Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

సమ్మర్‌ ఓవర్‌ - నెక్స్‌ట్‌ ఏంటీ!

summer over. what next..

వేసవి కాలం ముగింపుకు వచ్చేసింది. పరీక్షలైపోయాయి, ఫలితాలు వచ్చేశాయి. యువత ఇప్పుడు కొత్త దారి వెతుక్కోవాల్సిన సమయం మొదలైంది. కొందరు ఉన్నత చదువుల కోసం చూస్తోంటే, ఇంకొందరు ఉద్యోగాన్వేషణలో తలమునకలై ఉన్నారు. ఒకప్పుడు వేసవి కాలం అంటే సంబరం. సెలవుల్ని మేగ్జిమమ్‌ ఎంజాయ్‌ చేసెయ్యాలి. ఇప్పుడలా కాదు, స్కూల్‌ విద్య అయినప్పటికీ కూడా భవిష్యత్తు మీద ఆలోచనలతో సమ్మర్‌ సెలవుల్ని సైతం ఎలాగోలా 'వాడేసుకోవడం' తప్ప, ఆడేసుకోవడానికి వాడుకోవడంలేదు. ట్రెండ్‌ మారిందనడానికి ఇదే సంకేతం. సమ్మర్‌లో చిన్న పిల్లలకైతే డాన్స్‌ అనీ, క్రికెట్‌ అనీ, ఇంకోటనీ పలు వ్యాపకాల్ని తల్లిదండ్రులు చూపిస్తున్నారు. పిల్లలు కూడా అక్కడా ఆటపాటలే గనుక ఆ కొత్త ఎంజాయ్‌మెంట్‌ వైపు ఆసక్తి చూపడం జరుగుతోంది. గడచిన దశాబ్దంన్నర కాలం నుంచే ఆలోచనలు మార్చుకుని, సమ్మర్‌ సీజన్‌ని కెరీర్‌కి మలుపు తిప్పే సీజన్‌గా ఫిక్స్‌ చేసేసుకుంది. పోటీ ప్రపంచంలో తామెక్కడ వెనకబడిపోతామోనన్న ఆలోచనతో అందుబాటులో ఉన్న ఏ ఒక్క క్షణాన్నీ విడిచిపెట్టడంలేదు నేటి యువత.

ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ మాత్రమే కాదు, విదేశాల్లో విద్య అభ్యసించాలనుకుంటున్నవారూ ఈ సమ్మర్‌లోనే తగిన ఏర్పాట్లు, ప్రణాళికలూ సిద్ధం చేసేసుకున్నారు. ఆ ప్రణాళికల అమలు చేయాల్సి ఉంది ఇకపై. ఉద్యోగాన్వేషణ సంగతి సరే సరి. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలపై ఫోకస్‌ పెట్టినవారంతా, ఆయా ఉద్యోగాల కోసం ప్రిపరేషన్‌ మొదలు పెట్టేశారు. ఇదివరకు ఎక్కడ చూసినా సమ్మర్‌లో యువత ఆటపాటలతో మునిగి తేలేవారు. అయితే ఇప్పుడు ఆటపాటలతో పాటుగా చేతిలో పుస్తకంతో దర్శనమిస్తున్నారు. కెరీర్‌ మీద ఖచ్చితమైన ప్లానింగ్‌ లేనివారు మాత్రం షరామామూలుగా సమయాన్ని వృధా చేస్తూనే ఉండటమూ కనిపిస్తోంది. నాణానికి రెండు వైపులూ ఉంటాయి కాబట్టి, యువత మంచి మార్గాన్ని ఎంచుకోవడం ముఖ్యమిక్కడ. విలువైన సమయాన్ని ఇప్పుడు వృధా చేసుకుంటే, భవిష్యత్‌ ఆశించిన స్థాయిలో అద్భుతంగా కనిపించదనే విషయాన్ని నేటి యువత ఎప్పుడో గుర్తించింది. ఆ దిశగానే వారి ప్రణాళికలూ ఉంటున్నాయి.

ఉన్నత చదువులు చదవాలన్నా, ఉద్యోగాన్వేషణకు వెళ్ళాలన్నా ఖచ్చితమైన ప్రణాళిక ముఖ్యం. ఫ్రెండ్స్‌ అటువైపు వెళుతున్నారు కాబట్టి, ఆ మార్గం తమకూ మంచిదేనన్న భావన అన్ని సందర్భాల్లోనూ సబబు కాదు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల నుంచి, తమ విద్యార్హతలు, తమకున్న ఇతర టాలెంట్స్‌ వీటన్నిటినీ దృష్టిలోపెట్టుకుని భవిష్యత్‌ ప్రణాళిక రచించుకుంటే అలా ఎంచుకున్న మార్గం మీకు సత్ఫలితాలనిస్తుంది. చదువా? ఉద్యోగమా? అనే సందిగ్ధంలో ఉన్నవారు సైతం, అన్ని కోణాల్లో ఆలోచించడం ముఖ్యం. స్నేహితుల సలహాలే కాదు, తల్లిదండ్రుల సూచనల్ని పాటిస్తే భవిష్యత్‌ అద్భుతంగా ఉంటుంది. యంగ్‌స్టర్స్‌ బ్యూటీఫుల్‌ లైఫ్‌ ఎహెడ్‌ బట్‌ బీ ప్లానింగ్‌, బీ కేర్‌ఫుల్‌. 

మరిన్ని యువతరం
be care full with youth