Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

బాబు బాగా బిజి చిత్రసమీక్ష

babu baga busy movie review

చిత్రం: బాబు బాగా బిజీ 
తారాగణం: అవసరాల శ్రీనివాస్‌, మిస్తీ చక్రవర్తి, శ్రీముఖి, సుప్రియ ఐసోలా, తేజస్వి మాదివాడ, తనికెళ్ళ భరణి, ప్రియదర్శి, పోసాని కృష్ణమురళి, సుధ, ఆదర్శ్‌ బాలకృష్ణ తదితరులు. 
సంగీతం: సునీల్‌ కశ్యప్‌ 
సినిమాటోగ్రఫీ: సురేష్‌ భార్గవ 
దర్శకత్వం: నవీన్‌ మేడారం 
నిర్మాత: అభిషేక్‌ నామా 
నిర్మాణం: అభిషేక్‌ పిక్చర్స్‌ 
విడుదల తేదీ: 05 మే 2017

క్లుప్తంగా చెప్పాలంటే 
మాధవ్‌ (అవసరాల శ్రీనివాస్‌) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. ప్లేబాయ్‌ మనస్తత్వంతో ఉండే మాధవ్‌, టీనేజీ నుంచే అమ్మాయిలకు ఎట్రాక్ట్‌ అవుతూ, వారిని ఎట్రాక్ట్‌ చేస్తుంటాడు. అలాంటి మాధవ్‌, పెళ్ళి చూపుల్లో నిజాయితీకి పోయి, తన గతం గురించి చెప్పేస్తాడు. షరామామూలుగానే అతని గతాన్ని విన్నవారంతా ఛీకొట్టేస్తారు. దాంతో గతాన్ని దాచి రాధా (మిస్తీ చక్రవర్తి)కి దగ్గరవుతాడు. ఆమెతో పెళ్ళి కుదురుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? మాధవ్‌ గతం గురించి మిస్తీకి తెలిసిందా? అసలు ఇద్దరికీ పెళ్ళి జరిగిందా? లేదా? వంటి ప్రశ్నలకు సమాధానం తెరపైనే దొరుకుతుంది.

మొత్తంగా చెప్పాలంటే 
అవసరాల శ్రీనివాస్‌ మంచి నటుడు. తనలోని నటుడికి అగ్ని పరీక్షే పెట్టాడు ఈ సినిమాతో. సినిమాని ఎంచుకోవడంలోనే అతను తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు. చాలా బాగా చేసినా, కొన్ని సన్నివేశాల్లో వేరియేషన్స్‌ చూపించాల్సి వచ్చినప్పుడు తేలిపోయాడు. హీరోయిన్లలో మిస్తీ చక్రవర్తికి ఎక్కువ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ దక్కింది. ఆమె తన పాత్ర వరకూ బాగానే చేసింది. క్యూట్‌గా హాట్‌గా తేజస్వి మాదివాడ కన్పిస్తే, హాట్‌నెస్‌ ఎక్కువయ్యింది సుప్రియ ఐసోలా పాత్రకి. శ్రీముఖి ఓకే. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగానే చేశారు. 
కథ విషయానికొస్తే, ఇది బాలీవుడ్‌ మూవీ 'హంటర్‌'కి రీమేక్‌. కథనం పరంగా మన నేటివిటీకి తగ్గట్టుగా దర్శకుడు వ్యవహరించి ఉంటే బాగుండేది. మన తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేని రీతిలో కొన్ని సన్నివేశాలున్నాయి. అది మాత్రం పెద్ద మైనస్‌ కావొచ్చు. ఎందుకంటే, అవసరాల శ్రీనివాస్‌ ఫొటోని పోస్టర్‌పై చూస్తే కామెడీని ఆశిస్తారు. ఆయన్నుంచి కామెడీ ఆశించే ప్రేక్షకులు ఈ సినిమాకి దూరమైపోతారు. డైలాగ్స్‌ ఓకే. ద్వందార్థాలు బాగానే వున్నాయి. సినిమాటోగ్రఫీ, సంగీతం సినిమాకి ప్లస్‌ అయ్యాయి. నిర్మాణపు విలువలు బాగున్నాయి. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ బాగానే సినిమాకి హెల్ప్‌ అయ్యాయి.

'హంటర్‌' సినిమాకి కథే బలం. కాబట్టి కథ పరంగా ఇక్కడ వంక పెట్టడానికేమీ లేదు. కథనం కూడా ఒరిజినల్‌ని దాదాపు ఫాలో అయిపోయారు. అదీ ఓకే. కానీ నేటివిటీకి తగ్గట్టుగా సినిమాని మలచుకుని ఉండాల్సింది. కామెడీ డోస్‌ ఇంకాస్త పెంచి, హాట్‌ కంటెంట్‌ డోస్‌ ఇంకొంచెం తగ్గించి ఉంటే బాగుండేదనిపిస్తుంది. సినిమాలో నవ్వులకు కరువేమీ లేదు. కానీ, కుటుంబ సమేతంగా చూసేలా సినిమా లేకపోవడం కన్నా మైనస్‌ ఏముంటుంది? ఫస్టాఫ్‌ ఓకే. సెకెండాఫ్‌లోనే సినిమా కొంత గాడి తప్పినట్లన్పిస్తుంది. ఓ వర్గం ఆడియన్స్‌కి కాలక్షేపాన్నిస్తుంది. ఓవరాల్‌గా అంటే మాత్రం, మరీ అంతగా ఈ బాబు సాధారణ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేయడం కష్టమే.

ఒక్క మాటలో చెప్పాలంటే 
బాబు ఓ వర్గం ఆడియన్స్‌కి మాత్రమే

అంకెల్లో చెప్పాలంటే: 2.5/5 

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka