Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

 గతసంచికలో నాదైన ప్రపంచం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

http://www.gotelugu.com/issue209/594/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

 

( గతసంచిక తరువాయి ).....

‘‘మీరు నాకు అభిమానులా?’’ తెల్లబోయి అంది.

‘‘అవును. మీకు నేను అభిమానిని....’’నిజాయితీగా అన్నాడు.

‘‘నిజంగా?’’

‘‘చాలా నిజంగా.....’’

కీర్తనకి చాలా ఆనందంగా అనిపించింది. తను చిన్నప్పటి నుంచి చాలా సార్లు ఎన్నో గొప్ప మ్యాచ్ లను  గెలిచింది. గెలిచినప్పుడల్లా చాలా మంది ‘చాలా బాగా ఆడావు’ అని అభినందించారు. వారి అభినందనలను  తనకెంతో ఉత్సాహాన్నిచ్చేవి కానీ ఎప్పుడూ, ఎవరూ ఇంత వరకూ తన అభిమానినని చెప్పలేదు.

ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరో వచ్చి మీ అభిమానిని అంటుంటే మనసు పులకించి పోతోంది.

‘‘మీరు నేను ఆడిన మ్యాచ్ లను  చూశారా...?’’ చాలా మృదువుగా అడిగింది.

అప్పటికి వూపిరి పీల్చుకున్నాడతను.

‘‘ఆ బెంచీ మీద కూర్చుని మాట్లాడుకుందాం పదండి’’ అంటూ తనే ముందు దారి తీశాడు. వెళ్ళడానికి కీర్తన తటపటాయించింది. అతను వెనక్కి తిరిగి చూస్తూ ‘‘రండి....’’ అంటూ మళ్ళీ పిలిచాడు.

తన అభిమానే కదా అని మనసుని సమాధాన పర్చుకుని వెళ్ళి బెంచీ మీద ఓ మూల ఒదిగొదిగి కూర్చుంది.

‘‘మీ మ్యాచ్ లను  ఒకటేంటి అన్నీ చూశాను. మీ చిన్నప్పటి నుంచి అదే...మీ పదేళ్ళు....’’

‘‘పన్నెండేళ్ళు’’ సరిజేసింది.

‘‘ఆ!ఆ!....మీ పన్నెండేళ్ళ వయసు నుంచీ చూస్తున్నాను. ఏం ఆట...ఏం ఆట అసలంత బాగా ఎలా ఆడగలరండీ మీరు?’’ ఆరాధనగా ఆమె వంక చూస్తూ అన్నాడు.

మొహ మాటంగా తల వంచుకుంది ఆమె.

‘‘మీరు వైజాగ్ వెళితే అక్కడికొచ్చాను. డిల్లీ వెళ్ళినప్పుడూ వచ్చాను. ఆఖరికి ముంబయి టీమ్ మీద మీరు పదిహేను ఆరుతో గెలిచినపుడు....’’

‘‘పదిహేను....ఎనిమిది’’ సరిదిద్దింది.

‘‘అదే లెండి పదిహేనూ ఎనిమిదితో గెల్చినపుడూ....జట్టు కెప్టెన్ గా మీరు సగర్వంగా కప్ ని అందుకున్నప్పుడూ నేను మీ వెంటే వున్నాను. మిమ్మల్ని చూస్తూనే వున్నానండీ. నా పరీక్ష మానుకుని మరీ మీ ఆట కోసం వచ్చాను. మీ ఆట ముందు నా పరీక్ష పోయినా ఓ లెక్కా’’ ఉద్రేకంగా అన్నాడతను.

‘‘అయ్యయ్యో! పరీక్ష మానేశారా? మీ ఇంట్లో ఏమీ అనలేదా?’’ కంగారుగా అంది.

‘‘మీరు భలే వారండీ! ఏం అనలేదా అని మెల్లగా అంటారేంటండీ! ఏం అనకుండా ఎందుకుంటారు? నీకు పరీక్ష ముఖ్యమా? ఆ అమ్మాయి ముఖ్యమా? అన్నారు’’ అన్నాడు.

‘‘అమ్మాయా?’’ బిత్తర పోయి అడిగింది.

‘‘అదేలెండి ఆ అమ్మాయి ఆట ముఖ్యమా? అన్నారు.

‘‘మరి మీరేం అన్నారు....?’’ కీర్తన అతని వంక ఆసక్తిగా చూస్తూ అంది.

‘‘ఆ అమ్మాయే నాకు ముఖ్యం అన్నాను’’ మళ్ళీ ఉద్రేక పడి పోయి అన్నాడు .

‘‘అదే ఆ అమ్మాయి ఆటే ముఖ్యం అనుంటారు’’ తనే సరిదిద్ది చెప్పింది కీర్తన.

‘‘ఆ....! అదేలెండి.’’

తన ఆట కోసం అతను తన పరీక్షని, తద్వారా అతడి ఫ్యూచర్ నీ నాశనం చేసుకున్నందుకు ఆమె హృదయం ద్రవించి పోయింది.

‘‘అయినా మీరలా చేయడం బాగా లేదు’’ తల దించుకుని గోళ్ళు పరిక్షగా చూసుకుంటూ అంది.

‘‘ఎలా చేయడం?’’

‘‘నా ఆట కోసం పరీక్ష మానేయడం...ఆట ఆటే, పరీక్ష పరీక్షే. ఒక దాని కోసం ఇంకొకటి త్యాగం చేయ కూడదు’’ బోధించింది.

‘‘ఒక్కో సారి మీలాంటి వాళ్ళ కోసం తప్పదండీ....!’’ భారంగా అన్నాడు.

ఆమె టైమ్ చూసుకుంది. అప్పటికే ఆరున్నర...చీకటి పడి పోతోంది.

‘‘అయ్యో! చాలా లేటయి పోయింది’’ ఆందోళనగా అంది.

అతను కూడా లేచి నిలబడ్డాడు.

‘‘నేను డ్రాప్ చేస్తాను రండి’’ పిలిచాడు.

ఎంత అభిమానయినా అతనూ అబ్బాయే కదా! అప్పుడు గుర్తొచ్చింది.

‘‘అమ్మో! ఇంకేవన్నా వుందా? నేనలా రాను. మాకూ కారుంది. మా పిన్ని తీసుకెళ్ళారు. లేకపోతే నేను కారు లోనే వెళ్ళేదాన్ని.’’
చిన్నపిల్లలా మాట్లాడుతున్న ఆమెని చూసి కొంచెం నవ్వు, జాలీ కలిగాయతనికి.

అతను చూస్తూ నిలబడ్డాడు. అతనికి ‘బై’ చెప్పకుండానే అతను చెప్పేది విన్పించుకోకుండానే దగ్గరకి వచ్చి ఆగిన ఆటో ఎక్కి వెళ్ళి పోయింది.

***

లంకంత ఆ ఇంట్లో ఏదీ ఉండాల్సిన చోట వుండదు. ఎవరూ తమ తమ స్థానాల్ని బట్టి ప్రవర్తించరు. ఒక సారి ఒకరికొకరు ఏమవుతారో తెలీనట్లుంటారు. అవసరమనుకుంటే అంతా ఒకటై పోతారు.

ఆ ఇంట్లో పెద్ద సంతానంగా జన్మించింది మృదులా దేవి. చిన్నప్పుడంతా రాజసంగా పెరిగినా, పెద్దయ్యే సరికి తమ ఫ్యామిలీ పరిస్థితి బాగానే అవగాహనకి వచ్చింది.

ఇంట్లో పెద్ద సంతానమైన తనకీ తండ్రి ఓ మోస్తరు రాజ వంశీకుల సంబంధం తేలేక పోతున్నాడు.

అందుకే భూపతి సంబంధం వచ్చినప్పుడు తెగించి అతన్ని పెళ్ళి చేసుకుంది.

భూపతిని ఆమె అయిదోతనం కోసం కన్నా ఐశ్వర్యం కోసమే పెళ్ళి చేసుకోవడం వాస్తవం.

పెళ్ళయిన తర్వాత ఆమె భర్త కోసం కన్నా పుట్టింటి కోసమే ఎక్కువ కష్టపడింది.

చెల్లెలికి పెళ్ళి చేసింది. పెద్ద తమ్ముడికి భూపతి ఫార్మాస్యూటికల్స్ కంపెనీ అప్పగించింది.

చిన్న తమ్ముడికి పొలం బాధ్యత అప్పగించింది. వాళ్ళు తిన్నంత తిని, మిగతాది ఇచ్చినా ఏమనేది కాదు....వాళ్ళ జన్మ హక్కు అన్నట్లుగా వూరుకునేది.

వాళ్ళిచ్చిన మిగతా డబ్బుని తన విలాసాలకి వాడుకుంటూ పిల్లలకి మాత్రం క్రమశిక్షణ, పొదుపు పేరుతో సరయిన తిండి కూడా పెట్టేది కాదు.
ఇప్పుడు అశోక్ పెద్ద వాడై ఫార్మా స్యుటికల్స్ ని సొంతం చేసుకున్నాడు.

అప్పట్నుంచీ ఏదో అభద్రతా భావం వెంటాడుతోంది. అశోక్ ఇక్కడితో ఆగడు.

కంపెనీలో ఉన్న షేర్ల గురించి వాకబు చేస్తాడు. పొలం మీద వచ్చే అయిదు వేల గురించి ఆరా తీస్తాడు.

అన్నింటినీ మించి ఎకరం స్థలంలో ఉన్న ఇంటికి అతను కూడా వారసుడు...ఈ విషయం తల్చుకుంటుంటే ఒంటి మీద తేళ్ళూ జెర్రులూరీ పాకినట్లుగా వుంది.

అప్పటికి ఆమె పుట్టింటికి వచ్చి రెండ్రోజులయింది. తల్లిదండ్రులు ఏదో గొణుగుతూనే వున్నారు.

పెద్ద తమ్ముడు జగన్నాధం ముభావంగా వున్నాడు. తనేం చేసిందనీ! మృదులా దేవికి చిరాగ్గా అన్పించినా, వాళ్ళ అండదండలు లేకపోతే తను ఒంటరిదన్న భయం ఆవహించి, ఏవో మంచి మాటలు చెపుతూ వాళ్ళని శాంత పరచడానికి ప్రయత్నిస్తోంది.

ఆ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక అందరూ ఇంట్లో సమావేశమయ్యారు.

‘‘అయితే ఏమంటాడు నీ కొడుకు....?’’ జగన్నాధం ఉపోద్ఘాతంగా అన్నాడు.

‘‘అనేది ఏముంది....తన హక్కుని తాను ఉపయోగించుకుంటానన్నాడు.

‘‘ఏంటి వాడి హక్కు, బోడి హక్కు....ఏదో ఆస్థంతా వాడిదయినట్లు’’ ఆవేశంగా అన్నాడు.

‘‘ఆవేశ పడితే ఏం లాభం? వాడూ ఆవేశ పడి. మనమూ ఆవేశ పడి తెగే దాకా లాగితే ఏంటి ఉపయోగం? గట్టిగా ఏవన్నా అంటే ఆస్థి నాలుగు భాగాలయ్యేట్లు వుంది. ముసలాడు తన భాగం పిల్లలికే ఇస్తాడు. పైగా ఆయనకి కూడా లక్ష ఆస్థి వెళుతుంది. అందుకే జాగ్రత్తగా ఆలోచించి పథకం వెయ్యాలి’’ మృదులా దేవి అంది.

‘‘ఏం చేద్దాం?’’ సాలోచనగా అన్నాడు జగన్నాధం.

‘‘ఇప్పుడు తన కంపెనీకి ఏవో ఆర్డర్స్ వచ్చాయంట. పైగా  ఇరవై వేల లాభం అంట....మొన్న తెగ విర్ర వీగుతూ చెపుతున్నాడు అక్కసుగా అంది మృదులా దేవి.

‘‘ఆ గర్వం అలా పెరిగిపోనివ్వ కూడదు.’’

‘‘మరి....?’’

‘‘అణిచి వెయ్యాలి’’ కసిగా అన్నాడు.

‘‘ఎలా?’’ కుతూహలంగా అడిగింది.

‘‘ఆ కంపెనీని చూసుకొని మిగతావి వదిలేస్తే ఫర్వాలేదు. కానీ దాని మీద లాభం సంపాదించిన ధీమాతో మిగతా వాటి మీద కూడా కన్ను పడిందంటే మన నోట్లో మట్టే.’’

‘‘మరేం చేద్దాం?’’ ఆందోళనగా అంది మృదులా దేవి.

‘‘అసలు నేను ముందే చెప్పాను. తమ్ముడికి ఆ పిల్లనిచ్చి చేద్దాం. అప్పుడు వాళ్ళంతా చచ్చినట్లు మన కాళ్ళ దగ్గర పడుంటారని చెప్పానా....?’’

ఎప్పుడో జరిగిన దానికి ఆవేదన పడ్తున్నాడు జగన్నాధం.

‘‘నేనేమన్నా వద్దన్నానా...? ఆ అశోక్ గొడవ పెట్టాడు. ముసలాయనకీ ఇష్టం లేదు. అసలు వాళ్ళందరూ ఒకటి, నేనొక్కదాన్నీ ఒకటి. అక్కడ ఒంటరిగా నేను ఎన్ని తిప్పలు పడ్తున్నానో మీకేం తెలుసు?....’’ ముక్కు ఎగబీలుస్తూ అంది.

ఆమె ఏడుపుకి కంగారు పడ్డాడు జగన్నాధం.

‘‘సరే! సరే!.... అయిందేదో అయి పోయింది. ముందుగా దేనిని చూసుకొని వాడు విర్ర వీగుతున్నాడో దాని మీద మొదటి దెబ్బ పడాలి. వాడి గర్వం అణగాలి. ఆ తర్వాత నీ కూతురిని నేనో, మన గోపాలం గాడో రెండో పెళ్ళి చేస్కుంటాంలే వెకిలిగా నవ్వాడు.

‘‘ఏం చేస్తావో, ఎలా చేస్తావో నీ ఇష్టం. సమస్తం నీ మీదే భారం వేసాను.’’ నిట్టూరుస్తూ అంది.

‘‘నీకెందుకు నువ్వు ఇక్కడే ఓ నెల దర్జాగా గడిపి అక్కడికి వెళ్ళు. తర్వాత అక్కడ వచ్చే మార్పు నీ కళ్ళతో నువ్వే చూసి ఆనందిద్దూ గాని’’
‘‘ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను.’’ మెరుస్తున్న కళ్ళతో అంది మృదులా దేవి.

***

‘‘హలో!.....’’

అన్న పిలుపు వినిపించి కాలేజీ లోకి అడుగు పెట్టబోతున్నదల్లా వెనక్కి తిరిగి చూసింది కీర్తన.

‘‘నేను ఆకాష్ ని....’’ చెప్పాడు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
atadu..aame..oka rahasyam