Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nijayitee pellam

ఈ సంచికలో >> కథలు >> దొడ్డ మనసు

dodda manasu

రైలు కుదుపులకి కొంచెం నిద్ర పడుతుందనగా, హలో శేఖరం గారు, పలకరించాడో  వ్యక్తి. కొంచెం కళ్ళు తెరిచి చూశాడు శేఖరం. పొడుగ్గా, ఉంగరాల జుట్టుతో, కొంచెం నల్లగా ఎర్ర చొక్కాతో పళ్ళు కనబడేలా నవ్వుతూ ఎదురుగా నించున్నాడో వ్యక్తి.
మీరు? అడిగాడు శేఖరం.

నేను రమణని. మీ శివాపురం అంతా మాయ చిట్ ఫండ్  ఆఫీసు కి ఎప్పుడూ  వస్తుండేవాడ్ని కదా సార్.మా బావ వేసిన చిట్ వాయిదా డబ్బులు అప్పుడప్పుడు నేనే వచ్చి మీ ఆఫీసు లో జమ చేసేవాడ్ని.చెప్పాడతను చిన్న నవ్వుతో కళ్లలోకి చూస్తూ.

అతని మాటలకి శేఖరం,కొంచెం ఆలోచించి,నా  పేరు,నేను చిట్ ఫండ్  ఆఫీసులో పనిచేస్తున్నాననీ ,అంతా కరెక్టుగా చెప్తున్నాడంటే తెలిసిన వాడే అయి ఉంటాడు.గుర్తుపట్టలేకపోతే ఏమైనా అనుకుంటాడేమో,అని తనకి తాను సర్ది చెప్పుకుని, ఆ గుర్తొచ్చింది లేవయ్యా.ఈ మధ్య  నువ్వు తరుచూ రాకపోయేసరికి గబుక్కున గుర్తుపట్టలేక పోయానంతే.చెప్పాడు చిరునవ్వుతో.

అది సరే సార్. నేను కూడా ఈ మధ్య ఓ పది లక్షల చిట్ ఒకటి వేద్దామనుకుంటున్నాను సార్ .నెలకి ఎంతెంత కట్టాలి .ఒక వేళ  మధ్యలో చీటీ పాడేస్తే ఎందరు ప్రభుత్వ ఉద్యోగుల సంతకాలు కావాలి అనే డీటైల్సు అడగడానికి నేనే మీ బ్రాంచికి సోమవారం వస్తాను.చెప్పాడు రమణ.
పది లక్షలా.యాబై వెలకి కమీషన్ రెండు వేలు.అలాంటిది పది లక్షలంటే నలభై వేలు వచ్చేసినట్టే.మనసులో మురిసిపోసాగాడు.
అంతలోనే రమణ ,శేఖరాన్ని ఓ కుదుపు కుదిపి, ప్రస్తుతం లోకి తెచ్చి, సార్ నాకో చిక్కువచ్చిపడింది .ఏం చేయాలో తోచడం లేదు. చెప్పాడు.కాస్త కంగారుగా.

ఇప్పటిదాకా బానేవున్నావ్ కదయ్యా.ఇప్పుడే ఏమైంది.

ఏం లేదు సార్.నా దగ్గర ఓ స్నేహితుడి చెల్లి పెళ్ళికి అందజేయాల్సిన డబ్బు ఉంది.కానీ  అది అందించాలంటే నేను నిడదవోలు దిగాలి.అసలే రైలు మూడు గంటలు ఆలస్యంగా నడుస్తోంది.కనుక నేను దిగితే,ఆలశ్యమైపోయి నేను రాబట్టుకోవాల్సిన అప్పు ఒకటి రాబట్టుకోలేక పోవచ్చు.ఎందుకంటే అతను కొద్ది గంటల్లోనే ఉద్యోగ రీత్యా వేరే రాష్ట్రం వెళ్ళిపోతున్నాడు. నేను సమయానికి వెళ్లకపోతే డబ్బు చేతికి రాదు. అపుడు చిట్ కూడా వేయలేను.ఇప్పుడెలా.చేతులు నలుపుకోసాగాడు.

తిరిగి తిరిగి నా చిట్ వేయలేనంటాడేన్టి.సరే తప్పుతుందా.సరేలేవయ్యా.ఎలాగూ నే వెళ్ళాల్సింది తణుకు.ఇదక్కడిచ్చేసి,తర్వాత  బస్సులో తణుకు వెళ్తాన్లే. దగ్గరేగా. నీకు అభ్యంతరo లేదంటే చెప్పు,ఆ పెళ్ళిలో నేనే ఆ డబ్బు స్వయంగా అందజేస్తాను.అడ్రెస్ ఇవ్వు చాలు.చెప్పాడు శేఖరం.

ఇదుగోoడి. ఈ శుభలేఖలో ఉన్న అడ్రెస్ కి చేరవేయండి చాలు.చెప్పాడతను.

అయినా ,విడ్డూరం! తెలిసిన వాడినైనా,నన్ను మరీ ఇంత గుడ్డిగా నమ్ముతున్నావ్.ఎలాగయ్యా.?
ఏముంది సార్ .ఇందాక ఎవరో రెండువేల నోటు పారేసుకుంటే,ఎవరిది,ఎవరిది అంటూ కనుక్కుని మరీ ఇచ్చారు.మీ మంచితనం నాకు అప్పుడే అర్దమైంది సార్.

ఆహా.మొత్తానికి ఘటికుడివేనయ్యోవ్, అంటూ అతని బుజo తట్టి, అతను ఇచ్చిన అడ్రెస్ తీసుకున్నాడు శేఖరం.ఆ తర్వాత ఆ అడ్రెస్ కి  వెళ్ళాడు.అంతా పచ్చ తోరణాలు.వైభవంగా ముస్తాబైన పెళ్లి పందిరి.జనంతో హడావుడిగా ఉంది.ఎటు వెళ్లాలో తెలియక ఓ సారి చుట్టూ కలియజూస్తుండగానే ,ఓ వ్యక్తి పరుగు లాంటి నడకతో చక,చకా వచ్చి ,శేఖరం చేతిలోని బ్యాగ్ వైపే  చూస్తూ ,సార్ ఈ,ఈ  బ్యాగు అంటూ మాట తడబడ్డాడు.

మీ అడ్రెస్ ఉన్న శుభలేఖ ఇచ్చి ఇక్కడికి పంపాడు  సార్  మీ స్నేహితుడు.చెప్పాడు శేఖరం.
నా స్నేహితుడా? ఈ డబ్బు నాదే సార్.నిన్ననే  రైల్లో పోగొట్టుకున్నాను.ఏది ఏమైనా ఇపుడు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ .సమయానికి మా చెల్లెలి పెళ్లి ఆగి పోకుండా కాపాడారు.మీ రుణం తీర్చుకోలేo.చెప్పాడతాను.

అతను మీ స్నేహితుడు కాదా! అసలు ఏం జరిగింది.ఈ డబ్బు ఇచ్చినతను తన పేరు రమణ అని చెప్పాడు.అతనెవరో మీకు తెలీదా.అడిగాడు చాలా ఆశ్చర్యంగా .

తెలీదు సార్.అసలు జరిగిందేవిటంటే ,నేను నిన్న రాజమండ్రి బ్యాంక్ లో బంగారం తాకట్టు పెట్టి,తెలిసిన స్నేహితుడి ధగ్గర కూడా కొంత మొత్తం అప్పు చేశాను.మొత్తం అయిదు లక్షలు తీసుకొస్తుండగా,ఎవరో ఎత్తుగా,నల్లగా ,ఉంగరాల జుట్టుతో ఉన్నవాడు నా పేరు తో నన్ను పిలిచి, నేను తెలుసని చెప్తే ,నిజమే అనుకున్నాను.మాట కలిపి,నన్ను మంచి చేసుకుని, తినమని ఏదో ప్రసాదం అని నా చేతిలో పెట్టాడు . కొంచెం నిద్ర పట్టేసరికి నా బ్యాగ్ కొట్టేశాడు వెధవ.తర్వాత ఆలోచించి చూస్తే, నా పర్సు కొట్టేసి, అందులో ఉన్న ఆధార్ కార్డు చూసి, నా పేరు, వివరాలు తెలుసుకుని  నన్ను పరిచయం చేసుకున్నాడని అర్ధమైంది. అలాగే , ఆ కొట్టేసిన వాడు,ఎవరికైనా భయపడి వదిలేశాడో ,లేక ఆ జనం రద్దీలో పారేసుకున్నాడో గానీ, నే బంగారం తాకట్టు పెట్టిన రిసీప్టూ ,శుభలేఖ కూడా అందులో ఉండడం చేత ,ఈ బ్యాగ్ దొరికినతను , దేవుడిలా మీకు ఈ బ్యాగ్ ఇచ్చి,నా స్నేహితుడని చెప్పి మిమ్మల్ని ఇక్కడికి పంపించుంటాడు. నిజంగా ఆయనిది దొడ్డ మనసు.చెప్పాడు చిన్న కన్నీటి పొరతో.

అతని మాటలు విన్న శేఖరం ఓ క్షణం ఆలోచన్లో పడ్డాడు.ఎత్తుగా ,నల్లగా ,ఉంగరాల జుట్టుతో ఉన్నవాడు, పేరు పిలిచి పరిచయం చేసుకున్నాడా ?నాకు ఈ బ్యాగ్ ఇచ్చిన వాడు కూడా పోలికల్లో అలానే ఉన్నాడు.పైగా నన్ను కూడా అచ్చం అలానే పేరు పిలిచి,  వృత్తి వివరాలు చెప్పే పరిచయం చేసుకున్నాడు.అంటే నిన్న దొంగిలించిన దొంగే, అందులో తాకట్టు రసీదూ ,శుభలేఖ చూసి ఆడ కూతిరి పెళ్లి ఖర్చుల డబ్బు అని తెలిసి ,దొంగైనా ,దొడ్డ మనసుతో నాతో ఈ బ్యాగ్ ఇక్కడికి చేరేలా చేసాడన్నమాట. మరి నా వివరాలు ఎలా తెలిసాయి! అనుకుంటూ జేబు తడుముకున్నాడు .పర్సు లేదు.అంటే, పర్సులో నా విసిటింగ్ కార్డు చూసి,నేను ఫలానా అని తెలుసుకున్నాడన్నమాట.

నేను ఊహించిందే నిజం. రూడీ చేసుకున్నాడు శేఖరం.అంతలోనే ,సార్ మా చెల్లెల్ని దీవించండి అంటూ అక్షింతలు చేతిలో పెట్టాడతను.పర్సు పోగొట్టుకున్నా ,ఓ మంచి పని చేయడంలో సహాయపడినందుకు గాను, తృప్తీ ,ఆనందం నిండిన మనసుతో ,ఆమెపై అక్షింతలు వేసి ఆశీర్వదించాడు  శేఖరం.

మరిన్ని కథలు