Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
khamanu veedhi kathalu

ఈ సంచికలో >> కథలు >> వినాయకుడి సందేశం

vinayakudi sandesam

బంజారాహిల్స్ లో నక్షత్ర టీవీ ఛానల్!

గేటు ముందు నుంచున్నాడో వ్యక్తి. బాగా లావుగా ఉన్నా అందంగా ఉన్నాడు. తేజస్సు, ప్రశాంతత ముఖంలో ద్యోతకమవుతోంది.

"మీ యజమానిని కలవాలి" సెక్యూరిటీ అతనితో సౌమ్యంగా అన్నాడు.

ఆ మాటల్లోని మార్ధవానికి ముగ్ధుడైన అతను పరవశంతో గేటు తీసి, మరొకతన్ని తోడిచ్చి లోపలికి పంపించాడు.

ఇప్పటి కాలాన్ని రాజసంగా ఏలుతోంది ఛానల్ టీవీ. ఆర్ధిక వనరులు అప్రతిహతంగా వచ్చి చేరుతున్నాయి. ఆ హంగూ, ఆర్భాటం సెక్యూరిటీ గేటు నుంచి లోపలి కెళ్లే దాకా అంగుళం అంగుళంలో కనిపిస్తూనే ఉంది. దాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నాడాయన.

లోపల అన్ని సౌకర్యాలూ అమరి ఉన్న ఆ గది లోకి ప్రవేశించాడు. ఇంద్రుడిలా ఆశీనుడై ఉన్న వ్యక్తిని చూసి "నా పేరు ఏక దంత మూర్తి. నెనొచ్చిన పని.." అంటూ కొద్ది నిముషాలు మాట్లాడి."..అంచేత వెంటనే నేను ప్రేక్షకులతో లైవ్ లో మాట్లాడే ఏర్పాటు చేయండి"అన్నాడు.
ఆయన కూడా ఆయన ఆకర్షణ శక్తికి లో బడిన వాడిలా ఏం అడ్డు చెప్ప లేక ఆఘ మేఘాల మీద అన్ని ఏర్పాట్లూ చేశాడు. చుట్టూ కెమేరాలు, లైట్లు.. మధ్యలో ఆసనం మీద ఏక దంత మూర్తి.

"ఓం శివ పార్వతాయ నమః. మీ అందరికీ నా శుభాశీస్సులు. మీతో నేను ముచ్చటించాలని ఇలా కార్యక్రమం రూపొందించుకుని వచ్చాను. మీ ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ అంటూ ఓ మంచి పనికి శ్రీకారం చుట్టాడు. పరిశుభ్రత అనేది అందరూ అవలంభించాలి. శుభ్రతలో ఆరోగ్యముంటుంది. మీ ఆరోగ్యమే నాకు ముఖ్యం. ఇన్నాళ్లు మీరు స్వర్గం అంటే సర్వ సుఖాలు, రంభా ఊర్వశులు అనుకుంటున్నారు. నిజానికి స్వర్గం అంటే పరిశుభ్రత, పచ్చదనం. స్వచ్ఛమైన గాలి, నీరు. మనిషి అనుభూతించడానికి ఆహ్లాదంగా ఉండే ప్రకృతి. మీ భూ లోకాన్ని నరకం చేసుకుంది వీటిని కలుషితం చేసుకునే కదా!

ఒకప్పుడు ఈ భూమండలం అందమైన కీకారణ్యాలతో, విశేషమైన జంతు జాలంతో, మంచి నీరు పారే నదులతో, సెలయేర్లతో, కాలానుగుణ ప్రకృతి మార్పులతో భూతలాన్ని సృష్టించిన మా దేవతలకే కన్నుకుట్టేలా ఉండేది. మేము అప్పుడప్పుడు ఆటవిడుపుగా వ్యాహ్యాళికి వచ్చే వాళ్లం కూడా. మరిప్పుడు ఉద్యాన వనాల మాట మేమెరుగు(దేవుడెరుగు), కనీసం పచ్చని చెట్లు లేవు. సరస్సుల మాట సరే, తాగడానికి గుక్కెడు మంచి నీళ్లు లేవు. ఎక్కడ చూస్తే అక్కడ మురికి. భూమిలో పాతుకుని మట్టిలో కలిసి పోని పాలిథీన్ కవర్లు. మీరు ముక్కులకీ మూతులకీ గుడ్డ కట్టుకుని తిరగడం. ఎక్కడ ఏ నీరు తాగితే, ఏ ఆహారం తింటే ఏం ప్రమాదమో? అని భయపడుతూ బతకడం. మీరు దాదాపు జీవచ్ఛవాలే. ఇంతకంటే నరకం ఉంటుందా? ఇదా మీరు సాధించిన అభివృద్ధి?

ఎప్పట్నుంచో మీరు నా ప్రతిమలు ప్లాస్టర్ ఆఫ్ పేరీస్ తో చెయ్యడం, హానీ కలిగించే రంగులను ఉపయోగించడం, చెఱువుల్లో నిమజ్జనం చెయ్యడం త ద్వారా ఆ నీళ్లు కలుషితమయి పర్యావరణానికి చేటు కలిగించడం, అవి తాగిన చేపలు, పశు పక్ష్యాదులు మరణించడం తెలిసిందే!

ఆ రకంగా చేయడం ప్రమాద కరమని కొంత మంది పర్యావరణ ప్రేమికులు చెవునిల్లు కట్టుకుని చెబుతున్నా, మట్టి ప్రతిమలు అందిస్తున్నా, అనుకున్న మార్పు మీలో రావడం లేదు. అదే నాకు బాధ కలిగించింది. అరే! నన్నింతగా ప్రేమిస్తారే! అభిమానిస్తారే! సంవత్సరానికో సారి నన్ను పిలిచి నవ రాత్రులూ మీ విభవము కొద్దీ కుడుములూ, ఉండ్రాళ్లు, కజ్జికాయలు, లడ్డులూ మా అమ్మలా బొజ్జ నిండా పెట్టి పూజలతో సంతుష్ఠి పరుస్తారు కదా! అంతే కాకుండా ఇంట్లో ఏ శుభ కార్యం జరిగినా మొదటి పూజ నాకే కదా! మరి మీ క్షేమం నేను కాంక్షించక పోతే మరెవరు కోరుకుంటారు? అందుకే ఇలా వచ్చాను." అని తన రూపాన్ని క్షణం పాటు వినాయకుడిగా మార్చుకుని టీవీల ద్వారా దర్శనం ఇచ్చి..మళ్లీ యధా రూపం ధరించి "నేను మీ కోసం కైలాసం వదిలి ఈ విషయం చెబుదామనే వచ్చాను. మీకు ఇప్పుడిప్పుడే పర్యావరణం పట్ల అవగాహన కలుగు తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య మంత్రుల ఆధ్వర్యంలో విశేషంగా మొక్కలు నాటుతున్నారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుని నీళ్లు నిలవ చేసుకుంటున్నారు.

స్వార్థం విడిచి ఈ భూప్రపంచం మా అందరి నివాసం అన్న స్పృహతో జాగృతమవుతున్నారు. మీలో నా విగ్రహాలు, పూజల విషయాల్లో కూడా మార్పు రావాలి. మీరు పెట్టే విగ్రహం ఎత్తు ఎంతన్నది కాదు కావలసింది..చిన్న మట్టి ప్రతిమ అయినా మనో శుద్ధితో పూజిస్తే చాలు. పెద్ద పెద్ద మైకులతో పాటలు పెట్టక పోయినా, నా సమక్షంలో మంద్రంగా శ్లోకాలు, పద్యాలు చదివినా చాలు..మిమ్మల్ని అనుగ్రహిస్తాను. విఘ్న నివారణ చేస్తాను.

ఆర్భాటం, ఆడంబరం కాదు కావలసింది. పరిపూర్ణ భక్తి, నా మీద ధ్యాస. నా భక్తులు నిండు మనసుతో నా విన్నపాన్ని వింటారని, ఈ భూతలాన్ని స్వర్గతుల్యం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరిక వెళతాను."అని హడావుడిగా లేచి వెళ్లిపోయాడు. ఆయన వెళ్లిపోయాక ట్రాన్స్ లోనుంచి బయట కొచ్చినట్టుగా టీ వీ స్టాఫ్ ఆయన కోసం వెతికితే దొరక లేదు. టీ వీ లో వినాయకుడి లైవ్ చూసిన భక్తులు తమ జన్మ ధన్యమైందని పొంగి పోయారు. ఆయన తమకు చేసిన విన్నపాన్ని కచ్చితంగా పాటించాలని మానసికంగా సర్వసన్నద్ధులయ్యారు.

*****

అతి కొద్ది కాలం లోనే భూ మండలం స్వచ్ఛతతో, అడవులతో, పచ్చ దనంతో, జంతు జాలంతో, పక్షులతో, సెలయేళ్లతో స్వర్గ సమానమై పూర్వ స్థితి నొంది మానవులందరూ ఎటు వంటి రోగాలు, వ్యాధులు లేకుండా పూర్ణాయుర్ధులై వినాయకుడుకి హంగులూ, ఆర్భాటాలు, ఆడంబరాలు లేకుండా యధా శక్తీ మనో శుద్ధితో పూజించ సాగారు.

మరిన్ని కథలు
ramya