Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
jagame maya

ఈ సంచికలో >> కథలు >> మాటరాని మౌనమిది

matarani mounamidi

ఆ గది లో మౌనం రాజ్యమేలుతోంది , వున్న నలుగురి మనసులలో వేరు వేరు ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి .

అయితే యెవరు ముందు మొదలు పెట్టాలో అర్ధం కాక ఒకరివైపు ఒకరు చూసుకోసాగేరు .

యింటికి పెద్దని కాబట్టి నాదే మొదటి ఛాన్సు అన్నట్లు  కోపంగా మొదలుబెట్టబోయిన రావుగారు " తాతగారు యిది నా సమస్య , యిందులో మీ జోక్యం సహించను " అన్న సుమ మాటలతో మళ్లా ఆ గదిలో మౌనమే చోటుచేసుకుంది .

" చచ్చేకాలానికి మాకెందుకీ రొష్టు , ఓ టిక్కెట్టుముక్క పారేస్తే యే కాశీయో రామేశ్వరమో పోతాం " పైట చెంగుతో కళొత్తుకుంటూ మెల్లగా అంది యెనభైయేళ్ల శారదమ్మ .

"  నానమ్మా పిచ్చి మాటలొద్దు , నాకు మీ అందరి అంగీకారం కావాలి " .

" చాక్లెట్టా అడగగానే యిచ్చెయ్యడానికి , పరువు ప్రతిష్ట , గౌరవం .... " ప్రకాష్ మధ్యలోనే అడ్డుకుంది సుమ .

" అవి మనకి కూడు పెట్టవు కదా నాన్నా "

" జాతి సంకరం చేస్తే పిండివంటలతో కూడు దొరుకుతుందా ? యెంత సౌమ్యంగా అందామనుకున్నా దాగని కోపం ప్రకాష్ గొంతులో .

" సుమతల్లీ మామాట వినమ్మా , మాకు తలవంపులు తెచ్చే పని చెయ్యకు తల్లీ , యేడాది లోపల మంచి సంబంధం తెచ్చి ఆకాశమంత పందిరి భూదేవంత పీట వేసి నీ పెళ్ళి చేస్తాం తల్లీ , ఆ కులం గోత్రం లేని పెళ్ళి చేసుకోకు తల్లీ " అన్నాడు ప్రకాష్ .

" నా గతం అంతా మరిచిపోయి పూర్వపు సుమని అవాలని వుంది కాని నేనెప్పుడో గీత దాటేను నాన్నా "

" యెక్కడో అమెరికాలో జరిగిన విషయం కదా మరిచి పో , యిక్కడ యెవ్వరికీ చెప్పొద్దు , కొత్త జీవితం కొత్తగా మొదలు పెడుదూగాని తల్లీ "

"  అబధ్దాల పునాది మీద నిలబెట్టిన కొత్తజీవితం యెన్నాళ్ళు నిలబడుతుంది నాన్నా " .

" నువ్వు పిచ్చి వాగుడు వాగకపోతే యెన్నాళ్ళైనా నిలబడుతుంది " అంది  నిభాయించు కోలేని మాలతి .

" సత్యమునే పలుక వలెను అని పిల్లలకి నువ్వు చెప్పే పాఠం తప్పంటావా అమ్మా "

" ఔనే నిన్ను కనడం ఒక తప్పే , పెంచి పెద్దచేసి చదువులు చెప్పించడం మరో తప్పే , మదవెక్కి యెవడితోనో పోయి సిగ్గు లేకుండా  చెప్తున్నావు చూడూ అదివిని నీకు బడిత పూజ చెయ్యకుండా వూరుకున్న నీ అమ్మా అబ్బలది అన్నిటికన్నా పెద్ద తప్పు . ముందు దాన్ని ఆ గదిలో పారేసి తలుపు తాళం వెయ్యి . తరవాత సంగతి తరవాత చూసుకుందాం " అన్న రావుగారి మాటలు విని శాంతంగా

" పాతకాలంలో వుండి పోయేవు తాతయ్యా , అసలు తప్పంతా నీది అని నేనంటే నీ సమాధానం యేమిటి " .

" భడవా నేను ఔనంటేనే వాడితో పోయావుటే , వితండవాదం కాకపోతే " .

" అసలు సమస్య నొదిలేసి యిదంతా యెందకు కానీ నా మాట విను " యెలాగైనా కూతురుని వొప్పించాలనే తాపత్రయం ప్రకాష్ ది .

" అసలు విషయమే మాట్లాడు తున్నాను నాన్నా , తోటివారితో పోటీ పడకూడదు , అబధ్దాలు ఆడకూడదు అని చిన్నప్పటి నుండి మాకు నూరిపోసి , ఆ సూక్తులని మీరు ప్రతీ రోజూ అధిగమిస్తూ వుంటే అయోమయంలో పడి వూరుకోలేక అడిగినందుకు నాకు లభించిన బహుమతి తొడపాశం . మొదటి నుంచి ఈ పోటీ నాకు పడేది కాదు . అందుకే యే పోటీ పరీక్షకి వెళ్ళేదాన్ని కాదు . సామర్ధ్యం వున్నా అరవై శాతం కన్నా యెక్కువ మార్కులు తెచ్చు కొనేదాన్ని కాదు . నాకన్నా పెద్దదయిన పెదనాన్న కూతురు రమ్య యింజనీరింగు లో చేరడం తో మీకు పెదనాన్న తో పోటీ యేర్పడింది . చిన్నప్పటి నుండి మీలో అణిగి వుండిపోయిన  ' నేను అన్నతో పోటీపడి గెలవలేకపోయానే ' అనే భావం ఈ సారి నాద్వారా గెలవాలనే పట్టుదల మీ చేత నన్ను యింజనీరింగు లో చేర్చేవరకు వూరుకోనివ్వ లేదు . అంతర్గతంగా రమ్య మీద వున్న అసూయతోనో  , అంతకు ముందే ఈ కోర్సులలో చేరిన యిరుగు పొరుగు వారి చూపులలోని తేడా ని పోగొట్టాలని అనుకున్నానో గాని నేనూ యెదురు చెప్పకుండా యింజనీరింగు పూర్తి చేసేను . అప్పటికే అమెరికా చదువులకి యెగిరిపోయింది రమ్య . మీ కూతురు కూడా అమెరికా లోచదువుకోవాలనే కోరిక మీలో తలెత్తింది . నా కొచ్చిన స్కోరు మంచి యూనివర్సిటీలో సీటు సంపాదించ లేకపోయింది .  ధూం ధాం గా అక్కకి అమెరికా వరుడి తో పెళ్లి చేసి బ్యాంకు బాలెన్సు సున్న చేసుకున్న మీరు అమెరికా చదువు వద్దంటారని యెదురుచూసిన నాకు నిరాశే మిగిలింది .  అమెరికా మోజు  మనలని ఆలోచించుకోనివ్వ లేదు . అంతర్గతంగా నేను కూడా అమెరికా జీవితం కోరుకోడం తో వివేకం కోల్పోయి ఆ మారుమూల యూనివర్సిటీకి బయలుదేరేను .

" కాలూ కడుపూ కట్టుకొని యిక్కడి రూపాయలని డాలర్లు గా మార్చి నిన్ను చదువు కోమని పంపితే ఒళ్ళు .... చేసిన వెధవ పనికి సిగ్గు పడి ఛావక మమ్మల్ని తప్పు పడతావటే " పళ్ళు కొరికేడు ప్రకాష్ .

"  ఆ యూనివర్సిటీ లో చదువు కాక వ్యభిచారం నేర్పేరుటే నీకు " కళ్ళెర్ర చేసేరు రావుగారు .

" ఎవరు యెలా అనుకున్నా నాకు సంబంధ లేదు . అక్కడ యేం జరిగింది అన్నది మీకు చెప్పే బాధ్యత నా మీద వుంది . మీరు నేర్పిన సంస్కారం , విలువలు నేను మరిచిపోలేదని , మిమ్మల్ని  చిన్న బుచ్చడానికి నేను ఈ పని చెయ్యలేదనేది మీరు నమ్మితే చాలు . మీరు వొప్పుకుంటేనే నేను రోషన్ చేత తాళి కట్టించుకుంటాను లేకపోతే జీవితాంతం యిలాగే వుండి పోతాను , ముందు నే చెప్పేది వినండి .

" నేను అక్కడకి వెళ్లింది సెప్టెంబరు ఆఖరు వారంలో . అక్కడి వాళ్లకి అది వేసవి  . హైదరాబాదులో కొన్న లాంగు కోట్లు అప్పటికి సరిపోయేయి . వేరే అపార్టుమెంటు తీసుకుంటే అద్దె యెక్కువ అవుతుందని పేయింగెస్ట్ గా చేరేను . లాండులార్డు కి మూడు నెలల అడ్వాన్సు యిచ్చి , యూనివర్సిటీ రాకపోకలకి పాతకారు కొనుక్కొనే సరికి నాదగ్గర డాలర్లు నిండుకున్నాయి . అక్కను అడిగితే వంద డాలర్లు పంపి పార్టుటైము పనేదైనా చూసుకొని చదువుకో మని సలహా యిచ్చింది . అమెరికా ఆర్థిక పరిస్థితులు తలకిందులవడంతో బావ వుద్యోగం పోగోట్టుకొని అక్క జీతంతో యిల్లు గడుపుతున్నారు వాళ్లు ,  అది మాత్రం యేంచేస్తుంది . చేతిలోంచి జారుతున్న ప్రతీడాలరూ నాలో భయాన్ని నింపుతోంది . మా మొత్తం యూనివర్సిటీ ని కిందా మీదా వేసినా పట్టుమని పది మంది భారతీయులు లేరు . యెవరితో నా భయాలు పంచు కోవాలో తెలిసేది కాదు . నెలకి సుమారుగా నాకయే ఖర్చు పదిహేను వందల డాలర్లు . మిమ్మల్ని అడగొచ్చు . నెలకి ముప్పైవేల జీతగాడు నెలకి లక్ష రూపాయలు యెక్కడనుంచి తేగలడు అనే వివేకం నన్ను అడగకుండా ఆపింది .

లోకల్ గా వుండే ప్లేస్ మెంటు యేజెన్సీ లో నా వివరాలు యిచ్చి వచ్చేను .

మూడు నెలల అడ్వాన్సు యివ్వడం వలన ఫుడ్ కి బెడ్ కి యిబ్బంది లేదు దాని తరవాత అనే దగ్గర నా ఆలోచనలు ఆగిపోయేవి . నా యిబ్బంది సీనియర్సకి చెబితే ముగ్గురు నలుగురు షేర్ చోసుకొనే అపార్టుమెంటు తీసుకుంటే తక్కువ ఖర్చు పడుతుందని  , ఆడామగా కలిసి ఒక యింట్లో కలిసి వున్నంత మాత్రాన శీలం యేం పోదని , అలా పోయేదే అయితే యిక్కడకి రాబోయే ముందు ఇండియాలో దాచుకు రావలసిందని  సలహా యిచ్చేరు , ఆ ముగ్గురు నలుగురు యేరీ ? వారిని బతిమాలి వారి జాగాలో వొక రోజు పని చేసి చిన్న చిన్న అవుసరాలు తీర్చుకోగలిగేను . అదీ నెలకి ఒకళ్ళో యిద్దరో వప్పుకొనేవారు . డబ్బు చేదు కాదుకదా యెవరికీనూ .

ఏజెన్సీ వాళ్ళు హెల్పర్ పని వుందని పిలిచేరు . హెల్పర్లు అంటే యిల్లు తుడిచి , అలకడం , బాత్రూములు కడగడం అన్నమాట . ముందు తటపటాయించినా గత్యంతరం లేక వొప్పుకున్నాను . ఖర్చులన్నీ పోగా యాభైడాలర్లు  వరకు మిగిలేవి . మనం పండుగులకి యిళ్ళు దులుపుకొని కడుక్కోమూ అక్కడా అంతే క్రిస్మస్ ముందు మాత్రమే పని వుంటుంది .

కొత్త సంవత్సరం నాకు ఆనందాన్ని తేలేదు . నాకు అర్జెంటుగా రెండువేల డాలర్లు కావాలి . మా ఓనరుకి మరో మూడునెలలకు అడ్వాన్సు కట్టాలి లేదా తట్టా బుట్టా సర్దుకోవాలి . నా గడువు ముగిసి పోయినా మరో నెల వుండనిచ్చేరు అదీ వారి కుక్కల సంరక్షణ చూసుకోవాలనే షరతు మీద , అప్పటికే బాత్రూంలు కడిగిన నాకు కుక్కల సంరక్షణ కష్టమనిపించలేదు " .

" ఇంత మంచి కుటుంబంలో పుట్టిన నువ్వు యిలాంటి పనులు చెయ్యడ మేమిటే " ఉక్రోషంతో అరిచింది మాలతి .

" ముందు చూపు లేకుండా చేసే పనులు యిలాంటి ఫలితాలనే యిస్తాయమ్మా , యీ చేతులతోనే వాటికి స్నానం చేయించేను , మాంసాహారాలూ వండేను . ఆ నిస్సహాయతని నాలో దాచుకోలేక భగవంతుడా పై జన్మలో యిలాంటి దేశం లో కుక్క గా పుట్టించు అని యెన్ని సార్లు కోరుకున్నానో ? . ఒక్క యేడాది యెలాగో అలాగ గడిపేస్తే రెండో సంవత్సరం చదువుకి వేరే యూనివర్సిటీకి ట్రాన్సఫర్ పెట్టుకోవచ్చు . సిటీ లో పార్ట్ టైము వుద్యోగావకాశాలు యెక్కువగా వుంటాయి . నాలుగు నెలలు గడవడమే కష్టంగా వుందే మిగతా ఆరు నెలల యేంచెయ్యాలి .

"  భగవంతుడా పై జన్మలో యిలాంటి దేశం లో కుక్క గా పుట్టించు " అన్న సుమ కోరిక వినగానే శ్రోతలలో ఆమె యెంతటి నిస్సహాయ స్ధితిని యెదుర్కుందో అర్ధమయింది .

" నా సమస్యని నా సీనియర్స ముందుంచి సలహా అడిగేను . అందరూ కాకపోయినా కొందరు నాలాంటి సమస్యలని యెదుర్కొనే వుంటారనే నమ్మకం నాది .

అప్పుడే తెలిసింది రోషన్ కూడా నాలాగే యిబ్బందులు పడుతున్నాడని , ఓ అమ్మాయి యిచ్చిన సలహా ప్రకారం యిద్దరం లివింగ్ రిలేషన్ షిప్ లో వున్నామని రోషన్ యింటి ఓనరుకి చెప్పి యిద్దరూ అక్కడే వుండడం . రోషన్ వుండే యిల్లు వూరికి దూరంగా వుండడం తో రోషన్ వెళిపోతే యింకొకరు అద్దెకు రారేమోనని ఓనరు కి భయం .అందుకు మరో మనిషి ఛార్జెస్ అడుగడు . ముఖ్యంగా ఒక కారు అమ్మేసి ఒకే కారుని యిద్దరూ వాడుకోవచ్చు . ఒక మనిషి ఖర్చుతో యిద్దరూ బతకొచ్చు .ఈ ప్రపోజల్ నాకు నచ్చినా నా సందేహాలు నాకున్నాయి , అందుకే రోషన్ తో మాట్లాడేక నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాను .

రెండుమూడు సార్లు అతని యింటికి వెళ్లేను మనిషి నమ్మదగ్గట్టే అనిపించేడు . అలా కనిపించకపోయినా గత్యంతరంలేదు . నా గడువు తీరగానే నా సామానులతో రోషన్ రూముకి మారిపోయేను . అతని కారు అమ్మి మా సెమిస్టర్ పరీక్షలకి కట్టవలసిన సొమ్ము సమకూర్చుకున్నాం . అతనే పార్టు టైము పనులేవో చేసి యిద్దరి అవుసరాలు తీరేంత సంపాదించేవాడు .

ఉన్న ఒక్క మంచం నా కిచ్చి అతను కార్పెట్ మీద పడుకొనేవాడు . నా గురించి అతని మనసులో యేఅభిప్రాయముందో గాని నాకు మాత్రం యిది యీ ఆరు నెలలు గడపడానికి చేసుకున్న వో వొప్పందం మాత్రమే . ఆరు నెలల తరువాత అతనెవరో నేనెవరో అంతే . ఇక్కడ కొనుక్కొని తీసుకు వెళ్ళిన చలి బట్టలు అక్కడ యేమాత్రం పనికి రావని శీతాకాలం మొదలవుతూనే అర్ధమయింది . నా చేతిలో చిల్లి గవ్వ లేదు . పళ్ళ బిగువున చలి ఆపుకొనేదాన్ని . ఓ రోజు రోషన్ రెండు స్నోకోట్లు తెచ్చేడు . వద్దనాలని వున్నా వివేకం హెచ్చరించడంతో తీసుకున్నాను . నాకు వుద్యోగం రాగానే రోషన్ దగ్గర తీసుకున్న ప్రతీ పైసా లెక్క కట్టి వడ్డీ తో సహా తీర్చెయ్యాలని నిర్ణయించుకున్నాక మనస్సు కొంత శాంతించింది .

వెంటాడి వేటాడే మృగాలు తిరిగే యీలోకంలో చెయ్యజాచితే అందేంత దూరంలో ఆడపిల్ల వున్నా పట్టనట్టుగా వుండే రోషన్ ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలుగజేసేది .

ఇంటిపనులలోనూ చదువులోనూ అడగక ముందే సహాయపడేవాడు .

ఎక్కువగా యెవరి పనులలో వారం వుండేవారం , మా మధ్య మాటలు చాలా తక్కువగా జరిగేవి . తక్కువగా జరగడం కాదు , అలా వుండేటట్లు చూసుకున్నాను అంటే సరిపోతుందేమో .

"అందుకే ఉప్పు నిప్పు ఒకచోట ఉంచకోడదనేది , దరిద్రానికి దగ్గరా వెళ్లి దరిద్రం పట్టిందని యేడ్చిందిట నీలాంటిదే , అంతగడవక పోతే తిరిగి వచ్చే లేకపోయేవ్ " శారదమ్మ అరిచేసింది .

" మీ అన్న మనుమడు సగంలో చదువాపేసి వచ్చేస్తే మీరందరూ యెన్నెన్ని మాటలన్నారో గుర్తు తెచ్చుకో నానమ్మా , యివాల్టకి కూడా వాడిని అమెరికా పంపడానికి  చేసిన అప్పులు తీర్చలేక మీ మేనల్లుడు యెన్ని అవస్థలు పడ్డాడో , చేతకాని వాడని పిల్లనివ్వడానికి యెవరూ ముందుకు రావటం లేదని , చేతకాని చవట అని నువ్వే యెన్ని సార్లు తిట్టేవో గుర్తు తెచ్చుకో "

" ఓహో అయితే యిప్పుడు  నువ్వు చేసిన పని చాలా గొప్పదని  నిన్ను నెత్తిన పెట్టుకోవాలన్న మాట బాగుందే నీ సమర్ధింపు " .

         " నిజమే నానమ్మా , మధ్యలో చదువు చంకనాకబెట్టి వచ్చెస్తే అప్పటి వరకు పెట్టిన డబ్బు వృధావే కదా ! ఒక యింట్లో వున్నంత మాత్రాన కాపురం చేసినట్లు కాదుకదా అనుకున్నాను గాని యిలా అవుతుందని కున్నానా "

      " సరే పిడకల వేట తరువాత ముందు అమలు సంగతి చెప్పు " ముందు విషయం తెలుసుకుంటే  పరిష్కారం సులువవుతుందనే తొందర ప్రకాష్ ది

     మరో యూనివర్సిటీకి మారేంతవరకు యెలోగోలా  కాలం గడపాలని నిర్ణయించుకున్నాను కాబట్టి అతని విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం చూపించలేదు . సాధ్యమైనంత వరకు అంటీముట్టనట్టు  గా గడిపేదాన్ని . మన వంశ మర్యాదల గురించి అవుసరం లేకపోయినా ప్రతీ రోజూ వినిపించేదాన్ని . అతనిని కించపరచాలని కాదు కాని యెందుకో అలా మాట్లాడాలని అనిపించేది లేకపోతే నాలో వుండే అపరాధాన్ని భావం నాతో అలా అనిపించేదో ? ఆర్ధిక యింబ్బందులు లేవుకాబట్టి రోజులు గడుస్తున్నాయి .  ఫరవాలేదు యిలాగే మరో ఆరుమాసాలు గడిపేయవచ్చు అనే నిబ్బరం పడుతున్న సమయంలో విధి కన్నెర్ర చేసింది .

       విధి అనేది వొకటి వుంటుందని దానిని తప్పించుకోడం మనవల్లకాదని నిరూపించుకున్న సంఘటన జరిగింది .

          ఫిబ్రవరి  మూడో వారంలో అనుకుంటా రెండు రోజులలో మంచు తుఫాను రాబోతోందనే హెచ్చరికతో విద్యాసంస్థలు శలవు ప్రకటించేయి . మా ఓనరు మరో రెండు రజ్జాయిలు యిచ్చి యిది కప్పుకొని దగ్గరగా హత్తుకు పడుకోమని చెప్పివెళ్ళి పోయేడు . మొదటి రోజు హీటర్స పనిచెయ్యడంతో మంచు తుఫానుని కిటికీ లోంచి చూస్తూ వేడి కాఫీ తాగుతూ యీపాటి దానికి వీళ్ళు భయపడ్డమే కాక మనని కూడా భయపెట్టేరని నవ్వుకున్నాం , మా నవ్వులకి ప్రకృతికి కన్నుకుట్టిందేమో ఆ రోజు రాత్రి విపరీతంగా మంచు కురవ సాగింది పవర్ కట్టయింది . కొవ్వొత్తి వెలిగించి తెచ్చిన ఓనరు పాలు , పళ్ళు బ్రెడ్డులతోనే గడుపు కోవాలని తిరిగి ఎలక్ట్రిసిటీ రావడానికి కనీసం పదిరోజులైనా పడుతుందని చెప్పి వెళ్ళిపోయేడు .

     ఆ రాత్రి నరకయాతన అనుభవించేం , మాకోట్లు , రజ్జాయిలు కప్పుకున్నా ఆగలేదు చలి . ఆ చలికి తట్టుకోలేని శరీరం నరనరం వణక సాగింది . ఇలా వుంటే యెంతో సేపు బతకలేమన్నది తెలిసిపోయింది . చావుని చాలా దగ్గరగా చూసేం . సాంప్రదాయాలు , కట్టు బాట్లు , కులం గోత్రం యేవీ గుర్తురాలేదు . తెలుస్తున్నదల్లా బ్రతకాలనే కోరిక . చావు ప్రతీ వాళ్లకీ వస్తుంది అన్నది తెలుసుగాని యిలాంటి చావు పగవాళ్ళకి కూడా రాకూడదు . తప్పు ...ఒప్పు ... శీలం వీటన్నిటికీ  ' నేను ' అంటూ వుంటేనే కదా అని అనిపించిన ఆ బలహీనమైన క్షణం లో అలా జరిగి పోయింది . ఆ క్షణం దాటిన తరువాత దీనికన్నా చావు మేలేమో అని చాలా సార్లు అనుకున్నా నాన్నా , నిజం నా కిష్టమైన నా కుటుంబం మీద వొట్టు  వేసి చెప్తున్నా .

      పది రోజులకి వాతావరణం బాగుపడింది .  -20c డిగ్రీలలో బతికి వుండాలంటే అంతకన్న గత్యంతరం లేదు . కాని మాలో అలజడి తగ్గలేదు . ఏదో తప్పు చేస్తున్నామన్న భావన యిద్దరిలోనూ వుంది , బతికుండాలంటే అంతకన్నా గత్యంతరం కూడా లేదు .

ఇలాంటి బ్రతుకు అవుసరమా ? అని రోజుకి యే వందసార్లో అనిపించేది .  ఎక్కువగా మౌనంగా గడపసాగేం . రోజు ఒక యుగంగా గడిచింది . ఈ లోపల నాకు సియాటల్ , రోషన్ కి షికాగో యూనివర్సిటీ లకి ట్రాన్సవర్ వచ్చేయి .

       అదే నేను కోరుకున్న ముగింపు నా కథకి , కాబట్టి చాలా సంతోషంగా టా టా బై చెప్పే సా .

     ఓ పక్క చదువు , పార్ట్ టైము వుద్యోగం తో బీజీ అయిపోయేను . పేపర్లు సబ్మిషన్ అయిపోయింది . కాంపస్ సెలక్షన్ లో మంచి వుద్యోగమే సంపాదించుకోగలిగేను . మీ దగ్గర నుంచి పెళ్లి కొడుకుల ఫొటోలు రాసాగేయి . అప్పుడు మళ్ళా అంతర్మధనం మొదలయింది . నా రహస్యాన్ని నాలలోనే దాచుకొని తలవంచుకొని తాళి కట్టించుకొని పెళ్ళి మంత్రాలని అవహేళన చేసి జీవితాంతం తలదించుకు బ్రతకాలా ?  లేక బ్రతకడం కోసం వేసిన తప్పటడుగుని దిద్దుకొని తలయెత్తుకు బ్రతకాలా ?  యేమీ తోచిన అయోమయం . అందుకే వుద్యోగంలో నిలదొక్కుకోవాలని మీ దగ్గర ఆరునెలలు సమయం అడిగేను .

      రోషన్ బాకీ అతని కి పంపేసి ఋణవిముక్తురాలనయేనని సంతోషించేను .

        ఏమిటో మనస్సు తేలిక అవడంపోయి మరింత బరువు గా మారింది .

         ఆరునెలల గడువు పూర్తయింది కాని నా ఆలోచనలు ఒక కొలిక్కి రాలేదు . నాకేమీ ప్రత్యేకంగా రోషన్ అంటే  యిష్టమూ లేదు , అయిష్టమూ లేదు . మనిషి మంచివాడే . అంతకుమించి అతని గురించి గాని అతని కుటుంబం గురించి గాని నాకేమీ తెలీదు , తెలుసుకోవాలని ప్రయత్నించలేదు .

        పెళ్లి అనే ఆలోచన నాలో వచ్చినప్పుడల్లా నాలో యేదో అలజడి మొదలయ్యేది . మొదటిసారి మీరు పంపిన వరుడి తో మాట్లాడినప్పుడు విదేశాలలో చదువుకున్న ఆడపిల్లల మీద సగటు మగపిల్లడి భావాలు యెలా వుంటాయో అర్దం అయ్యింది . చదవుకున్నా మగపిల్లల మనఃస్తత్వం మారలేదని తెలుసుకున్నాను . నా పొరపాటున కప్పిపుచ్చుకొని తాళి కట్టించుకోవాలి లేదా జీవితాంతం నాలోని అపరాధానా  భావాన్ని మోస్తూ జీవించాలి .

       మొదటిది నాకు సమ్మతం కాదు . ఎటూ నిర్ణయించుకోలేని స్తితిలో రోషన్ నుంచి వచ్చిన  చిన్న ఇ- మెయిల్ తెచ్చిన సందేశం నన్ను యీ నిర్ణయం వైపు నడిపించింది . దాని ప్రకారం రోషన్ కూడా నాలాగే అయోమయంలో వున్నాడని , యెవరో ముక్కు మొహం తెలీని వాళ్లతో జీవితం పంచుకొనే బదులు శరీరాలు కలసిన మనం ఒకటైతే కనీసం మిగతా జీవితం అపరాధ భావం నుంచి తప్పించుకున్న వాళ్లమౌతాం కదా అన్నది సారాంశం .

          సుమారు పద్ధెనిమిది నెలలు గిల్టీనెస్ ని మోసిన మనస్సు అలసిపోయింది . అందులోంచి బయటపడతాను అనే ఆలోచనే నాకు యెంతో రిలీఫ్ నిచ్చింది . రోషన్ తెచ్చిన ప్రతిపాదన తరువాత అతని గురించి ఆలోచించడం మొదలుపెట్టేను . నేను భర్త యెలా వుండాలనుకున్నానో చాలా మటికి

అలానే వున్నాడు . నా కుటుంబ సభ్యులని ఏక్సెప్ట్ చెయ్యడానికి అతనికి లేని అభ్యంతరం నాకెందుకుండాలి . మీరు చూసిన సంబంధ మైనా వాళ్ల గురించి నాకెంత తెలుస్తుంది , రోషన్ గురించి నాకు అంతకన్నా యెక్కువే తెలుసు .

        మన చుట్టాలు  నన్ను రోషన్ని ఆదరించాలని  నేను ఆశించటం లేదు . పచ్చని పందిట్లో వేదమంత్రాలమధ్య నన్ను గన్న తల్లి తండ్రులు కన్యాదానం చేస్తే నా వైవాహిక జీవితం చల్లగా సాగుతుందని నా నమ్మకం . మీరు కాదంటే రోషన్ తో కాపురం పెట్టెస్తానని అనుకోవద్దు , కని పాతికేళ్లు పెంచిన మీ మమకారం కావాలినాకు , కొన్ని రోజుల సాహవాసం కాదు . మీ నిర్ణయమే నా నిర్ణయం " . ధారాపాతంగా కారుతున్న కన్నీటిని రుమాలులో దాచే ప్రయత్నం చేసింది సుమ .

      ఇన్నాళ్లుగా  దాచుకున్న బరువు బయటపడడం తో యెంతో తేలికైంది సుమ మనసు .తలపైన పడ్డ నాలుగు చేతులు మౌనంగా తమ అంగీకారాన్ని అందజేసేయి . మాలతి చేతులు మౌనంగా సుమ కన్నీటిని తుడి చేయి .

మరిన్ని కథలు