Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

వెంకటేష్ తో ఇంటర్వ్యూ

interview with venkatesh
ఆ విష‌యంలో ర‌జ‌నీకాంత్ ఆద‌ర్శం - వెంక‌టేష్‌

విక్ట‌రీ వెంక‌టేష్ ఇంటి పేరు.. 
వైవిధ్యం వెంక‌టేష్ చిరునామా..
అందుకే వెంకీ ఇప్ప‌టికీ కొత్త‌గా క‌నిపిస్తుంటాడు.. కొత్త‌గా అల‌రిస్తూనే ఉంటాడు.
యాక్ష‌న్, ఫ్యామిలీ, సెంటిమెంట్, కామెడీ ఇలా ఏ జోన‌ర్ తీసుకొన్నా అందులో 360 డిగ్రీల్లోనూ త‌న ప్ర‌తిభ చూపించే ఏకైక స్టార్‌.. వెంక‌టేష్‌.
కొత్త‌గా ఆయ‌న హార‌ర్ జోన‌ర్‌లోనూ అడుగుపెట్ట‌బోతున్నాడు. వెరైటీకి ఇంత‌కంటే నిర్వ‌చనం ఇంకేం కావాలి..??  ఇప్పుడు బాబు బంగారం అంటూ.. ప్రేక్ష‌కుల్ని న‌వ్వుల్లో మంచెత్త‌నున్నాడు. ఈ చిత్రం.. శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. దానికి తోడు కథానాయ‌కుడిగా 30 యేళ్ల ప్ర‌యాణం పూర్తి చేసుకొన్నాడు వెంకీ. ఈ సంద‌ర్భంగా వెంకీతో జ‌రిపిన చిట్ చాట్  ఇది.

* కంగ్రాట్స్‌.. 30 ఇయ‌ర్స్ జ‌ర్నీ పూర్తి చేసుకొన్నందుకు.. ఈ ప్ర‌యాణం ఎలా అనిపించింది?
- నేనెప్పుడూ అంకెల్ని గుర్తు పెట్టుకోనండి. ఎన్ని సినిమాలు చేశా.. ఎంత కాలం నుంచి ప‌నిచేస్తున్నా.. ఇవేం ప‌ట్ట‌వు. ఏ సినిమాకి ఆ సినిమానే. బాబు బంగారం పూర్త‌యిపోయిందా.. వెంట‌నే మ‌రో సినిమా పనిలో ప‌డిపోతా. అంతే త‌ప్ప‌... మైలురాళ్ల‌కు పెద్ద‌గా విలువ ఇవ్వ‌ను.

* కానీ హిట్స్‌.. ఫ్లాప్స్ గురించి ఆలోచించాలి క‌దా?
- అవేమైనా మ‌న చేతుల్లో ఉన్నాయా.. ఆలోచించ‌డానికి. ప్లాన్ చేస్తే ఏదీ రాదు. ఆ విష‌యాన్ని నేను బాగా న‌మ్ముతా. సెట్‌కి వెళ్లిన‌ప్పుడు ఇదే నా తొలి సినిమా అన్న‌ట్టుగా ప‌నిచేస్తా. నేనేంటి, మ‌రీ ఇంత‌లా ఆలోచిస్తున్నా.. అని నాకే ఒక్కోసారి అనిపిస్తుంటుంది. నేనేదో చేసేశాను.. అనే ఫీలింగ్ ఎప్పుడూ రాదు.

* పోనీ.. ఇన్నేళ్లు క‌థానాయ‌కుడిగా కొన‌సాగ‌డానికి ఏమేం విష‌యాలు దోహ‌ద‌ప‌డ్డాయ‌ని అనుకొంటున్నారు?
- నాకు దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాలు ఉండ‌వు. సినిమా త‌ర‌వాత సినిమా చేసుకొంటూ పోవ‌డ‌మే. క‌థ‌ల ఎంపిక‌లో చాలా ప‌క్కాగా ఉంటా. ఫ‌లితం ఎలా ఉంటుంద‌న్న‌ది మ‌న‌కు తెలీదు. కానీ ఆ ప‌నిచేస్తున్న‌ప్పుడు అంకిత భావంతో ప‌నిచేయాలి. నేనూ అదే చేశా. సినిమా హిట్ట‌యిపోతే భుజాలు ఎగ‌రేయ‌డం, ఫ్లాప్ అయితే దాని గురించే ఆలోచించ‌డం ఇవేం ఉండ‌వు. హిట్‌, ఫ్లాప్ మ‌జా నాకు ఒక్క‌రోజే. మ‌రుస‌టి రోజున దాని గురించి ఆలోచించ‌ను.

* తొలి రోజుల్లో వెంక‌టేష్‌కీ.. ఇప్ప‌టి వెంక‌టేష్‌కి ఏమైనా తేడా ఉందా?
- కొంచెం కూడా లేదు. ఫ‌స్ట్ సినిమా చేస్తున్న‌ప్పుడు ఎంత భ‌యం భ‌యంగా `పాస్ అవుతానా లేదా` అనే టెన్ష‌న్‌తో కంగారు ప‌డేవాడినో.. ఇప్ప‌టికే అదే భ‌యం.. కంగారు. అలాగైతేనే సినిమాని సిన్సియ‌ర్‌గా చేస్తామ‌ని నా న‌మ్మ‌కం. 30 ఏళ్ల‌యిపోయాయి.. సీనియ‌ర్‌ని అని కాల‌ర్ ఎగ‌రేస్తే ఎలా??  ర‌జ‌నీకాంత్ గారిని చూడండి. ఎన్ని విజ‌యాలు సాధించినా ఎంత సింపుల్‌గా ఉంటారో. ఈ విష‌యంలో నాకు ఆయ‌నే ఆద‌ర్శం.

* మీ కెరీర్‌లో ఎక్కువ‌గా రీమేక్ సినిమాలే క‌నిపిస్తుంటాయి. కార‌ణం ఏమిటి?  సేఫ్ జ‌ర్నీ కాబ‌ట్టే అలాంటి క‌థ‌లు ఎంచుకొంటారా?
- అదేం లేదు. ఓ సినిమా చేస్తున్న‌ప్పుడు.. ఇలాంటి క‌థ మ‌న తెలుగులోనూ చెప్పాలి అనిపిస్తుంటుంది. వెంట‌నే.. రైట్స్ ఎవ‌రి ద‌గ్గ‌రున్నాయ‌ని ఆరా తీస్తా. మంచి క‌థ దొరికిన‌ప్పుడు అది ఏ భాష నుంచి తీసుకొంటే ఏమిటి??   నా కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాల‌న్నీ దాదాపుగా బాగా ఆడాయి. భ‌విష్య‌త్తులో మ‌రిన్ని రీమేక్ చిత్రాలు చేయ‌డానికి రెడీ.

* రిటైర్ అయిపోవాల‌న్న ఆలోచ‌న వ‌చ్చింద‌న్నారు ఆమ‌ధ్య‌..
- అప్పుడ‌ప్పుడూ అలా అనిపిస్తుంటుంది.. (న‌వ్వుతూ). ఒక‌టి చెప్పనా.. మ‌నం రిటైర్ అయిపోవాలి అనుకొన్నంత మాత్ర‌న అయిపోం. ఇంకా సినిమాలు చేయాలి అనుకొన్నంత మాత్రాన చేయ‌లేం. కొన్నిసార్లు మంచి క‌థ‌లు దొర‌క్క ఖాళీగా ఉండాల్సివ‌స్తుంది. ఇంకొన్నిసార్లు మంచి క‌థ‌ల‌న్నీ వ‌రుస‌గా వ‌చ్చేస్తుంటాయి. అలాంట‌ప్పుడు ఖాళీగా ఉండ‌కూడ‌దు.

* ఇంత‌కీ బాబు బంగారం ఏ టైపు సినిమా..
- చాలా జోవియ‌ల్‌గా సాగిపోయే సినిమా. హీరో పోలీస్ అంటే ఎక్కువ‌గా సీరియ‌స్ క‌థ‌లే ఉంటాయి. కానీ ఇది అలాంటి క‌థ కాదు. నా పాత్ర చుట్టూ కావ‌ల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్ న‌డుస్తుంది. ఇలా హుషారుగా క‌నిపించే పాత్ర చేసి చాలా కాలం అయ్యింది.

* గెట‌ప్ చూస్తుంటే కాస్త యంగ్‌గానే ఉన్నారు...
- మారుతి అలా చూపించాడు.. సినిమా చూస్తున్న‌ప్పుడు ఓ ప‌దేళ్లు వెన‌క్కి వెళ్లిపోయానా.. అనిపించింది.

* సీరియ‌ర్ హీరోలకు హీరోయిన్లు దొర‌క‌డం క‌ష్ట‌మైపోతోంద‌ని బ‌య‌ట టాక్‌...
- ఆ విష‌యం నిజ‌మే. క‌థ‌లు కూడా అంత తేలిగ్గా దొర‌క‌డం లేదు. ఓపిగ్గా వెతుక్కోవాల్సిందే.

* మీరు ఎప్పుడు మాట్లాడినా అందులో ఆధ్యాత్మిక విష‌యాలు దొర్లుతుంటాయి. మీ భావాల‌తో ఓ సినిమా తీయొచ్చుగా..
- భ‌లే వారే. అలాంటి విష‌యాలు మాట్లాడుకోవ‌డానికి బాగుంటాయి. సినిమాగా తీశామంటే...అంతే సంగ‌తులు.

* ఇప్పుడు చేస్తున్న సినిమాలేంటి?
- సాలా ఖ‌దూస్ ని రీమేక్ చేస్తున్నాం. త్వ‌ర‌లోనే ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. ఇందులో బాక్సింగ్ కోచ్‌గా క‌నిపిస్తా.

* సిక్స్ ప్యాక్ చేస్తున్నారా?
- సిక్స్ ప్యాక్‌లు చూపించే కోచ్ కాదు.. ఇదో ఎమోష‌న్ డ్రామా. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఆ నేప‌థ్యంలో సినిమా చేయాల‌ని చాలా  రోజుల నుంచి ఎదురుచూస్తున్నా. ఆ అవ‌కాశం ఇప్పటికి ద‌క్కింది.
మరిన్ని సినిమా కబుర్లు
cine churaka