Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
facebook (d) status

ఈ సంచికలో >> కథలు >> నోముల పండగొచ్చింది

nomula pandugocchindi

" కిందటిసారి మీరొచ్చినప్పటికి యిక్కడ ఎవరితోనూ పరిచయం యేర్పడలేదు గాని యీసారి చూడండి యీ రెండు నెలలు యిలా గడిచి పోతాయి " అని చిటికె వేస్తూ చెప్పింది శిరీష .

" సాయంత్రం తయారయి వుండండి " గొలు "చూడడానికి వెళదాం " అంటూ కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది శిరీష . కోడలు వెళ్లిపోయాక జెట్ లాగ్ తగ్గక పోవడం తో నిద్రకి ఉపక్రమించింది సుమన .

" గొలు అంటే యేదో మాల్ అనుకుంటున్నావా ? దిగు దిగు వచ్చేసేం " అంటున్న కొడుకు విజయ్ మాటలతో ఏదో ఆలోచనలో వున్న సుమన యీ లోకంలో కొచ్చింది .

రెసిడెన్షియల్ ఏరియాలా వుంది  వరుసగా కట్టిన యిళ్లు  పొందికగా ముచ్చటగా వున్నాయి . రోడ్డుకి వారగా పార్క్ చేసిన కార్లని చూసి " మనమే ఆలస్యమైనట్లున్నాం " అంటూ కోడలు గబగబా ఎదురుగా వున్న యింట్లోకి దారి తీసింది వెనకాలే తల్లి కొడుకు లోపలకి నడిచేరు .

ముందు హాల్లో నిండుగా , పద్దతిగా పెట్టిన పెద్ద కొలువు . ఓహో గొలు అంటే బొమ్మల కొలువా ? అను కొంది .

ఎన్ని బొమ్మలో , అన్నీ మట్టివే , ఇలాంటి బొమ్మలు యీ దేశాలలో దొరకడం అసంభవం . మనదేశం నుంచి యెంత శ్రమకి ఓర్చి తెచ్చేరో ? , వారి ఓపికకి మెచ్చుకోకుండా వుండలేకపోయింది .

పదేళ్ళ అబ్బాయి , వాడి పక్కనే ఆరేళ్ళ అబ్బాయి కొలువుకి ఎదురుగా కూర్చొని ఎదురుగా సంగీతం పుస్తకం పెట్టుకొని తోడ మీద కొట్టు కుంటూ సంగీత పాఠాలు పాడేరు . ఆ ఖూనీ  సంగతం వినలేక వారిని దిద్దడానికి ప్రయత్నం చెయ్య బోతే శిరీష కళ్ళతోనే వద్దని వారించడంతో ఆ ప్రయత్నం విరమించుకుంది సుమన .

పాటలు , మాటలు , ప్రసాదాలు అయేక ఆఖరు ఘట్టం లోకి అడుగు పెట్టేరు . అదే బాయ్ , గుడ్ నైట్ అన్నమాట .

యింటి ఇల్లాలు చిన్న చిన్న గిఫ్ట్ బేగులు చేతిలో పెట్టింది . రంగు రంగుల పువ్వుల కాయితం తో చేసిన పేపరు బాగ్ చూడ ముచ్చటగా వుంది . ఎంతైనా అమెరికా వాళ్లు అమెరికా వాళ్ళే , యిదే మనదేశం లో అయితే ఓ మాగిపోయిన అరటి పండు , పచ్చరంగు  లోకి మారిన తమల పాకులు , ముక్కిపోయిన వక్కపొడి పొట్లం , నాన పెట్టిన శనగలు ఓ చెత్త ముష్ఠి  ప్లాస్టిక్ కవర్లో పడేసి యిచ్చెయ్యడం . యిది  తన చిన్నప్పటి ముచ్చట . అదే యిప్పుడైతే పై వాటితో పాటు అదే కవర్లో పడేసిన బ్లౌజు పీసు అనబడే బట్ట , పసుపు కుంకుమ పేకెట్లు ,  కొండొకచో ఓ స్వీటు కుడా అందులోనే పడేసి యిచ్చెయ్యడం . శనగల తడికి స్వీటు నానిపోయి , పసుపు కుంకుమ లతో కలిసి జాకెట్టు బట్ట కి అంటుకోవడం తనకు అనుభవమే . తనూ అలాగే చేసేదనే విషయం మాత్రం మరచిపోయింది సుమన .

అదే కదా మానవ నైజం .

అమెరికా వెళ్లొస్తే  చాలు అక్కడి వాళ్లని పొగడడం మనని తిట్టడం చేస్తారు అని ఆడిపోసుకుంటారు గాని వుత్తినే ఎవరైనా యెందుకు అంటారు అని ఆలోచించరు . యీ బేగ్ చూస్తేనే ముద్దొస్తోంది మరి గిఫ్ట్ యింకెంత బాగుంటుందో ? అనుకుంటూ లోపలి వస్తువులు బయటికి తీసింది . గాజు జార్ కొవ్వొత్తి , బలేగా వుందే , యింకా యేవో వున్నట్టున్నాయి అనుకుంటూ బేగ్ ని బోర్లించింది . అందులోంచి కిందపడ్డ వాటిని చూసి కెవ్వున అరిచింది సుమన .

అంత గట్టిగా అరిచినా కొడుకు కోడలు చలించలేదు సరికదా ఏమైందని కూడా అడగలేదు . పైగా ముసి ముసి నవ్వులొకటి అని వుడుక్కుంది సుమన .

" బేగ్ చూసి బోల్తా పడ్డావా ? " అని యీ సారి గట్టిగా నవ్వసాగేరు .

" అమ్మా మనం వెళ్ళింది యిండియన్స్ యింటికి . అమెరికాలో వున్నా  చంద్ర మండలం మీద వున్నా  యిండియన్స్ యిండియన్సే " . డ్రైవ్ చేస్తూనే పకపకా నవ్వసాగేడు విజయ్ .

సుమన కెవ్వు మానడానికి కారణమైనవి ఏమిటో తెలుసా మాగిపోయిన అరటి పండు , అందంగా పువ్వులా తయారు చేసిన పసుపు కుంకుమ పొట్లాలు ,యెంత అందంగా కట్టినా చేతికి అంటిన పసుపు కుంకం , నాలుగు వేరు వేరు రంగుల  సైజుల గాజులు , పసుపు తాడు , కాలం చెల్లిన వక్కపొడి పాకెట్ .

" పొనీ యీ గాజు జారు బాగుంది కదా " అంది సుమన .

" ఓహో యిది నీకు మొదటిది కదా ? అందుకే మోజు . యింట్లో ఏ పాతికో ముప్పైయ్యో వున్నాయి కావాలంటే యిండియా పట్టుకుపో , మీకు అక్కడ పవర్ కట్ కదా పనికొస్తాయి "

" పోరా పవర్ కట్టులో కొవ్వొత్తులు వెలిగించుకొనే కాలం పోయింది , ప్రతీ యింటా ఇన్వెర్టర్లు   వచ్చేయి " అంటూ ఆలోచనలో పడింది సుమన   అయ్యో మరీ  అన్నయితే ఏంచేస్తాం ?, యిక్కడ పవర్ కట్ కూడా లేదు , దేవుడి దగ్గర వెలిగిస్తే సరి అఖండ దీపం లా ఓ రెండు రోజులు వెలుగుతుంది కదా ? ఛి ఛి కొవ్వొత్తులు దేవుడి దగ్గర వెలిగిస్తే గో హత్యా పాతకం చుట్టుకొంటుందిట .

" అశ్వీజమాసం మొదలయ్యింది కదా యీ నెల , కార్తీక మాసం యిక్కడ యిలాగే యేదో ఒక పేరంటం , ఇలాంటివే చేతిలో పెట్టడం . యింకా యీ నెల ఫరవాలేదు . కార్తీక మాసం లో అయితే ఎవరింటికి పేరంటానికి వెళ్లి నా చాక్లెట్లు  బేగ్ లో పెట్టి యిస్తారు . హేలోవీన్ కి సేకరించినవి " అంది శిరీష .

" చాక్లెట్స్ అయితే మంచిదే కదా ? , హాయిగా తినొచ్చు " .

" అయ్యో అత్తయ్యా అందరు బ్రాండెడ్ వి యివ్వరుగా ? హాఫ్ ప్రైస్ కి వస్తాయని కొంటారు . అవి ఇవాళో రేపో గడువు తేదీ అయిపోయేవో , డాలర్ షాప్ లో కొన్నావో పిల్లలు తెస్తారు . వాటిని యిలా పెరంటాలలో  వదిలించు కుంటారు " .

యీ వదిలించు కొనే జబ్బు యిక్కడా ప్రవేశించిందా ?  మనసులోనే అనుకొంది సుమన .

అసలు యీ నోములు అనేవి మన సంస్కృతిలొ యెలా ప్రవేశించాయో అన్న విషయం పక్కన పెడితే యిప్పుడు అవి యెంత విజ్రుంబిస్తున్నాయో చూస్తే మాత్రం చిరాకు కలుగుతోంది సుమనకి .

కారు స్టీరియో లోంచి  " నోము పండించవా దేవా " అనే పాట వినిపిస్తోంది . నోము అనే మాటవింటే ఒంటి మీద పాములు తేళ్ళు పాకినట్టు అవుతుంది సుమనకి . విశాఖ పట్నం లో వుండే సుమనకి నోములు , వాయనాలు పుచ్చుకోవడం కొత్తకాదు . శ్రావణ మాసం వచ్చిందంటే చాలు నెలంతా నోములే  . సాతాళించిన శనగలు , వడలు యిలా రకరకాలైన శనగ వంటలతో పొట్టలు పాడవడం అనుభవమే సుమనకి . భాద్రపదమాసం అంటే యెంతిష్టమో , శూన్యమాసం గా  నోములు వుండవు . ఆశ్వీజ మాసం తో మళ్లా నోములు మొదలు .

పుట్టింది , మెట్టింది విశాఖపట్నమే అవడంతో యెన్నో తెలిసిన యిళ్ళు , యెనెన్నో వాయనాలు . డెబ్బై  , యెనభై దశకాలలో స్త్రీ లకి నోముల పిచ్చి యింత లేదు . తాంబూలంతో సరిపెట్టేవారు , మహా అయితే శనగలు . యిప్పుడలా కాదు , ప్రతీ దానికి స్టీలు సామానో , జాకెట్టు బట్టలో , చీరలో పెట్టడం . యింటినిండా అవే బట్టలు . మనం పుచ్చుకున్నవి మరొకరికి యివ్వకూడదేమో ? యిస్తే అశుభమేమో అనే సందేహం . దాంతో  యింటి నిండా స్టీలు సామానులు ,పనిమనుషులు కుడా తిరస్కరించే చీరెలు , జాకెట్టు బట్టలు , ఫలితం ఏ బీరువా తీసినా కింద పడిపోతూ చీరలే చీరలు .

నోము అంటే గుర్తొచ్చింది మెరూన్ కలరు హెవీ పల్లూ కంచి పట్టుచీర , ఆ చీర కొనుక్కోడానికి తను చేసిన సత్యాగ్రహాలు , హఠం , యెప్పుడూ మాటా మాటా అనుకోని తమ మధ్య జరిగిన మాటల యుద్ధం అన్నీ కళ్ల ముందు తిరిగేయి . దసరా నాడు అమ్మవారికి పెట్టి , రెండో సారి చలిమిళ్ళ నోము అని పిలిస్తే కొత్త చీర నలుగురు అమ్మలక్కలకి చూపించి వారి కళ్ళల్లో కనిపించే యీర్ష ని చూసి ఆనందించాలని యెంత వుబలాటంగా వెళ్ళిందో , చలిమిడి ముద్ద మీద ప్రేమ కూడా వుందనుకోండి  . అదేం మాయదారి ఆచారమో కాని ఒళ్ళో చలిమిడి ముద్ద పెట్టాలిట , దాంతో పాటు రెండు అరటిపళ్లు . చలిమిడి ముద్ద యెంత బరువుగా వుందంటే దాన్ని పట్టుకోడానికి కాస్త బలప్రయోగం చెయ్యవలసి వచ్చింది . ఫలితం అరటి పళ్ళు చలిమిడి తో సంగమించి చలిమిడి రూపుదాల్చేయి .అప్పటికి పేపరులో చుట్టి పెట్టినా జరగవలసిన నష్ఠం జరిగి పోయింది . ఎనిమిది వేల రూపాయల చీర గోవిందా గోవింద .

శుభ్రమైన పండు పెట్టలేని వారు యీ నోములు పట్టడం ఎందుకో అర్ధం కాదు . మాగిపోయి ముద్దముద్దగా అయిపోయిన పండు పెట్టక పోతేనే నయమేమో కదా ?   పూజ గొద్దీ పురుషుడు , దానంగొద్దీ  బిడ్డలు అంటారు . మరి మాగిపోయిన పళ్లు దానం చేస్తే యెలాంటి పిల్లలు పుడతారు . అలా అనుకుంటే కళ్ల  ముందు అమాయక స్పెషల్ చిల్ద్రెన్ కనిపించి వులిక్కి  పడింది . అలాంటి పిల్లలు ఆ తల్లి చేసిన దానం ఫలమా ? సైన్స్ యీ వాదనని వొప్పుకోదు , సుమనకి యెందుకో సైన్స్ నే నమ్మాలని అనిపించింది .

పై జన్మలో చేసుకోబోయే భర్త కోసం , పైజన్మలో పనసపండంటి పాపడి కోసం యీ పూజలు . పూజలు నోముల పేరుతో చేసే ఖర్చు అవుసరమా? ఆ డబ్బు యే అనాధాశ్రమానికి యిస్తే యిలలో నే తృప్తి కలుగుతుందికదా . యివన్నీ మనసులో అనుకోవలసినవేగాని బయటికి అంటే యింకేవన్నా వుందా ?

పనస పండు అనుకోగానే నాలుగైదు యేళ్ళ కిందట జరిగిన సంఘటన గుర్తొచ్చి పెదవుల మీదికి సన్నని నవ్వు పాకింది .

విషయం తెలుసుకోవాలంటే నాలుగేళ్ల వెనక్కి వెళ్లక తప్పదు .

నాలుగైదేళ్ళ కిందట తోటికోడలు , మరిది గృప్రవేశం చేసుకుంటూ వుంటే వెళ్ళింది సుమన . ముందురోజు గృహప్రవేశం బాగా జరిగింది . సాయంత్రం పెద్ద ట్రక్కులోంచి దిగేయి అయిదు అడుగుల పనస పళ్లు . దిగేయి అనే బదులు దొర్లించ బడ్డాయి అంటే సరిపోతుందేమో ?      నలుగురు కలిసి ఒకపండు ని కదల్చ  లేకపొయేరు . సో మర్నాడు పూజ కాలువ పక్క జరుపుకున్నారు . తోటికోడలు ఆమె అక్కలు మరెవరో యిద్దరు మొత్తం అయిదుగురు పనస కాయల చుట్టూ కూర్చొని పూజ చేసుకొని మళ్ళా జన్మ లో యీ పళ్ల లాంటి పాపాయిలు కలగాలని కోరుకొని ఒకరి తరవాత ఒకరుగా అయిదుగురూ అవే పళ్ళని దానం చేసుకున్నారు . పళ్లు చూస్తే వదల బుద్ది కావడం లేదు . అలాగని మోసేవాళ్ళు లేరు , మోసేవాళ్ళు యెలాగో దొరికినా పనస పండుని కొసే వాళ్ళూ లేరు . పక్కింటి పిన్నిగారు మా ఆయనకి పండు కొయ్యడం వచ్చండి , నేనో పండు తీసుకొనా ? సగం తొనలు మీకు పంపుతా అంది . అడిగిందే తడవుగా సరే అంది తోటికోడలు . పక్కింటి పిన్నిగారి ముగుడు , భీముడు లాంటి వారి అబ్బాయి వచ్చి యేపండు కొస్తే మంచి తొనలు వస్తాయో  వారికి తెలిసిన పరిజ్ఞానాన్ని వుపయోగించాలని పళ్ళని కదిపితే తెలిసింది , ఒకటి కన్నా ఎక్కువ చోట్ల పంది  కొక్కులు కొరికి పళ్లని రుచి చూసినట్లు . మొత్తం పదహారు దానం పళ్ళు , రెండు నైవేద్యం పళ్ళు . పంది కొక్కులు తక్కువ రుచి చూసిన వో పండుని అవలీలగా భుజానికెత్తుకొని వెళ్లపోయేడు భీముడు .

పళ్ళని చూసిన ఆ అయిదుగురి మొహాలు తెల్లగా పాలిపోయేయి . అందరికీ వారు పూజప్పుడు కోరుకున్న కోరిక గుర్తొచ్చిందేమో ?  రాత్రి తొమ్మిదింటికి భీముడు యిన్నే తొనలు తియ్యగలిగేరు నాన్న రేపు మిగతావి తీస్తారుట . అని యాభైయ్యో అరవైయ్యో తొనలున్న వో పోలితిన్ సంచీ యిచ్చి పోయేడు . ఒక్క తొన కుడా చిటికెన వేలు కంటే పెద్దది లేదు . అందరి మనసులలో వొకే  ప్రశ్న , అదే అంత పెద్ద పండులో యింత చిన్న తోనలా  అని ?

సైజు దేముందిలే రుచి ముఖ్యం గాని అని సరిపెట్టుకొని తొనలు నోట్లో పెట్టుకున్నారు . ఆముదం తాగిన మొహం కొందరి దైతే , అశుద్ధం చూసిన మొహం కొందరిది అయింది . గొంతులో వేసుకున్నదాన్ని బయటికి తీయలేక అలాగని మింగలేక నానా అవస్థలు పడ్డారు . పనస పండు కధ అంతటి తో ముగియలేదు . మర్నాడు మునిసిపాలిటీ వాళ్లు పనసపళ్ళు రోడ్డు మీద వుంచి నందుకు ఫైను , వాటిని అక్కడ నుంచి తొలగించడానికి ఫీజు తీసుకొని వెళ్ళేరు . పక్కింటి పిన్నిగారు యెవరికో ఇల్లు కడుక్కుంటూ యిటు ఏడు తరాలకి , అటు యేడు తరాలకి నైన్ శర్మనీస్ పెడుతోంది  .  ఎవరా అదృష్ఠవంతులు అనుకుంటే తెలిసీ తెలీనట్టుగా , బోధపడీ బోధపడకుండా వుంది . సరిగ్గా వో అరగంట పక్కింటి పిన్నిగారి తిట్లు విన్న తరవాత అర్ధమైంది . అవన్నీ పనసపండు యిచ్చిన మా తోటికోడలికేనని . విషయం ఆరా తీస్తే  తెలిసింది  నిన్నటి పనస పండు కుళ్ళి అందులోంచి వచ్చిన కంపు నీటితో  ఇల్లంతా గబ్బు అయిందని దాన్ని తీసుకు పోవడానికి చెత్తలు ఎత్తేవాడికి యాభై రూపాయలు యివ్వవలసి వచ్చిందని . ఆ యాభై రూపాయలు తోటికోడలు సమర్పించు కుంటేనే గాని పిన్నిగారి తిట్ల ప్రవాహం ఆగలేదు .

యీ విషయం యెప్పుడు గుర్తొచ్చినా సుమన పెదవులు విచ్చుకోక మానవు  , యిప్పుడూ అంతే . నయం ఎవరు పెట్టేరో గాని శూన్యమాసాలని అప్పుడు కాస్త ఉపిరి పీల్చుకొవచ్చు .

సుమన ఏదో జ్ఞాపకం వచ్చినట్లుగా " శిరీషా కార్తీక మాసం తో యీ నోములు పూజలు అయిపోతాయిగా  " ఆశగా అంది .

" లేదత్తయ్యా , మార్గశిర లక్ష్మి వారాలు , భోగిపళ్లు , సంక్రాంతి , రధసప్తమి అన్నీ సాంప్రదాయంగా జరుపుకుంటారు మీరే చూస్తారుగా " .   హత విధీ , విధి హెంత బలీయమైనది , అమెరికా అయితే నోములు , వాయనాలు వుండవని కదూ యీ సమయాన్ని యెంచుకుంది .
సాంప్రదాయం మన్నూ మశానం అంటూ అర్ధం పర్ధం లేని ఆచారాల్ని తరతరాలుగా పెంచి పోషిస్తున్నది ఎవరు ?..... ఎవరు?..... ఎవరు ........

ఎక్కడి నుంచో పీల గొంతు  " మనమే " అంది .

మనమేనా ? అనుకొంది సుమన .

మనం పెట్టుకొన్న ఆచారాలను మనం మార్చుకోలేమా ? ఎందుకు మార్చుకోలేం , మార్చుకోవాలి కుడా  .... , మార్పు  రావాలి .

ఆ మార్పుని యెలా తేగలం అని ప్రశ్నించుకుంటే తట్టిన సమాధానం వస్తుందో రాదో తెలీని పుణ్యం కోసమే అయితే పళ్లు , బట్టలు అనాధాశ్రమాలలోనో , వృధ్దాశ్రమాలలోనో పంచినా వస్తుందిగా ? ...... ,

దానం పాత్ర యెరిగి చెయ్యమన్నారు , కడుపు నిండిన వాడికి పెట్టిన పంచభక్ష్య పరమాన్నాలకన్నా ఆకలితో వున్న వాడికి పెట్టే పట్టెడన్నం గొప్ప . అలాగే మనం యిచ్చే చీరలు లాంటివి  కూడా ........

మన దేశమైనా , సంపన్న దేశాన్ని భుజాలు చరుచుకుంటున్న విదేశాలైనా పేదలు , త్యజించబడ్డ వృధ్దులు వుంటూనే వుంటారు వారికోసం ఒక్కరోజు కేటాయించి ఒక్క చిరునవ్వు వారి పెదవులపై తేగలిగితే వచ్చే తృప్తి కన్నా మనిషి జన్మకు యేం కావాలి .

సుమన తనలో కలిగిన ఆలోచనలని కొడుకు  కోడలితో చర్చంచి కార్యరూపంలోకి తేవాలని నిశ్చయించుకుంది .

మరిన్ని కథలు