సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లుగా అభిప్రాయాలు చెప్పేస్తామని అంటే ఇకపై కుదరకపోవచ్చు. ఇప్పటికే సోషల్ మీడియాపై ఆంక్షలు ఎన్నో ఉన్నాయ్. అయితే ఆ ఆంక్షలు, నిబంధనల్ని ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవడంలో ఆచి తూచి స్పందిస్తున్నాయి ప్రభుత్వాలు. బాల్‌థాక్రే మరణించినప్పుడు పుట్టుకొచ్చిన వదంతులు, దురదృష్టకర వ్యాఖ్యలు కొందరు నెటిజన్లను ఇబ్బందులపాల్జేశాయి. అలాగే జయలలిత అనారోగ్యం, మరణం పట్ల సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలతోనూ చట్టపరమైన చికాకులు తప్పలేదు. సోషల్ మీడియాలో ఏదైనా రాసుకోవచ్చనే అభిప్రాయం నూటికి తొంభై మందిలో ఉండవచ్చునేమో. కానీ ఇకపై అలాంటివి కుదరవు. ఎందుకంటే కఠిన చర్యలు తీసుకునే దిశగా కొన్ని ఆక్షేపణీయమైన సందర్భాలను నిర్వచిస్తున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసందర్భ ప్రేలాపనలు, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే వ్యాఖ్యలు వంటివాటిపై కొరడా ఝుళిపించడానికి ప్రభుత్వాలు, అలాగే సోషల్ మీడియా సంస్థలూ సమాయత్తమవుతున్నాయి. ముందుగా కొన్ని 'పదాల్ని' ఫిల్టర్ చేసే చర్యలు చేపడుతున్నాయట వివిధ సంస్థలు. అసభ్యకరమైన రాతలకు చెక్ పెట్టడంలో ఇది ముందడుగు కావొచ్చు. భవిష్యత్తులో ఇది మరింతగా ఉధృతం కానుంది.
స్వేచ్ఛకీ ఓ హద్దు ఉంటుంది. స్వేచ్ఛ పేరుతో ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడాలనుకోవడం, వారి వ్యక్తిగత జీవితాన్ని బహిర్గత పరచాలనుకోవడం నేరమే. ఈ నేరానికి తగిన శిక్షలు చట్టాల్లోనే పేర్కొనబడ్డాయి. కొన్ని సందర్భాలలో ఇటువంటి నేరాలకు తగిన శిక్షలు విధించడమూ చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ఎక్కడో ఉండి, ఏదో ఒక సాధనం ద్వారా ఇష్టమొచ్చినట్టు కామెంట్ చేసేసి జారుకుందాం అనే తేలిక భావన చాలామంది యువతలో కనిపిస్తుంటుంది. ఇంటర్నెట్ పట్ల, సోషల్ మీడియా పట్ల, సాంకేతిక పరిజ్ఞానం పట్ల అవగాహన ఉన్నవారు కొంతవరకు తమను తాము అదుపులోనే ఉంచుకుంటారు. అయితే వీటి పట్ల అవగాహన సరిగా లేనివారు తేలికగా తప్పించుకుంటామనే భావనతో ఉండడం కనిపిస్తుంది. అలాంటి వారితోనే ఎక్కువ ముప్పు వాటిల్లుతోందని నిపుణులు అంటారు. అయితే ఇంటర్నెట్‌లో తప్పు చేస్తే, ప్రపంచంలో ఏ మూల దాగి ఉన్నా ఆ వ్యక్తిని తేలిగ్గా తీసుకురావొచ్చునని సాంకేతిక నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు.
ముఖ్యంగా యువతరం ఇటువంటి చర్యలకు దూరంగా ఉండాలి. విద్యార్థి లోకం, ఏం జరుగుతుందిలే అనుకుంటే, సోషల్ మీడియాలో వెకిలి రాతలు వారి భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చవచ్చు. సోషల్ మీడియా అకౌంట్ ద్వారా మీ ఇ-మెయిల్ లేదా మీ మొబైల్ ఫోన్ అనుసంధానం అయి ఉంటుంది. కంప్లీట్ లింకప్ ఏదో ఒక మూల దొరుకుతుంది. కాబట్టి, ఉద్యోగాల కోసం ప్రయత్నించేటప్పుడో, ఉన్నత విద్యాభ్యాసం కోసం ప్రయత్నించేటప్పుడో సోషల్ మీడియాపై నిఘా పెట్టడం అనే ప్రక్రియ ద్వారా మీ జాతకం బయటపడిపోతోంది. కాబట్టి యువతరం ఇటువంటి వెకిలి చేష్టలకు చాలా చాలా దూరంగా ఉండడం తప్పనిసరి.
|