Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
selfee  muddu chelagatam vaddu

ఈ సంచికలో >> యువతరం >>

శివోహం స్వతంత్ర చిత్రం

దేవుడెవరు? ఎక్కడుంటాడు?? ఎలా ఉంటాడు??? చెప్పే వ్యక్తిని బట్టి సమాధానం మారుతుంటుంది...అన్ని సమాధానాలూ అందరినీ ఆకట్టుకోవు....కానీ ఈ స్వతంత్ర చిత్రం చూసాక లభించే సమాధానాలు మాత్రం అందర్నీ కదిలిస్తాయి. అదెలాగో చూద్దామా...

యూట్యూబ్ లో కొన్ని వేల షార్ట్ ఫిల్మ్ లు ఉన్నాయి వస్తూనే ఉన్నాయి. దాదాపుగా అవన్నీ యూత్ ని ఆకట్టుకొనేవే, లవ్ ఓరియంటెడ్ సబ్జెక్టులే, కొన్ని సస్పెన్స్, క్రైం ఇలాంటివి మరికొన్ని. కానీ వేలల్లో ఒకటిగా నిలిచేదే ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ "శివోహం". 

పేరుని బట్టీ సబ్జెక్టుని బట్టీ ఇదేదో పూర్తి ఆధ్యాత్మిక ఫిల్మ్ అనుకుంటే పొరపాటే. ఇందులో యూత్ కి కావలసినవి, ఒక పూర్తి నిడివి సినిమాలో ఉండాల్సినవి అన్నీ ఉన్నాయి...లవ్, కామెడీ, సెంటిమెంట్, ఎంటర్ టైన్ మెంట్, ఫ్రెండ్ షిప్... అన్నీ మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.


కథేంటి?

ఉద్యోగం చిన్నదైనా, పెద్దదైనా చేసేపనిని గౌరవించే ఒక యువకుడు(శంకర్). ఒక కొరియర్ ఆఫీసులో మేనేజరుగా పనిచేస్తుంటాడు. అతనికి స్నేహితులే తప్ప నా అన్నవారెవరూ ఉండరు. ఉన్నంతలో సాయమడిగిన వారికి లేదనకూడదని అతని విశ్వాసం. పార్కులో యోగా చేస్తున్న ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తుంటాడు కానీ ఆ అమ్మాయి దగ్గర వ్యక్తం చేయలేకపోతుంటాడు. స్నేహితులు కల్పించుకుని అతని ప్రేమని ఆ అమ్మాయికి చెప్తారు. ఆ అమ్మాయి ఒక ధనవంతుని కూతురు. కనీసం యాభై లక్షలు సంపాదిస్తే తన కూతుర్నిచ్చి పెళ్ళి చేస్తానంటాడు అమ్మాయి తండ్రి. ఈలోగా ఉన్న ఉద్యోగం పోతుంది శంకర్ కి.

బాధలో మందుకొట్టి శిఖరం వైపు చూస్తూ నిందించి నిద్రలోకి జారుకున్న శంకర్ మేల్కొనేసరికి దివ్య కాంతులీనుతోన్న ఒక వ్యక్తి ఎదురుగా కనిపించి తనను తాను దేవుడు గా చెప్పుకుంటాడు. కొన్ని వరాలు కూడా ఇస్తాడు. వాటిని పరీక్షించే క్రమంలోనే అన్నీ అయిపోయి ఒకటే మిగులుతుంది.

యాభై లక్షలిమ్మని అడుగుతాడు శంకర్. అలాగేనని దేవుడు డబ్బు సంచి సృష్టించి ఇస్తాడు. అవి తీసుకెళ్ళి అమ్మాయి తండ్రికిచ్చి ఇక తన ప్రేమను సఫలం చేసుకోవడమే తరువాయి అనుకుంటున్న తరుణంలోనే అనుకోని సంఘటనలు ఎదురుపడి కథ అనేక మలుపులు తిరుగుతుంది. ఆ మలుపులేమిటి? ఎదురుపడిన వ్యక్తులు, సంఘటనలేమిటి అసలు దేవుడెవరు? ఇవన్నీ ఈ ఫిల్మ్ చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది.

ఈ ఫిల్మ్ కి డైలాగ్ కింగ్ సాయి కుమార్ డబ్బింగ్ హైలైట్. ఎంచుకున్న సబ్జెక్ట్ మీద, ప్రెజంట్ చేసే విధానం మీద దర్శకుడు గంగాధర్ కి ఉన్న పట్టు ప్రతి ఫ్రేం లోనూ తెలిసిపోతూనే ఉంటుంది. అమాయకమైన ముఖకవళికలతో కథానాయకుడి పాత్ర బాగుంటుంది. డైలాగ్స్ ఏదో సీన్ కి తగినట్టుగానే కాక, ఒక్కక్కచోట వావ్...క్యా డైలాగ్ హై అనిపిస్తాయి. ముఖ్యంగా దేవుడి డైలాగ్స్ ఆలోచింపజేస్తాయి.

నటీనటులు ప్రతి ఒక్కరూ పరిణితి ప్రదర్శించారు. ఈ బ్యాగ్ లో ఏముందో అని హీరో అడిగిన ప్రశ్నకి, ఆటో డ్రైవర్ చెప్పిన 'మహా అయితే డబ్బుంటుంది సార్' అనే  డైలాగ్ లో మంచితనం, అప్పనంగా ఆశించని తత్వం ఏ స్థాయి వ్యక్తుల్లోనైనా ఉంటుందనే సత్యాన్ని చెబుతుంది. మధ్యలో ఒక చిన్న థీం సాంగ్ కూడా ఉంటే బాగుండేది.

ఫిల్మ్ మొత్తం ఇంత బాగా తీయగలిగిన దర్శకుడికి అదేమంత అందని విషయం కాదుగానీ, బహుశ దర్శకుడు వద్దనుకుని ఉంటాడు.

ఈ ఫిల్మ్ చూసిన ప్రేక్షకులకు ఈ దర్శకుడు వెండితెరకు ప్రమోట్ కాబోతున్నాడని అనిపించకమానదు. అదే నిజమైతే,

దర్శకుడు గంగాధర్ నుంచి వెండి తెర పైకి ఎన్నో మంచి చిత్రాలు వచ్చే అవకాశముంది.

అది తప్పక నెరవేరాలనీ, దర్శకుడు గంగాధర్ త్వరలోనే వెండితెరపై వెలుగొందాలనీ గోతెలుగు మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.

దర్శకుడు గంగాధర్ కి గోతెలుగు శుభాభినందనలు తెలియజేస్తోంది!

మరిన్ని యువతరం