Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
atadu..aame..oka rahasyam

ఈ సంచికలో >> సీరియల్స్

నాగలోకయాగం

గతసంచికలో నాగలోక యాగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి: http://www.gotelugu.com/issue196/566/telugu-serials/nagaloka-yagam/nagalokayagam/

 

ఒక్క రోజు ఆగితే శతానీకుని సైనిక శక్తి అదనంగా చేరుతుంది కాబట్టి ఈ రోజుకి యుద్ధ విరామాన్ని ఆశిస్తున్నాడు వాడు. అలాగే అదనపు బలగాలు మాళవ సేన ఇక్కడికి చేరటానికి తమకూ ఒక రోజు విరామం అవసరమే. ఈ రాయబారాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఆలోచిస్తున్నాడు మహా మాత్యుడు. అతడి సలహా కోసం వేచి చూస్తున్నాడు అర్కుడు. ఉన్నట్టుండి ఆగి రాయబారి వంక చూసాడు మహా మాత్యుడు.

‘‘ఇతని పేరేమి?’’ అడిగాడు.

‘‘వరదుడు’’ చెప్పాడు రాయబారి.

‘‘ఇతను ఒక్కడే వచ్చినాడా వెంట ఎవరన్నా ఉంటిరా?’’

‘‘ఇంకో ఇరువురు వచ్చినారు. వారు రాజ ప్రాసాదం వద్ద వేచి వున్నారు’’

ఈ సారి సర్వ సైన్యాధ్యక్షుడు అర్కుడు బదులిచ్చాడు.

‘‘మంచిది. చూడు వరదా! రక్త పాతం నివారించుటకు మీ నాయకుడు బాహ్లీకుడు యిలా రాయబారం నెరపుట మాకును సంతోషమే. కాని సమాధానమిచ్చుటకు ఈ రాజ్యము మాది కాదు. కేవలము మేము భృత్యులము మాత్రమే. కావున రాజ దంపతులతో సంప్రదించక స్వయం నిర్ణయాధికారము మాకు లేదు. కావున మీకు ప్రత్యుత్తర మిచ్చుటకు తామదము తప్పదు. సాయం సమయాన గాని రేపటి ఉదయాన గాని మా మనిషి ద్వారా రాజ నిర్ణయాన్ని బాహ్లీకునికి తెలియ పర్చగలం. పోయి ఇదే మా మాటగా బాహ్లీకునికి తెలియ జేయుము. యద్ధ విరామానికి కట్టుబడి మా సేనలు ఉన్న చోటు నుండి కదలవు. మీరు కూడ అలాగే ఉండాలె. పోయి రమ్ము’’ అన్నాడు.

‘‘చిత్తం మహామాత్య. శలవు’’ అంటూ రాయబారి వరదుడు వెను తిరిగాడు. అర్కుని అక్కడే వుండమని వరదుని వెంట సైనికుల్ని పంపించాడు వాసుదేవ నాయకుడు.

బాహ్లీకుని హెచ్చరిక విన గానే అక్కడే వరదుడ్ని ముక్కులుగా నరికి మూట గట్టి వచ్చిన యిద్దరి చేత వెనక్కి పంపించాలన్నంత కోపం వచ్చింది. అలాంటిది మహామాత్యుడు ఇంత ప్రశాంతంగా ఇంత తేలిగ్గా బాహ్లీకునికి వర్తమానం పంపటం ఏమిటో అర్థం గాక విస్తుపాటుతో చూస్తున్నాడు అర్కుడు. మహా రాణి దుఖ్ఖంలో వున్నారు, మహా రాజు ఉలుకూ పలుకూ లేదు. ఎవరితో సంప్రదించాలి? అతడి అవస్థ గమనించి దరహాసంతో` ‘‘ఏమిటి అర్కా! ఆశ్చర్యముగా వున్నదా? పరిస్థితి అర్థము గాలేదా?’’ అనడిగాడు వాసుదేవ నాయకుడు.
‘‘పరిస్థితియే గాదు, మీ ఆలోచన గూడ అర్థము గాకున్నది అమాత్యా’’ అన్నాడు అర్కుడు.

‘‘ఆవేశము తగ్గించిన ఆలోచన పరిస్థితిని మనకు బోధ పరుస్తుంది. ఆవేశము వచ్చిన అవకాశాల్ని ధ్వంసం చేస్తుంది. అంతర్యుద్ధంలో జయాపజయాలు అంచనా వేయ లేము. కాబట్టి గాంధార రేడు శతానీకుని బలగాలు సాయం వచ్చు వరకు బాహ్లీకునికి యుద్ధ విరామం అవసరం. అందుకే ఈ రాయబార తంత్రం ప్రయోగించాడు. ఆలోచిస్తే మనకు సాయం వచ్చు వరకు మన పరిస్థితీ అదే. ఇవి రెండూ ఇరు పక్షాలకు రేపటికి సమకూరగలవు. అందుకే నేనలా చెప్పి వరదుడ్ని పంపించితి. కాని ఈ సమయాన్ని ఉపయోగించుకొని మనము బాహ్లీకుని చావు దెబ్బ కొట్ట వలె’’ అన్నాడు దరహాసంతో వాసుదేవ నాయకుడు.

‘‘మహా మాత్యా! అదెలా సాధ్యం?’’ అడిగాడు అర్కుడు.

‘‘సాధ్యమే. ప్రస్తుత పరిస్థితిలో ఎవరి కోసం యుద్ధం చేయాలన్న నిరాశతో మనము లొంగి పోయి రత్న గిరిని దోసిట వప్పగించెదమన్న ధీమాతో బాహ్లీకుడు వాడ్ని బల పరిచే సేనలు రాత్రికి మైదానం లోని తమ శిబిరాల్లో తప్ప తాగి అద మరచి నిద్రస్తుంటారు. నీవు మన సేనల్ని మూడు భాగాలు చేసి సిద్ధంగా ఉంచుము. రాత్రి రెండో జాము ముగుస్తుండగా కాగడాలు వెలిగించకుండా చీకట్ల లోనే చాప కింద నీరు వలె మైదానం వైపు ప్రయాణించి వాళ్ళని చుట్టు ముట్టాలె. ఏమి జరుగుచున్నదో వాళ్ళకి తెలిసే లోపలే సగం మంది అంతం కావాలి. ఉదయానికి బాహ్లీకునితో సహా ఎవరూ ప్రాణాలతో మిగల రాదు.’’

ఆ మాటలతో వాసుదేవ నాయకుడి అంతరంగం అర్థమై విభ్రాంతి చెందాడు అర్కుడు. యుద్ధ తంత్రాల్లో ఇది దారుణము, నీచమైన తంత్రం. ఇది ధర్మ యుద్ధం అన్పించుకోదు. సందేహం పీడించగా` ‘‘మహా మాత్యా! నిద్రించే వాళ్ళని ఊచ కోత కోయటం న్యాయమా?’’ అనడిగాడు.
‘‘న్యాయమే’’ అన్నాడు మహా మాత్యుడు.

‘‘కలికాలము ఆరంభమై నాలుగో శతాబ్ధం నడుస్తున్నది. కలి ప్రభావము. న్యాయ ధర్మాలు గతి తప్పబట్టే బాహ్లీకుని వంటి నీచులు అధికరిస్తున్నారు. అవతలి వాడు ధర్మం తప్పినప్పుడు మనం తప్పుటలో తప్పేమున్నది. ముల్లును ముల్లు తోనే తీయ వలె....’’ ఉన్నట్టుండి  ఆకాశం వంక చూస్తూ మాటలు ఆపేసాడు వాసు దేవ నాయకుడు.

అతని చూపులు మబ్బుల పైనే నిలిచి పోయాయి.

సూర్య కాంతికి ధగధగాయమానంగా ప్రకాశిస్తూ ఏదో కిందికి దిగి వస్తూండటం అతని కంట పడింది. అర్కుడు కూడ అటు చూసి విస్మయం చెందాడు.

అప్పటికి బాహ్లీకుడు పంపిన రాయబారి వరదుడు మిగిలిన యిద్దరూ కోట విడిచి రాజ మార్గంలో నగర వాకిళ్ళ వైపు అశ్వాల మీద పోతూ కన్పిస్తున్నారు. వాళ్ళని నగర వాకిళ్ళు సురక్షితంగా దాటించ డానికి పది మంది అశ్వికులు కూడా వెంట వెళ్తున్నారు. వాళ్ళు దూరం వెళ్ళి పోతున్నందున ఆకాశం నుంచి వస్తున్న వస్తువు వాళ్ళ కంట బడే అవకాశం లేదు. కాని కోట పరిసరాల లోని కొందరు పౌరులు వీధుల్లో కొచ్చి మరీ ఆకాశం వంక ఆశ్చర్యంగా చూస్తున్నారు. అది మరి కాస్త దిగువకు రాగానే అర్కుడు గుర్తిస్తూ` ‘‘మహా మాత్యా! సరిగా చూడండి. అది పుష్పక విమానము కాదు గదా?’’ అన్నాడు.

‘‘అది ఏలాగున ఉండునో నాకును తెలియదు అర్కా! కాని ఎగిరి వచ్చుచున్న ఆ పసిడి వాహనమును గాంచ పుష్పకము వలెనే తోచుచున్నది. దేవతలు విహరించు ఆ విమానము అదియు ఉదయ కాలమున మన నగరమున కేతెంచుట అబ్బురముగ నున్నది. సరిగా గమనించుము. అందులో రెండు అశ్వములు, ఎవరో మనుషుల జాడ తెలియు చున్నది’’

‘‘అవును మహామాత్యా. సూర్య కిరణములు సరిగా చూడ నిచ్చుట లేదు. కాని నేరుగా అది కోట వైపే వచ్చు చున్నది. ఒక వేళ అందులో వచ్చునది మన యువ రాజు ధనుంజయుల వారు కాదు గదా’’ సందేహం వెలిబుచ్చాడు అర్కుడు.

‘‘అంత అదృష్టమా... అదియే నిజమైనచో మన ప్రభువు ధర్మ తేజుల వారు మనకు దక్కినట్టే. ఆ విమానము రాజ ప్రాసాద ఆవరణ వైపు వాలుచున్నటున్నది. అదేమిటో చూచెదము గాక పద’’ అంటూ కదిలాడు మహా మాత్యుడు వాసు దేవ నాయకుడు. ఇరువురూ వడివడిగా కోట బురుజు నుండి దిగ నారంభించారు.

***********

పుష్పక విమానం నేరుగా రత్నగిరి కోట లోకి వచ్చి రాజ ప్రాసాదం ముంగిట నేలకు వాలింది. ముందుగా యువరాజు ధనుంజయుడు కిందకు దిగి మాతృ భూమిని తాకి నమస్కరించాడు. పిమ్మట చేయి అందించి సఖియలు మూవురినీ కిందకు దించాడు. చివరిగా భూతం ఘృతాచి కళ్ళాలు పుచ్చుకుని అశ్వాలు రెంటినీ కిందకు దించింది.

రాజ ప్రాసాదం కావలి భటులు రక్షణ సైనికులు అప్పటికే పుష్పక విమానాన్ని గమనించి ఆశ్చర్య సంభ్రమాలతో చూస్తున్నారు. ఎప్పుడైతే అందు లోంచి తమ యువ రాజు ధనుంజయుడు దిగాడో ఇక వారి ఉత్సాహానికి అంతు లేకుండా పోయింది. ‘‘జయహో యువరాజా... జయము జయము. ధనుంజయుల వారికి జయము జయము’’ అంటూ ఒక్క పెట్టున జయ ఘోష ఆరంభించారు. ఆ ఘోష ద్వారాలు దాటి కక్ష్యలు దాటి మందిరాలు దాటి రాజ ప్రాసాదమంతటా సముద్ర ఘోషలా ప్రతిధ్వనించ సాగింది. వారి అభిమానానికి ముగ్ధుడవుతూ చిరు నవ్వుతో సైనికులకు చేయి వూపాడు ధనుంజయుడు. పిమ్మట`

ఇరవై దినముల పైగా గల తమ ప్రయాణ దూరాన్ని ఒక పగలు, రాత్రి లోనే ముగించి గగన మార్గాన తమను రత్నగిరి కోటకు చేర్చిన పుష్పక విమానానికి కృతజ్ఞతగా నమస్కరించాడు. అంతే` లిప్త కాలంలోనే పుష్పక విమానం అక్కడి నుండి అదృశ్యమైంది.
‘‘ఘృతాచి! నిన్నిటుల గాంచిన యిచటి జనులు హడలి చత్తురు. అదృశ్యముగా ఉండుము.’’ అంటూ భద్రా దేవి హెచ్చరించుటతో భూతం ఘృతాచి కూడ అదృశ్యమైనది.

కొందరు భటులను పిలిచి అశ్వాల మీది తమ ఆయుధాలను, సంచులను అన్నిటినీ తన మందిరానికి చేర్చమని ఆజ్ఞాపించాడు ధనుంజయుడు. అలాగే అశ్వాలు ఇన్ని రోజులు ఎడ తెగని ప్రయాణాలతో అలసి పోయి వున్నాయి. వాటిని అశ్వశాలలో వప్పగించి భద్రముగా వాటిని సంరక్షింప అశ్వశాల సంరక్షకులకు చెప్పమని ఆజ్ఞాపించాడు. పిమ్మట సఖియలు మూవురినీ తోడ్కొని రాజ ప్రాసాదంలో ప్రవేశించాడు.

ఈ లోపల`

అటు మహారాజు మంచానికి పరిమితమై.. ఇటు కన్నకొడుకు దూరమైన బెంగతో మహా రాణి కనకాంబిక తినీ తినక శుష్కించి ఆ భీమ శంకరుని నమ్ముకొని ధ్యానిస్తూ ఎక్కువ సమయం పూజా మందిరం లోనే గడుపుతోంది. ఆ ఉదయం కూడ అక్కడ ఉండగా ఉన్నట్టుండి బయట భటుల కోలాహలము, జయ ఘోష ఆమెకు విన్పించింది. అంతే`

అంతటి బలహీనతలో కూడ ఆ తల్లికి అంత బలం ఎలా వచ్చిందో తెలీదు. చివ్వున లేచింది.

‘‘బిడ్డా ధనుంజయా... వచ్చినావా నాయనా... ఎక్కడున్నావయ్యా...’’ అంటూ పరుగు పరుగున పరిచారికులు వెంట పడి వారిస్తున్నా వినకుండా తడ బడుతున్న అడుగులతో ఎదురు వెళ్ళింది. తన కోసం వస్తున్న కన్నతల్లిని చూడగానే పరుగున వచ్చాడు ధనుంజయుడు. తూలి పడబోతున్న తల్లిని ఒడిసి పట్టుకుని అక్కున చేర్చుకున్నాడు. ‘‘కుమారా... నాయనా... వచ్చినావా తండ్రీ’’ అంటూ దుఖ్ఖిస్తున్న తల్లిని ఓదారుస్తుంటే ధనుంజయుని కళ్ళు చెమర్చాయి. ఆ తల్లీ కొడుకుల్ని చూస్తున్న అందరి కళ్ళలోనూ నీరు నిలిచింది. 
‘‘అమ్మా నేను వచ్చితిని గదా. ఇక భయము వలదు. బెంగటిల్ల పని లేదు. దివ్య నాగమణి తెచ్చితి. జనకుడు ఎప్పటిలా లేచి నడయాడ గలరు’’ అంటూ తల్లిని వూరడించాడు.

మహా రాణి కన్నీరు తుడుచుకుంటూ అప్పుడు చూసింది తన కుమారుని వెంట దేవ కన్యల్లా మెరిసి పోతున్న ముగ్గురు యువతుల్ని. ఎవరన్నట్టు ధనుంజయుని చూసింది.

‘‘దివ్య నాగ మణితో బాటు నాకు లభించిన మూడు మేలిమి రత్నాలు.’’ అంటూ ధనుంజయుడు తన కాబోయే  కోడండ్రు ముగ్గురినీ పరిచయం చేస్తుంటే మహా రాణి ఆనందానికి అంతు లేకుండా పోయింది. వినయంగా తనకు పాదాభి వందనం చేస్తున్న ముగ్గురినీ లేపి అక్కున చేర్చుకుంది. పిమ్మట`

అందరినీ తీసుకుని తన తండ్రి మహా రాజు ధర్మతేజుడున్న మందిరానికి బయలుదేరాడు. ఇంతలో కోట బురుజు నుంచి దిగి వచ్చిన మహా మాత్యుడు వాసు దేవ నాయకుడు, సర్వ సైన్యాధ్యక్షుడు అర్కుడు అక్కడికి చేరుకున్నారు. పెద్దయిన ఆ యిరువురికీ సవినయంగా నమస్కరించాడు ధనుంజయుడు. తమ యువ రాజును చూడగానే ఆ యిరువురి ఆనందానికి మేర లేక పోయింది. ఆ మహా వీరుడు తిరిగి వచ్చుటతో గుండె నుండి పెను భారం దిగి పోయినట్టు సంతోషించారు.

అందరూ రాజ మందిరంలో ప్రవేశించారు.

హంస తూలికా తల్పం మీద స్పృహ లేని స్థితిలో బోర్లా పడి వున్నాడు ప్రభువు ధర్మ తేజుడు. ఇరువురు దాసీలు చెరో పక్కన వుండి వింజామరాలు వీస్తున్నారు. రాజ వైద్యులు నలుగురు అక్కడ వున్నారు.

మహా రాజు పరిస్థితి చాలా దయనీయంగా వుంది. అయన వెన్ను మీద రెండు రెక్క గూళ్ళకు మధ్యన వృత్తాకారంలో అరచేయంత మేర వ్యాపించిన రాచపుండు లావా పొంగుతున్న జ్వాలా ముఖిలా వుంది. ఎర్రగా పుట్టలా పెరిగి నెత్తుటి ముద్దలా వుంది. బాధ ఉపశమించ డానికి వ్రణం చుట్టూ వైద్యులు పూసిన ఔషధి లేపనాలు, పూతలు నల్లగా మాడి ఎండి పోయి చూడ్డానికి పగిలిన అగ్ని పర్వతాన్ని తలపిస్తోంది. ఇంత కాలము ఆ వ్రణ బాధను ఆయన ఎలా భరిస్తూ వచ్చాడో గాని ఆ బాధ వర్ణనాతీతం. ధనుంజయుని కళ్ళలో నీరు నిలిచింది. 

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్