స్నేహానికన్నా మిన్న ఇంకేమీ లేదని యువతరం ఉప్పొంగిపోతూ చెప్పడం మామూలే. తల్లిదండ్రులతో పంచుకోలేని ఎన్నో విషయాల్ని స్నేహితుల వద్ద పంచుకోవడానికి ఇష్టపడుతుంటారు యువతీయువకులు. ఓ వయసు వచ్చాక ఇంట్లో తల్లిదండ్రులతో గడిపే సమయం కన్నా, స్నేహితులతో గడిపే సమయమే ఎక్కువ. ఈ మధ్యకాలంలో ఇది ఇంకా ఎక్కువగా కనిపిస్తోంది. మారుతున్న పరిస్థితులు అందుకు ముఖ్య కారణం. ప్రపంచం చాలా వేగంగా పరుగులు పెడుతోంది. ఆ వేగాన్ని అందుకోవాలంటే, పరస్పరం తమ అభిప్రాయాల్ని స్నేహితులతో పంచుకోవాలి, తద్వారా తమ పరుగులో వేగం పెంచుకోవడానికి వీలుపడుతుంది. 10వ తరగతికి ముందు నుంచే ఈ 'స్నేహితులతో పరుగు'ని చూస్తున్నాం. ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ తర్వాత ఈ పరుగులకు ఆకాశమే హద్దుగా చూడాల్సి వస్తోంది. భవిష్యత్‌ని ఎలా డిజైన్ చేసుకోవాలో స్నేహితులతో మమేకం అయినప్పుడు, వారి చర్చల్లో స్పష్టత వస్తుండడాన్ని అభినందించాలి, ఆస్వాదించాలి.
అయితే అన్నిట్లోనూ మంచినీ, చెడునీ చూసి, మంచి చెడుల్ని బేరీజు వేసుకున్నప్పుడే ఏ ప్రయాణం అయినా సేఫ్‌గా ఉంటుంది. జీవన ప్రయాణం కదా, మంచి చెడుల బేరీజు ఇంకా పక్కాగా వేసుకోక తప్పదు. నువ్వెలాంటివాడివో, నీ పక్కనున్న స్నేహితుడ్ని బట్టి అర్థమవుతుంటాడు ఓ మహానుభావుడు. నిజమే, నీ స్నేహితుడు మంచివాడైతే, నువ్వు కూడా మంచి మార్గంలో నడిచే అవకాశముంది. నీ స్నేహితుడిలో చెడ్డ ఆలోచనలుంటే, మంచి మార్గం పక్కన పెట్టి, వక్రమార్గంలో నీ ఆలోచనలు నడుస్తాయి. 'వాడు నా ఫ్రెండ్, మంచి అయినా చెడు అయినా వాడితోనే' అనే భావన అన్ని వేళలా మంచిది కాదు. పరిస్థితుల్ని బేరీజు వేసుకుని, స్నేహితుడు వక్రమార్గంలో నడుస్తున్నప్పుడు, అతన్ని మంచి మార్గంలో నడపగలిగినప్పుడే అతను, అతనితోపాటు నువ్వు అభివృద్ధిపథంలో ముందడుగు వేయగలవు. ఫలానా పరీక్ష, ఫలానా ఇంటర్వ్యూ, ఫలానా ఉద్యోగం ఇలాంటి విషయాల్లో స్నేహితుల సూచనలు సలహాలు ఎంతగానో ఉపయోగపడ్తాయి కాబట్టి, మీ స్నేహితులు, వారితోపాటు మీ ఆలోచనలు సక్రమ మార్గంలో వున్నట్టా? లేనట్టా? అని బేరీజు వేసుకుంటే భవిష్యత్ బ్రహ్మాండం. అప్పుడే ఆ స్నేహం కూడా అన్నిటికన్నా మిన్న అవుతుంది.
|