Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
drugs in software

ఈ సంచికలో >> యువతరం >>

చిట్కా వైద్యమా? కొంచెం జాగ్రత్త సుమా!

take care with Tip medicine

ఇప్పుడంటే రకరకాల మందులు అందుబాటులోకి వచ్చేశాయి. జలుబు చేస్తే ట్యాబ్లెట్‌ వేసేస్తున్నాం, దగ్గు వస్తే సిరప్‌ తాగేస్తున్నాం. ఇదివరకు అలా కాదు. తీవ్రమైన జ్వరానికీ వంటింటి చిట్కాలే పరిష్కారం చూపేవి. కాలం మారింది. కాలంతోపాటుగా పరిస్థితులు కూడా మారిపోయాయి. ఒక్కోసారి చిట్కా వైద్యం ఇచ్చే రియాక్షన్స్‌కి గోటితో పోయే వ్యవహారం గొడ్డలిదాకా వెళుతోంది. కాబట్టి చిట్కా వైద్యం గురించి ఎవరైనా చెబితే, కొంచెం ఆగి ఆలోచించి ముందడుగు వేయడం మంచిది. టీవీల్లో చిట్కా వైద్యాల గురించి వింటున్నాం. అయితే అలాంటి చిట్కాలను తెలుసుకోవడం వరకూ తప్పు లేదు, పాటించేటప్పుడు వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి. ఇదివరకటి రోజుల్లో పెరటి వైద్యమే అన్నింటికీ పనిచేసేది. ఇప్పుడు పెరటి వైద్యం వికటించేస్తోంది. జలుబుకి అయినాసరే చిట్కాలు సరిగ్గా పనిచేయడంలేదు. పూర్తిగా పనిచేయడంలేదని కాదుగానీ కాంప్లికేషన్స్‌ పెరిగిపోతున్నాయంటారు వైద్యులు.

పాత తరం ఆలోచనలు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉండేవని, వాటిని అప్పటి కాలానికి మేలైనవిగా భావించగలం తప్ప, నేటి తరం కూడా వాటిని అనుసరించవచ్చని చెప్పలేకపోతున్నామంటారు వైద్యులు. దానికి కారణాలు చెబుతూ, ఇప్పటి వాతావరణ పరిస్థితులు, అన్నిటా పెరుగుతున్న కల్తీలే కారణమని వివరించడం జరుగుతోంది. పంటి నొప్పికి లవంగలు వేసుకుందామంటే, ఆ లవంగం కూడా కల్తీనే అవుతోంది. సమస్య అక్కడే వస్తోంది. ఇంకొన్నిసార్లు ఓ రోగానికి మందేస్తే, అది తగ్గకపోగా కొత్త రోగం పుట్టుకొస్తుండడమూ గమనించదగ్గదే. సాధారణ సమస్యలైన జలుబు, పంటినొప్పి, చిన్న చిన్న గాయాలకు చిట్కా వైద్యం కొంతవరకు ఉపశమనం కల్పిస్తుందని వైద్యులూ ఒప్పుకుంటారు. అయితే జలుబు సాధారణమైనదా? కాదా? అని గుర్తించడం కూడా ముఖ్యమేనని వారు సున్నితంగా హెచ్చరిస్తున్నారు. సాధారణ జలుబు ఏదో, కఠినతరమైన వైరస్‌ల వల్ల కలిగే జలుబు ఎలాంటిదో గుర్తించడం కష్టం. సాధారణ పంటినొప్పికీ, దంతాల కింద తలెత్తే తీవ్రమైన సమస్యలకీ తేడా గుర్తించడం కూడా కష్టమేనని వారు చెబుతారు.

అయితే చిట్కా వైద్యానికి సంబంధించి కూడా ప్రొఫెషనల్స్‌ పుట్టుకొస్తున్నారిప్పుడు. అలాంటివారి నుంచి సలహాలు తీసుకుంటే చిన్న చిన్న చిట్కాలు చిన్న చిన్న సమస్యలకు తేలిగ్గానే పరిష్కారమార్గాలవుతాయి. ఇంట్లో వాడే ఉప్పు దగ్గర్నుంచి ప్రతి ఒక్కటీ చిట్కా వైద్యానికి పనికొచ్చేదే. పెరట్లో ఔషధ మొక్కల్ని పెంచుకోవడం, వాటి ద్వారా ఉపశమనం పొందాలనుకోవడం తప్పు కాదు. కానీ దేనిపైన అయినా కొంచెం అవగాహన కలిగి ఉండకపోతే కొత్త సమస్యలు వచ్చే ప్రమాదముంది.

మరిన్ని యువతరం