Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

గతసంచికలో ఏం జరిగిందంటే....http://www.gotelugu.com/issue168/479/telugu-serials/atulitabandham/atulita-bandham/

బాస్ తనను పిలిచాడని హడావుడి గా లేచి అతని కాబిన్ లోకి వెళ్ళింది ఐశ్వర్య. 

ఫోన్ లో ఏదో మాట్లాడుతున్న వాడల్లా అది హోల్డ్ చేసి,  “కమాన్ ఐశ్వర్యా... టేక్ యువర్ సీట్...” కూర్చోమని చెప్పి, తిరిగి కాల్ ని కొనసాగించాడు మల్ హోత్రా. 

“యస్, చెప్పండి సర్...” వినయంగా అడిగింది అతని  ఫోన్ కాల్ అయిపోగానే...

“ఏమీ లేదు, ఊరికే నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అని...” 

ఇద్దరి సంభాషణ ఆంగ్లంలో సాగుతోంది.

“నాతోనా?” అనుమానంగా అడిగింది. ఎందుకో అతని చూపులో, మాటలో తేడా గోచరించింది.

“ఐ హార్డ్ దట్ యు ఆర్ అలోన్!” అసహనంగా కదిలింది ఐశ్వర్య. అయినా సభ్యత కాదని వింటూ ఉండిపోయింది.

“నీకు సహజీవనం అంటే ఇష్టమని తెలిసింది. నీతో ఉన్నతను నిన్ను విడిచి వెళ్లిపోయాడని కూడా తెలిసింది. ఒంటరిగా ఎలా ఉంటావు? అందుకని, నాది ఒక ప్రపోజల్... నా భార్య అనారోగ్యం మూలంగా నాకు సంసార సుఖం కొరవడింది. అందుకని నీకో బంగ్లా చూస్తాను. అక్కడ ఇద్దరం కలిసి ఉందాము... నీకు కావలసినన్ని నగలూ, డబ్బూ ఇస్తాను... నిన్ను ఎంతో అపురూపంగా చూసుకుంటాను... సరేనా?”
ఐశ్వర్య ముఖం జేవురించింది. రక్తం సలసల మరిగిపోవటం మొదలైంది. ముక్కుపుటాలు కోపంతో ఆదరసాగాయి. 

“అసలు మీరు నా గురించి ఏమని అనుకుంటున్నారు? నేను ఆ టైపు కాదండి. ప్రేమించిన వాడితో కలిసి బ్రతకాలని అనుకున్నాను.

దురదృష్టవశాత్తూ మా దారులు వేరైనాయి... అంతే కానీ, ‘ప్రేమ’ అనేది లేకుండా డబ్బు కోసమో, నగల కోసమో నన్ను నేను అమ్ముకునేంత నీచురాలిని కాను. నా చదువు నాకు ఉద్యోగం ఇచ్చింది. దానివలన నాకు తిండికి, బట్టకూ లోటు లేదు... అయామ్ సారీ... మీ ప్రపోజల్ కి నేను కనుక  కాదని ఇంత సౌమ్యంగా చెబుతున్నాను. వేరే ఎవరైనా అయితే చెప్పు తీసి ఉండేవాళ్ళు...”

“ఏయ్... ఎంత ధైర్యం నీకు? పోనీ పాపం అని నా అంతటి వాడు ప్రపోజ్ చేస్తే...”

అప్పటివరకూ మెత్తగా మాట్లాడుతున్న ఐశ్వర్య అపర కాళిక అయిపోయింది.

“ఛీ...సిగ్గుందా నీకు? నీ భార్య కూడా నువ్వు వద్దని వేరే దారి చూసుకుంటే నీ పరిస్థితి ఏమిటో ఆలోచించుకో... మీ మగవాళ్ళు అందరూ ఇంతే... చపల చిత్తులు... మీకసలు  నీతీ జాతీ లేదు... ఇంకో సారి  హద్దులు దాటితే విషయం మీ నాన్నగారికి చెప్పాల్సి వస్తుంది... మైండ్ ఇట్...” గబుక్కున లేచి తన సీట్ కి వచ్చేసింది.

ఆమెకి ఉవ్వెత్తున ఏడుపు తన్నుకు వచ్చింది. అసలు...అసలు... అసలేమని అనుకుంటున్నాడు తన గురించి? మేనేజింగ్ డైరెక్టర్ అయిన మల్హోత్రా తండ్రి దృష్టికి తీసుకువెళితే?

ఛ ! అప్పటికప్పుడు రిజిగ్నేషన్ లెటర్ రాసి రెడీ చేసింది. లోపలికి పంపబోతూ,  మధుబాలకి ఫోన్ చేసి విషయం చెప్పింది, కన్నీళ్లు జలజల రాలుతూ ఉంటే...

కొంచెం ఆగమనీ, సంయమనంతో వ్యవహరించమనీ, ఉన్న ఉద్యోగాన్ని హఠాత్తుగా వదులుకోవద్దనీ, మరో ఉద్యోగం చూసుకునేవరకూ ఆవేశాన్ని ఆపుకోమనీ మధుబాల  గట్టిగా చెప్పటంతో, రాజీనామా కాగితాన్ని బాగ్ లోకి తోసేసి, ఎవరికీ చెప్పకుండా ఇంటికి వెళ్ళిపోయింది ఐశ్వర్య. 

ఆ పరిస్థితిలో తాను అమ్మ కాబోతున్నానన్న శుభవార్తను ఐశ్వర్యతో పంచుకోలేకపోయింది మధుబాల.

***

మర్నాడు ఆఫీసుకు రాగానే ఇంటర్ కామ్ లో ‘సారీ’ చెప్పాడు మల్ హోత్రా.  విషయాన్ని తన తండ్రివరకూ తీసుకు వెళ్లవద్దనీ, అలాగే ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి వెళ్ళవద్దనీ బ్రతిమాలుకున్నాడు. అప్పటికి ఐశ్వర్య ఆవేశం తగ్గి, మనసు శాంతించింది.

ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా తన పని తాను సక్రమంగా చేసుకుని ఇంటికి వచ్చేయటం అలవాటు చేసుకుంది. ఆమె గాంభీర్యాన్ని చూసి అందరూ భయపడటం మొదలుపెట్టారు. లేట్ అవర్స్ ఉండటం కానీ, సెలవు దినాల్లో వచ్చి పని చేయటం కానీ ఎవరు చెప్పినా చేసేది కాదు ఐశ్వర్య. ఎంత పని అయినా తన పనిగంటలలోనే చేసేసుకునేది. ఎక్కువ పని కానీ, లేట్ అవర్స్ ఉండి చేయాల్సిన పనులు కానీ ఉంటే మర్నాడు ఉదయమే త్వరగా వచ్చి చేసుకునేది. 

హాండ్ బాగ్ లో ఎప్పుడూ ఒక మడత పెట్టిన చురకత్తి, కారం పొట్లం ఉంచుకోవటం అలవాటు చేసుకుంది. తన దగ్గరకు దుష్ట శక్తులేవీ రాకుండా ముందు జాగ్రత్తలన్న మాట.

క్రమంగా ఆమెలో అభద్రతా భావం పోయి కాఠిన్యం చోటు చేసుకోసాగింది. 

ఇంటికి వెళ్ళాక తనకి నిద్రాసమయం అయేవరకూ మంచి పుస్తకాలు చదవటమో, పిన్నీ బాబాయిలతో గడపటమో చేయసాగింది. తాగటం కూడా మానేసింది. 

***

‘మనుజుడై పుట్టి మనుజుని సేవించి 

అనుదినమును దుఃఖమందనేలా?’

అభోగి రాగంలో యమ్మెస్ గారి కంఠంలోంచి అమృతోపమానంగా జాలువారుతున్న అన్నమయ్య పాటను యు ట్యూబ్ ఛానెల్ లో ఎంతో తన్మయత్వంతో వింటున్న ఐశ్వర్యకు కాలింగ్ బెల్ శబ్దం చికాకును కలిగించింది.

లాప్ టాప్ ఆఫ్ చేసి, లేచి వెళ్లి తలుపు తీసింది విసుగ్గా...  ఎదురుగా నిలుచుని ఉన్న మధుబాలను చూడగానే ఐశ్వర్య ముఖంలో విసుగంతా మాయమైపోయి, పున్నమి వెన్నెల నిండిపోయింది...

“హేయ్ మధూ... రావే... వాటే సర్ ప్రైజ్? ఆదివారం మీ జైలరు బాబు ఎలా వదిలాడే బాబూ...” అంది మధుబాలను ఆనందంగా హగ్ చేసుకుంటూ... జైలర్ అని వేణుకు ముద్దుగా పేరు పెట్టుకుంది ఐశ్వర్య...

“ఈ రోజు కాస్త పనుండి ఆఫీసుకు వెళ్లానే... పనై పోయిందని నిన్ను చూద్దామని వచ్చాను. ఏమిటే ఇలా అయిపోయావు? అసలు తిండి తినటంలేదా?”  బాధగా అంటూ, ఐశ్వర్య చెంపలు నిమిరింది మధు.

“నాకేమే నేను హాయిగా ఉన్నాను... ఒంటరితనం తప్ప పెద్ద సమస్యలు ఏమీ లేవు... ఈ మధ్య సంగీతం వింటూ, పాడుకుంటూ దాన్నీ అధిగమించటానికి ప్రయత్నిస్తున్నాను. అలాగే నీ అంత మంచి నేస్తాలు నా పుస్తకాలు కూడా నాకు మంచి తోడు...” 

ఐశ్వర్య మాటలకు బరువుగా నిట్టూర్చింది మధుబాల.

“ఒంటిగంట అవుతోంది... లంచ్ రెడీ గా ఉంది, ఇద్దరం తిందాం... కాదనకు మధూ!” 

“అయ్యో,  అలాగేనే... సాయంత్రం వరకూ ఉంటాను. తిందాం లే ఓ అరగంటాగి... ఇటు రా... కొంచెం సేపు కబుర్లు చెప్పుకుందామే...” సోఫాలో కూర్చుని ఐశ్వర్య పక్కనే కూర్చుంది మధుబాల.

మధుబాల భుజమ్మీద తలవాల్చి కళ్ళుమూసుకుంది ఐశ్వర్య.

“ఈ ప్రపంచంలో అత్యంత భాగ్యవంతుడు ఎవరూ అంటే, ఒక్కడైనా స్నేహితుడు ఉన్నవాడని అంటాను నేను... నేను చాలా అదృష్టవంతురాలిని మధూ ఈ విషయంలో... దేవుడికి ఎంతో థాంక్స్...” మధు బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది ఐశ్వర్య.
“పిచ్చి ఐశూ... ఆ విషయంలో నేనూ అంతే కదే... భగవంతుడు అమ్మను స్నేహితులరూపంలో సృష్టిస్తాడు... అమ్మ దగ్గరకు అస్తమానూ వెళ్ళలేము కదా మరి?”

“నిజం మధూ... ఆ ఇంతకూ ఏమిటి విశేషాలు? ఎలా ఉంది కాపురం? మీ అత్తగారు, మామగారూ బాగున్నారా? మీ లేడీ విలన్ వినత గారి విశేషాలు ఏమిటి? జైలర్ ఎలా ఉన్నాడూ?” ప్రశ్నల వర్షం కురిపించింది ఐశ్వర్య. 

అన్నింటికీ జవాబుగా ఓ నవ్వు నవ్వేసింది మధుబాల. తరువాత ఐశ్వర్య కుడిచేతిని తన పొట్ట మీద పెట్టుకుని, “ఐశూ, నేను అమ్మను కాబోతున్నాను...” అని చెప్పింది పరవశంగా...

ఐశ్వర్య మనసు ఆనంద సాగరమై ఉప్పొంగింది... 

“అబ్బా, కంగ్రాట్స్ మధూ... ఎంత మంచి వార్త చెప్పావు? మరి పాపాయి పుట్టాక నన్ను ఆడుకోనిస్తావా?”

“భలే దానివేనే ఐశూ... పాపాయి మనిద్దరికీ పాపాయే...”

“ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవే మధూ... నెలనెలా చెకప్ కి వెళ్ళు.  అశ్రద్ధ చేయకుండా డాక్టర్ ఇచ్చిన మందులు వాడు... సరేనా?” ఆరిందాలా జాగ్రత్తలు చెప్పింది ఐశ్వర్య.

“సరే గానీ వంట ఏం చేసావే?” ఆసక్తిగా అడిగింది మధుబాల.

“సాంబారు, వంకాయ కూర... తింటావ్ గా?”

“తింటా కానీ, పుల్లగా ఏమైనా తినాలని ఉంది ఐశూ... పికిల్స్ ఏమీ లేవా?”

“ఎందుకు లేవు? పిన్నిగారు ఇచ్చిన చింతకాయ పచ్చడి ఉంది... ఉండు ఫ్రెష్ గా ఇంగువ  పోపు వేసి తెస్తా... నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయి రావే... నేను కంచాలు పెట్టేస్తా...” హుషారుగా లేచింది ఐశ్వర్య.

“పిన్నీ, బాబాయి గార్లు బాగున్నారా?”

“ఓ, చక్కగా ఉన్నారు... నువ్వు వచ్చినట్టు చూడలేదేమో... లేకపోతే పిన్ని ఈ పాటికి వచ్చి ఉండేవారు...” అంటూ ఉండగానే తలుపు చప్పుడు అయింది. తలుపు తెరవగానే నవ్వు ముఖంతో అన్నపూర్ణ లోపలి వచ్చింది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nagaloka yagam