Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nagalokayagam

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు... ఆమె.. ఒక రహస్యం..

గతసంచికలో ఏం జరిగిందంటే ...http://www.gotelugu.com/issue190/548/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

 

(గతసంచిక తరువాయి)  “ఈ కేసు చాలా కన్ ఫ్యూజింగా ఉంది. ఒక వేళ అతడిది ఆత్మహత్యే అనుకున్నా, నిద్ర మాత్రలు మింగిన వాడు మళ్ళీ  నరాలని కత్తితో కోసుకోవడ మెందుకు? నిద్ర మాత్రలు పని చెయ్య వన్న అనుమానం వచ్చిందా?” తనలో తాను అనుకుంటున్నట్టుగా అన్నాడు ప్రసాద్.

పాణి మాట్లాడ లేదు.

****

రెండతస్థులలో నిర్మించ బడిన రాజ మహల్లో, రాజేంద్ర వర్మ గది ఉన్న పై అంతస్థుని మొత్తం సీజ్ చేసి ఎవర్నీ వెళ్ళకుండా కట్టడి చేసింది ఇంద్ర నీల.  పోస్టు మార్టమ్ కూడా అయి పోవడంతో చేసే పనేం లేక రిలాక్స్ డ్ గా ఉంది ఇంద్ర నీల.  సురేష్ వర్మ ఢిల్లీ నుంచి వచ్చేస్తే, అతడికి శవాన్ని హేండోవర్ చేసి వెళ్ళి పోవచ్చు. ఈలోగా బంగళాలో మనుషులని ఇంటరాగేట్ చెయ్యాలి.

పెద్ద రాజా నరేంద్ర వర్మ   గది దగ్గరకి వెళ్ళి ఒక సారి చూసింది. ఆయన మంచమ్మీద కళ్ళు మూసుకుని నిద్ర పోతున్నాడు. ఆయన మంచం పక్కనే ఒక కుర్చీలో డాక్టరూ, మరో కుర్చీలో  రాజ మహల్ వ్యవహారాలు చూసే దివాన్జీ సర్వోత్తమ రావు కూర్చుని ఉన్నారు. అతడి వయసు కూడా ఇంచు మించు నరేంద్ర వర్మ వయసే ఉంటుంది.

ఒక సారి నిద్ర పోతున్న నరేంద్ర సింగ్‍ని పరిశీలనగా చూసిన ఇంద్ర నీల  డాక్టర్ని  అడిగింది “ఎలా ఉంది ఆయన పరిస్థితి?”

“నార్మల్ గానే ఉంది మేడమ్. నిద్రకి మైల్డ్ డోస్ ఇచ్చాము. కొద్ది సేపట్లో మెలకువ వస్తుంది”

“పని వాళ్ళు ఎక్కడ ఉన్నారు?” అడిగింది ఆమె సర్వోత్తమ రావుని.

“బయట హాల్లో ఉన్నారు మేడమ్. మీరెవరితో నైనా మాట్లాడాలంటే నేను తీసుకు వెడతాను”  అన్నాడు సర్వోత్తమ రావు లేచి నిలబడుతూ. రాజ మహల్ సిబ్బంది అంతా హాల్లో ఒక మూలగా కూర్చున్నారు.  సుమారు పదిహేను మంది ఉన్నారు. వాళ్ళ వంక పరిశీలనగా చూసింది ఒక్క సారి.  ఆమెకి నవ్వొచ్చింది. ఇంట్లో ఉండే ముగ్గురు మనుషులకి  సేవలు చెయ్యడానికి పదిహేను మంది పని వారు! వాళ్ళిద్దరూ వాళ్ళని సమీపించగానే వాళ్ళంతా లేచి నిల్చున్నారు.

“మీరంతా ఇక్కడే ఉంటారా?”   వాళ్ళని చూస్తూ అడిగింది.

“కోట బయట అందరికీ సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి మేడమ్. అంతా కుటుంబాలతో సహా అక్కడే ఉంటాము”  చెప్పాడు సర్వోత్తమ రావు.

“మీరంతా ఇక్కడ ఎన్నాళ్ళ నుంచీ పని చేస్తున్నారు?  కొత్తగా పనిలో చేరిన వారు మీలో ఎవరైనా ఉన్నారా?” అంది ఇంద్ర నీల వాళ్ళని చూస్తూ.

“మేమంతా చాలా రోజులుగా ఈ బంగళాలో పని చేస్తున్నామండీ. ఇది మాకు వంశ పారంపర్యంగా వస్తున్న వృత్తి”

ఆమె ఆశ్చర్యంగా చూసింది ఒక్క క్షణం. “మీలో ఎవరెవరు ఏ పనులు చేస్తారు?” ఆసక్తిగా అడిగింది.

“రాజ మహల్ లోని పని మూడు విభాగాలుగా ఉంటుంది. ఒకటి వంట పని, రెండోది ఇంటి పని, మూడోది తోట పని. తర తరాలుగా ఈ రాజ వంశీకులకి ఆహారమన్నా, ప్రకృతి సౌదర్యమన్నా ప్రీతి. అందుకే, వంట పనికీ, తోట పనికీ నిపుణులని ఎంచుకుని మరీ పనికి కుదుర్చుకున్నారు. ఇంటి పనులకి పని చేసే వాళ్ళు మధ్య మధ్య మారుతూ ఉన్నా, వంట వాళ్ళూ, తోట మాలులూ వంశ పారంపర్యంగా ఇక్కడ పని చేస్తున్నారు. రాజ మహల్ కి వచ్చే అతిధులకి,  పెద్ద రాజా వారు, చిన్న రాజా వారికి సురేష్ వర్మ గారికీ వారి వారి రుచులకి తగినట్టుగా వండి పెట్టడం వంట వాళ్ళ పని. ఆ విభాగంలో  ఐదుగురు పని చేస్తున్నారు, ముగ్గురు మగ వాళ్ళూ, ఇద్దరు ఆడ వాళ్ళూ”  అంటూ వాళ్ళని పరిచయం చేసాడు సర్వోత్తమ రావు.

“ఈ కోట చుట్టూ పద్దెనిమిది ఎకరాల స్థలంలో  రక రకాల వృక్ష జాతులూ, దేశ విదేశాల నుంచి ఎప్పుడెప్పుడో తీసుకు వచ్చి పెంచుతున్న పూల మొక్కలూ లతలూ,  ప్రపంచంలో దొరికే అన్ని రకాల పండ్ల మొక్కలూ ఉన్నాయి. వాటన్నింటినీ సంరక్షించడానికి ప్రధానంగా ఐదు మంది రాజ మహల్ పని వాళ్ళు ఉంటారు. వాళ్ళ క్రింద ఒక ఇరవై ముప్ఫై మంది  రోజు వారీ కూలీలు  చుట్టు పక్కల గ్రామాల నుంచి అవసరాల మేరకి వచ్చి పని చేస్తుంటారు.  రోజు వారీ కూలీకి వచ్చే వాళ్ళెవరికీ బంగళాలో ప్రవేశం ఉండదు” వింటున్న ఇంద్ర నీల కళ్ళముందు ఉదయం రాజ మహల్ ప్రహారీ గోడ దాటి తమ జీపు లోపలకి వస్తున్నప్పుడు  మొఘలాయిల శైలిలో అద్భుతంతా తీర్చి దిద్ది కనిపించిన గార్డెన్ మెదిలింది.

“ఇక ఇంటి పని వాళ్ళు. ఈ విభాగంలో ఐదుగురు పనివాళ్ళు ఉన్నారు. ఇద్దరు మగ వారు, ముగ్గురు ఆడ వారు.  రాజ మహల్ లోని రెండతస్థుల్లోనూ మొత్తం ఇరవై ఐదు గదులూ, ఒక పెద్ద వంటగ ది, రెండు భోజనాల హాళ్ళూ, క్రిందా పైనా నాలుగు  సమావేశ మందిరాలూ ఉన్నాయి. అన్నీ, పురాతన శైలితో  కళా ఖండాలతో అలంకరించ బడి ఉంటాయి. వాడినా వాడక పోయినా వాటిని రోజూ శుభ్రం చెయ్యాలి.  ఇద్దరు ఆడవాళ్ళు  పొద్దుట ఆరింటి నుంచీ సాయంత్రం ఐదింటి వరకూ ఆ పని లోనే ఉంటారు. మిగిలిన ముగ్గురిలో ఒక స్త్రీ  ప్రత్యేకంగా పెద్ద రాజా వారి పనులని చూసుకుంటుంది. ఆయనకి అనారోగ్యం వచ్చిన దగ్గర నుంచీ ఈ ఏర్పాటు జరిగింది. మిగిలిన ఇద్దరు మగ వాళ్ళూ రాజ మహల్‍ కి అవసరమైన సరుకులూ, ఇతర సామాగ్రీ తీసుకు రావడానికీ, బయటి బజారు పనులనీ చూస్తారు” 

“ రోజూ పని వాళ్ళు ఉదయం ఎన్నింటికి వస్తారు? రాత్రి ఎన్నింటికి వెడతారు?”

“నాతో సహా అందరు పని వాళ్ళు ఉదయం ఐదున్నర కల్లా రాజ మహల్‍కి వస్తాం. సాయంత్రం ఐదున్నరకి పని వాళ్ళంతా వెళ్ళి పోతారు. పనిని బట్టి నేను ఆరూ అరున్నర మధ్యన నేను ఇంటికి వెడతాను” చెప్పాడు సర్వోత్తమ రావు.

“పని వాళ్ళంతా వెళ్ళాక ఎవరు మహల్ తలుపులు ఎవరు వేస్తారు?” అడిగింది ఇంద్ర నీల.

“పెద్ద రాజా వారి పని మనిషి, వంటవాళ్ళలో ఒక్కరు మాత్రం  అందరు పని వాళ్ళతో ఇళ్ళకి వెళ్ళరు. ఇక్కడే బంగళాలో ఉండి పోతారు. పని వాళ్ళందరూ వెళ్ళాక  రాజా వార్లు ఎవరి గదు ల్లోకి వాళ్లూ వెళ్ళి పోయాక  బంగళా తలుపులు మూసేసి వాళ్ళు క్రింద అంతస్థులో ఉన్న సర్వెంట్ గదు ల్లోకి వెళ్ళి నిద్ర పోతారు.  అవసరమైనప్పుడు వాళ్ళని నిద్ర లేపడానికి వీలుగా ఈ మధ్యనే కాలింగ్ బెల్ సిస్టమ్ కూడా అమర్చాము బంగళాలో”

“నిన్న రాత్రి బంగళాలో పని వాళ్ళు ఎవరెవరు ఉన్నారు?”

“వంట వాళ్ళలో నరసింహ, పని వాళ్ళలో లక్ష్మీ ఉన్నారు. వాళ్ళిద్దరూ భార్యా భర్తలు”

నరసింహ, లక్ష్మిల వంక పరిశీలనగా చూస్తూ అంది ఇంద్రనీల “నిన్నరాత్రి  బంగళా తలుపులు ఎన్నింటికి మూసారు?”

“సురేష్ వర్మ గారు హైదరాబాద్ వెళ్ళడంతో నిన్న రాత్రి  పెద్ద రాజా వారు, చిన్న రాజా వారూ మాత్రమే ఉన్నారు బంగళాలో. చిన్నరాజా వారు బయటకి వెళ్ళి తొమ్మిదిన్నరకి వచ్చారు. వస్తూనే నేరుగా మేడ మీదకి వెళ్ళి పోయారు.  ఆ తరువాత ఆయన భోజనానికి కూడా క్రిందకి రాలేదు. ఆయన వచ్చి మేడ మీదకి వెళ్ళిన కొద్ది సేపటికి పెద్ద రాజా వారు భోజనం చేసి తన గది లోకి వెళ్ళి పడుకున్నారు. పదిన్నర వరకూ చిన్న రాజా వారు భోజనానికి వస్తారేమో నని చూసి, రాక పోవడంతో పని వాళ్ళంతా వెళ్ళి పోయారు.  పదీ నలభైకి నేనూ లక్ష్మీ గదిలోకి వెళ్ళి పడుకున్నాం” చెప్పాడు నరసింహ.

“రాత్రి చిన్న రాజా వారి గది నుంచి కానీ, పెద్ద రాజా వారి గది నుంచి కానీ కాలింగ్ బెల్ రాలేదా?”

“లేదండీ”

“బెల్ పని చేస్తోందా?”

“పని చేస్తోంది మేడమ్”

“మీరు గాఢ నిద్రలో ఉన్నారా?”

“ఎంత గాఢ నిద్రలో ఉన్నా బెల్ వినగానే మెలకువ వచ్చేస్తుంది మేడమ్ మా ఇద్దరికీ”

ఇంద్రనీల తల పంకించింది.   “ఉదయం మొట్ట మొదటగా మేడ మీదకి వెళ్ళినది ఎవరు?”

వాళ్ళందరినీ క్యాజువల్ గా ప్రశ్నలు వేస్తోంది కానీ ఇంద్రనీల మనసు మాత్రం ఆ ప్రశ్నల మీద లేదు.  తనకి కావాల్సిన మరేదో  ‘రహస్యం’ కోసం  ఆమె కళ్ళు  అక్కడ అణువణువునీ శోధిస్తున్నాయి.

“నేనండీ” అంటూ  ముందుకు వచ్చింది ఒక స్త్రీ ఇంద్ర నీల ప్రశ్నకి సమాధానంగా. ఏదో ఆలోచిస్తున్న ఇంద్ర నీల ఉలిక్కి పడింది.  మరు క్షణం లోనే తేరుకుని ఆమె వైపు పరిశీలనగా చూసింది. దాదాపు నలభయ్యేళ్ళుంటాయామెకి.

“నీ పేరేమిటి?”  అడిగింది ఇంద్ర నీల.

(కేసు వంకతో బంగళాలోకి వచ్చిన ఇంద్రనీల వెదుకుతున్న అసలు రహస్యం ఏమిటి?  ఆమె అన్వేషణ ఫలించిందా?... వచ్చేవారం !)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్