Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 2nd june to 8th june

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఉత్తరాఖండ్ ( తీర్థ యాత్రలు ) - కర్రా నాగలక్ష్మి

uttarakhand tourism

ఆదిబదరి , నంద ప్రయాగ

కర్ణ ప్రయాగ తర్వాత ' ఆదిబదరి ' దర్శించుకుందాం అని నిర్ణయించుకొని రాణి ఖేత్ రోడ్డు  వైపు ప్రయాణించసాగేం . సుమారు 17 కిలోమీటర్లు పిండారిగంగ వొడ్డునుంచి సాగిన ప్రయాణం రోడ్డు పైన వున్న మందిరాల వద్ద ఆగింది .  ఆది బదరి ఉత్తరాఖంఢ్ లోని చమోలి జిల్లాలో వుంది . రోడ్డు మీద మందిరాలు బావుంది అనుకోగానే తట్టిన విషయం రోడ్డు పక్కన మందిర నిర్మాణం జరగలేదు , మందిరం పక్కనుంచి రోడ్డు నిర్మించేరని .

మొత్తం పదహారు మందిరాల సముదాయం పెద్ద రాతి మండపం మీద వేరే వేరే మందిరాలలో దేవత విగ్రహాలున్నాయి . ముఖ్య మందిరమైన బదరీనారాయణుని మందిరంలో మూడడుగుల నల్లరాతి విగ్రహం అందంగా వుంటుంది . లక్మి , సరస్వతీ , రామమందిరం , భైరవమందిరం మొదలయినవి వున్నాయి , విగ్రహంలేని కుబేరమందిరం  , సూర్యమందిరం కూడా చూసేం . కోవెల ప్రాంగణం లో వాష్రూమ్స్ కొత్తగా నిర్మాణం చేసేరు , శుభ్రపరచేవారు దొరకక వాటికి తాళం వేసి వుంచేరు .

మొత్తం అన్నీ గుప్తులకాలానికి చెందిన రాత్రి కట్టడాలే .

ఈ మందిరాలు మొదట ఆదిశంకరులవారిచే విగ్రహాలు స్థాపింపబడి , మందిరాలు నిర్మింపబడ్డాయి , తర్వాత వచ్చిన రాజులు వీటికి మార్పులు చేర్పులు చేసి మరమ్మత్తులు చేయిస్తూ వచ్చేరు .స్థల పూరాణానికి వస్తే బదరీనారాయుణుడు కలియుగానికి పూర్వం యిక్కడ తపస్సుచేసుకున్నాడట , కలియుగం మొదలవగానే ' విశాలబదరి ' అంటే యిప్పుడు బదరీ నాథ్ గా పిలువబడుతున్న మందిరం కి వెళ్లి పోయేడట , కలియగం అంతమయి తిరిగి సత్య యుగం మొదలవగానే నారాయణుడు భవిష్య బదరీకి తరలి పోతాడుట .

వేదాలను విభజించి వేద వ్యాసుడుగా పిలువబడ్డ వ్యాసుడు మహాభారతాన్ని యిక్కడవుండి రాసేడుట , కాని మహాభారత యుధ్దం వల్ల అతనిలో కలిగిన అశాంతి చల్లారక హిమాలయాలలో కి వెళ్లి భగవంతుడి ఆదేశం మేరకు భాగవతం రచన చేస్తాడు . కాబట్టి మహాభారత కథను రచించిన ప్రదేశం యిది .

యాత్రీకులు యిక్కడ బస , భోజనాదులు చెయ్యదలచుకుంటే ఉత్తరాఖండ్ ప్రభుత్వం వారి  ' ఘరెవాల్ వికాశ్ మండల నిగమ్ ' వారి గష్ట్ హౌసు మందిరానికి నాలుగడుగుల దూరంలో వుంది . ఆప్రాంతం లో ఆపాటి నివాసయోగ్యంగా వుండేది అదొక్కటే .

ఆది బదరీ చూసుకొని మేం నంద ప్రయాగ వైపు ప్రయాణం సాగించేం .

నంద ప్రయాగ ఉత్తరాఖంఢ్ లోని చమోలి జిల్లా కి చెందిన పట్నం . 2015 లో 300 ంవ్  జలవిధ్యుత్ కర్మాగారానికి పునాది పడ్డనాటికి నాలుగిళ్లతో వున్న నందప్రయాగ పట్నంగా రూపుదిద్దుకుంది . ఈ ప్రస్తావన వల్ల పెద్ద వుద్యోగుల రాకపోకలు యెక్కువకావడం , పనివారు కూడా పెద్ద సంఖ్యలో వచ్చిచేరడంతో వారి సౌకర్యార్ధం రోడ్డు వెడల్పు చెయ్యడం , స్కూల్స్ , హోటల్స్ రావడం తో నందప్రయాగ రూపురేఖలు మారిపోయేయి .

ఆది బదరి నుంచి నందప్రయాగ  వెళ్లాలి అంటే మళ్లా వచ్చిన దారిన కర్ణప్రయాగ వరకు వెళ్లి అక్కడనుంచి బదరీ నాధ్ రోడ్డుమీద సుమారు 21 కిలో మీటర్లు ప్రయాణించాలి .

రోడ్డు వేసే కూలీలు , హైడెల్ పవర్ స్టేషన్ వైపు వెళ్లే జీపులు తప్ప రోడ్డు మీద మరే రాకపోకలూ లేవు . నంద ప్రయాగ వూరు మొదలవుతూనే అన్ని రకాల షాపులు , హోటల్స్ మొదలవుతాయి . ఇక్కడ ఘరెవాల్ వికాష్ మండల్ వారి గెస్టు హౌసులో రాత్రి బస చేసుకున్నాం .

గెస్ట్ హౌసు కి పదడుగుల దూరంలో గోపాల మందిరం దర్శించుకున్నాం , చిన్న మందిరం , యెదురుగా హోమకుండం వున్నాయి . మందిరంలో చిన్న బాలగోపాలుని విగ్రహం వుంది .

పిల్లలు లేని వారు ఈ బాలగోపాలుని దర్శించుకుంటే పిల్లలు పుడతారని స్థానికులు చెప్పేరు . స్థలపురాణం ప్రకారం సంతతి లేని యాదవ రాజు నందుడు యిక్కడ విష్ణమూర్తి ని ప్రసన్నుని చేసుకొని సాక్షాత్తు విష్ణుమూర్తిని పుతృనిగా పొందే వరమందుకున్నాడు . అందుకే యీ ప్రదేశం నందప్రయాగ గా ప్రసిధ్ది పొందింది .  

ఇదే కాకుండా నలుడు దమయంతిని వివాహమాడిన ప్రదేశమని , భరతుడు శకుంతలని గాంధర్వ వివాహ మాడిన ప్రదేశమని కూడా చెప్తారు .

ఈ మందిరం నుంచి కాస్త పైకి మెట్లదారిన వెడితే పురాతనమైన దుర్గాదేవి కోవెల వుంది ఆ ప్రాంగణం లోనే శివలింగం వున్నాయి , యిది కూడా చాలా పురాతనమైన మందిరమే .అక్కడ నుంచి ప్రయాగ ప్రదేశానికి వెళ్లేం , బదరీనాథ్ కి వెళ్లే దారి కూడా అదే , నందాదేవి అభయారణ్యాలలో వున్న ' నంద గుంట ' అనే హిమనీనదము లో పుట్టిన నందాకిని అలకనందతో సంగమంచే ప్రదేశం మనకి కనువిందు చేస్తుంది .

ఈ ప్రయాగలను చూస్తున్నప్పుడు వీధిలోని నీరు తలపై జల్లుకోవాలని అనిపించినా యెక్కడో కిందన ప్రవహిస్తున్న నీటిని చూస్తే అంతవరకు దిగడం తర్వాత అంత పైకి యెక్కడం రెండు మన వలన కావు అని అని పించి అక్కడనుంచే నమస్కారం చేసుకున్నాం . మాకు మరో అలవాటుంది అదేంటంటే నేతిలో వత్తులు వేసి ఓ డబ్బాలో పట్టుకొని వెళ్లి యిలాంటి ప్రదేశాలలో వాటిని వెలిగించి హారతి యిచ్చి పటికబెల్లం ( అదికూడా మాటతో తెచ్చుకుంటాం ) నివేదించి తృప్తి పడుతూవుంటాం .

 ఈ సారి కూడా అలాగే చేసి మా ప్రయాణం విష్ణు ప్రయాగ వైపు కొనసాగించేం .

అయితే విష్ణు ప్రయాగని పంచప్రయాగలలో లెక్కించరు యెందుకో , కాని ఉత్తరాఖంఢ్ లో వున్న పంచప్రయాగలలో ఒకటిగా లెక్కిస్తారు వచ్చే సంచికలో విష్ణుప్రయాగ , హేలంగ్ , జోషిమఠ్ లగురించి చదువుదాం అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
potlakaya perugu pacchadi