Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> అతి సర్వత్రా వర్జయేత్

ati sarvatraa varjayeth

లల్లీ ,లల్లీ ,అని మధు పిలవగానే, ఇల్లు ఊడ్చి అప్పుడే బయటికి వెళ్లబోతున్న పనమ్మాయి రమణి,ఓ క్షణం ఆగి , అయ్యగారూ,అమ్మగారు ఎదురింటికి వెళ్లారు.చెప్పి చీపురు ఓ మూల పెట్టి ఆమె వెళ్లిపోయింది.

దాంతో మధు,శూన్యంలోతుల్లోకి చూస్తూ ,లలిత ఈ మధ్య బాగా డల్ అయిపోయింది.ఎప్పుడూ పరమ పరధ్యానంగా ఉంటోంది.అసలు మా ఆవిడ ఇలా తయారవుతుందని నేనెప్పుడూ అనుకోలేదు.అదీ కేవలం ఓ కుక్కపిల్లకోసం ఇంతలా మనసుని ముంతలా పగల కొట్టుకుంటుందని  ఊహించలేకపోయాను.మా పెళ్ళికి వాళ్ళ పిన్ని  ఓ ఫారన్ బ్రీడ్  పామేరియన్ కుక్కపిల్లని  ఇచ్చి వెళ్లింది.మా ఆవిడ దానికి జిమ్మీ అని పేరు పెట్టింది.అలా అది అప్పటినుండీ, అంటే గత మూడేళ్లుగా అది మాతోనే ముడేసుకుంది.పిల్లా పిచుకా లేరేమో,మరీ జిమ్మీ దానికి తుమ్మ జిగురులా దగ్గరైంది.కానీ ఓ పక్షం రోజుల క్రితం వరకూ  మా ఇంట్లో తెగ కలియ తిరిగేదల్లా, హఠాత్తుగా మాయమై తగలడింది. అప్పటినుండి నా బతుకు చిరిగిన తలగడైంది.

కుక్కపోతే ఆమె బాధపడాలి కానీ నాకెందుకీ ఉక్కపోత అంటే ,దానిపై ప్రేమతో లలిత నన్ను చెడుగుడాడేస్తోంది మరి.ఎలా అంటే ,ఉదాహరణకి, పోయిన ఆదివారం నాడు నేను ఆబగా చికెన్ లెగ్ పీస్ ఎంతో ఆత్రంగా తింటున్నాను.నా వైపే కొద్ది సేపు ధీర్ఘంగా చూసి,జిమ్మీ కూడా మీలానే చికెన్ లెగ్ పీస్ ఎంతో ఆత్రంగా తినేది సుమా అని ఆమె అనగానే, నాకు ఆకలి చచ్చి తనని రోకలితో కొట్టాలన్నంత కచ్చి వచ్చింది.కానీ ఏదో జిమ్మీ పోయిన బాధలో ఉండి అందిలే అని సరిపెట్టుకున్నాను.కానీ తర్వాత తన ముందు చికెన్ మనస్ఫూర్తిగా తినలేకపోయేవాడ్ని.ఆ తర్వాత అది ముదిరి ,నేను అరిస్తే అచ్చం జిమ్మీలానే అరుస్తున్నానని ,ముద్దు పెట్టుకుంటే ,జిమ్మీ నాకినట్టుందనీ,తన బుజం మీదో, ఒళ్ళోనో తల పెట్టుకుంటే ,అచ్చం జిమ్మీ కూడా ఇంతే అని నా మూడ్ని మ్యూట్ చేసేసేది.ఇంకా చెబితే  పరువు చేటు.బెడ్రూం లో, నిద్రలో నేను పొరపాట్న చేయ్యో,కాలో వేస్తే, జిమ్మీ పో అవతలికి పోయి ఆ మూల గోని పట్టామీద పడుకో.చిచ్చుకొస్తే పెరట్లోకి పో .అంటూ ఆ నిద్ర మత్తులో నన్ను మంచం పై నుండి నెట్టేసి ,తోసేసి కింద పడేసేది.అలా కింద పడి ఓ సారి  నా తల వాచింది కూడా. తర్వాత  ఓ సారి నాకు పాలు, గ్లాసులో బదులు గిన్నెలో తెచ్చి తాగ మంది. సరే ఏమంటే ఎమౌతుందనే భయంతో,ఆ గిన్నెలోనే పాలు తాగేసాను. అలా తాగుతున్నపుడు,నా తల నిమరడం,మెల్లగా తాగు అంటూ నా చెవులు సవరదీయడం లాంటి చేష్టలు చేస్తుండడంతో  నాకు ఏం చేయాలో పాలుపోక మానసిక వైధ్యుడికి చూపిస్తే ,అతను బాగా చెక్ చేసి ,ఆమెకి ఆమె దారిలోనే వెళ్ళి చెప్తే ప్రయోజనం ఉండొచ్చు అంటూ పంది బరువు మందులు రాసాడు. అని మధు ,అలా గతం లో ఆలోచిస్తుండగానే ,ఏదో శబ్దం కావడంతో ఆలోచనల్లోంచి బయటికి వచ్చి చూడగా,లలిత కంట నీరుతో వస్తూ,చూడండి ఆ ఎదురింటి శరణ్య, నన్ను ఎంతగా అవమానించిందో ,చెప్పింది ,స్వరంలో బరువుతో.
అవునా? ఇంతకీ ఏమైంది లలితా! ఏమన్నారావిడ అడిగాడు నిదానంగా .

వాళ్ళ పెంపుడు గుర్రం ఈ మధ్యే జబ్బు చేసి చనిపోయిందట.పైగా దాని పేరు కూడా లల్లియేనట.అది కూడా నాలాగే పొట్టిగా దుక్కాలా ఉండేదట.నా జడ చూస్తే దాని తోక  గుర్తొస్తోందట.దానివి కూడా నాలాంటి డొప్ప చెవులేనట.నా నవ్వు వింటుంటే ఆవిడ గుర్రం సకిలింపు గుర్తొస్తోందట.దానికి కూడా అచ్చం నాలాగే ముక్కు మీద పుట్టుమచ్చ ఉందట.పైగా తినడానికి కూడా నాకు గుగ్గిళ్లే పెట్టింది.ఊ అని చిన్న ఏడుపు ఏడ్చి, ముక్కు చీది ,నన్ను ఓ జంతువుతో అయుదు నిమిషాలు పోలిస్తేనే నాకు కోపం పెరిగిపోయింది.ఒళ్ళు మండిపోయింది.అలాంటిది నేను మీకు జిమ్మీ పై ప్రేమతో చేసింది తలుచుకుంటే ,అంటూ మళ్ళీ ముక్కు చీది,కంట నీరు పెట్టింది.
ఏం పర్లేదు లలితా ,బాధ పడకు.మూగ జీవాల్ని పెంచడం ,ప్రేమ పంచడం ఏమాత్రం తప్పుకాదు.అందులో ఏ తప్పూ లేదు.కానీ వాటి మోజులో అతి పోకడలు మంచిది కాదు.మంచి బ్రీడ్ అని రెండు లక్షలు పెట్టి ,ఓ కుక్కపిల్లని కొని నీ ఫ్రెండుకి గిఫ్టు చేశావ్. అలాంటివి చేయడం వలన , మూగ జీవాల జాతుల  పిల్లలని పెట్  షాపుల్లో  పెట్టి, వస్తువుల్లా అమ్మి , వ్యాపారం చేసి డబ్బు గడిస్తున్నారు కొందరు. ఇక జిమ్మి ఆలన ,పాలనే సర్వం అన్నట్టు చూసావ్.కానీ నేను తిన్నానో లేనో పట్టించుకునేదానివే కాదు.పైగా దానికి పెట్ బ్యూటీ పార్లర్లు, ప్రత్యేకమైన డైట్ , డాగ్ షోస్ కి  ట్రైనింగులు లాంటి వాటితో పెద్ద  మొత్తంలో  సమయం, డబ్బులు వెచ్చించావ్. ఎక్కువ ఖరీదైన పెంపుడు కుక్కపిల్లల్ని,పిల్లుల్ని పెంచడం స్టేటస్ గా భావించి మురిసిపోవడం  అమాయకత్వం. అలాగే నువ్వు ఇష్టపడేంతగానే ఇతరులు కూడా దానిని ఇష్టపడాలనుకోవడం ,అలా కాకపోతే వారు జంతు ప్రేమికులు కాదు అనుకోవడం తగదు.

ఇక ప్రస్తుతానికి వస్తే , నీ తప్పు తెలుసుకున్నావ్.అదే పదివేలు. ఆఖరిగా నీకు చెప్పొచ్చేదేంటంటే,  ఎందులోనైనా అతి తగదు.అతి సర్వత్రా వర్జయేత్ అని ఆమెతో చెప్తూ ,దగ్గరికి తీసుకుంటుండగానే, బిడ్డ లా చూసుకున్నది  దూరమైందనేనండీ నా భాధ.చెప్పిందామె చిన్న స్వరంతో.
భలే దానివే, బిడ్డలాంటిది ఎందుకు! ఈ సారి బిడ్డనే పెంచుకుందాం.సాయంత్రమే  ఆర్ఫన్ హోం విసిట్ చేద్దాం. అని మధు చెప్పడంతో, చాలా మంచి ఐడియాసుమండీ చెప్పిందామే చాలా సంతోషంగా. అంతలోనే,మధు ఫోన్లో వాట్సప్ మెసేజ్ వచ్చింది.దాన్ని చూడగా,ఎదురింటి శరణ్య పంపింది.అన్నయ్యా,ముల్లుని,ముల్లుతోనే తీయాలన్న సూత్రాన్ని అనుసరించి, వదినకి నువ్వు చెప్పమన్నట్టే గుర్రం అదీ,ఇదీ అని తెగ చెప్పేశాను.పాపం వదిన , కన్నీరు పెట్టుకుని మరీ  వెళ్లిపోయింది. ఇంతకీ మన ప్లాన్ సక్సెస్సా ? అడిగిందామె .
యెస్ .అని చిరునవ్వుతో  టైప్ చేసి, లలితని పూర్తిగా దగ్గరికి తీసుకున్నాడు.                                   

మరిన్ని కథలు
missing mistery