Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kadali

ఈ సంచికలో >> సీరియల్స్

అతులితబంధం

గతసంచికలో ఏం జరిగిందంటే...http://www.gotelugu.com/issue174/498/telugu-serials/atulitabandham/atulita-bandham/

 

“చూసావా అమలా, రూప పుట్టిన రోజని తెలిసి కూడా వీడు రాలేదు...” బాధగా అన్నాడు అరుణ్ తమ్ముడు కార్తీక్ ని తలచుకుంటూ...

“అవునండి... ఫోన్ కి రెస్పాన్స్ లేదు... ఎందుకిలా తయారయ్యాడో తెలియటం లేదు...”

“ఏముందిలేమ్మా, తిన్నది అరక్క... అసలు మా పెంపకం సరిగ్గా లేదులే, ఎవర్ననుకుని ఏం లాభం?” పరమేశ్వర రావు నిట్టూర్చాడు.

కాత్యాయని కళ్ళు తుడుచుకుంది.

“ఈ రోజు లంచ్ కి ఓ ప్రత్యేకమైన అతిథిని పిలిచాను అత్తయ్యా...” అంది అమల మాట మారుస్తూ...

“ఎవరమ్మా? నీ క్లబ్ మెంబర్స్ లో ఎవరైనానా?”

“కాదు, కాసేపట్లో వస్తారు... రూప ను హాల్లోకి తీసుకు వస్తాను...” అని లోపలికి వెళ్ళి, రూపను వీల్ చైర్ లో కూర్చో బెట్టి తీసుకు వచ్చింది అమల.

ఉదయమే రూపకు తలంటి స్నానం చేయించి కొత్త బట్టలు ధరింప జేసింది అమల. బంగారు వర్ణంలో ఉండే రూప ఆకు పచ్చని డ్రెస్ లో విరిసిన పూల కొమ్మలా ఉంది. బాల్యం దాటి కౌమార ప్రాయం లోనికి అడుగు పెట్ట బోతున్న రూపకు నడవ లేదన్నది ఒక్కటే లోపం.

“నాన్న గారూ, ఇక్కడ మీకు సదుపాయంగానే ఉంది కదా...” అడిగాడు అరుణ్.

పరమేశ్వర రావు, కాత్యాయని ఇక్కడికి వచ్చేసి వారం రోజులు దాటుతోంది.

“చాలా హాయిగా ఉన్నామురా అబ్బాయి... కోడలు తీసుకునే శ్రద్ధ వలన మా ఆరోగ్యాలు కూడా బాగున్నాయి. రూపతో మంచి కాలక్షేపం అవుతోంది... దాంతో చెస్ ఆడుతూ ఉంటే సమయమే తెలియదు...” చెప్పాడు పరమేశ్వర రావు.

“కానీ మన ఇంట్లో ఉన్నట్టుగా పచ్చని చెట్లు, గాలి తక్కువయ్యాయి కదా... అయినా మనమందరం కలిసి ఉంటేనే మంచిది నాన్నా...”

“నిజంరా... ఏముందిలేరా... మీ అపార్ట్ మెంట్స్ ఎదురు గానే పచ్చని చెట్లతో నిండిన ఆ పార్క్ ఉంది కదా... అందుకే లిఫ్ట్ లో ఉదయమే వెళ్లి కాసేపు అక్కడ తిరిగి వస్తున్నాను...” అన్నాడు పరమేశ్వర రావు.

“అత్తయ్య గారు అన్నీ చూసు కోవటం వలన సాయంత్రాలు క్లబ్ కి సంబంధించిన పనులు ఈజీ గా చేసుకో గలుగుతున్నానండి...”  చెప్పింది అమల.

“తాతయ్యా, బామ్మా, మీరు ఎప్పటికీ ఇక్కడే ఉండాలి... మీరు వచ్చాక నాకెంత బాగుందో...” అమాయకంగా చెప్పింది రూప.

“తప్పకుండా  బంగారు తల్లీ... ఇక ఇక్కడే ఉంటాం...”

కాలింగ్ బెల్ మ్రోగింది. అమల వెళ్లి తలుపు తీసింది.

చేతిలో గిఫ్ట్ ప్యాక్ తో, చిరునవ్వుతో అడుగు పెట్టింది ఐశ్వర్య.

అందరినీ విష్ చేసి, సరా సరి రూప దగ్గరికి వెళ్లి గిఫ్ట్ చేతిలో పెట్టి, “హాపీ బర్త్ డే బంగారు తల్లి రూపా...” అని వంగి,ఆమె తలను గుండెలకు హత్తుకుంది.

“థాంక్స్ టీచర్... మీరు వస్తారని తెలియ లేదు... బాగున్నారా?” అంది ఆనందంగా రూప.

“రూపా, తను ఇప్పుడు టీచర్ కాదు... నీకు పిన్ని అవుతుంది... అలానే పిలవాలి...” చెప్పింది అమల.

ఐశ్వర్యను అత్తా మామలకు పరిచయం చేసింది. అప్రయత్నంగా ఇద్దరికీ పాదాభివందనం చేసింది ఐశ్వర్య.

“నువ్వేనామ్మా ఐశ్వర్య?” ఆమె తల నిమిరి దగ్గరకు తీసుకుంది కాత్యాయని.

ఐశ్వర్యకు కాస్త మొహమాటంగా అనిపించింది.

“వస్తూ ఉండమ్మా ఇక నుంచి...” చెప్పాడు అరుణ్.

“సరేనండి...”

“పిన్ని, నాకు జాగ్రఫీలో కొన్ని లెసన్స్ అర్థం కాలేదు. కొంచెం చెప్ప గలరా?” అడిగింది రూప.

“తప్పకుండా చెబుతాను రూపా...”

“అయితే సరే, మీరిద్దరూ నీ రూములో చదువుకోండి... నా వంట పూర్తి కాగానే భోజనం చేద్దాం...” అంటూ, వీల్ చెయిర్ ని గది లోకి తీసుకు వెళుతూ, తనతో రమ్మన్నట్టు ఐశ్వర్యకు సైగ చేసింది అమల.

ఒక రెండు గంటల సేపు రూపతో పాటున్న ఐశ్వర్యకు కాలం తెలియ లేదు. తన కొత్త పిలుపు మొదట్లో ఇబ్బందిగా తోచినా కాసేపటికి అలవాటై పోయింది.

వాళ్ళతో కలిసి భోజనం చేసి, ఆనందంగా అందరితో గడిపి, తిరిగి తన ఫ్లాట్ కి వచ్చింది ఐశ్వర్య. ఆరోజు ఆమెకు చాలా తృప్తిగా అనిపించింది. అది మొదలు కనీసం పది రోజులకో సారి అమల ఇంటికి వెళ్ళటం పరిపాటి అయిందామెకు.


**************************


“నెలలు నిండుతున్న  పిల్ల, దానికీ విషయం చెప్పకండి...” చిన్న గొంతుతో భర్తతో అంటోంది పూర్ణమ్మ.

అప్పుడే నిద్ర లేచి తన గది లోంచి బయటకు వస్తున్న మధు బాల చెవిలో ఆ మాటలు పడనే పడ్డాయి...

“ఏమైంది నాన్నా?” అంది ఖంగారుగా...

“అబ్బే ఏమీ లేదమ్మా... నువ్వు గాబరా పడకు...” అన్నాడే కానీ ఆయన ముఖంలో అలముకున్న విషాదం ఏదో జరగ రాని సంఘటన జరిగినట్టు మధు బాలకు చెప్పకనే చెప్పినట్టు అయింది.

మౌనంగా నిలుచున్న పూర్ణమ్మతో, “అమ్మా... ఏమిటి విషయం? చెప్పండి ఫర్వాలేదు...” అంది మధు బాల.

“మీ మామ గారికి యాక్సిడెంట్ అయిందిట మధూ...” చెప్పాడు అనంత రామయ్య.

“అరె... ఇప్పుడు ఎలా ఉన్నారు?”

“సారీ అమ్మా... వారు మనకిక లేరు... ఇందాకే అన్నయ్యకు ఫోన్ చేసి చెప్పారు అల్లుడు గారు...” పై తువ్వాలుతో కళ్ళు తుడుచు కున్నాడు అనంత రామయ్య.

మధు బాలకు కళ్ళు తిరిగినట్టు అయింది. ద్వార బంధాన్ని ఆసరాగా చేసుకుంటూ నిల బడింది. పూర్ణమ్మ త్వర త్వరగా వచ్చి కూతుర్ని పట్టుకుంది.

“కాసేపు ప్రశాంతంగా పడుకోమ్మా... నువ్వు చూడటానికి వెళ్ళ కూడదు... నాన్న గారు, అన్నయ్య వెళ్లి వస్తారు...” అనునయంగా చెప్పింది పూర్ణమ్మ.

“వెళ్ళ కూడదా? నాకు ఆయన్ని చూడాలని ఉంది అమ్మా... ఆయన వేణుకు కాదమ్మా నాకు నాన్న గారిలా నిల బడ్డారు అన్నింట్లో... ప్లీజ్ అమ్మా...” గోవర్ధన రావును తలచుకుని వెక్కి వెక్కి ఏడవ సాగింది మధు బాల.

ఏమనాలో తెలియక అక్కడే ఉన్న కొడుకు వైపు చూసింది పూర్ణమ్మ.

“నానమ్మా, నిర్మలా ఇక్కడ ఉంటారు. అందరం వెళదాము... దాని కోరిక కూడా కాదన లేము అమ్మా... టాక్సీ బుక్ చేస్తాను...” అన్నాడు గిరి.

*********************************

ఇంటికి తిరిగి వచ్చినప్పటి నుంచీ కంటికీ మంటికీ ఏక ధారగా ఏడవ సాగింది మధు బాల.

అక్కడ చలన రహితంగా పడుకుని ఉన్న మామ గారిని చూస్తే మనసంతా వికలమై పోయింది... ఎవరెవరో చుట్టాలు వస్తున్నారు. అందరూ ఏడుస్తున్నారు. అత్త గారిని చూస్తే చాలా బాధ కలిగింది. దగ్గరగా వెళ్లి ఆమె భుజమ్మీద చేయి వేసింది తాను.  ఈ లోగా వినత  వచ్చి, తనను లోపలి రూము లోకి లాక్కుపోయి గొడవ పెట్టుకుంది.

“ఎందుకు వచ్చావు? ఇంకా ఏం మిగిలిందని చూడటానికి వచ్చావు?” అంది కర్కశంగా...

“వినతా... అదేమిటి? మామయ్య గారు...” తన మాట పూర్తి కాకుండానే, “నా మీద నింద వేసి నువ్వు ఇల్లు వదిలి వెళ్ళి పోయావు... అది మొదలు మా నాన్న నన్నే దోషిగా ఎంచి నానా మాటలు అన్నారు. అంతే కాదు, మా అమ్మను కూడా అనరాని మాటలు అన్నారు. ఆయన మానసికంగా చాలా దెబ్బ తిన్నారు మధు బాలా... అందుకనే స్థిమితం లేని మనసుతో బైక్ డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ కి గురి అయ్యారు... ఆయన చావుకు కారణం ఖచ్చితంగా నువ్వే... నన్ను తండ్రిలేని దానిగా చేసింది నువ్వే... నువ్వే...” తర్జనితో నిలదీస్తూ కింద కూల బడి ఏడవ సాగింది వినత.

లోపలికి వచ్చిన వేణు కూడా వినతను ఓదార్చటంలో మునిగి పోయాడే కాని తననసలు  పట్టించుకో లేదు.

“వేణూ, అయామ్ సారీ...” అంటున్న తనతో, “చూసావు కదా? నీ కోసం, నీ కడుపులోని బిడ్డ కోసం ఆలోచించి, ఆలోచించి ఆయన మరణం పాలయ్యాడు... నువ్వు వెళ్ళి పోయాక, ఆయన ఒక్క రోజు కూడా సరిగ్గా భోజనం చేయ లేదు. బీపీ బాగా హెచ్చయింది... బయటకు వెళ్ళ వద్దు అని ఎంత చెప్పినా వినకుండా నిన్న బైక్ తీసుకు వెళ్ళారు... తిరిగి ఇలా వచ్చారు... చాలా థాంక్స్ మధూ...” అన్నాడు కోపంగా.

తనకేం అర్థం కాలేదు. జరిగిన దాంట్లో తన తప్పు ఏముందని అంతగా దూషిస్తున్నారు? వినత సరే, వివేకం లేనిది... మరి వేణు బుద్ధి ఏమైంది? తండ్రి పోయిన దుఃఖం అనుకుందామన్నా, ఆ పరుషపు వాక్యాలేమిటి? మనసును కోసేస్తున్నాయే! వేణుకి కోపంలో ఒళ్ళూ పై తెలియదు... చెల్లెలి ఏడుపునే చూస్తున్నాడు కానీ విలపించే తన మనసును అసలు గమనించక పోగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు.

అంతా గమనిస్తున్న అన్నయ్య తన దగ్గరకు వచ్చాడు.

“వెళదాం చెల్లాయ్... నువ్వు ఉండలేవిక్కడ...” అన్నాడు మెల్లగా.

“బావుండదు అన్నయ్యా...” దీనంగా చూసింది అన్న వైపు.

“ఫర్వాలేదు... నాకు నీ ఆరోగ్యం ముఖ్యం... ఇంకా మాటలు పడి మనస్థాపం చెందటం అవసరం లేదు... అసలు కడుపుతో ఉన్న పిల్లవి నువ్వు రానక్కర లేదు...అయినా చివరి చూపంటూ వచ్చావు, చూసావు... ఇక చాలు... నిన్నూ, అమ్మను టాక్సీ ఎక్కించి పంపిస్తాను... జాగ్రత్తగా వెళ్ళండి... నేనూ, నాన్న గారూ తర్వాత వస్తాము...”

“కానీ వేణు బాధ పడతాడు...”

“బాధ పెడతాడు కూడా... వినత తూట్లు పొడుస్తుంది... కావాలా అవన్నీ? నువ్వేం ఆలోచించకుండా వెంటనే బయలుదేరు... ఇక్కడ నీకు కాఫీ చుక్క ఇచ్చే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు...”

ఆఘ మేఘాల మీద టాక్సీ బుక్ చేయించి తల్లినీ తననూ పంపేసాడు గిరి.

ఇదేమిటి? వేణుకి తానంటే ప్రేమ లేదా? పోనీ తన కడుపులో పెరుగుతున్న అతని బిడ్డ మీద కూడా మమత లేదా? ఎంత కటువుగా మాట్లాడుతున్నారు వాళ్ళు? అసలు వినత పక్కనుంటే అందరూ అలాగే మాట్లాడతారా?

మధు బాల మనసు కృంగి పోసాగింది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nagalokayagam