Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

పదిహేనవ భాగం

Anubandhaalu Fifteenth part

"నన్ను కాదా... ఇంకెవరిని...?" అని విస్తుపోతూ అడిగిందామె.

పెద్దగా నిట్టూర్చి భార్య వంకా, తల్లి వంకా చూశాడు.

"పిల్లల విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.

అనంతసాయి, సాయి శివానీలను ఇండియా పంపించాలని నిర్ణయం తీసుకున్నాను. వాళ్ళిద్దరూ కొన్నాళ్ళ పాటు మున్నలూరులో ఉంటే ఖచ్చితంగా మార్పు వస్తుందని. ఇంతకు మించి మరో మార్గం లేదు. మీరేమంటారు?" అని అడిగాడు.

ఆ మాటకు సంతోషించింది అన్నపూర్ణేశ్వరి.

"వాళ్లు మున్నలూరు వస్తామంటే అంతకన్నా సంతోషం ఏముంటుంది? కొంతకాలం పాటు నాతో ఉంటే మన పద్ధతులు వాళ్లకి తెలుస్తాయి. వాళ్ల అమెరికా ఫ్యాషన్ల మత్తు వదిలించేయొచ్చు. నాతోపాటు వాళ్లను తీసుకెళ్తాను. ఏమంటావు సత్యవతి?" అని అడిగింది.

"నాదేముంది అత్తయ్యా! మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు సంతోషమే" అందావిడ.

"ఒక్క నిమిషం" అంటూ అడ్డువచ్చాడు గోపాల్.

"అమ్మా! నేను ఇండియా పంపించాలనుకుంది పిల్లలిద్దర్ని మాత్రమే. నువ్వు మాతో కొంతకాలం ఇక్కడే ఉంటావు" అంటూ వివరించాడు.

"ఉండడం నా వల్ల కాదు. వాళ్లతో పాటే నేనూ వెళ్లిపోతాను."

"ఉండాలి. వల్లకాదు అంటే ఎలా? అక్కడ లేనిపోని సమస్యలు రాకూడదనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అన్నయ్యతోనూ, బావగారితోనూ వివరంగా మాట్లాడాను. వాళ్లు కూడా ప్రస్తుతానికి నిన్ను మా వద్దనే ఉంచమన్నారు. అనంత్, శివానీల విషయంలో వాళ్లు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు. వీళ్లు వెళ్ళిన నెల తర్వాత ఓసారి నేను వెళ్లి పరిస్థితి స్వయంగా చూసి వస్తాను. ఇంకేం కావాలి? అంటూ తన వ్యూహం వివరించాడు. ఒకటికి రెండు సార్లు వివరించాక అన్నపూర్ణేశ్వరి సత్యవతి ఇద్దరూ తమ అంగీకారం తెలిపారు. ఇందులో తమాషా ఏంటంటే వారం రోజుల్లో ప్రయాణం.

కొడుకూ, కూతురు ఇద్దరికీ డెట్రాయిట్ నుంచి హైదరాబాద్ వరకు టికెట్స్ కూడా చేసాడాయన. మొదట ఉండను వెళ్లిపోతానంటూ గొడవ చేసిన తర్వాత ఉండిపోవడానికి అన్నపూర్ణేశ్వరి ఒప్పుకుంది. తల్లితో పాటు తన భార్య కూడా ఓకే చెప్పడంతో తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు గోపాల్. అయితే ఈ విషయం రాత్రి వరకు అనంత్, శివానీలకు తెలియదు. రాత్రి ఎనిమిది గంటలకు ఆస్పత్రి నుంచి కారులో ఇంటికి వస్తూ కొడుకు, కూతుర్లు ఇద్దరికీ ఇంటికి వెంటనే రావాల్సిందిగా ఆర్డర్ వేశాడు గోపాల్.

ఆ టైం లో ఎక్కడో సిటీ హాల్లో ప్రఖ్యాత పాప్ సింగర్ స్టేజ్ షోలో ఉన్నారు వాళ్లిద్దరు. అయిష్టంగానే బయల్దేరి ఇంటికి వచ్చారు. రాత్రి తొమ్మిది గంటలకు భోం చేశాక, అందరినీ హాల్లోకి పిలిచి మాట్లాడాడు గోపాల్.

"మీకో ముఖ్య విషయం చెప్పాలి. మీ ఇద్దరూ ఇండియాకు వెళ్తున్నారు. నాలుగు రోజుల్లో ప్రయాణం." అంటూ ఇద్దరి ముఖాల్లోకి చూశాడు.

"ఇండియాకా... వై?" షాక్ తో పెద్దగా అరిచింది శివాని.



"నేను వెళ్ళను" అన్నాడు అనంతసాయి.

'వెళ్లాలి. టికెట్స్ కూడా బుక్ చేశాను. మీ పదనాన్న హైదరాబాద్ కి వచ్చి, మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు." మృదువుగా వివరించాడు.

"ఓ డాడ్! అమెరికా చూడాలని అక్కడివాళ్లు ఇక్కడికి వస్తుంటారు. మేమక్కడికి వెళ్లడం ఏంటి? నాన్సెన్స్... ఏముందక్కడ?" విసుగ్గా అరిచాడు అనంత్.

"ఏముందో వెళ్లి చూస్తేనే కదా తెలుస్తుంది. మీ అమ్మానాన్నలమైన మేము పుట్టి పెరిగిన పవిత్ర భూమి అది. మీకు నాన్సెన్స్ గా ఉందంటే. షేమ్ టూ యు. .... ఏమనుకుంటున్నారు మీరు... ఆస్తులు, ఐశ్వర్యాలు. జల్సాగా తిరగడాలు అవే జీవితమనుకుంటున్నారా? విలాసాలు, కార్లు, ఎస్టేట్ లు, వీటన్నిటికీ మించిన గొప్ప విషయాలు చాలా ఉన్నాయి. తెల్సుకోవాలి. నేర్చుకోవాలి. బిజినెస్ మేనేజ్ మెంట్ చేశారు. బాధ్యతలు మాత్రం గుర్తించుకోలేకపోతున్నారు. మీరు అవునన్నా, కాదన్నా తప్పదు. ఇండియా వెళ్తున్నారు. మీరు వెంట తీసుకెళ్లడానికి ఏం కావాలో ఏర్పాట్లు చేసుకోండి" అంటూ వివరించాడు గోపాల్.

ఆ మాటలు వింటుంటే ఇదేదో నాయనమ్మ చేసిన కుట్రలా తోచింది వాళ్లకి. అలాగని ఎదురు తిరిగే ప్రయత్నం చేయలేదు. డాడీ ఒక నిర్ణయం తీసుకుంటే ఇక అందులో మార్పులు చేర్పులు ఉండవని వాళ్లకి తెలుసు. రాత్రి నిద్రపోయేముందు అన్న గదిలోకొచ్చి కాసేపు కూర్చుంది శివాని.
"ఏమిటన్నయ్యా! వీళ్ళేంటి బలవంతంగా మనల్ని ఇండియా పంపిస్తున్నారు. నాకు వెళ్ళాలని లేదు. ఆ పల్లెటూళ్ళో మనం ఉండగలమా...? అంది.

"డోంట్ వర్రీ. వెళ్లలేదనే చెడ్డపేరు మనకెందుకు? వెళ్లి చూద్దాం. నెలరోజులు ఉండేసరికి మనల్ని భరించలేక వాళ్ళే మనల్ని వెనక్కి పంపిస్తారు. ఇక్కడి జీవితానికి అలవాటుపడ్డ మనకి అక్కడ ఉండడం ఇబ్బందే. కానీ తప్పదు." నచ్చచెబుతూ అన్నాడు అనంతసాయి.

మరుసటి నాటికే ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు మొదలయ్యాయి. అన్నపూర్ణేశ్వరి మున్నలూరు ఫోన్ చేసి పెద్దకొడుకు, అల్లుడు మిగిలిన వాళ్లతో మాట్లాడింది. పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది. గోపాల్ కూడా వాళ్లతో మాట్లాడాడు.

ఈ క్రమంలో తాము వెనక లేకుండానే పిల్లల్ని ఇండియా పంపించే విషయంలో సత్యవతికి మనసులో చాలా బాధగానే వుంది. పైకి చెప్పుకోలేకపోయింది. పిల్లలు పెద్దవాళ్లైనా
ఆమె దృష్టిలో ఇంకా పిల్లలే.

మరునాడు ఉదయం అనంత్, శివానీలను తీసుకొని బయల్దేరాడు గోపాల్.

అలాగే నాలుగు సూట్ కేసులు, అవీగాక చెరో హ్యాండ్ బాగ్ ఉన్నాయి. మూడు సూట్ కేసుల నిండా బట్టలకే సరిపోయింది. అక్కడ వారికోసం ఇవ్వడానికి గిప్ట్స్, ఆర్టికల్స్ ఉన్నాయి. బహుశా తండ్రిని వదిలి దూరం వెళ్తున్నందువల్ల కావచ్చు. "డాడీ! అంటూ తనని చెరోపక్క కౌగలించుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్న కొడుకు, కూతరు ఇద్దర్నీ అక్కున చేర్చుకొని కన్నీళ్లు తుడిచాడు. డాక్టర్ గోపాల్.

"నాకు తెలుసు. మమ్మల్ని వదిలి ఒంటరిగా ఎప్పుడూ అంత దూరం వెళ్లలేదు. జాగ్రత్తగా వెళ్ళిరండి. ఒక్క మాట గుర్తుంచుకోండి. నాకంటూ ఒక లక్ష్యం ఉంది. ఇప్పటికీ ఆ లక్ష్యాన్ని నేను చేరుకోలేదనే లక్ష్యమంటూ లేకుండా జీవితాన్ని వృథా చేసుకుంటున్నారు. ఇది పధ్ధతి కాదు. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనే మీ ఊరు పంపిస్తున్నాను. అక్కడ వారు మిమ్మల్ని బాగా చూసుకుంటారు. మీరు కూడా వారిపట్ల అలాగే ఉండాలి. దేశాలు మారినా బంధుత్వాలు మారవు. ఆప్యాయతా, అనుబంధాలు జీవితానికి నిండుదనాన్ని, పరిపూర్ణతను ఇస్తాయి. అందరితో కలిసి మెలసి ఉండండి. అనంత్, చెల్లాయిని జాగ్రత్తగా చూసుకో" అంటూ ఇద్దరికీ హితబోధ చేసి పంపించాడు గోపాల్.

విమానం బయల్దేరే వరకు ఉండి ఏర్ పోర్ట్ నుండి వెనక్కు తిరిగాడు గోపాల్.

అమెరికా నుంచి తమ్ముడి పిల్లలు ఇండియా వస్తున్నారంటే సహజంగా ఎవరికైనా కలిగే ఆనందమే రామలింగేశ్వర్రావుకీ కల్గింది. తాను వాళ్లకి పెద్దనాన్న. వాళ్లు అక్కడ ఉన్నన్ని రోజులు వాళ్ల మంచి చెడులు తాను కాకపోతే ఎవరు చూస్తారు? పైగా వాళ్ళు సకల సౌఖ్యాలతో చిన్నట్నుంచీ అల్లారు ముద్దుగా పెరిగిన వాళ్లు. వాళ్లకిక్కడ ఏ లోటూ రాకూడదు. ఆయన ఎంత ఆనందంలో మునిగిపోయాడంటే తమ్ముడు గోపాల్ చేసిన హెచ్చరికలు కూడా మర్చిపోయాడు.

"అన్నయ్యా! వాళ్ళిద్దరూ చదువుకున్నారు, పెద్దవాళ్ళయ్యారు. కానీ తామేమిటి? తమ బాధ్యతలేమిటి? అనేది ఇంకా గుర్తించడం లేదు. జల్సాగా ఖర్చు చేయడం, సరదాగా తిరగడమే జీవితమనుకున్నారు. మన సాంప్రదాయాలు, అలవాట్లు పూర్తిగా వాళ్లకి తెలియదు.. వాళ్లు మారాలి. పద్ధతుల్లోకి రావాలి. అందుకే మీ వద్దకు పంపిస్తున్నాను. వాళ్ల మంచిచెడ్డలు ఇక మీవి" అంటూ చెప్పాడు.

కానీ ప్రస్తుతం రామలింగేశ్వరరావుకి తమ్ముడి మాటలు ఏవీ గుర్తులేదు. వస్తున్న తమ్ముడి బిడ్డలని ఇక్కడ ఎంతబాగా చూసుకోగలమనే దానిమీదే ఆయన ధ్యాస. ఆయనే కాదు, ఆయన భార్య మహాలక్ష్మీ, చెల్లెలు భ్రమరాంబ, ఆవిడ భర్త రఘునాథ్ అందరికీ సంతోషమే. మహేశ్వరి చిన్నప్పట్నుంచి కూడా బావ అనంతసాయి అంటే ఇష్టం. ఇష్టమే కాదు, బోలెడంత ప్రేమ. ఎప్పుడో తాను పెద్దమనిషి గాకముందు వాళ్లు మున్నలూరు వచ్చినప్పుడు బావను చూసింది. ఇప్పుడు తన వయసు ఇరవై ఒకటి. బావ వయసు ఇరవై ఐదు. బావ వస్తున్నాడంటే ఆమె వయసు పురివిప్పి నాట్యం చేస్తోంది. తన్ను చూసి ఏమంటాడో? అమెరికా అబ్బాయి కదా నచ్చలేదంటాడేమో? ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఊహల్లో తేలిపోతూ చాలా సంతోషంగా ఉంది మహేశ్వరి.

పైగా వాళ్లు వస్తున్న సంగతి ఊళ్లో కూడా తెలిసుండడంతో అలా బయటకెళ్తే చాలు తన ఈడు అమ్మాయిలు నీకేమమ్మా అమెరికా నుండి నీ బావ వస్తున్నాడు, ఇక మేం కనబడంలే అంటూ ఉడికిస్తుంటే అసలే అందమైన మహేశ్వరి బుగ్గలు మరింత సిగ్గుతో మొగ్గలయ్యేవి.

కానీ ఈ విషయంలో చెల్లెలికి పూర్తిగా వ్యతిరేకి అన్న నవీన్. అతని మరదలు సాయి శివాని అంటే ఇష్టం వుంది. కానీ ఆశ మాత్రం లేదు. ఎవరన్నా ఈ విషయాన్ని తీసుకొచ్చినా మండిపడేవాడు. "అది అమెరికా పిల్ల. మనం పల్లెటూరి వాళ్ళం. దానికి, మనకు పడదని ఎప్పుడో నిర్ణయించేశాను. పిచ్చి పిచ్చిగా వాగకండి" అంటూ కోప్పడేవాడు. అందుకే వాళ్లు అన్నాచెల్లెళ్లిద్దరూ వస్తున్నారంటే ఆ ఇంట్లో ఆనందించని మనిషి నవీన్ ఒక్కడే. పైగా వాళ్ల గురించి ఇక్కడంతా పెద్దగా ఆలోచించడం కూడా చికాకు కల్గించింది. వాళ్ళక్కడ అమెరికాలో బయల్దేరడానికి వారం రోజుల ముందే ఇక్కడ హడావుడి మొదలైంది. వాళ్ళక్కడ పెద్ద పెద్ద భవంతుల్లో, ఏ. సి. కార్లో తిరిగిన పిల్లలు. ఇక్కడ వాళ్లకి ఏ విధమైన అసౌకర్యం కల్గకుండా ఉండడానికి బస ఏర్పాటు చేయడం ఎలా? ఇది ప్రధాన సమస్య.

తమది పాతకాలం మండువా లోగిలి.

వాళ్లు అందులో ఉండడానికి ఇష్టపడకపోవచ్చు. ఇక తమ పక్కన తమ చెల్లెలు భ్రమరాంబది రెండంతంస్తుల భవంతి ఉంది. కానీ భ్రమరాంబ పిల్లలకి వీళ్ళనిచ్చి పెళ్లి చేయాలనేది తమ తల్లి అన్నపూర్ణేశ్వరి చిరకాల ఆశ.

మరి వయసుకొచ్చిన వీళ్ళంతా ఒకే ఇంట్లో ఉండడం కూడా పద్ధతిగా ఉండదు కాబట్టి, తమ మండువా లోగిల్లోగానీ, చెల్లెలి భవంతిలో వాళ్లకి ఉండేందుకు వసతి ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఇక మిగిలింది తమ ఇంటికి ఎడం పక్కనున్న తమ డాబా ఇల్లు. అప్పట్లో అక్కడ స్థలం ఖాళీగా ఉండడం ఎందుకని డాబా ఇల్లు వేసారు. ప్రస్తుతం తమ పశువుల దాణాను స్టోర్ చేయడానికి దాన్ని ఉపయోగిస్తున్నారు. అంతా ఆలోచించి దాన్ని ఉపయుక్తంగా మార్చడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారు. అంతే మర్నాడే అందులోని పశువు దాణాను వేరే చోటికి తరలించేశారు. చిన్న చిన్న మరమ్మత్తులుంటే చేయించేసి మూడు రోజుల్లోనే ఆ డాబా ఇంటికి రంగులు వేయించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నాలుగో రోజుకు ఫర్నీచర్ వచ్చింది. అన్నకి ఒక గది, చెల్లెకి ఒక గది, అటాచ్ బాత్రూమ్స్, విశాలమైన హాలు, చుట్టూ పచ్చని చెట్లతో కొత్త పెళ్లికూతిరిలా ముస్తాబయ్యింది డాబా. ఐదో రోజుకి పడకింటికి ఎయిర్ కండీషన్స్ వచ్చేశాయి. వారం తిరక్కుండానే అన్నాచెల్లెళ్ళు ఉండడానికి అన్ని వసతులు, ఇళ్ళు సిద్ధమైంది. అంతేకాదు రెండు పడగ్గదుల్లోనూ రెండు కలర్ టీవీలు, డి.వి.డీ. ప్లేయర్లు, అలాగే మంచి సినిమాలు ఉన్న వంద సీడీలు కూడా సమకూర్చారు. ఇలా వాళ్లు అమెరికా నుంచి రాక ముందే ఇక్కడ అన్ని ఏర్పాట్టు చేసుకున్నారు. అంతా ఈ హడావుడి చూసి నవీన్ చాలాసార్లు చిరాకుపడ్డాడు. చివరకు ఆ రోజు రానేవచ్చింది.

ముంభైలో తెల్లవారుజామున విమానం దిగ్గానే రామలింగేశ్వరరావు సెల్ కి ఫోన్ చేశాడు అనంత్. మరో రెండు గంటల్లో ముంభై నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానంలో హైదరాబాద్ వస్తున్నట్లు చెప్పాడు. మీరేం కంగారు పడక్కర్లేదు అనంత్. నేను, మావయ్య ఇద్దరం మీకోసం ఏర్ పోర్ట్ లో ఉంటాం" అని చెప్పాడు రామలింగేశ్వరరావు. ఫోన్ వచ్చిన సమయంలో వాళ్ళిద్దరూ హైద్రాబాద్ లోనే ఒక హోటల్లో నిద్రపోతున్నారు. ఎందుకైనా మంచిదని బావా బావమరుదులు ఇద్దరూ హైదరాబాద్ వచ్చి ఒక ఎయిర్ కండీషనర్ కార్ బుక్ చేసుకొని, అక్కడే హోటల్లో నిద్రపోయారు.

ఇద్దర్నీ రిసీవ్ చేసుకోవడానికి నవీన్ వెంటరమ్మని అడిగాడు రామలింగేశ్వర్రావు. తనకు వీలు కాదని చెప్పాడు నవీన్. మావయ్య రానంటున్నానని ఏమీ అనుకోకు. నాకు పని ముఖ్యం. పరీక్షలు అయిపోయాయని ఖాళీగా తిరిగే మనిషిని కాదు. నేను నీకు తెలుసు. పత్తిచేలో పనులు అలాగే ఉండిపోయాయి. రేపు నాకు ఖాళీ ఉండదు. ఇలాంటి వాటికి మా నాన్నే బెటర్, ఆయన్నే తీసుకెళ్ళు" అన్నాడు నిర్మొహమాటంగా.

అంటే నీ ఉద్దేశం ఏమిట్రా? నువ్వు మాత్రం పనిచేసేవాడివి. మీ నాన్న మాత్రం ఖాళీగా తిరిగేవాడనా? అంటూ నిలదీశాడు రామలింగేశ్వర్రావు.

"కొడుకు చేతికందివస్తే ప్రతిబాబు అలాగే అనుకుంటాడు. రేపు నీ కొడుకు పెద్దయ్యాక నువ్వు చేసే పని అదే. అడుగు మా నాన్న పొలానికి వచ్చి ఎన్ని రోజులయ్యిందో? ఆయన పక్కనే ఉన్నారుగా" అన్నాడు కొంచెం కూడా తొణక్కుండా నవీన్. వెంటనే రఘునాథ్ కల్పించుకుంటూ "బావా వాడో పనిరాక్షసుడు. అంతా వాడి అమ్మమ్మ పోలికలే. వాడితో పెట్టుకుంటే మన పరువే పోతుంది. నే వస్తాగా పద" అంటూ రామలింగేశ్వర్రావుని పక్కకు తీసుకెళ్ళిపోయాడు రఘునాథ్. సుమారు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ముంబాయి నుంచి వచ్చిన విమానం హైద్రాబాద్ ఏర్ పోర్ట్ లో ల్యాండ్ అయింది. మరికొద్దిసేపట్లోనే అరైవల్స్ గేట్ లో నుంచి చెరో ట్రాలీ తోసుకుంటూ బయటకు వచ్చారు అనంత్, శివానీ ఇద్దరు. అన్నాచెల్లెల్లిద్దర్నీ చూసి ఎంతో ఉత్సాహంగా చేతులు ఊపారు. బావబావమరుదులు ఇద్దరూ పరస్పర పలకరింపులు, యోగక్షేమాలు అనంతరం అంతా ఏ.సి. కారులో మున్నలూరు బయల్దేరారు.

ఏ.సి. కారు హైదరాబాద్ నుంచి మున్నలూరు చేరేసరికి మధ్యాహ్నం పన్నెండు దాటిపోయింది. ఊరిలోకి వస్తుంటే పచ్చటి పొలాలు, తలలూపుతున్న చెట్లు, ఎగిరే పక్షులు తమకు ఆహ్వానం పలుకుతున్నట్లున్నాయి. అన్నాచెల్లెల్లిద్దరికీ సొంత ఊరికి రావడం ఆహ్లాదం గానే ఉంది. కారు సరాసరి అన్ని హంగులతో రెడీగా ఉన్న డాబా ఇంటి ముందు ఆపించాడు రామలింగేశ్వర్రావు. కారు దిగుతున్న అనంతసాయిని, సాయి శివానిని చూడడానికి ఆ వీధిలో చాలామంది జనం గుమిగూడారు. ముఖ్యంగా ఆడవాళ్ళు, పిల్లలు అధికసంఖ్యలో చేరారు. అన్నపూర్ణేశ్వరి మనవడు, మనవరాలు దొరబిడ్డల్లాగే ఉన్నారని చెవులు కొరుక్కున్నారు. శివానీని చూస్తుంటే సినిమా హీరోయిన్ని చూస్తున్నంత సంబరానికి గురయ్యారంతా. అప్పటికే సిద్ధంగా ఉన్న మేనత్త భ్రమరాంబ కారు దిగిన మేనల్లుడు, మేనకోడలు ఇద్దరికీ ఎర్ర నీళ్ళతో దిష్టి తీసి, వీధిలో పోసింది. గోడ వెనుక నిలబడి దొంగచూపులు చూస్తున్న మహేశ్వరిని గుర్తుపట్టాడు అనంతసాయి. పెద్దమ్మ మహాలక్ష్మీ వాళ్ల పిల్లలు. భ్రమరాంబ, మహేశ్వరీ అంతా గుమ్మం లోపలే పలకరించారు. యోగక్షేమాలు అయ్యాక ఇద్దర్నీ లోనికి తీసుకెళ్ళారు. కారు డ్రైవర్ లగేజీ తీసుకెళ్లి లోపల పెట్టి వచ్చాడు. రామలింగేశ్వర్రావు పేమెంట్ ఇచ్చేసి, అతన్ని పంపించి లోపలకు వెళ్ళాడు.

వస్తూనే అమెరికాలో ఉన్న తమ్ముడి సెల్ కి ఫోన్ చేసి పిల్లలిద్దరూ క్షేమంగా ఇంటికి చేరుకున్నట్లు చెప్పాడు. అక్కడ ఇప్పుడు అర్ధరాత్రి సమయం. ఆ ఎఫెక్ట్ అనంత్, శివానీల ముఖాల్లో స్పష్టంగా కన్పిస్తోంది. అక్కడ నిద్రపోయే టైమ్, ఇక్కడ పట్టపగలు. ఈ మార్పుకి శరీరాలు అలవాటు పడడానికి కొంత టైమ్ పడుతుంది. వాళ్లంతా తమని ఇంత ఆదరంగా చూస్తుంటే అనంత్, శివానీలకు చాలా ఆనందంగా ఉంది. అయితే అక్కడ నవీన్ లేని విషయాన్ని అనంత్ గుర్తుపట్టి అడిగాడు.

"అత్తయ్యా! బావ నవీన్ కన్పించట్లేదు ఎక్కడ?" అంటూ అడిగాడు.

మరిన్ని సీరియల్స్
nadiche nakshatram Ninth part