Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
kula charitra- why brahmins does not eat meat

ఈ సంచికలో >> శీర్షికలు >>

లేహ్ అందాలు - ..

beauty of leh

పంగోంగ త్సొ సరస్సు

చిన్నచిన్న మోనష్ట్రీలు చూసుకొని బజారు రోడ్డు రెండు రోజులు తిరిగే సరికి యింక అక్కడ చూడవలసినవి యింకేమీ మిగలలేదు అని తెలిసింది . మరునాడు తిరిగి మిలటరీ వారి వాహనాలలో రొహతాంగ్ , మనాలి మీదుగా ఢిల్లీ కి బయలు దేరేం .

ప్రొద్దుటే టీ , బ్రేక్ ఫాస్ట్ చేసుకొని చిన్న బస్సులలో ప్రయాణం మొదలు పెట్టేం . ఓ అరవై కిలో మీటర్ల ప్రయాణానంతరం భోజనాలకై మిలిటరీ కేంపు లో ఆగేం . కల్నల్ గారితో వున్నాం కాబట్టి

వి అయ్ పి టెంటులో భోజనాలు చేసి మడత మంచాలపై విశ్రమించేం . యెప్పటికీ మా బస్సు బయలదేరలేదు యేదో రిపేర్లు అన్నారు , తరువాత బయలు దేరి ఓ అయిదు కిలో మీటర్లు ప్రయాణించేక ఆగింది మళ్లా ఓ గంట మరమ్మత్తుల తరువాత మళ్లా బయలుదేరి ఓ కిలో మీటరు తరువాత ఆగింది మరి కదలనని మోరాయిస్తే అప్పటికే చీకటి పడడం తో వేరే బస్సులో అక్కడకు దగ్గరగా వున్న మిలిటరీ పోస్ట్ కి మమ్మల్ని తరలించేరు . మిగతా బస్సులు యెప్పుడో ముందుకు వెళ్లి పోయేయి .

మాకు ఆఫీసర్స్ గెస్ట్ హౌస్ లో బస యిచ్చేరు . దాని యిన్ఛార్జ్ , రామదాసు అని మా కల్నల్  గారి దగ్గర పని చేసేరట సో యింక అడగాలా , మాకు రాచ మర్యాదలే , అతను మాకు ఆ చుట్టు పక్కల చూడవలసిన వాటికి జీపుని డ్రైవరుని యిచ్చి పంపేరు . ఆ రామదాసుగారు కనబడక పోతే చాలా అద్భత ప్రదేశాలను చూడలేక పోయుందుం .

మరునాడు పొద్దన్నే జీపులో ముందుగా 'హాల్ ఆఫ్ ఫేమ్ ' చూడ్డానికి వెళ్లేం . ఇది లేహ్ లో ఎయిర్ ఫీల్డ్ కి దగ్గరగా వుంది . ఇది భారత ఆర్మీ వారి చే కట్టబడి , వారి ఆధ్వర్యంలో  వున్న మ్యూజియం . ఇందులో భారత - పాక్ యుద్దాలలో వుపయోగించిన ఆయుధాలు , వీరమరణం పొందిన వీర జవానుల జ్ఞాపకాలు పొందు పరిచేరు . ఇది రెండస్థుల భవనం , కిందంతస్థులో వీరజవానుల ఫొటోలు , వారి వీరోచిత గాధలు , వారు వాడిన ఆయుధాలు పొందు పరిచేరు . యెక్కువగా 1999 లో జరిగిన కార్గిల్ అవశేషాలు , జ్ఞాపకాలు వున్నాయి . రెండవ అంతంస్థులో శతృదేశం నుంచి వశపరచుకున్న ఆయుధాలను ప్రదర్శనకు పెట్టేరు .

వీరజవానుల వీరగాథలు చూసి మనస్సు చలించి పోయింది . మన పిల్లలకు అహ్లాదకరమైన ప్రదేశాలే కాదు యిలాంటివి కూడా చూపిస్తే ఈతరం పిల్లలకు ఆర్మీ జవాను అంటే యెవరు ?యెలాంటి ప్రతికూల పరిస్తితులలో వారు దేశాన్ని కాపాడుతున్నారో అవగాహన కలిగి కాస్తంత దేశభక్తి కలుగుతుందేమో అని అని పించింది .

పితుక్ మోనష్ట్రీ--

లేహ్ పట్టణానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో వున్న స్పితుక్ మోనష్ట్రీ కి వెళ్లేం . 11 వ శతాబ్దం లో  ' గెలుగు ' అనే బౌద్ద శాఖ వారిచే నిర్మింపబడింది . ఇందులో సుమారు 100 మంది బౌద్ద సన్యాసులు నివసిస్తున్నారు . బౌద్ద మోనష్ట్రీ లలో కొన్ని శాంతి స్థాపనకు పాటుపడేవి , వాటికి అధిపతి దలైలామా . కొన్ని తాంత్రిక సాధన , తాంత్రిక బోధన చేస్తున్న

' గొంపా ' లు , అలాంటి గొంపా యిది . ఇక్కడ ఓ పెద్ద కాళికామాత విగ్రహం  వుంది . ప్రతీ సంవత్సరం బౌద్ద కేలండరు ప్రకారం , పదకొండో నెలలో 27 వ రోజు నుంచి 29 వ రోజు వరకు ' గష్టోర్ ఉత్సవం ' జరుపు కుంటారు .

చుట్టూరా మట్టి కొండల మధ్య వున్న బహుళ అంతస్తుల భవనం . మనుషులు యెగిరిపోయేంత గాలిలో , యెముకలు వణికించేంత చలిలో యెక్కువ సేపు అక్కడ గడపలేక వెను తిరిగేం .

దూరాలు తక్కువయినా కొండలపై ప్రయాణం కావడం వల్ల ఓ రోజు గడిచిపోయింది .

మరునాడు రంగులు మార్చే సరస్సు కి ప్రయాణం .

రంగులు మారే సరస్సుని అంటున్నారు కాని నిజానికి ఆకాశం రంగు నీటిలో ప్రతి ఫలించి నీరు ఆ రంగులో కనిపిస్తుంది అని మేం మాట్లాడుకుంటూ ప్రయాణం సాగించేం .  లేహ్ పట్టణం నుంచి సుమారు 170 కిలో మీటర్ల దూరంలో వుంది ఈ సరస్సు . నామ మాత్రగా వున్న రోడ్డుమీద సాగిన మా ప్రయాణం మద్యాహ్నం ఒంటిగంటకు భోజనానికి ఓ ఆర్మీ వారి గెస్ట్ లో యేర్పాటు చేసేరు . చిన్న వుద్యానవనం వెనకాల చక్కని సెలయేరు ప్రవహిస్తూ చాలా బాగుంది . చుట్టుపక్కల యెక్కడా కూడా యెటువంటి జనావాసాలు లేవు . ఎక్కడా పంట పొలాలుగాని , చెట్టూ చేమా కాని యేమీ లేవు . భోజనాల తరవాత తిరిగి సాగిన ప్రయాణం అక్కడక్కడ ప్రవహిస్తున్న సెలయేరులు దాటుకుంటూ సాగింది . చాలా మటికి  తడినేల పైన కొన్ని చోట్ల నీళ్లల్లో సాగింది మా ప్రయాణం . వీటిని తడినేలలు ( వెట్ లేండ్స్ ) అంటారని , యీ తడినేలలు  " రామ్సర్ కన్వెన్షన్  " వారి సంరక్షణ లో వున్నాయని తరువాత తెలిసింది . ఈ తడినేలలు వ్యవసాయానికి పనికి రావు . మూడున్నర నాలుగుకి మేం సరస్సు చేరుకున్నాం .

ఈ సరస్సుని గురించిన కొన్ని వాస్తవాలు .

దీనిని ' పంగోంగ్ త్సొ ' సరస్సు అంటారు . టిబెట్టు లో ' పంగోంగ్ త్సొ ' అంటే  ' యెత్తైన గడ్డి మైదానాల సరస్సు ' అని అర్దం . ఈ సరస్సు సుమారు 4,250 మీటర్ల యెత్తులో సుమారు 700 కిలో మీటర్ల విస్తీర్ణాన్ని కలిగి వుంది . దీని పొడవు సుమారు 134 కిలోమీటర్లు కాగా  వెడల్పు సుమారు 5 కిలో మీటర్లు , లోతు సుమారు 328 అడుగులు కలిగివుంది . ఈ సరస్సు గుండా భారత చైనా సరిహద్దు రేఖ వెళుతూ వుండడంతో యీ సరస్సు యెప్పుడూ వివాదాలలో వుంది . ఈ సరస్సు యొక్క తూర్పు మొదలు టిబెట్లోనూ , దక్షిణాన జాన్సన్ లైను , ఉత్తరాన ఆక్సైమ్ ఛిన్ బోర్డరు , ఖర్నక్ ఫోర్టు వున్నాయి , చైనా టిబెట్ ని ఆక్రమించుకున్న తరువాత యీ సరస్సు తూర్పు భాగం , 1952 యిండో - చైనా యుధ్దానంతరం ఖర్నక్ ఫోర్ట్ చైనా వారి ఆధీనంలోకి రావడంతో యీ సరస్సులోని 60 శాతం చైనా కి 40 శాతం భారత కి చెందింది .

సరిహద్దుకు చాలా దగ్గరగా వుండడం వల్ల ప్రత్యేక అనుమతి వున్న వారికే ప్రవేశం కలుగుతుంది .

ఆర్మీ వారి స్థావరం తప్ప చుట్టుపక్కల మరేమీ లేవు .

సరస్సు లోని నీరు యెంత స్వఛ్చంగా వున్నాయో ?

సరస్సులో సరిహద్దు దళాలకు చెందిన కాపలా పడవలు , ఆర్మీ ప్రముఖులు వస్తే విహరించేందుకు అత్యాధునికమైన ముచ్చటగొలుపుతున్న బోటు వున్నాయి .

ఈ సరస్సు శీతాకాలంలో పూర్తిగా గడ్డకట్టుకు పోతుంది . మేం వెళ్లినది జూలై ఆఖరి వారంలో , అది ఆ ప్రదేశాలకి యెండాకాలం , ఆసమయంలో మైనస్ డిగ్రీలలో తాపమానం వుంది , రాత్రి సమయాలలో సున్నకు 10,15 డిగ్రీలు కంటే కిందకు పడిపోతుంది .  శీతాకాలాలలో యిక్కడి తాపమానం -30 , -40 లకి పడిపోతుంది .

ఇది వుప్పు నీటి సరస్సు , దీనికి సింధునది కి సంబంధం లేదు . యే నది వల్ల యీ సరస్సు యేర్పడిందో తెలీదు , నదీ జలాల వల్ల యేర్పడ్డ సరస్సులు మంచి నీటి సరస్సులు . సముద్రం నుంచి యేర్పడినవా అంటే వేలకిలోమీటర్ల దూరం వరకు సముద్రం లేదు .

కను చూపు మేర వరకు అంతా ఊదా రంగు నీళ్లు , బయలుదేరేముందు రంగులు మారే సరస్సు అని రామదాసు చెప్పడం గుర్తొచ్చి ఆకాశం వైపు చూస్తే ఆకాశం అంతా నీలంగా మధ్య మధ్య తెల్ల మబ్బులతో వుంది మరి నీటికి ఊదా రంగు యెలా వచ్చింది . ఆర్మీవారు ఆ సరస్సుని గురించిన వివరణ యిస్తూ సాయంత్రం చైనా వొప్పందం ప్రకారం నాలుగు తరువాత నీటిలో సరిహద్దు కాపలా బోటులు తప్ప వేరేవీ నడపకూడదు లేకపోతే ముందుగా వచ్చుంటే మన ఆధీనంలో వున్న సరస్సులో  బోటు షికారు చేయించే వాళ్లం మిమ్మల్ని అంటే  మంచి ఛాన్సు పోగొట్టుకున్నాం అని పించింది . కాపలా బోటు లోపల నుంచి చూసి ఆనందించేం . చాలా ఆధునిక ఆయుధాలతో తయారు చేయబడిన బోటది . తరవాత ఆర్మీ ముఖ్యులను తిప్పే బోటు కూడా లోపలనుంచి చూసి సంతోషించేం . సర్వ సదుపాయాలూ బోటులో అమర్చేరు .

సరస్సు లోని నీరు ప్రతీ పదినిముషాలకు ఆకాశం లోని మేఘాలతో సంబంధం లేకుండా రంగు లు మారడం గమనించి అబ్బుర పడ్డాం . సరస్సు పరిసరాలలో వున్న ప్రకృతి సౌందర్యం ముగ్ధులను చేసింది వదలక వదలలేక తిరుగు ప్రయాణమయేం . అక్కడి ఆర్మీ వారు ప్రతి రోజూ చూస్తున్న మాకే తనివి తీరదు సార్ మీకు రెండుగంటలలో యెలా తనివి తీరుతుంది అన్నారు .

దిల్ సే , త్రీ యిడియెట్స్ లాంటి చాలా హిందీ సినిమా లలో ఈ సరస్సును చూపించేరు .

రాత్రి యెనిమిదికి తిరిగి మా బస చేరుకున్నాం .

పై వారం మరికొన్ని వివరాలతో మీ ముందుకు వస్తానని మనవి చేస్తూ శలవు .

మరిన్ని శీర్షికలు
weekly horoscope 24th march to 30th march