Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

అమెరికా వెళ్తున్నారా?

going to america

అమెరికా వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి! 

అమెరికాలో జాత్యహంకార దాడులు భయాందోళనలకు కారణమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీనివాస్‌ కూచిబొట్ల, ఓ అమెరికన్‌ చేతిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో వ్యక్తి అలోక్‌ గాయపడగా, అమెరికాకే చెందిన మరో వ్యక్తి ఈ దారుణాన్ని ఆపే క్రమంలో గాయపడ్డాడు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, 'అమెరికన్ల కోసమే అమెరికా' అని నినదించడంతోనే ఈ సమస్య వస్తోంది. అయితే ఇది కొత్త సమస్య కాదు, సమస్య తీవ్రత ట్రంప్‌ హయాంలో పెరిగిందంతే. అమెరికాలో జాత్యహంకార దాడులు ఎప్పటినుంచో ఉన్నాయనే విషయం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఏళ్ళ తరబడి అమెరికాలో ఎందరో భారతీయులు, ఇతర దేశాలకు చెందినవారు స్థిరపడి ఉన్నారు. అయితే వారికి పూర్తిస్థాయి భద్రత లభించింది. ఇప్పుడు ఆ భద్రత అనుమానాస్పదంగా మారింది. ట్రంప్‌ విధానాలతో అక్కడ స్థిరపడ్డవారి ఉద్యోగ భద్రతపైనా నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికన్లకే ఉద్యోగాలు కల్పిస్తామనీ, ఇతరుల్ని దేశం నుంచి పంపేస్తామని కూడా ట్రంప్‌ ప్రభుత్వం అంటోంది. ఈ నేపథ్యంలో అమెరికా వెళ్ళాలని కలలుగంటోన్న భారతదేశ యువత ఏం చేయాలి? అన్న ప్రశ్న చుట్టూ అనేక సూచనలు, సలహాలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. 

భారతదేశం నుంచి ఏ దేశానికి వెళ్ళినాసరే, అది మన దేశంలా ఉండదని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. అక్కడి వాతావరణ పరిస్థితులకు అలవాటుపడాలని ఎలా అనుకుంటామో, అక్కడి పద్ధతులకు అనుగుణంగా నడుచుకోవాలని కూడా అనుకోవడం ఎంతో ముఖ్యం. అమెరికానే తీసుకుంటే, అక్కడి చట్టాల్ని గౌరవించడం తప్పనిసరి. అలాగే, అమెరికా వెళ్ళాలనుకున్నప్పటినుంచే మన ఆలోచనా ధోరణి సరిగ్గా ఉందో లేదో చూసుకోవడం ముఖ్యం. వేరే దేశానికి వెళుతున్నాం గనుక, అక్కడ ఎలా ఉండాలి? ఏం చేయాలి? సమస్య ఎదురైతే దాన్ని ఎలా ఎదుర్కొనాలి? వంటి అంశాలపై అవగాహన పెంచుకోవడం ముఖ్యం. చదువుకోవడానికి వెళితే, అక్కడి విద్యార్థులతో స్నేహపూర్వకంగా ఉండాలి. అక్కడ అందరూ మాట్లాడే భాషనే ఫాలో అవ్వాలి. అంతే తప్ప మనవాళ్ళు కలిశారనే ఆనందంతో అమెరికన్ల ముందు మన భాషలో మాట్లాడటం ఒక్కోసారి ప్రమాదకరం కావొచ్చు. వారి మీద కామెంట్లు వేస్తున్నామనుకుని, వారు మనపై దాడులు చేసే అవకాశం ఉంది. వేషధారణ దగ్గర్నుంచి ప్రతి విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోక తప్పదు. చదువుకోవడానికి వెళితే చదువు మీద ధ్యాస, ఉద్యోగం కోసం వెళితే ఆ పని చూసుకోవడం వంటివి మాత్రమే చేయాలి. వీటన్నిటితోపాటుగా అమెరికా వెళ్ళి సాధించేదేమిటి? అదే ఇండియాలో ఉంటే సాధించలేనిదేమిటి? అని కూడా బేరీజు వేసుకోవడం ముఖ్యం. అమెరికా ఇప్పుడు ఏమాత్రం భూతలస్వర్గం అనిపించడంలేదు గనుక, అవగాహన లేకుండా వెళ్ళాలనుకునేవారు ఒకటికి నాలుగుసార్లు ఆలోచించుకుంటే బెటర్‌. ఖచ్చితమైన అవగాహన ఉంటే, తగిన జాగ్రత్తలు తీసుకోగలిగితే మాత్రం అమెరికా పెద్దగా మిమ్మల్ని ఇబ్బందిపెట్టకపోవచ్చు. 

మరిన్ని యువతరం
How to buy gadgets