''ఒరేయ్! ఇందాక తాతయ్యేంటీ నీమీద గట్టిగా కేకలేస్తున్నారూ?''
''బాధ్యత లేకుండా తిరుగుతున్నావని తిట్టారు నాన్నా!''
''పనీపాటా లేక తిరిగితే తిట్టరూ మరి! ఇంకేమన్నారూ?''
''నీ వయసులో వున్నప్పుడు మీ నాన్న కూడా ఇలాగే చేసేవాడు వెధవ అన్నారు నాన్నా!''
*******************
''మీ మమ్మీ గంటలో యాభై చపాతీలు చేయగలిగితే మీ పక్కింటి ఆంటీలు ముగ్గురు కూడా కలిస్తే మొత్తం నలుగురు గంటలో ఎన్ని చపాతీలు చేయగలరు?''
''ఒక్క చపాతీ కూడా చేయలేరు మేడం!''
''తిక్క తిక్కగా వుందా? అసలు ప్రశ్నేంటో అర్థమైందా నీకు?''
''ఆ నలుగురూ కలిస్తే మాటల్లో పడి అసలు పనే చేయరు మేడం!''
*******************
''దొంగతనం చేశాక తెలివిగా తప్పించుకోక ఎలా పట్టుబడ్డారు మీరిద్దరూ?''
''ఇదిగో... ఈ దరిద్రుడివల్లే! ఏదో ఒక కెమెరా ముందు నటించాలనే అత్యుత్సాహంతో సి.సి. కెమెరా ముందుకెళ్లి 'నా పెర్ఫార్మెన్సు గనక మీకు నచ్చినట్టయితే...' అంటూ వివరాలన్నీ చెప్పేశాడు...''
*******************
''ఏమయ్యా! నీకు బుద్దుందా? ఈ వాచీ బ్రహ్మాండంగా పనిచేస్తుందంటూ ఏడొందలు తీసుకుని అంటగట్టావ్. నీ దగ్గర తీసుకుని వెళ్లిన ఒక్కరోజులోనే ఆగిపోయింది తెలుసా?''
''భలేవారే సార్! వాచీ ఆగిపోయింది కదాని కాలం ఆగుతుందా? ధైర్యంగా ముందుకు సాగిపోండి!''
*******************
''ఏమయ్యా, హీరోగారు వెళ్లిన గుర్రం ఇంకా తిరిగి రాలేదు?''
''చచ్చాం సార్! మర్చేపోయాను. నా గుర్రానికి ముందుకెళ్లడమే తెలుసు. వెనక్కి తిరిగి రావడం నేను నేర్పించలేదు.''
*******************
దర్శకుడు - ప్రొడ్యూసర్ గారూ! మన కథానాయకుడు చెమటోడ్చి రిక్షా నడుపుతూంటాడు. ఒక కోటీశ్వరుడు చూసి మన హీరో చిత్తశుద్ధికి ఆశ్చర్యపోయి రిక్షా బ్రాండ్ అంబాసిడర్ గా స్విట్జర్లాండ్ కి పంపుతాడు.
ప్రొడ్యూసర్ - నీ బొంద! ఇప్పటివరకూ స్విట్జర్లాండ్ వెళ్లలేదు, ఈ షెడ్యూల్లోనే ప్లాన్ చేయమని నువు ప్రొడక్షన్ మేనేజర్ కి చెప్పడం నేను వినలేదనుకున్నావా?
*******************
''ఒరే చింటూ! మన పండగల్లో పచ్చడి చేసుకునే పండగేదో చెప్పరా!''
''నాకు తెలీదు మేడం! ఎందుకంటే, మా మమ్మీ రెండ్రోజులకో పచ్చడి చేసి తినకపోతే చితగ్గొట్టేస్తుంది.''
-ఎన్.జీ.కే. అన్నమయ్య
|