Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
betting is so dangerous

ఈ సంచికలో >> యువతరం >>

యువతరం - ఆపడం ఎవరితరం?

youth so speed

యువతరం అంటే వేడి, యువతరం అంటే ఉత్సాహం, యువతరం అంటే వేగం. యువతరం అంటే అంతకు మించి! అవును, యువత ఆలోచనలకు ఆకాశమే హద్దు. ఆకాశం అంచులను తాకేద్దామనే యువత వేగానికి అడ్డుకట్ట వేయడం ఎవరికి సాధ్యం? సముద్రపు లోతుల్ని కొలిచేద్దామనుకునే యువత పట్టుదలకి పట్టపగ్గాలుంటాయా? ప్రపంచంలోనే 'యువశక్తి' పరంగా భారతదేశానికి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందుకే, భావి ప్రపంచానికి భారతదేశ యువత దిక్సూచి కాగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచమంతా ఇప్పుడు ఇదే మాట చెబుతోంది. క్రీడా రంగం, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ - ఇలా ఒకటేమిటి, అన్ని రంగాల్లోనూ మన యువత వడివడిగా అడుగులేస్తోంది. సరికొత్త రికార్డులను సొంతం చేసుకుంటోంది. అది ఆట కావొచ్చు, విద్య కావొచ్చు, సరికొత్త ఆవిష్కరణ అయినా కావొచ్చు, ప్రపంచం భారత యువతపై చాలా నమ్మకాలు పెట్టుకున్నట్లే కనిపిస్తోంది. ఆ అంచనాలకు తగ్గట్టుగా మన యువతరం కొత్త ఉత్సాహంతో విజయలక్ష్యాన్ని ముద్దాడేందుకు పరుగులు తీస్తుండడం మనందరికీ గర్వకారణమే కదా! 

యువశక్తి ఎంత పవర్‌ఫుల్‌ అయినప్పటికీ కూడా సరైన దిశానిర్దేశం అవసరం. ఆ దిశా నిర్దేశం సరిగ్గా ఉండబట్టే శాటిలైట్‌ అయినా, మిస్సైల్‌ అయినా లక్ష్యాన్ని ముద్దాడగలుగుతాయి. యువత కూడా అంతే. యువతలో దూకుడికి సరైన దిశా నిర్దేశం ఉంటే, ఆ యువత సాధించే విజయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తాయనడానికి ఎన్నో ఉదాహరణలు. లక్ష్యాన్ని నిర్ధారించుకోవడం, ఆ లక్ష్యాన్ని చేరుకోడానికి సరైన మార్గాన్ని ఎంచుకోవడం ఇవి విజయంలో కీలక భూమిక పోషిస్తాయి. కృషితో నాస్తి దుర్భిక్షం అని పెద్దలు చెప్పిన మాట అక్షర సత్యం. ఏ రంగంలో రాణించాలన్నాసరే కృషి, పట్టుదల ముఖ్యం. సంగీతం, క్రీడా రంగం, శాస్త్ర - సాంకేతిక రంగం ఇలా ఏదైనాసరే, విజయం ఎప్పుడూ ప్రత్యేకమైనదే. సరికొత్త ఆలోచనలు చేసే పనికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తాయి. పదిమందిలానే ఆలోచిస్తే కొత్తదనం ఎక్కడినుంచొస్తుంది? అందుకే కొన్ని విషయాల్లో పదిమంది చూసే కోణంలో కాకుండా, కొత్తగా చూడాల్సి ఉంటుంది. ప్రపంచం చాలా చిన్నదైపోయింది, అలాగే అవకాశాలు విశ్వవ్యాపితమయ్యాయి. మీకంటూ ప్రత్యేకతను మీరు సంపాదించుకోగలిగితే, ప్రపంచమే మీ పాదాల వద్ద వాలిపోతుంది. యువతను ఆపడం ఎవరితరమూ కాదు. కానీ దానికి యువత చేయాల్సిందల్లా లక్ష్యాన్ని నిర్దేశించుకుని, సరైన మార్గంలో తమ ఆలోచనల్ని నడిపించడమే.

మరిన్ని యువతరం