Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

అతడు..ఆమె..ఒక రహస్యం

atadu aame oka rahasyam

గత సంచికలోని అతడు-ఆమె-ఒక రహస్యం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి http://www.gotelugu.com/issue208/592/telugu-serials/atadu-aame-oka-rahasyam/atadu-aame-oka-rahasyam/

 

( గతసంచిక తరువాయి )...

బంగారు లక్ష్మికి స్పృహ వచ్చే సరికి  ఆమె తన ఇంట్లో లేదు. ఆమె కట్టి వేయ బడిన కుర్చీతో సహా ఎక్కడో చీకటి కొట్లో ఉంది. చుట్టూ ఎవరూ లేరు. అసలు తనెక్కడ ఉందో కూడా అర్ధం కాలేదామెకి. బలిష్టమైన దుండగులు ఎడా పెడా చెంపల మీద కొట్టడం వల్ల పెదవుల అంచులలో కోసుకు పోయి  కారిన రక్తం గడ్డ కట్టినట్టు తెలుస్తోంది.  అప్పటి దాకా స్పృహ లేక పోవడం వల్ల తెలియ లేదు కానీ స్పృహ రావడం తోటే భయంకరమైన తలనొప్పి మొదలైంది.

కొద్ది సేపు ఏమీ ఆలోచించే ఓపిక లేక మళ్ళీ కళ్ళు మూసుకుంది. ఒక ఐదు నిమిషాల తరువాత కళ్ళు తెరిచి అప్పుడు ‘అసలు తనెక్కడ ఉంది?’  అని ఆలోచిస్తూ పరిసరాలని అంచనా వెయ్యడానికి ప్రయత్నించింది.

చుట్టూ ఉన్న చీకటి వల్ల కళ్ళు మూసుకున్నా తెరిచినా ఒకేలా ఉంది. కాళ్ళ క్రింద నేల గరుగ్గా తగులుతుండడం వల్ల అది సిమెంటు చేసిన గది అని తెలుస్తోంది.  పైనా క్రిందా ఎక్కడా సన్నటి వెలుతురు సందు కూడా కనిపించక పోవడంతో తను ఏదో గొడవున్ లాంటి స్థలంలోనో లేక సొరంగం లోనో ఉన్నానని అర్ధమైంది. అవన్నీ కాకుండా ఆ స్థలమేమిటో ఆమె మెదడుకి ఏదో హింట్ దొరుకుతున్నట్టనిపిస్తోంది కానీ తల నొప్పి వల్ల ఎక్కువగా ఆలోచించ లేక పోతోంది.

మళ్ళీ కళ్ళు మూసుకుని పది నిమిషాల తరువాత తెరిచింది. తన మెదడుకి అందుతున్న ఆ సంకేతం ఏమిటా అని ఆలోచిస్తే అప్పుడు అర్ధమైంది ఆమెకి. ఆ సంకేతం తన మెదడుకి ముక్కు ద్వారా వెడుతోందని. ఏదో వాసన... ఆ వాసన తనెక్కడ ఉందో  సిక్త్ సెన్స్ చెబుతుతున్నట్టుగా లీలగా మెదడుకి చెబుతోంది.

ఏమిటా వాసన? ముక్కు పుటాలని ఎగబీలుస్తూ  వాసనని తదేకంగా పరిశీలిస్తూ ఒక్క క్షణం ఆలోచించగానే ఆమెకి అర్ధమైంది... అది కొత్తగా కొన్న బియ్యం బస్తా  తెరిచినప్పుడు వచ్చేలాంటి వాసన అని.

బియ్యం బస్తా వాసన అక్కడ ఎందుకు వస్తోంది?

బహుశా తనని  ఏదో రైస్ మిల్ తాలూకు గొడవున్ లో బంధించి ఉండచ్చు...  కాలిని చాప గలిగినంత మేరా ముందుకు చాపుతూ కాలికింద నేలని తడమసాగింది.  కాలికి  రంపపు పొట్టులాంటిది నేల మీద గరుగ్గా తగిలింది. అంతే కాకుండా బియ్యం ఆడినప్పుడు వచ్చే తవుడు వాసన కూడా ఆమె ముక్కు పుటాలకి ఈ సారి స్పష్టంగా తెలియడంతో, తనని ఏదో రైస్ మిల్ గొడవున్ లోనే బంధించారన్న విషయం రూఢీగా అర్ధమైంది.

రైస్ మిల్ అంటే,  పల్లెటూళ్ళలోనో,  నగర శివార్లలోనో ఉంటాయి... హైదరాబాద్ నగర శివార్లలో రైస్ మిల్లులు అరుదు.  అంటే వాళ్ళు తనని రాత్రి హైదరాబాద్ దాటి చాలా దూరం తీసుకు వచ్చారన్న మాట?

అసలు ఎవరు వాళ్ళు?

అంత కష్టపడి తనని ఇంత దూరం తీసుకు వచ్చి ఈ చీకటి కొట్టంలో బంధించి ఎక్కడికి వెళ్ళి పోయారు?  తనని ఇలా ఎంత సేపు ఇక్కడ ఉంచుతారు? 

కొద్ది సేపు కుర్చీతో పాటే అటూ ఇటూ కదులుతూ అక్కడి నుంచి  తను తప్పించుకుని వెళ్ళడానికి ఏదైనా మార్గముంటుందా అని ఆలోచించింది.  కానీ అంత కష్టపడి తనని ఎత్తుకొచ్చిన వాళ్ళు తనకి తప్పించుకునే అవకాశం అంత సులువుగా ఇవ్వరన్న విషయం కూడా ఆమెకి తెలుసు.

అలా ఒంటరిగా ఉండడం బోర్ గా అనిపిస్తుంటే కనీసం తలనొప్పైనా తగ్గుతుందని కళ్ళు మూసుకుని బలవంతంగా నిద్ర లోకి జారడానికి ప్రయత్నించింది. నోరూ గొంతూ పిడచ కట్టుకు పోయినట్టు ఉండడంతో నిద్ర కూడా రాలేదామెకి.

అలాంటి భయంకర మైన స్థితిలో అరగంట గడిపాక దూరంగా చిన్న వెలుతురు కనిపించిందామెకి. క్రమంగా చిన్నగా కనిపించిన ఆ వెలుతురు  క్రమంగా పొడవుగా పరుచుకుంది.

అంత సేపూ చీకట్లో ఉన్న ఆమెకి ఆ వెలుతురుని చూడగానే ప్రాణం లేచొచ్చినట్టనిపించింది.  వెలుతురు పొడవుగా పరుచుకుంటున్న విధానాన్ని బట్టి ఎక్కడో దూరంగా ఉన్న చిన్న తలుపు తెరుచుకుందని అర్ధమైంది.  ఆ వెలుతురు చూసాక కానీ ఆ గొడవున్ అంత పొడవు ఉంటుందన్నది ఆమె ఊహకి అందలేదు.

తెరుచుకున్న తలుపులోంచి ఎవరో వ్యక్తులు నీడల్లా నడుచుకుని రావడం కనిపించింది.

హఠాత్తుగా ఆమెకి ముందు రోజు రాత్రి తనని కొట్టిన వ్యక్తి గుర్తొచ్చాడు. ‘ఇప్పుడు కూడా ఆ హింస కంటిన్యూ అవుతుందా?’  తల్చుకుంటేనే ఆమెకి గుండెలు దడదడలాడాయి.

ఆమె భయపడుతుండగానే, ఆ ఆకారాలు దగ్గరగా వచ్చాయి. మసక వెలుతురులోనే వచ్చిన వాళ్ళని  పరిశీలనగా చూసింది.  నిన్న వచ్చిన వ్యక్తులు వేరు, ఇప్పుడు వచ్చిన వ్యక్తులు వేరు.  ఇప్పుడొచ్చినను పంచె కట్టుకుని ఉన్నాడు. అతడి పక్కన ఉన్న వ్యక్తి ఒక స్త్రీ. ఆమె చేతిలో ఏదో సంచీ ఉంది.

“నువ్వేనా బంగారు లక్ష్మి అంటే?”  పంచె కట్టుకున్న వ్యక్తి అన్నాడు.

అవుననీ కాదనీ చెప్పడానికి  వీల్లేకుండా బంగారు లక్ష్మి నోట్లో గుడ్డలు కుక్కి ఉన్నాయి.  నోట్లో గుడ్డలు లేక పోయినా మాట్లాడ గలిగే  స్థితిలో ఆమె లేదు.  మౌనంగా తలూపింది.

ఆ పంచె కట్టు వ్యక్తి తనతో పాటూ వచ్చిన ఆడ మనిషికి సైగ చేసాడు.

ఆమె చేతిలో ఉన్న సంచీ క్రింద పెట్టి బంగారు లక్ష్మి కూర్చున్న దగ్గరకి వచ్చి  నోటికున్న కట్లు తీసింది. కొంత రిలీఫ్ గా అనిపించింది బంగారు లక్ష్మికి.

సంచి తెరిచి, అందులో ఉన్న  సీసాలోని నీళ్ళతో బంగారు లక్ష్మి ముఖం కడిగింది.  ఆమె చేతులు కట్టేసి ఉండడం వల్ల, తనే  సీసా ఎత్తి  కొన్ని నీళ్ళు  ఆమె నోట్లో పోసింది.

ఆత్రంగా గడగడా నీళ్ళని తాగేసింది బంగారు లక్ష్మి.  పొలమారుతుంటే ఆమె నీళ్ళు పొయ్యడం ఆపి, “కాఫీ తాగుతావా?” అంది.

ఎదురు చూడని ఆ మర్యాదకి ఉక్కిరిబిక్కిరైనట్టుగా అవాక్కై చూసింది బంగారు లక్ష్మి . ఆమె అడిగిన ఆ ప్రశ్నకి ఎన్ని కోట్ల విలువ చేసిన వజ్రాలని ఇచ్చినా ఆమె ఋణం తీర్చుకోలేదనిపించిందామెకి ఆ క్షణంలో.

పంచెకట్టతను సైగ చెయ్యడంతో, సంచిలో ఉన్న ఫ్లాస్కు తీసి అందులోంచి వేడిగా పొగలు కక్కుతూ సువాసనలు వెదజల్లుతున్న కాఫీని ఒక కప్పులో పోసింది. వేడి చల్లారేలా నోటితో ఒకసారి ఊది ఆమె నోటి దగ్గర పెట్టింది.  ఆత్రంగా జుర్రుకుంటూ కాఫీ త్రాగేసింది బంగారు లక్ష్మి.

చావగొట్టి, తెల్లవార్లూ  కట్టి పడేసి, పొద్దున్నే నిద్రలేపి ముఖం కడిగించి ఎవరైనా కాఫీ పట్టిస్తే అంత బావుంటుందన్న విషయం  మొదటిసారిగా తెలిసింది బంగారులక్ష్మికి.  కృతజ్ఞతగా ఆ ఆడ మనిషి వంక చూసింది.

ఆమె బంగారులక్ష్మి చూపులనేం పట్టించుకోకుండా, ఆమె మూతి తుడిచి  ఫ్లాస్కుని సంచిలో సర్దుకుని  నెమ్మదిగా నడుచుకుంటూ ఆపరేషన్ చేసిన డాక్టర్లా  అక్కడి నుంచి వెళ్ళిపోయింది.  అప్పుడు ఆమె ముందుకి వచ్చాడు పంచె కట్టతను.

“ఆ వజ్రాలెక్కడ ఉన్నాయో నీకు తెలుసన్న సంగతి నాకు తెలుసు.  నువ్వు తల క్రిందులుగా తపస్సు చేసినా అవి నీకు దక్కవు.  అనవసరంగా ఎందుకు ప్రాణాలని రిస్కులో పెట్టుకుంటావు?  ఆ వజ్రాలెక్కడ ఉన్నాయో చెప్పెయ్” అన్నాడు.

“నాకు ఏ వజ్రాల సంగతీ  తెలియ...” అంటూ మధ్యలోనే ఆగి పోయింది ఆమె. కాఫీ తాగినప్పుడు సహకరించిన నోరు మాట్లడేటప్పుడు సహకరించడం లేదు.

ఆ పంచెకట్టతను అసహనంగా చూసాడు బంగారు లక్ష్మి వంక.  తల వెనక్కి తిప్పి విసుగ్గా “జోసఫ్...” అన్నాడు. అతడి వెనక నుంచి చీకట్లోంచి బయటకి వచ్చింది ఒక ఆకారం.

ఆ ఆకారాన్ని చూడగానే గుండె ఆగినంత పనైంది బంగారు లక్ష్మికి.  అతడు ముందు రోజు  ఇంట్లో రాత్రి ఆమెని కొట్టిన వ్యక్తి !

భయంగా అతడి చేతుల వంక చూసింది... ఈ సారి అతడు ఉత్తి చేతులతో రాలేదు. సాయుధుడై చేతినిండా ఆయుధాలతో వచ్చాడు. ఆమెకి మళ్ళీ స్పృహ తప్పుతున్నట్టనిపించింది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nadaina prapancham