రియో రైల్ రోడ్ నిర్మాణం సమయంలో జాక్ సన్ పామర్ దృష్టిలోకి కొలరాడో స్ప్రింగ్స్ వచ్చింది.  ఆయన తమ సంస్ధ అధినేత చార్లెస్ ఎలియట్ పెర్ కిన్స్ ని ఇక్కడ నివాసం ఏర్పరుచుకుని చికాగోనుంచి కొలరాడో స్ప్రింగ్స్ కి రైల్ రోడ్ నిర్మించమన్నాడు.  చికాగో – కొలరాడో రైలు మార్గం నిర్మించకపోయినా, పెర్ కిన్ 1879లో అక్కడ 240 ఎకరాల స్ధలాన్ని కొన్నాడు.  తర్వాత ఇంకా కొంత భూమి కొన్నాడుగానీ, ఆ భూముల్లో ఏ నిర్మాణమూ చేపట్టలేదు.  అంత అద్భుతమైన ప్రదేశం లో నిర్మాణాలు చేస్తే ఆ స్ధలం స్వరూపమే మారిపోతుందని, అలాంటి అందమైన ప్రదేశాలు ప్రజలకే ఉపయోగ పడాలని ఆయన ఉద్దేశ్యం. అయితే దానిగురించి ఆయన ఏమీ చెయ్యక ముందే 1907 లో చనిపోయాడు.  పార్కిన్ సన్ పిల్లలు తమ తండ్రి ఆశయానుగుణంగా 1907లో ఆయనకున్న 480 ఎకరాల స్ధలాన్ని పబ్లిక్ పార్కుకిచ్చారు.  అది పబ్లిక్ పార్కుగా మాత్రమె ఉపయోగించాలనీ, పార్కుకి సంబంధించినవి తప్ప వేరే కట్టడాలేమీ వుండ కూడదని, అక్కడి రాక్ ఫార్మేషన్స్ పాడు చెయ్యరాదనీ కండిషన్స్ పెట్టారు, వారి తండ్రి ఉద్దేశ్యం సక్రమంగా నెరవేరటానికి.   ఆనాడు ఆయనకా ఉద్దేశ్యం లేకపోతే ఈనాడు గార్డెన్ ఆఫ్ గాడ్స్ అనే పార్కే వుండేది కాదు, ఎన్నో మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ రాక్ ఫార్మేషన్స్ అందరూ చూడలేక పోయేవారు.  అక్కడ ప్రకృతి సృష్టించిన అందమైన రాక్ ఫార్మేషన్స్ బదులు కాంక్రీట్ జంగిల్ వుండేది.

ఎందరో మహానుభావులు...అందరికీ వందనములు.  

మరిన్ని శీర్షికలు
sahiteevanam