Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
bless my rikshavala

ఈ సంచికలో >> కథలు >> రాజేశ్వరి నిరీక్షణ

rajeshwari nireekshana

ఊరు చివర ఇల్లు. ఒంటిరగా నిస్తేజంగా జాలిగా ఉంది. ఇల్లు చాల పాత బడి పోయింది. గోడలకు పెచ్చులు ఊడి పోయాయి. చాల సంవత్సరాల నుంచి సున్నం వెయ్యక పోవటం రంగు వెలిసిన బొమ్మలా ఉంది. హాలులో కూర్చుని ఏదో పుస్తకం  చదువుతోంది ఒక యాబై సంవత్సరాల స్త్రీ. సన్నగా పొడుగ్గా ఉంది. రంగు వెలిసిన చీర. అక్కడక్కడ చినిగిన జాకెటు. ఆమె పరిస్ధితిని చెప్పకనే చెప్పుతున్నాయి.

ఒక వైపు పుస్తకం చదువుతునే ఇంకో వైపు గుమ్మం వైపు  ఆత్రంగా చూస్తోంది. ఆవిడ ఎవరి కోసమో ఎదురుచూస్తున్నట్టుగా ఉంది. ఒక రోజు నుంచి కాదు. రెండు రోజుల నుంచి కాదు. నెలల నుంచి కాదు. సంవత్సరాల నుంచి ఎదురుచూస్తోంది. ప్రతి రోజు ఆ మనిషి తప్పకుండ తనని వెతుక్కుంటు వస్తాడని నమ్ముతోంది. కాని రోజులు సంవత్సరాలు గడిచిపోయాయి. కాని ఆమె ఎదురుచూస్తున్న మనిషి మాత్రం రాలేదు. ఆయిన ఆమె ఆశ వీడలేదు. ఈ రోజు కాకపోయిన రేపయిన వస్తాడని ఆవిడకు తెలుసు. అందుకే ప్రాణాలు బిగ పట్టుకుని అతని కోసం ఎదురు చూస్తోంది.

నిజానికి రాజేశ్వరి ఏమంత పేదది కాదు. ఆవిడుకు కొద్దో గొప్పో ఆస్ది పాస్తులు ఉన్నాయి. సొంత ఇల్లు ఉంది. బ్యాంకులో కొంచం డబ్బు ఉంది. దాని మీద వచ్చే వడ్డీ ఆమె జీవనాధారానికి సరి పోతుంది. డబ్బు కోసం ఆమె ఎవరి మీద ఆధార పడ వలసిన అవసరం లేదు. ఆమెకు ఉన్నది ఒక్కగా నొక్క కొడుకు. రెండు సంవత్సరాలకు ముందు అతను అకస్తాతుగా చని పోయాడు. దాంతో ఈ ప్రపంచంలో ఆమె పూర్తిగా ఒంటరిదై పోయింది. భర్త చాల కాలం క్రితం చని పోయాడు.

కొడుకు పోయిన తరువాత రాజేశ్వరి పరిస్ధితి బాగా మారి పోయింది. అతని చావు ఆమెలో బలమైన ప్రభావం చూపించింది. ఆ షాక్ నుంచి దాదాపు దాదాపు నెల రోజుల వరకు కోలుకో లేక పోయింది. తరువాత మెల్లగా తేరుకుంది. కాని మునుపటి ఉత్సాహం ఆమెలో క్షిణించింది. నిజానికి ఆమె మంచి బట్టలు కొనుక్కోవచ్చు. ఇంటిని బాగు చేసుకో వచ్చు. కాని అది ఆమెకు ఇష్టం లేదు. కారణం ఏమిటో ఎవరికి తెలియదు. చుట్టు పక్కల వాళ్ళు ఎన్నిసార్లు అడిగిన ఆమె జవాబు చెప్పేది కాదు. నవ్వి ఊరుకునేది.

ఆమె ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ తలుపు మీద చప్పుడు వినిపించింది. పుస్తకం టిపాయ్ మీద పెట్టి వెళ్ళి తలుపు తెరిచింది రాజేశ్వరి.  గుమ్మం దగ్గర ఒక యువకుడు కనిపించాడు. ముప్పై సంవత్సరాలు ఉంటాయి అతనికి. పొడుగ్గా బలంగా ఉన్నాడు. తన పేరు ప్రసాద్ అని పేపర్ లో ప్రకటన చూసి వచ్చానని చెప్పాడు.

రాజేశ్వరి అతన్ని సాధరంగా లోపలికి ఆహ్వానించింది. మాములు ఫార్మాలిటిస్ పూర్తయిన తరువాత ఇంటి దర గురించి ప్రసక్తి వచ్చింది.

“చూడు బాబు. ఈ ఇంటిని పదిహేను లక్షలకు అమ్మాలని అనుకుంటున్నాను. నీకిష్టమైతే చెప్పు అగ్రిమెంట్ రాసుకుందాం” అంది రాజేశ్వరి.

“చాల ఎక్కవ. ఈ పాడు పడిన ఇంటికి పదిహేను లక్షలా. ఎవరైన వింటే నవ్వి పోతారు. ఆశకు అంతు ఉండాలి. అంత ఇచ్చుకో లేను కాని అయిదు లక్షలు ఇవ్వ గలను” అన్నాడు ప్రసాద్. రాజేశ్వరి ససేమిరా అంది. ప్రసాద్ ఎంత నచ్చ చెప్పటానికి ప్రయత్నించిన ఆవిడ లొంగ లేదు. పదిహేను లక్షలకు ఒక పైసా తగ్గనని చెప్పింది.

ఇక చేసేది ఏం లేక ప్రసాద్ వెళ్ళి పోయాడు. వచ్చిన పార్టీ వెళ్ళి పోయినందుకు ఆమె పెద్దగా బాధ పడ లేదు. తను కోరుకున్న డబ్బుకు ఇల్లు అమ్ముడు అవుతుందని ఆమెకు పూర్తి నమ్మకం ఉంది. రెండు రోజుల తరువాత ఆమె ఊహించినట్టుగానే జరిగింది. ఇల్లు కొనుక్కోవటానికి ఇంకో వ్యక్తి వచ్చాడు. తన పేరు రంగారావు అని చెప్పాడు. రాజేశ్వరి చెప్పిన రేటు విని అతను కొంచం కూడా ఆశ్చర్య పోలేదు. అలాగే ఇస్తానని ఒప్పుకున్నాడు.

“నేను ముంబాయి నుంచి వచ్చాను. హోటల్ లో దిగాను. రేపు డబ్బు అగ్రిమెంట్ కాగితాలు తీసుకు వస్తాను. సిద్దంగా ఉండండి” అని చెప్పి రంగా రావు వెళ్ళి పోయాడు. రాత్రి రాజేశ్వరి అతని హోటల్ కు కాల్ చేసింది.

“చూడు బాబు నా నిర్ణయం మార్చుకున్నాను. పదిహేను లక్షలు కాదు. పాతిక లక్షలు ఇస్తే ఒప్పుకుంటాను” అంది చావు కబురు చల్లగా చెప్పుతున్నట్టు.

“అదేమిటి ఉదయం పదిహేను లక్షలు అన్నారు. నేను దానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు పాతిక లక్షలు అంటున్నారు. ఇది అన్యాయం. దయచేసి పదిహేను లక్షలకు ఒప్పుకోండి. ఇదే కదా మన మద్య జరిగిన ఒప్పందం” అన్నాడు రంగారావు.

“నేను మాట అంటే మాటే. పాతిక లక్షలకు ఒక్క పైసా తగ్గను. నీకు ఇష్టమైతే కొనుక్కో. లేక పోతే మానుకో. నేను ఇంకో మనిషిని చూసుకుంటాను”అంది రాజేశ్వరి తీక్షణంగా.

“వద్దు లెండి అంత మాట ఎందుకు. పాతిక లక్షలు ఇస్తాను. కాని దయ చేసి ఈ రేటు మీద నిలబడండి” అన్నాడు రంగా రావు.

మరునాడు ఉదయం రంగారావు డబ్బు సంచితో అగ్రిమెంట్ కాగితాలతో వచ్చాడు.

“ఇదిగో మీరు అడిగిన డబ్బు. ఇవి అగ్రిమెంట్ కాగితాలు. వీటి మీద మీరు సంతకం పెడితే డీల్ అయి పోతుంది. నాకు ఎంత తొందరగా ఇల్లు స్వాధీనం చేస్తే అంత మంచిది” అన్నాడు రంగారావు.

“అలాగే ముందు ఇద్దరం కలిసి టీ తీసుకుందాం. ఆ తరువాత కాగితాల మీద సంతకం పెడతాను” అని చెప్పి రెండు టీలు తీసుకువచ్చింది. ఒక కప్పు అతనికి ఇచ్చి రెండోది తను తీసుకుంది.  అతను టీ గబ గబ తాగి కప్పు టీపాయ్ మీద పెట్టాడు.

అంతె అతనికి తల గిర్రున తిరిగినట్టుగా అయింది. గుండెల్లో ఏదో మంట మొదలయింది. ఊపిరి పీల్చటం చాల కష్టమైంది. రెండు క్షణాలు చిత్రవధ అనుభవించి తరువాత అతను తల వాల్చేశాడు. రాజేశ్వరి మెల్లగా అతని దగ్గరికి వెళ్ళి చూసింది. చని పోయాడని నిర్ధారణ చేసుకున్న తరువాత గబగబ బాత్రూం కోలి వెళ్ళింది. శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకుంది. చని పోయిన రంగా రావు ముందుకు వచ్చి నిలబడి అంది.

“నాకు ఉన్నది ఒక్కగానొక్క కొడుకు. వాడు బాగానే చదువుకున్నాడు. కాని చెడుస్నేహం వల్ల బాగా చెడి పోయాడు. ముంబాయి స్మగ్లర్స్ తో వాడికి స్నేహం ఏర్పడింది. నువ్వు వాడి పార్టనర్ వి. మీరిద్దరు కలిసి వజ్రాలు స్మగ్లింగ్ చేసేవారు. ఇలాంటి తప్పుడు పనులు చెయ్య వద్దని మా వాడికి ఎన్నో సార్లు చెప్పాను. కాని వాడు వినిపించుకో లేదు. ఒక రోజు అర్ధ రాత్రి నువ్వు వాడు కలిసి ఈ ఇంటికి వచ్చారు.

ఆ సమయంలో ఇంట్లో కరెంటు లేదు. అంతా చీకటిగా ఉంది. నిన్ను పూర్తిగా బాగా చూసే అవకాశం లేక పోయింది. మీరిద్దరు నాకు ఎదురుగా ఉన్న గది లోకి వెళ్ళి తలుపులు లోపల నుంచి గడియ వేసుకున్నారు. ఆ రోజు మీరిద్దరు భోజనం కూడా చెయ్య లేదు. ఒక గంట తరువాత నువ్వు బయటకు వెళ్ళి పోయావు. మళ్ళి రెండు గంటల తరువాత తిరిగి వచ్చావు. ఆ క్షణం నుంచి మీ మద్య గొడవ అయింది. మీరు దొంగలించి తెచ్చిన వజ్రాల కోసం గొడవ పడుతున్నారని నాకు అర్ధమైంది. నువ్వు కోపంతో నా కొడుకు గొంతు పిసికి చంపేశావు. నేను ఎక్కడ పట్టుకుని పోలీసులకు అప్పగిస్తానని నీకు భయం వేసింది. అందుకే పారి పోయావు.

“కాని తప్పకుండ నువ్వు తిరిగి వస్తావని నాకు తెలుసు. ఆ వజ్రాల కోసం తప్పకుండ తిరిగి వస్తావని నాకు నమ్మకం. అందుకే ఈ ఇంటిని అమ్మకానికి పెట్టానని పేపర్ లో ప్రకటన చేశాను. నిజానికి ఈ ఇల్లు అయిదు లక్షలు కూడా చెయ్యదు. కాని వచ్చిన వాళ్ళందరికి పది లక్షలు అని చెప్పాను. అందరు నన్ను పిచ్చి దానిలా చూశారు. నేను అడిగిన మొత్తం బేరం చెయ్యకుండ ఎవరు ఇస్తారో వాడే నా కొడుకును చంపిన హంతకుడు. ఆ వజ్రాలు నా కొడుకు ఈ ఇంట్లో దాచాడని వాడి నమ్మకం. రెండు సంవత్సరాల నిరీక్షణ తరువాత నువ్వు వచ్చావు. పదిహేను లక్షలని చెప్పగానే బేరం చెయ్యకుండ ఒప్పుకున్నావు. ఆ రాత్రి నా కొడుకును చంపింది నువ్వే అని నాకు మెల్లగా అనుమానం కలిగింది. అది నిజమా కాదా తెలుసుకోవటానికి రేటు పెంచి పాతిక లక్షలు కావాలని అన్నాను. నువ్వు వెంటనే ఒప్పుకున్నావు. దాంతో నా అనుమానం పూర్తిగా తీరి పోయింది. ఒక నిజం చెప్పమంటావా. ఆ వజ్రాలు ఎక్కడ ఉన్నాయో నాకు తెలిసింది. సీలీంగ్ ఫ్యాన్ కప్పులో ఉన్నాయి. నువ్వు చని పోయిన తరువాత ఆ వజ్రాలను పోలీసులకు అప్పగించాలని గట్టిగా నిర్ణయించు కున్నాను. అందుకే ఇన్ని రోజులు వాటిని నా దగ్గర జాగ్రర్తగా పెట్టుకున్నాను. నా పగ తీరింది. ఇప్పుడు నా కొడుకు ఆత్మకు తప్పకుండ శాంతి కలుగుతుంది”

సంతోషంతో ఒక్క సారిగా పగల బడి నవ్వింది రాజేశ్వరి. రెండు సంవత్సరాల తరువాత ఆమె సుధీర్ఘ నీరీక్షణకు తెర పడింది.

మరిన్ని కథలు
vyapara vidya