Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nijamaina koduku

ఈ సంచికలో >> కథలు >> రమ్మనె వనభోజనం...!

rammane vanabhojanam

ఆఫీసర్ విశ్వనాథం ముందు లీవ్ లెటర్ తో నుంచున్నాడు జానకిరాం. ఫైల్సు చూస్తున్న విశ్వనాథం తలెత్తి ఏమిటి సంగతి? అన్నట్టు కళ్ళతోనే అడిగి, వెంటనే జానకిరాం తన ముందుకు తోసిన లీవ్ లెటర్ కేసి చూసాడు.

“ఓహ్....చెప్పావుగా... ఊరికి వెళ్తున్నానని....మంచిది చక్కగా ఎంజాయ్ చేసి రా...వనభోజనాలు, లక్షపత్రి పూజలతో పాటు పనిలో పని ద్రాక్షారామం, సామర్లకోట, పిఠాపురం, ఐనవిల్లి, ముక్తేశ్వరం...ఇలాంటివన్నీ చుట్టేసి రా....మరీ అర్జంటు ఉంటే మాత్రం కాస్త ఫోన్ చేస్తాను, అవసరమైన ఇన్ఫర్మేషన్ కొంచెం నాకు ఇస్తే చాలు...వీలైనంతవరకు ఆ ఇబ్బంది కూడా పెట్టననుకో....” అంటున్న విశ్వనాధం కేసి చూసి, “తప్పనిసరిగా సర్....ఏ పనున్నా తప్పనిసరిగా ఫోన్ చేయండి”, అంటూ బయటకు వచ్చాడు జానకిరాం పట్టలేని ఆనందంతో.
శలవంటే నిప్పులు తొక్కే బాస్ ఇంత కూల్ గా ఉన్నాడంటే ఒకటే కారణం – పల్లెటూరికి, సొంత ఊరికి ఎవరైనా వెళ్తున్నారంటే ఆయన మహదానందపడిపోతాడు. నగర జీవితంలో పడి, ఆ సహజమైన ప్రకృతి సౌందర్యాన్ని మనిషి ఎంతలా కోల్పోతున్నాడో  కాఫీయో, టీయో ఇచ్చి మరీ కూర్చోపెట్టి అలుపు లేకుండా గంట సేపైనా మాట్లాడతాడు.

***

సకుటుంబంగా కారులో ఊరికి బయల్దేరిన జానకిరాంకి మనసు గాలిలో తేలినట్టుంది. నిజానికి ఈసారి వనభోజనాలకి వెళ్ళకూడదనే నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే, గత ఏడాది వనభోజనాలకి ఎంతో ఉత్సాహంతో హాజరైన జానకిరాంకి తీవ్రమైన నిరాశ ఎదురైంది. దానికి కారణం ఉంది. వనభోజనాలంటే జానకిరాం మనసులో తిష్ఠ వేసుకున్న అతని బాల్యానుభూతులు, అనుభవాలు. అలా అనుకోగానే... చిన్ననాటి వనభోజనాల చిత్రం...ఒక్కసారి జానకిరాం కళ్ళ ముందు మనోహర దృశ్యంగా కదలాడింది.

***

జానకిరాం చిన్నప్పుడు – కార్తీకమాసమంటే సందడే సందడి...తెల్లారుఝామున చలిలో, చెరువులో వాళ్ళ అమ్మతో స్నానాలకు వెళ్ళటం దగ్గర్నుంచి, ప్రతి రోజు ఏవో పూజలు, ఉపవాసాలు, ప్రసాదాలు, భోజనాలు, అరటి దొప్పల్లో దీపాలు, ఆదివారాలు వస్తే – ఎక్కడో ఒక చోట వనభోజనాలు, సోమవారాలు లక్షపత్రి పూజలు, సాయంత్రం మరలా అందరికీ భోజనాలు ---- ఇలా కార్తీకమాసం అంతా సందడే సందడి. ముఖ్యంగా వనభోజనాలు అతని జీవితంలో మరపురాని మధురమైన అనుభూతులను మిగిల్చాయి. స్కూలు తరపున పిక్నిక్ పేరుతో, వీధిలోని వాళ్ళంతా కలిసి, ఊరి వాళ్ళతో కలిసి, ఇలా నెలంతా వనభోజన సందడులే.

జానకిరాంకి హైస్కూలు, కాలేజి వయసులో వనభోజనాలు మరపురానివి. సుబ్బన్న గారి తోటలో ప్రతి ఏటా జరిగే భోజనాలకి చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా జనాలు హాజరయ్యేవారు. పిల్లా, పెద్దా, అంతా కలిసి పొద్దున్నే ఇంటి నుంచి నడక ప్రారంభిస్తే, రెండు, మూడు కిలోమీటర్ల దూరం ఉన్న తోటకు చేరుకొనేటప్పటికి 9, 10 అయ్యేది. పెద్దవాళ్ళు, నడవలేని వాళ్ళు, ఎడ్లబళ్ళ మీద నెమ్మదిగా వచ్చేవారు. కుర్రాళ్ళు, పరుగులు తీసుకుంటా, కొంచెం పెద్దాళ్ళు సైకిళ్ళు తోక్కుకుంటా, ఇలా....రకరకాల మార్గాల్లో, రకరకాల వాహనాలమీద తోటకి చేరేవాళ్ళు. వందలమంది ఒక్క చోట చేరేటప్పటికి పిల్లల అల్లరికి అంతే ఉండేది కాదు. అరటి ఆకులో వేడి వేడి ఉప్మాతో ఫలహారాలు ప్రారంభం– ఆ ఉప్మా రుచి మళ్ళా ఎక్కడా దొరకలేదని జానకిరాం తలచుకుంటూ ఉంటాడు.

పిల్లలు, ముసలాళ్ళు వెళ్ళేటప్పటికె, ముందు గానే చేరిన యువకులు, వంట వాళ్ళు, పనివాళ్ళతో చాలా పనులు జరిగిపోయి ఉండేవి. గాడి పొయ్యిలు తవ్వడం, పెద్ద పెద్ద రాళ్ళు పేర్చి పొయ్యిలు తయారు చేయడం, కట్టె పుల్లల మోపులు రెడీ చేయడం, పులిహార కలపడానికి తాటాకు చాపులు, అన్నం వార్చడానికి బుట్టలు, ఇలా ---వంట బ్రాహ్మల ఆర్డర్లకి అనుగుణంగా అన్నీ అందించే కుర్ర బ్యాచి...ఏది తక్కువైందన్నా మళ్ళా సైకిళ్ళు పైన మెయిన్ రోడ్డుకు వెళ్ళిపోవడం ...అదో హడావుడి.

తోటలో ఉసిరి చెట్టు కింద నేలంతా శుభ్రంగా తుడిచి, కళ్ళాపి జల్లి, ముగ్గులు పెట్టేసి ఉండేది. ఉసిరి చెట్టు కింద లక్ష్మీ దామోదర పూజ కోసం రెడీ అయిన దంపతులు పట్టు బట్టలు కట్టుకొని కూచునే వారు. పిల్లలను కూడా కూచోపెట్టాలని చూసినా కుదిరితేనా? వాళ్ళ లోకంలో వాళ్ళుండే వాళ్ళు. సుబ్బన్న గారి తోట చాలా పెద్దది – కందిచేను, మామిడి చెట్లు, ఉసిరి చెట్లు, నిమ్మ చెట్లు, జామ చెట్లు, వీటితో పాటు గట్లమ్మట లేచిన ఈత చెట్లు, సీమ చింతకాయ చెట్లు..ఇలా పిల్లలు రకరకాల కాయల కోసం చెట్లు ఎక్కడం, చేతులు, కాళ్ళు గీరుకుంటున్నా పట్టించుకోకుండా, సీమ చింత కాయలు, రేగు కాయలు, ఈత పళ్ళ కోసం పోటీ పడడం, ఆనక జట్లుగా కబడ్డీ ఆడడం, పరుగు పందాలేసుకోవడం,  తిన్నగా లేని గట్లమీంచి పరిగెత్తి కింద పడడం, దెబ్బలు తగిలించుకోవడం, పెద్దాళ్ళకి తెలిస్తే కొడతారని నొప్పులు భరించడం, ఎన్ని అనుభవాలు? పొలం కాలువ బోదెల్లోంచి నీరు పారడం చూడ్డం, పొలంలో ఉన్న కరెంటు బోరు కింద కావాలని తడిసిపోయి, స్నానాలు చేయడం,....వాహ్ – మరిచిపోయేవా ఆ ఆనందపు అనుభూతులు?

ఇక కాలేజి కుర్రాళ్ళు వాళ్ళ వ్యవహారాల్లో వాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు. మరీ ఈ కాలంలా కాకపోయినా, ఆ కాలంలో కూడా, అమ్మాయిల గురించిన కబుర్లు, దొంగ చూపులు, రాయబారాలు, పట్టు పరికిణీలు, వోణీలు, మువ్వల పట్టాల సౌందర్య వర్ణనలు, వీలు కుదిరి, సమయం చిక్కితే, వారు, వీరు కలిసి అంత్యాక్షరి ఆడటాలు, పరిచయాలు పెంచుకొనే ప్రయత్నాలు, పెద్ద వాళ్ళు ఒక కన్నేసి ఉన్నా, వాళ్ళ కళ్ళు గప్పి, కళ్ళల్లో కళ్ళు కలిపి ఊసులు చెప్పుకోడాలు..........వావ్...ఆ చిలిపి ఊహల రోజులు గుర్తుకొస్తే జానకిరాంకి వద్దన్నా పెదవులపైకి నవ్వులు, గుండెల్లోకి గుబులు రాకమానదు.  ఇక పెద్ద వాళ్ళు, రకరకాల పనులు పంచుకొనేవారు. ఆడవాళ్ళు వంటలు, పూజలు వంటి వ్యవహారాలూ చూస్తుంటే, మగవాళ్ళు పంక్తి భోజనాలు, ఇతరత్రా ఏర్పాట్లు చేసేవారు. ఏ పనికి రాని బ్యాచి చాలా మంది ఏదో పెద్ద చెట్టు నీడన చతుర్ముఖ పారాయణం, నిత్యాగ్నిహోత్ర సేవలో నిమగ్నమయ్యేవారు. మళ్ళా వాళ్లకు టీలు, కాఫీలు, టిఫిన్లు సప్లై చేసే కుర్ర బ్యాచి ఒకటి.
ఆడవాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు ఆటపట్టించుకుంటూ, తమకు అరుదుగా దొరికిన ఆ స్వీచ్చా సామ్రాజ్యంలో ఒకోసారి భర్తలపై కూడా జోక్స్ వేస్తూ ఆనందపు జల్లుల్లో తడిసిపోయేవారు...ఆ కబుర్లలోనే, ఎవరి అబ్బాయిలు ఉద్యోగాల్లో స్థిరపడ్డారో, ఎవరి అమ్మాయికి అయితే వాళ్ళు సరితూగుతారో, ఏ పెళ్లి కూతురు కనుముక్కు తీరు ఎలా ఉందో......ఇలా మొత్తం మీద ఇన్ఫార్మల్ గా నైనా ఇన్ఫార్మర్ల ద్వారానైనా పెళ్లి సంబంధాల సమాచారాలు ఒకరినుండి ఒకరికి చేరేవి. మా అబ్బాయికి అప్పుడే పెళ్లి చేయమని భేషజాలు పోయేవాళ్ళు, తమ స్థాయికి తగిన కట్నకానుకలు ఇవ్వగలిగిన వాళ్ళు ఇంకా కనబడలేదనేవాళ్ళు.....ఇలా గొప్పలకు పోయే తల్లులు, తలలు బొప్పులు కట్టిన తండ్రులు, రెండు పార్టీల మధ్యలో చురుగ్గా తిరిగే పేరయ్యలు – ఇలా నేటి కాలంలా వివాహ వేదికలా కాకున్నా, సంబంధాలు వెతుక్కొనేందుకు, కుదిరితే మాటాడుకునేందుకు వనభోజనాలు ఒక అవకాశమే ఆ రోజుల్లో.

ఇక పూజలన్నీ పూర్తయ్యాక, భోజనాలు ప్రారంభం అయినప్పుడు సందడి తారాస్థాయికి చేరేది. పంక్తి భోజనాల వడ్డనలకి అందరూ పోటీ పడేవాళ్ళు. మొదటి బ్యాచిలో మీరు కూచోండి, అంటే మీరు కూచోండి అంటూ – అందరూ తప్పుకొనే ప్రయత్నమే. ముఖ్యంగా యువకులంతా ఆడపిల్లలు కూచున్న బ్యాచిలో మంచి నీళ్ళు వడ్డించే చాన్సు కోసం పోటీలు పడేవారు. ఎందుకంటే, మంచి నీళ్ళు వద్దనే వాళ్ళు సాధారణంగా ఎవరూ ఉండరు, ఎన్నిసార్లు అయినా తిరగచ్చు.

ఈ కుర్రవాళ్ళ వడ్డనను పర్యవేక్షించే పెద్దవాళ్ళు, జనాల సంఖ్యను బట్టి వంట బ్రాహ్మలకి ఫీడ్ బ్యాక్ ఇచ్చే వాళ్ళు, అదనంగా అన్నం వెయ్యమని తొందర పెట్టే వాళ్ళు, కూరలు, పిండి వంటలు వృధా చేయకుండానే, అందరికీ సంతృప్తిగా వడ్డించే పద్ధతి చూపించే వాళ్ళు – మేనేజ్ మెంట్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ – ఒక తరం నుంచి మరో తరానికి అందించే ఒక గొప్ప ప్రక్రియకి నాంది – ఆ భోజనాలు. చాపలు, జంబఖానాలు పరిచే వాళ్ళు, అరటి ఆకులు పరిచే వాళ్ళు, వాటిపై నీళ్ళు జల్లి, తుడిచే వాళ్ళు, సప్లై సామాన్ల వాడి స్టీలు గ్లాసులను కడిగించి, ఆకుల దగ్గర పెట్టే వాళ్ళు, మంచి నీళ్ళు పోసే వాళ్ళు – ఇలా – యువకులంతా ప్రాథమిక వ్యవస్థ చూస్తే – అసలు వడ్డనలో ఆడవాళ్ళదే అందె వేసిన చేయి. ఆకులో ఏ పదార్ధం ఏ పక్కన ఎంత వడ్డించాలో, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి తగినట్టుగా ఎలా వడ్డించాలో – వాళ్ళ వెనకాల ఉండే అమ్మాయిలకి ఆ స్కిల్స్ నేర్పుతూ ఉండేవారు – రాబోయే సంవత్సరాలలో మీదే ఈ బాధ్యత అంటూ.

“భోజన కాలే గోవింద నామ స్మరణ...గోవిందా....గోవిందా....” అంటూ అందరూ గొంతు కలిపి, భోజనాలకి కూర్చునేవారు....ఇక కబుర్లు చెప్పుకుంటూ, ఛలోక్తులు విసురుకుంటూ జనం తాపిగా భోజనాలు చేస్తుంటే, వెంటబడి, వెంటబడి, కొసరి, కొసరి వడ్డించే వారు...

“పప్పండీ, పప్పు, పప్పూ...మాష్టారూ! కొంచెం పప్పు వేయమంటారా?” పప్పు బాల్చీ తీసుకొని వచ్చినాయన ప్రశ్న.

“బాబూ! ఇది ‘పప్ ‘నా? ‘పప్పు’నా? ‘పప్పూ’నా? – హిందీ మాష్టారి ఛలోక్తి.

“ఏంటో వాటి మధ్య తేడా?” పక్కనే విశ్వనాధం గారి ఆరా....

“ఏం లేదండీ, మొదటి బ్యాచిలో వడ్డించేటప్పుడు గరిటెతో ఆకులో గట్టిగా కొడితే గాని పడదు....గట్టిగా ఉండి.... అది ‘పప్’....ఇక రెండో బ్యాచి, మూడో బ్యాచికి కొంచెం పప్పుకి నీరు తోడై,  శ్రమ పడకుండానే ఆకు మీదకి జారుతుంది ....అది ‘పప్పు’....ఇక ఊహించనంత మంది వచ్చినప్పుడు నీటికి పప్పు తోడై, ఆకులో పారుతూ ఉంటుంది....అది పప్పూ....అన్న మాట.

“భలే చమత్కారి మాష్టారూ....మీరు ...” విశ్వనాధం మెచ్చుకోలు.

“గురువు గారూ....నెయ్యి వెయ్యమంటారా?” నెయ్యి వడ్డిస్తున్న కుర్రాడి ప్రశ్న....

“వెయ్యద్దు నాయనా.....పొయ్యి....” బూరెలకు కన్నాలు పెట్టి ముందుకు తోసేవారు పరాంకుశం గారు....ఆ తెచ్చిన నేతి గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆ కుర్రాడు నెయ్యి పొయ్యవలసిందే....డెబ్బై ఏళ్ళు వచ్చినా అన్ని రుచులూ ఆస్వాదిస్తూ, సంతుష్టిగా  భోంచేసే పరాంకుశం గారిని చూస్తే, ఈర్ష్య కన్నా ఆశ్చర్యమే వేస్తుంది... మనిషి ఎక్కడికి వెళ్ళినా ఆ వయసులో కూడా చక్కా సైకిల్ పైనే వెళ్ళేవారు.
ఇక వంకాయ అల్లంకారం కూర, కార్తీక మాసం స్పెషల్ అయిన కంద బచ్చలి కూర, పనస పట్టు కూర, బూరెలు, పులిహార, ముక్కల పులుసు, కొబ్బరి పచ్చడి, దోసకాయ బద్దలు, అప్పడాలు, వడియాలు...ఇలా అన్నీ నోరూరించే వంటలే... వంట బ్రాహ్మడు నాగేశ్వర్రావు వంటలకి పేరెట్టే వాళ్ళు ఆ చుట్టుపక్కలే లేరు. వయసు మీద పడినా, శ్రద్ధగా అన్నీ తానే దగ్గరుండి చూసుకుంటూ, పిల్లలకి సూచనలు ఇస్తూ అదే రుచిని కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా వనభోజనాల వంటలు అంటే – ఒక యజ్ఞం లా ఎంతో శ్రద్ధగా చేస్తాడు....
ఇలా....కబుర్లు నంచుకొంటూ, వేళాకొళాలు అద్దుకొంటూ సావకాశంగా భోంచేస్తున్న వాళ్ళను చూసి, కొంచెం లేటుగా రెండో బ్యాచికి కూచుందామనుకొన్న వారికి అనవసరంగా ఆగామా అనిపించేది. మొత్తానికి భోజనాలన్నీ ఒక కొలిక్కి వచ్చాక, సాంస్కృతిక కార్యక్రమాల సందడి ప్రారంభమయ్యేది – ఆడవాళ్ళు సాంప్రదాయ సంగీత కీర్తనలు, చిన్న పిల్లల పద్యాలు, పాటలు, వగైరా...పురాణం మాష్టారి ప్రవచనం – పెద్దలు, పిల్లలు అందరినీ  అలరించేది. “కార్తీక మాసాన కలిసాము అందరం...అన్నానికా? కాదు, మరి ఎందుకు? ఘనమైన మన జాతి కష్టాలలో ఉంది..అది తెలుసుకొని దాన్ని కాపాడుకొందుకు..” అంటూ పాటతో ప్రారంభించి, అడుగంటి పోతున్న సంస్కృతీ, సంప్రదాయాల గురించి, సనాతన ధర్మ పరిరక్షణలో ఈ వనభోజనాల ప్రాముఖ్యత గురించి....ఇలా ఎంతో ఆసక్తికరంగా సాగేది వారి ప్రసంగం. ప్రతీ సంవత్సరం వారి ప్రవచనం విన్నా, ఎప్పటికప్పుడు కొత్తగా అనిపించేది.

ఆఖరుగా జమాఖర్చుల వివరాలు, నూతన కార్యవర్గాల ఎన్నిక, అభినందనలు, పెద్ద వయసు దంపతులకు సన్మానాలు, సత్కారాలు....ఇలా సాగి, సాయంత్రం అయ్యే వేళకి సందడికి ముగింపు పలికేవారు. అందరూ భారమైన హృదయాలతో ఆ ప్రాంతాన్ని వీడలేక వీడేవారు...ముఖ్యంగా పిల్లలు ఎంత సేపటికీ కదిలే వారు కాదు అక్కడినుంచీ....ఆ రోజులు మళ్ళా వస్తాయా???

***

ఆలోచనల్లో బాల్యంలోకి ప్రవేశించి షికార్లు కొడుతున్న జానకిరాం మనస్సుకి, కారుకి సడన్ గా బ్రేక్ పడింది...”నాన్నా...ఎదర ఆటో..” అంటూ చింటూ అరవడంతో... సడన్ గా ఎడమ వేపు నుంచి ఓవర్ టేక్ చేసిన ఆటోను హిట్ చేయబోయి త్రుటిలో చాకచక్యంగా తప్పించి ఊపిరి పీల్చుకున్నాడు జానకిరాం.

“ఏంటండి...మీ చిన్నతనంలోకి వెళ్లిపోయారా.. మళ్ళా.. ? మనసు చదివిన శ్రీమతి ప్రశ్నకు పెదవులపై నవ్వుతోనే సమాధానం ఇచ్చాడు జానకిరాం.

రోడ్డుపై కారు మరలా పరుగులు తీస్తోంది....పెద్దగా ట్రాఫిక్ లేకపోవడంతో,  వేగంగా, జాగ్రత్తగా పోనిస్తున్నాడు జానకిరాం. మనసు నాల్గు రోజుల ముందు జరిగిన సంఘటన వైపు మళ్ళింది. ఊరునుంచి అవధాని గారబ్బాయి కామేశం ఫోన్ చేసాడు...ఆదివారం వనభోజనాలు, కార్తీక సోమవారం శివాలయం లో లక్షపత్రి పూజకి తప్పక రావాలని... అప్పటికి సరే అన్నా, ఎందుకో జానకిరాంకి ఈసారి కార్తీక భోజనాలకి ఊరికి వెళ్లాలనిపించలేదు. దానికి కారణం ఉంది.

***

చాలా ఏళ్ళు ఇతర రాష్ట్రాలలోనే ఉద్యోగం చేయడంతో, వైజాగ్ వచ్చిన తరువాత  గత సంవత్సరమే కుదిరి, ఊరికి సకుటుంబంగా కార్తీక సమ్మేళనానికి వెళ్ళాడు. ఊళ్లోనే ఉన్న అన్నయ్య కుటుంబం, దగ్గర ఊర్లోనే ఉంటున్న చెల్లాయి కుటుంబం, దశాబ్దాల తరవాత కలిసే దూరపు బంధువులు, స్నేహితులు - ఇలా అందర్నీ కలవచ్చు అని, ఊహించుకొని నిజానికి చాలా ఆనందపడ్డాడు. కాని, వనభోజనాలకు వెళ్ళిన తరవాత అక్కడి దృశ్యం  అతని ఊహలను, ఆశలను పటాపంచలు చేసింది. వనభోజనాల స్థలం మారిపోయింది....అసలు నిజానికి ఊరే చాలా మారిపోయింది. జానకిరాం అమ్మ, నాన్నల దగ్గరకి వచ్చినా, ఆ రెండు, మూడు రోజులు ఇంటి పట్టునే ఉండడం, దగ్గరలో ఉన్న స్నేహితులను కలవడం తప్ప, ఊరు మొత్తం తిరిగి చూసింది లేదు...దాంతో అంతా కొత్తగా ఉంది...

పూర్వం భోజనాలు అయ్యే సుబ్బన్న గారి తోట వేరేవాళ్ళు ఎప్పుడో కోనేసారట. అది కాస్త హైవే కి దగ్గరగా ఉండడంతో వెంచర్లు వేసారు...తోట మాయం అయిపోయింది...ఊరు చుట్టూరా పచ్చగా పరుచుకున్నట్లున్న పొలాలు, తోటలు దాదాపు కనుమరుగైపోయాయి...ఎక్కడ చూసినా అయితే ఇళ్ళ స్థలాల వెంచర్లు, లేదంటే కోళ్ళ ఫారాలు...అందుకని, ఆ ఏడాది వనభోజనాలు భాగ్యరాజు గారి తోటలో పెట్టేరు. ఆ ప్రాంతానికి కుటుంబంతో చేరుకున్న జానకిరాంకి ఆ ప్రదేశంలోనేనా వనభోజనాలు? అనే సందేహం కలిగింది.

నిజానికి దాన్ని తోట అని అనలేం. మూడెకరాల స్థలంలో పామాయిల్ మొక్కలు, ఓ పావు ఎకరం ప్రాంతం కొంచెం ఖాళీగా ఉంది. బహుశా కార్తీక భోజనాల కోసమనే నాటారేమో – చిన్న ఉసిరి మొక్క... దాని ఎదురుగా రెండు జంటలు పూజకి కూర్చున్నాయి – ఎవరో కొత్తగా అనిపించారు...అందువల్ల అటూ ఇటూ చూస్తూ ఓ పదిమంది కుర్చీల్లో కూర్చున్న చోటుకి వెళ్ళాడు భార్య, పిల్లలతో పాటుగా. అవధాని గారబ్బాయి కామేశాన్ని గుర్తు పట్టాడు...కొందరు అతని దగ్గర కూర్చుని చందాలు రాస్తున్నారు. 

హమ్మయ్య, ఎవరో ఒకరు ఉన్నారులే అనుకొని అక్కడకు చేరి పలకరించాడు జానకిరాం. ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని, అందరికీ పరిచయం చేసాడు కామేశం... నిజానికి వాళ్ళల్లో చాలామంది తనకి తెలిసినవాళ్ళే, కాకపోతే చాలా రోజుల తర్వాత చూడడం మూలంగా గుర్తు పట్టడానికి కొంచెం సమయం పట్టింది. అక్కడకి దూరంగా కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు....అక్కడున్న ఒకే ఒక జామ చెట్టు ఎక్కడం కోసం అందరూ పోటీ పడుతున్నారు. “నాన్నా....నేను కూడా చెట్టు ఎక్కుతాను...” అని చింటూ అంటే ---“అమ్మో జాగ్రత్త! నీకు అలవాటు లేదు కదా మరి....” అంటుండగానే, “ ఏ పనైనా చేస్తేనే కదా నాన్నా....అలవాటయ్యేది...” అంటూ తుర్రుమన్నాడు.

అమ్మాయి శృతి అక్కడున్న పిల్లల దగ్గరకి వెళ్లి కలిసిపోయి ఆడడం మొదలు పెట్టింది. దూరంగా చెట్టు కింద ఓ ఇరవై మంది కుర్రాళ్ళు, పెద్దాళ్ళు ఉన్నారు.... అక్కడకి వెళ్లి చూస్తే, కొంచెం పెద్దాళ్ళు చతుర్ముఖ పారాయణంలో సీరియస్ గా ఉంటే, కుర్రాళ్ళు స్మార్ట్ ఫోన్లలో చాటింగులో మునిగిపోయి ఉన్నారు....పరిచయస్తులు ఒకరో ఇద్దరో తనని పలకరించి, మరలా తమ పనుల్లో మునిగిపోయారు.  తనతో ఫోనులో వస్తానన్న బంధువులు, స్నేహితులు చాలా మంది రానేలేదు...వాళ్లకి ఫోన్లు చేస్తే, కొందరు భోజనం టైముకు వస్తామని, మరికొందరు వేరే ఆఫీసు వాళ్ళ ఫంక్షన్ ఉండడంతో రావడం లేదని, ఇలా కారణాలు చెప్పారు.

ఎప్పుడు వనభోజనాలైనా పర్యవేక్షణ చేసే గురుమూర్తి గారి బాధ్యతని వాళ్ళ పెద్దబ్బాయి రామకృష్ణ తీసుకున్నాడు....అతనికి కూడా పెద్దగా సహకరించే బృందం లేదు.....ఆడవాళ్ళు చాలామంది ఉన్నా, వంట దరిదాపుల్లో ఎవరూ లేరు... పట్టుచీరలు, ఫ్యాన్సీ చీరలు, నగలు పరిశీలించుకుంటూ, ఇంజనీరింగ్ చదువుతున్న అమ్మాయిల గురించి, అమెరికాలో ఉంటున్న అబ్బాయిల గురించీ, సీరియళ్ళ గురించీ కబుర్లలో మునిగిన వాళ్ళే....కొంచెం పెద్దవాళ్ళు ఒక పదిమంది లలితా సహస్రం, విష్ణు సహస్రం చదువుతున్నా, మధ్యలో కొడుకులు, కోడళ్ళ ఊసులు చెప్పుకోడం మానడంలేదు.

జానకిరాం భార్య కూడా, తన తోడికోడలుతో,  ఆ ఊళ్ళో ఉండే దూరపు చుట్టాల అమ్మాయిలతో కూచుని కబుర్లలో పడింది. మొత్తం మీద జానకిరాంకి మాత్రం ఎందుకో ఆ వాతావరణం నచ్చలేదు.  ఎవరి గోలలో వాళ్ళు ఉన్నట్టు ఉంది తప్ప, నలుగురూ కలిసి చేసుకుంటున్న ఫంక్షన్ లా లేదు....వయసుల వారీగా, స్థాయిల వారీగా బృందాలుగా కూర్చున్నారు తప్ప, పూర్వపు కలివిడితనం కనబడడం లేదు....మొత్తానికి ఉసిరి చెట్టుకింద పూజ అయిందనిపించి, భోజనాల ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. 

బెంచీలు వేసి, డిస్పోజబుల్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు, సర్దుతున్నారు ఒకరిద్దరు... జానకిరాం తాను కూడా వడ్డన బృందంలో చేరి ఏర్పాట్లు చూస్తున్నాడు. సరిగ్గా భోజనాల సమయానికి బళ్ళు, కార్లు మీద చాలా మందే వచ్చారు, సరాసరి భోజనాల దగ్గరికి వచ్చి కూర్చుండిపోయారు...పొద్దుట నుండి ఉన్న పెద్దవారు వచ్చే లోపల సీట్లన్నీ నిండిపోయాయి. పదార్ధాలు అన్నీ వడ్డించే వరకు ఆగి, గోవింద నామ స్మరణతో అన్న ప్రసాదం స్వీకరించే సంప్రదాయమే లేదు.. పదార్ధాలు వేసినవి వేసినట్లుగా లాగించేస్తున్నారు... కుర్రాళ్ళయితే, ప్లేట్లలో పదార్ధాలు వడ్డించుకొని, నుంచునే తినేస్తున్నారు. ఒక పద్ధతి లేదు, పవిత్రత లేదు – జానకిరాం మనసు మూలుగుతోంది... “ఛీ, ఈ బఫెల్లో తిండికి ఇంతలా అలవాటు పడిపోయాం ఏంటీ అంటూ.” కాని, నలుగురిలో ఆ విషయం అప్పుడు చర్చించడం బాగుండదని ఊరుకొన్నాడు.... మొత్తానికి భోజనాల ప్రహసనం పూర్తయింది. వెంటనే, కనీసం సరదాకైనా కాసేపు కూర్చోకుండానే వెళ్లిపోయిన వారు కొందరు వెళ్లిపోగా...మిగిలిన వాళ్ళు అందరినీ అతి కష్టం మీద ఉండమని, సాంస్కృతిక కార్యక్రమాలు, సంఘం తీర్మానాలు అయ్యాక వెళ్ళమని మైకులో మొత్తుకుంటున్నారు రామకృష్ణ, కామేశం..

ఉన్నవాళ్ళలో చాలామంది ముళ్ళమీద కూర్చున్నట్లు కూర్చున్నారు..ఫోన్లు చూసుకుంటూ... భోజనాల మూలంగా ఆటవిడుపు ఇచ్చిన పేకాట రాయుళ్ళు మళ్ళా చెట్ల కిందకి చేరారు....చేతుల్లో పేక ముక్కలతో, నోట్లో సిగరెట్ పీకలతో... తన పిలుపు విని వచ్చిన వాళ్ళని కుర్చీలలో కూర్చోమని, ప్రస్తుత సంఘ సభ్యులని పరిచయం చేసాడు రామకృష్ణ....చందాలు, లెక్కలు, పద్దులు వివరాలు సమర్పించారు....ఇక సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో నిర్వహించిన కార్యక్రమాలు చాలా ఎబ్బెట్టుగాను, ఇబ్బందికరంగానూ ఉన్నాయి....టివి చానళ్ళ ప్రభావంతో వయసులతో నిమిత్తం లేకుండా డేన్స్ బేబీ డేన్సులు, ఐటెం పాటలకి అశ్లీల నృత్యాలు, జబర్దస్తు అపహాస్యం ప్రోగ్రామ్స్...ఇలా (అ)సాంస్కృతిక కార్యక్రమాలు సాగుతున్నాయి... అందరితో కూర్చుని ఆ ప్రదర్శనలు చూడలేక జానకిరాం వెనక్కి వెళ్లి నుంచున్నాడు... ఒక మంచి మాట లేదు, పెద్దలను మాట్లాడమని అడిగే నాధుడు లేడు...పెద్దవాళ్ళు కూడా తమ మనసుల్లో అదే అభిప్రాయాలతో ఉన్నా –నోరు విప్పి చెప్పే ధైర్యం లేక చూస్తూనే ఉన్నారు. ఒకరిద్దరు పిల్లలు శాస్త్రేయ సంగీతం, శ్లోకాలు చెప్పడానికి ముందుకు వచ్చినా, వాళ్ళని పెద్దగా ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు కనబడలేదు.....

ఇలా ఆ వనభోజనాల తీరు చూసిన జానకిరాం నిలువెల్లా నీరైపోయాడు....తన ఊహలకి, వాస్తవానికి ఏమాత్రం పొంతన లేని ఆ వాతావరణాన్ని అతని మనసు అంగీకరించలేకపోయింది.... దాంతో, నలుగురికీ బై చెప్పి, తొందరగానే వాళ్ళ అన్నయ్య ఇంటికి వెళ్ళిపోయి, రాత్రికి వైజాగ్ వెళ్ళిపోయాడు. అదీ గతేడాది జరిగిన అనుభవం.

***

నాల్గు రోజుల క్రితం ఊరినుంచి వనభోజనాలకి రమ్మని ఆహ్వానం వచ్చినా వెళ్లేందుకు ముందుగా జానకిరాం ఇష్టపడలేదు. అదే విషయాన్ని తన భార్య లక్ష్మితో చెప్పాడు....”గత ఏడాది జరిగిన వనభోజనాలు గుర్తొస్తే, అసలు వెళ్ళాలి అని అనిపించడం లేదు...” అంటూ....
జానకిరాం మనస్తత్వం తెలిసిన లక్ష్మి నవ్వుతూనే అతని పక్కన కూర్చుని అడిగింది.... “ఎందుకని అలా అనుకుంటున్నారు? లాస్ట్ ఇయర్ భోజనాలు, మన చిన్నప్పటి లా లేవనే కదా?” ఎప్పుడూ చిన్ననాటి కబుర్లు గుర్తుకొస్తే సంతోషంలో మునిగిపోయే భర్త అభిప్రాయం బాగా ఎరిగిన లక్ష్మి ప్రశ్నకు మౌనంగానే తలూపాడు జానకిరాం.

“ఆ విషయం నేనూ ఒప్పుకుంటానండీ....కాని, కాలం మారిపోతోంది....మనమంతా నగరాల్లో ఉంటున్నాం, ఉద్యోగాలు, పిల్లల చదువులు పేరుతో ఉరుకులు, పరుగులు పెడుతున్నాం....పల్లెల్లోంచి వచ్చిన వాళ్ళమే అయినా, సౌకర్యాల పేరుతోనో, ఆస్పత్రుల వంకతోనో పట్టణాలకే అంటిపెట్టుకుంటున్నాం...జ్ఞాపకాల్లో మండువా ఇల్లు ఉంటుంది, కాని, ఇరుకు అపార్ట్మెంట్లో జైలు పక్షుల్లా బతికేస్తున్నాం....సెలవులే లేకుండా పిల్లల చదువులు, ఒకవేళ ఉన్నా, వాళ్ళతో కలిసి గడపలేనంతగా మన ఉద్యోగాల బిజీలు... ఇలా ఊళ్ళో కొన్ని తరాల వాళ్ళంతా నగరాలు వచ్చి స్థిరపడిపోతున్నారు....ఊళ్ళల్లో ఉన్న కొద్దిమంది మీదా బాధ్యత పడడంతో వాళ్ళకీ ఇలాంటి ఫంక్షన్లు నిర్వహించటం ఇబ్బందిగానే ఉంటుంది కదా.... పైగా పెద్దవయసు వాళ్ళు మాత్రమే ఊళ్ళల్లో ఉంటే, వాళ్ళ మాట వినేవాళ్ళు ఎవరు? ఉమ్మడి కుటుంబాలను మనమే విచ్చిన్నం చేసుకుంటున్నాం – మన పిల్లలకు విలువలు, సంప్రదాయాలు అందటం లేదనీ బాధ పడుతున్నాం...ప్రకృతి నుంచి, సహజత్వం నుంచీ మనమే దూరమవుతూ, మళ్ళా మనమే ఇబ్బందిని వ్యక్తం చేస్తున్నాం....”

దోషమంతా ఎవరిదో అన్నట్లు భావిస్తూ బాధపడుతున్న జానకిరాంకి ఎక్కడో తమ తప్పు కూడా ఉందన్న విషయం బోధపడింది.... “అయితే ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి?” అన్నట్లు చూసాడు..లక్ష్మి కేసి..

“చక్కగా వనభోజనాలకి రెండు, మూడు రోజుల ముందే శెలవు పెట్టండి....ఊళ్ళో ఉన్న మీ స్నేహితులకి సహకరించి, ఏర్పాట్లు చక్కగా దగ్గరుండి చేయండి.... ఉన్నంతలో సాంప్రదాయానికి, సంస్కృతికీ పెద్దపీట వేసే కార్యక్రమాలకి రూపకల్పన చేయండి... అచ్చంగా మన చిన్నప్పుడు ఉన్నట్లే అన్నీ ఉండడం అసంభవం....అయితే – ఆ సామూహిక స్ఫూర్తిని, సహకార తత్వాన్ని అందించే మూలసూత్రం మాత్రం మరవకూడదు... మనం భోజనాలప్పుడే కలవడం కాకుండా, ఇతర సమయాల్లో కూడా ఊరిని గురించి పట్టించుకుంటే, ఈ బెంగ ఇంతలా ఉండదు...మన పిల్లలు కూడా అందమైన అనుభవాలని మిస్సవకుండా మనమే ప్లాన్ చేయాలి..అందుకని, అందరం వెళ్దాం....మానద్దు....పైగా పిల్లలు కూడా లాస్టియర్ వనభోజనాలు చాలా ఎంజాయి చేసారు...” అంటుంటే కర్తవ్యం బోధ పడి మనసు తేలిక పడింది జానకిరాంకి.

“అయినా...శ్రీవారూ..అసలు విషయం చెప్పనా? నలభైలోకి వెళ్ళబోతున్నా...మీ ఇరవైల నాటి చిలిపి జ్ఞాపకాల్లోనే మీరు ఇంకా ఉండిపోయారనుకుంటా...అందుకని ఈసారి ఆ పాత స్నేహితులని, స్నేహితురాళ్ళని కూడా తప్పనిసరిగా రమ్మని చెప్పండి...మళ్ళా మీ పాత రోజులకి వెళ్లిపోవచ్చు....ఓకేనా?” అంటూ లక్ష్మి దగ్గరకి తీసుకొనేటప్పటికి జానకిరాంకి బెంగ తీరిపోయింది...వనభోజనాలకి ప్రయాణం ఖరారయ్యింది.

సెలవు అడగడం.. స్నేహితులతో మాట్లాడడం, ఏర్పాట్ల కోసం మూడు రోజుల ముందుగానే ప్రయాణం కావడం...ఇలా జరిగిన సంఘటనలన్నీ కళ్ళముందు మెదులుతుంటే, “రమ్మనె వనభోజనం, కమ్మని వనభోజనం, కార్తిక మాసములో పవిత్ర పంక్తి భోజనం...” అంటూ హమ్ చేస్తూ, హాయిగా డ్రైవ్ చేస్తూ, ఊరికేసి సాగిపోతున్నాడు జానకిరాం సకుటుంబంగా!

మరిన్ని కథలు