మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం 'అభినేత్రి'. విజయ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో ప్రభుదేవా కీలకపాత్రలో నటిస్తూ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా రెండు విభిన్న పాత్రలో కనిపిస్తుంది. ఒక పాత్రలో ట్రెడిషనల్ లుక్‌లో కనిపించనుంది. మరో పాత్రలో విపరీతమైన గ్లామర్ లుక్‌లో కనించనుంది. తమన్నా అంటేనే గ్లామర్ కదా. గ్లామర్ లేకుండా తమన్నాని తెరపై చూడటం కష్టమే. అందుకే ముందుగా తమన్నాతో గ్లామర్ ఏమీ లేకుండా సినిమా తియ్యాలనుకున్నా తరువాత మేకర్స్ తమ మనసు మార్చుకున్నారని వినికిడి. ఈ సినిమాను తెలుగులో కోన వెంకట్ సమర్పిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దానిక్కారణం ప్రభుదేవానే. తమన్నా కెరీర్‌లో 'బాహుబలి' ఒక అద్భుతం అయితే మరో అద్భుతం 'అభినేత్రి' కానుందట. అంతలా ఈ సినిమాపై అంచనాలు పెంచుకుంది, ఆశలు పెట్టేసుకుంది తమన్నా.
ఈ సినిమా తెలుగు ఆడియోను విజయవాడలో ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఆడియో ఫంక్షన్‌కు నటి శ్రీదేవి ముఖ్య అతిధిగా రానున్నారట. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో, అబ్బురపరిచే గ్రాఫిక్ మాయాజాలంతో తెరకెక్కుతోంది ఈ చిత్రం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం విజువల్ వండర్ కానుంది. ప్రభుదేవా, తమన్నాల నటన అద్భుతహ అనేలా ఉంటుందని టీమ్ అంటోంది. తమన్నా మంచి డాన్సర్. ఇక ప్రభుదేవా ఇండియన్ మైఖేల్ జాక్సన్. మరి వీరిద్దరి కాంబోలో డాన్సు స్టెప్పులు అదిరిపోయేలా ఉంటాయట. తమన్, జి.వి. ప్రకాష్‌కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆగష్టు 15న ఈ సినిమా తెలుగు ఆడియో విడుదల కానుండగా వీలైనంత త్వరగా సినిమా ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
|