Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunaaluguyugaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనంవెంకట వరప్రసాదరావు

sahiteevanam
పాండురంగమాహాత్మ్యం 

అత్యుత్తముడైన దైవము, అత్యత్తమమమైన  తీర్థము, అత్యుత్తమమైన క్షేత్రము ఒకేచోట ఉన్న స్థలం ఏది స్వామీ? అని అగస్త్యుడు 
అడిగిన  ప్రశ్నకు అందుకు సమాధానము  యివ్వగలవాడు పరమశివుడే అనిచెప్పి  ఆయనను వెంటబెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు
కుమారస్వామి. అదే ప్రశ్నను తన తండ్రిని  అడిగాడు. పరమశివుడు పరమానందభరితుడై అటువంటి పుణ్యక్షేత్రము పాండురంగమే అని చెప్పి, పుండరీక మహర్షి చరిత్రమును  చెప్పనారంభించాడు. ఆ సందర్భంగా పుండరీకుడి గుణ శీలాదులను వర్ణించి, ఆతడి  తపోనిష్ఠకు మెచ్చి శ్రీహరి అతడిని కరుణించడం గురించి వర్ణిస్తున్నాడు పరమశివుడు. 

వదనైక స్తంభ కనక
సదనము సిరికొరకొనర్చు స్రష్ట నిలువు న
మ్మొదలింటి శంఖ శంకువొ
యిది! యనఁగా గంబుకంఠమింపు వహింపన్                         (కం)

తెనాలి రామకృష్ణుని అపూర్వమైన కల్పనలకు, ప్రబంధకాలపునాటి వినూత్నమైన  పోలికలకు, పోకడలకు ఈ పద్యం మరియొక ఉదాహరణము. శ్రీహరి ముఖము అనే  ఒంటి మేడస్తంభమును లక్ష్మీదేవికోసం నిలబెట్టాలని అనుకున్నాడు బ్రహ్మ బహుశా. ఆ ఒంటిస్తంభము మేడను కట్టడంకోసం శంఖుస్థాపన చేశాడు. ఆ శంఖుస్థాపన చేసినపుడు  గుర్తుకోసం శంఖాన్ని, శంకువును, మేకులాంటిదానిని గుర్తుకోసం స్థాపిస్తారు. ఆ మొదటి  యింటికోసం, శ్రీమహాలక్ష్మి యింటికోసం, గుర్తుగా నిలిపిన 'శంకువు' కావచ్చు అన్నట్లు  అందంగా ఉన్న శంఖమువంటి కంఠమును కలిగిన శ్రీమహావిష్ణువు తన భక్తుడైన  పుండరీకుడిని కరుణించడానికి బయలుదేరాడు.    

బింకపు వ్రేఁతల వాతెర 
మంకెనపూఁదేనెతేట మానక పైపై 
నింకఁగ నింకఁగఁ బల్మరుఁ 
బంకించుటఁబోలె మోవి బచ్చెన హెచ్చన్               (కం)

బింకంగా బిగదీసుకున్న గొల్లవనితల మంకెనపూలవంటి అధరముల తేనెను వదలకుండా  మాటిమాటికీ యింకిపోయేలా, యింకినకొద్దీ యింకా యింకా జుర్రుకోవడంవలన ఎర్రగా  పూచినట్లుగా ఉన్న నోటి కాంతులు, ఎర్రని అధరపుకాంతులు మీరుతుండగా ఆ భక్తసులభుడు 
తన భక్తుడిని కరుణించడానికి బయలుదేరాడు. 

తళుకుమొగము నెలపదకము 
నెలవున నిడుదీరుగాఁగ నిలిపిన యాఖం
డలనీల కళికక్రియ, ని
ట్టలమై స్ఫుట నాసికాపుటము దీపింపన్             (కం)

తెలుగు పంచమహాకావ్యాలలో అర్ధము చేసుకోడానికి అత్యంత క్లిష్టమైన శైలి, ఉపమానాలు  పాండురంగమాహాత్మ్యంలోనే ఎక్కువగా కనిపిస్తాయి, తెనాలి రామకృష్ణుడిని పట్టుకోవడమే  కష్టం, శ్రీకృష్ణదేవరాయలను పట్టుకోవడంకన్నా కూడా అని ఈ వ్యాసకర్త అభిప్రాయం. దానికి  ఈ పద్యం మరియొక ఉదాహరణము. ఆయన వదనము 'నెలపదకము' అంటే నెలవంక అనే పతకము, అంటే చంద్రుడు అనే 
'రత్నములు తాపిన పతకములాగా' తళతళలాడుతున్నది. నుదురువద్దనుండి చెవులవరకు  క్రిందివైపు తిరిగిన నెలవంక. చుబుకము వద్దనుండి చెవులవరకూ ముఖము పైకి తిరిగిన నెలవంక.  రెండూ కలిసిన పూర్ణచంద్రబింబము ఆయన వదనము. ఆ ముఖములో నిలువుగా, కొనదేలిన  నాసిక యింద్రనీలమణిమొగ్గ లాగా ఉన్నది! అటువంటి దివ్యమైన సౌందర్యమును విరజిమ్ముతూ 
తన భక్తుడిని కరుణించడానికి ఆ దేవదేవుడు బయలుదేరాడు.

తళుకుఁ జెక్కుల మకరకుండల కలాప 
మరకతద్యుతి రింఛోళి హరిణలక్ష్మ 
మండలంబుల లాంఛన మంజిమములు 
గానిపించువిధంబునఁ గలయఁబ్రాఁక             (తే)

ఆ మహానుభావుని తళుకులీనే చంద్రబింబమువంటి చెక్కిళ్ళమీద ఆయన చెవులకున్న  కుండలముల మరకత పచ్చల కాంతి ప్రతిబింబించి, చంద్రునిలోని మచ్చలవలె కనిపిస్తుండగా  దివ్యసుందరమూర్తి యైన ఆ మహావిష్ణువు తన భక్తుడిని కరుణించడానికి బయలుదేరాడు. 

తరళ మసార సారనిభ తారకముల్, సితపద్మపత్ర బం
ధురములు రాధికా హృదయతోయజ కోరక బోధనక్రియా 
తరుణ తరార్కరుగ్విలసిత స్ఫుటరక్తిమసక్త కోణ భా
స్వరములు సూక్ష్మపక్ష్మములు వాలికకన్నులు చెన్నుమీరగన్            (చం)

ఆయన విశాలమైన కన్నులు చలించే, మిలమిలలాడే యింద్రనీలమణులవంటి కనుపాపలు గలవి. తెల్లతామరరేకులవంటి ప్రకాశమును గలవి. రాధాదేవి హృదయము అనే తామరమొగ్గను  వికసింపజేసే లేతసూర్యుని ప్రకాశమువంటి ఎర్రదనమును కలిగిన కనుకొలకులు గలవి.  సూక్ష్మములు, పలుచనివి ఐన రెప్పలు కలిగినవి. అటువంటి దివ్యమైన నయనసౌందర్యము  కాంతులను వెలువరిస్తుండగా తన భక్తుడిని కరుణించడానికి ఆ భగవంతుడు బయలుదేరాడు! యింత అందంగా, విపులంగా, శాబ్దిక మాధుర్యంతో దేవదేవుని నయనసౌందర్యమును వర్ణించిన  తెలుగుపద్యము వేరే ఏదీ లేదేమో! ఒక అలలా ఉవ్వెత్తున అంతకంతకూ పైకి ఎగసిన వర్ణన!  

(
కొనసాగింపు వచ్చేవారం)

***వనం వేంకట వరప్రసాదరావు.
మరిన్ని శీర్షికలు
job gauenty