Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
vegamu

ఈ సంచికలో >> కథలు >> ఏది బాధ్యత ?

edi baadhyata

“నీవు ఈ జవాబు చేబుతావని అనుకోలేదమ్మా” ఫోనులో కూడా కూతురు శాంతి గొంతులో కోపం తెలుస్తూంది పార్వతికి 

“నీవు పోయిన వారం విషయం చెప్పినప్పటి నుండీ ఆలోచిస్తూనే వున్నాను శాంతీ, పరిస్థితులు ఇలా వచ్చాయి కదా”

“అంటే నీకు ఏది ముఖ్యమో తెలుస్తూంది”

“అలా అనకు శాంతీ, ఇప్పటికే నీ కానుపులకు రెండు సార్లు అమెరికా రాలేదా?”

“ఇప్పుడు కూడా అలాంటి బాధ్యతే అనుకోవచ్చు కదా”

“నిజమే...బాధ్యత అని నీవు గుర్తు చేస్తే ఇక్కడ కూడా నా బాధ్యత వుందమ్మా...నీకు తెలియదు నాన్నమ్మ ఎంత చేసిందో”

“సరేలే నీతో వాదించే వోపిక నాకు లేదు. అమెరికా రమ్మంటే రాననే దానివి నీవే” అని టప్పుమని ఫోనుపెట్టేసింది శాంతి. నిట్టూరుస్తూ ఫోను గొంతు నొక్కి వెనుదిరిగింది పార్వతి ఇంతసేపూ ఫోను సంభాషణ వింటూ వున్న రామా రావు 

“ఇంకోసారి ఆలోచించు పార్వతీ...నేను వుంటాను కదా ఇక్కడ అమ్మ దగ్గర” 

“మీరు వున్నా కొన్ని చేయలేరు” భర్తతో అంది.

“పనిమనిషిని పెడదాం దానిదేముంది?”

“అదే వద్దనుకున్నానండీ ..” అంటూ అత్తగారి రూములోకి నడిచింది పార్వతి.  మంచం మీద ముడుచుకుని పడుకున్న అత్తగారు సుందరమ్మ సన్నటి స్వరం తో 

“ఎవరు పార్వతీ ఫోను?” అంది.

“శాంతి చేసింది అమ్మా”

“ఏమిటి బాగున్నారు కదా”

“బాగున్నారు..వూరికే చేసింది. మీకు హార్లిక్స్ కలుపుకు వస్తాను” అని అక్కడ నుండీ కదిలింది. సుందరమ్మకు ఎనబైయ్యేళ్ళు. పదిహేను  రోజుల క్రితం బాత్రూం లో కాలుజారి పడింది.

ఎక్సరే తీస్తే పాదం దగ్గర ఎముక కొద్దిగా విరిగిందనీ ఈ వయసులో ఆపరేషను చెయ్యడం కన్నా కట్టు కడితే ఎముక అతుక్కొ వచ్చనీ డాక్టర్లు చెప్పడంతో కట్టు కట్టించారు. కాలు కింద పెట్టకూడదని చెప్పడంతో అన్నీ మంచం మీదే అమరుస్తోంది పార్వతి.

ఇలా చేయించుకోవాల్సి వస్తోందని సుందరమ్మ వాపోయినా, అత్తగారికి ఎంత చేసినా ఋణం తీరదన్న భావనతో ఇష్టంగా చేస్తూంది పార్వతి. అన్నం కూడా మిక్సీ పట్టి జావలాగా చేసి స్పూనుతో తినిపిస్తుంది. వొళ్ళంతా వేడి నీళ్ళబట్టతో తుడిచి బట్టలు మారుస్తుంది రోజూ..రోజుకు రెండు సార్లు పక్కకు తిప్పుతూ బెడ్ సోర్స్ రాకుండా చూస్తుంది..బెడ్ పాన్ పెట్టి అవసరాలను తీరుస్తుంది.

మధ్యాహ్నం కాఫీ ఇద్దామని వస్తే సుందరమ్మ బాగా నిద్ర పోతున్నట్టు వుంటే అక్కడే కుర్చీలో కూర్చుంది పార్వతి. ప్రశాంతంగా నిద్ర పోతూ వున్న అత్తగారిని చూస్తూ వుంటే ‘ఇది నీ బాధ్యత కాదా’ అన్న శాంతి మాటలు గుర్తుకు వచ్చాయి.

జీవితంలో ‘బాద్యత’ అన్నది నేర్పిన మనిషే సుందరమ్మ! 

ఎన్ని సంఘటనలు జ్ఞాపకం చేసుకోగలదు?

చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన తనకు ఈ ఇంటికి కోడలుగా వచ్చాక అమ్మ ప్రేమను పంచిన తీరు మరవగలదా?

శాంతి పుట్టినప్పుడు కానుపు కష్టమైనప్పుడు ఆమె తనకు సహకరించిన విధానం,

భర్త రామారావు కు రెండేళ్లు ఉద్యోగం పోయి అవస్థ పడ్డప్పుడు అన్నిటికీ తానై ఆదుకున్నదెవరు?

శాంతి ఇంజనీరింగు  ఫీజు కట్టడం కోసం  కష్టపడుతూ వుంటే అత్తగారే వూర్లో ఉన్న ఇంటిని అమ్ముదామని ఒత్తిడి చేసి 

‘పిల్ల చదువు ముఖ్యం’ అన్నప్పుడు ఆమె పాదాలు తాకిన  తనను ఆప్యాయంగా కౌగలించుకుని 

“పిల్లలు బాగుపడాలి పార్వతీ “ అని పిల్లల పట్ల తన బాధ్యతను గుర్తు చేసిన మనిషి తను.

శాంతి చదువు అవగానే మంచి ఉద్యోగం సంపాదించుకున్న తరువాత కోరి పెళ్లి చేసుకుని అమెరికా తీసుకెళ్ళిన అల్లుడిని చూసి అమితంగా ఆనంద పడింది ఆమే!

అంతెందుకు శాంతి రెండు కానుపులకీ “మీరు వెళ్ళిరండి..నాకేమీ పరవాలేదు “అని చెప్పి మరీ అమెరికాకి పంపిన అత్త్తగారు ఎంతమందికి దొరుకుతారు?

ప్రతి విషయం లోనూ బాధ్యత గా నిర్వర్తించిన అత్తగారు నడవలేక పడక మీద వున్నప్పుడు బాధ్యత పేరుతొ తను శాంతి దగ్గరికి వెళ్ళగలదా? 

ఆలోచిస్తే ఆమె కాలు బాగయినా ‘ఈ వయసులో ఒంటరిగా ఒదిలే ప్రసక్తే లేదు’ అనుకుంది గట్టిగా పార్వతి.

అయితే కొద్ది రోజులుగా ఎడతెగని బ్లీడింగు జరిగి గైనకాలజిస్టు ని సంప్రదించిన శాంతి, ఆమె సలహాతో కొద్దిరోజులు మేడిసిన్స్  వాడినా కంట్రోల్ కాక పోవడం తో గర్బసంచి తీసి వేయడం మంచిదని నిర్ణయానికి రావడం జరిగింది. పాప స్కూలుకి వెళ్ళినా, బాబు చిన్నవాడు కాబట్టి అమ్మ తోడుగా వుంటే ఒక నెల లోగా ఆపరేషను చేయించు కోవచ్చునని ఆశ పడింది. ఇది తెలిసాక పార్వతి మనసు చాలా ఆందోళన చెందింది. ఒక వైపు కూతురు, మరోవైపు మంచం లో వున్న అత్తగారు...ఎవరిని వదులుకో గలదు? 

ఆలోచిస్తే శాంతి కంటే అత్తగారికే తన అవసరం ఎక్కువ అని నిర్ణయానికి వచ్చి శాంతి తో చెబితే కోపగించుకుంది...తన నిర్ణయం తప్పా???? అమెరికా రమ్మంటే అన్నీ వదలుకుని వెళ్ళిపోదామని అనుకుంటారా??  

ఎడతెగని ఆలోచనలు.....

సుందరమ్మ కదలటం తో లేచి దుప్పటీ సరిచేసింది.

సాయంకాలం మళ్ళీ ఫోను చేసింది శాంతి.

“అమ్మా ఒకసారి నాన్నమ్మతో మాట్లాడతా...”అంది.

ఫోను తీసుకుని రూము లోకి వెళ్లి సుందరమ్మ చేతిలో ఫోను పెడుతూ

“శాంతి మాట్లడుతుందిట”అంటూన్న పార్వతి ని చూస్తూ ఫోనులో మాట్లాడసాగింది సుందరమ్మ.

“శాంతీ ఎలా వున్నావురా? అల్లుడుగారు బాగున్నారా? పాప స్కూల్ కి వెడుతోందా? బాబు నడుస్తున్నాడా?” ప్రశ్నల వర్షం కురిపించింది సుందరమ్మ.

“అందరూ బాగున్నాము నాన్నమ్మా..నీ ఆరోగ్యం ఎలా వుంది?”

“పరవాలేదు శాంతీ బాగానే వున్నాను. నాకు అన్నీ చేసిపెట్టడానికి మీ అమ్మ వుందిగా..నడవకూడదు అన్నారు కదా బాత్రూం కి పోలేను. బెడ్ మీద వుండటం నరకం...చేసే వాళ్ళు వున్నారని అంటారు కానీ చేయించుకోవడం ఇంకా నరకం..దేవుడు నన్ను తీసుకెళ్ళడానికి ఎందుకింత ఆలస్యం చేస్తున్నాడో..”

“అలా అనకు నాన్నమ్మా “

“నా సంగతి ఇంతేలే కానీ నీవేట్లా వున్నావు?”

“అమ్మ ఏమీ చెప్పలేదా?”

“ఏమయిందే? నాకు తెలియదే?”

“ఒక ఆపరేషను చేయించుకోవాలి నాన్నమ్మా... నీకు బాగాలేకపోయింది కదా అమ్మకు రావడానికి కుదరదేమో..”

“అయ్యో ఏమి ఆపరేషను తల్లీ... మీ అమ్మను పంపుతాలే..నాకు మీ నాన్న తోడు వుంటాడు.”

“నీవు ఇట్లా వుంటే అమ్మ రాదులే నాన్నమ్మా...పరవాలేదు”

“అట్లా అనకే నేను మీ అమ్మను ఒప్పిస్తాను. రేపో మాపో పోయేదాన్ని నాకోసం వుండక్కరలా..నీకే అవసరం అమ్మ తోటి...” ఆత్రుతగా అంది సుందరమ్మ 

“అది కుదరదులే నాన్నమ్మా..నీ ఆరోగ్యం జాగ్రత్త” అని ఫోను పెట్టేసింది శాంతి.

“పార్వతీ..పార్వతీ..” కొంచెం గట్టిగానే పిలిచింది సుందరమ్మ.

“ఏమ్మా...అంత  గట్టిగా అరవద్దు..ఆయాసం వస్తుంది”

“శాంతికి ఆపరేషను అని నాకు ఎందుకు చెప్పలేదు?” నిలదీసింది.

“చెబితే మీరు అదే యోచన చేస్తారని చెప్పలేదు. పర్వాలేదు అల్లుడు రవి మానేజ్ చేస్తాడు.”

“అదేమిటే అట్లా అంటావు? మన బిడ్డకి అవసరం వచ్చినప్పుడు ఆదుకోవాలి కదా. నన్ను రాము చూసుకుంటాడు లే. నీవు వెళ్ళు.” ఖచ్చితంగా అంది సుందరమ్మ.

“అమ్మా మీరు ఇప్పుడున్న పరిస్థితి లో ఆయన చెయ్యలేరు. నేను ఎక్కడికీ పోను.”

“మొండితనం  చెయ్యకు పార్వతీ, పిల్లలకు సాయపడటం మన బాధ్యత”

“అమ్మా మీరు మాకు ఎన్ని చెయ్యలేదు? ఇప్పుడు మంచాన వున్న మిమ్మల్ని వదలిపోనా??”

“నేను చేసాను అంటే అది ‘బాధ్యత’ పార్వతీ..” అంటూన్న ఆమె మాటలను మధ్యలోనే తుంచేస్తూ

“మీరు మాకోసం ‘బాధ్యత’ అంటూ చాలా చేసారు అమ్మా...మీ పట్ల నా బాధ్యత తీర్చుకోనివ్వండి.” 

“నిండు  నూరేళ్ళూ జీవించాల్సిన నీ కూతురికి సహాయపడటం బాధ్యతా?? కాటికి కాచుకున్న నా దగ్గర సేవ చెయ్యడం బాధ్యతా?? నీవు ఇంకేమీ మాట్లాడకు” ఆయాసం వచ్చింది సుందరమ్మకు. దగ్గరగా వచ్చి చాతీ నిమురుతూ కూర్చుంది పార్వతి.

అత్తగారి ఆలోచన ఇలా సాగుతుందనే శాంతి సంగతి తెలియ నివ్వలేదు ఇన్ని రోజులూ.

“అమ్మ మీరు బొంచేసి పడుకోండి తరువాత మాట్లాడదాము.” అంటూ వంటింట్లోకి వెళ్ళింది పార్వతి. వంటింట్లో పని పూర్తీ అయ్యాక బోజనాలు తతంగం తరువాత అత్తగారికి టాబ్లెట్స్ ఇవ్వాలని వస్తే 

“పార్వతీ, బీరువాలో పెట్టమని ఇచ్చిన సంచీ లో ఒక చిన్న డబ్బీ వుంటుంది చూస్తావా?”

ఎప్పుడో ‘ఇది దాచు’ అని  సుందరమ్మ ఇచ్చిన చిన్న సంచీ బీరువాలో పెట్టిన సంగతి గుర్తుకు వచ్చింది.

“ఇంతపోద్దులో దేనికి? పడుకోండి..రేపు చూస్తాలే” అంటూ టాబ్లెట్స్  ఇచ్చింది.

“లేదు నీకొక సంగతి చెప్పాలి...తీసుకురా” అంది. ఇక చెప్పినా వినదని బీరువాలోని సంచీ తెచ్చింది. దానిలో ఉన్న చిన్న డబ్బీబయటకు తీసి అత్తగారి చేతిలో పెట్టింది. దాన్ని తెరిచి అందులో వున్న చిన్న బంగారు ఉంగరం తీసి పార్వతి చేతిలో పెడుతూ 

“ఇది రాము పుట్టినప్పుడు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఉంగరం. దీన్ని శాంతి కొడుక్కు ఇవ్వాలి పార్వతీ ఇక్కడకు వచ్చినప్పుడు నేనే ఇద్దామని అనుకున్నా అందుకే నీవు అమెరికా వెళ్ళినప్పుడు ఇవ్వలేదు”

“ఈసారి శాంతి ఇక్కడకు వచ్చినప్పుడు ఇద్దాం లే అమ్మా, మీరే ఇద్దురు గానీ...”

“అన్ని రోజులు  నేను వుంటానా?అని అనుమానంగా వుంది. అందుకే నా కెందుకో నీవు ఈ సారి తీసుకెడితే బాగుంటుందని పిస్తుంది.”

“మీరు ఎన్నైనా చెప్పండి అమ్మా,  ఇప్పుడు నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను అంతే” అంది ఖచ్చితంగా .

“మొండి కేయ్యద్డు పార్వతీ”

“మీరే ఈ ఉంగరం లింకు పెట్టి నన్ను తరిమేయ్యాలని చూస్తున్నారు..” అంటూ ఆ డబ్బీని సుందరమ్మ దిండుకింద పెడుతూ “ఇక్కడే వుండనివ్వండి రేపు తీసి పెడతా మీరు ఎక్కువ ఆలోచించకుండా పడుకోండి “అని దుప్పటి కప్పింది.

పార్వతి వైపు నిస్సహాయంగా చూస్తూ కళ్ళు మూసుకుంది సుందరమ్మ. పడుకో బోయే ముందు  రామా రావు తో చెప్పింది పార్వతి
“అమ్మను చూసుకోవడమే నా ప్రస్తుత  బాధ్యత...మీరు అర్థం చేసుకోండి.”అని.

కూతురు ఒక పక్క, అత్తగారు ఒక పక్క ప్రశ్నిస్తూ వున్నట్టే అనిపించి కలత నిదురతో నే రాత్రి గడిచింది పార్వతికి 

తెల్లారింది. అత్తగారికి కాఫీ తీసుకుని సుందరమ్మ రూములోకి వచ్చి“లేస్తారా..” అంటూ సుందరమ్మ భుజం మీద చేయ్యేసింది. కదలకుండా వుందనిపించి చేయ్యిపట్టుకుంది. చల్లగా అనిపించేసరికి ముఖం తనవైపుకు తిప్పి  “అమ్మా అమ్మా”అంటూ గట్టిగా పిలిచింది. ఆ శబ్దానికి రామారావు లేచి వచ్చాడు.

“అమ్మను చూడండి ఒకసారి ..” అంది గాబరాగా..

రామారావు సుందరమ్మ చెయ్యి పట్టుకుని నాడి  చూసి “నాడి ఆడడంలేదు పార్వతీ”అన్నాడు చెయ్యి దించుతూ.  అప్పుడు సుందరమ్మ చేతి నుండీ కిందపడింది ‘డబ్బీ’.. చిన్న శబ్దం చేస్తూ. దాన్ని చూడగానే ఏడుపు వచ్చింది పార్వతి కి అత్తగారు ఎంత కృతనిశ్చయం చేసుకుని వెళ్లి పోయారో తెలిసి వచ్చింది.. అరమోడ్పు గా వున్న సుందరమ్మ కళ్ళని మూస్తూ ఆమె తలని చాతీ కి ఆనించుకుంటూంటే పార్వతి మీద ఒదిగిపోయి ‘నీ బాధ్యత నిర్వర్తించు పార్వతీ నేను అడ్డు రాను’ అంటూ వున్నట్టే అనిపించింది పార్వతికి.

మరిన్ని కథలు