Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

గత సంచిక లోని  నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి... http://www.gotelugu.com/issue229/636/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

( గతసంచిక తరువాయి )...అర గంటలో అమీర్ పేటకి చేరుకుంది ఆటో. ‘ఆకాష్ కంప్యూటర్స్’ అంటే చాలా ఫేమస్ కావటంతో చెప్పగానే తీసుకు వెళ్ళి ఆఫీసు ముందు ఆపాడు.

ఆకాశ హర్మ్యం అని వర్ణించ డానికి సరి పోతున్నట్లుగా ఎనిమిదంతస్థుల బిల్డింగ్ అది. ముందు భాగంలో తళ తళ లాడే అద్దాల గేటు మీద ఆకాష్ కంప్యూటర్స్ అన్న గోల్డ్ కలర్ అక్షరాలు మెరుస్తూ కనిపించాయి.

ఆటో అతనికి ఫేర్ యిచ్చి ముందుకడుగేసింది. గేటు దగ్గరి కెళ్ళి వాచ్ మెన్ ని ఆకాష్ రూం ఎక్కడో అడిగింది.  పిఫ్త్ ఫ్లోర్ అని చెప్పాడు.
లిఫ్ట్ ఎక్కి వెళ్ళింది. లిఫ్ట్ కూడా చాలా మోడ్రన్ గా వుంది. అందు లోంచి బయటికి రాగానే కళ్ళు చెదిరేలా వుందనిపించింది ఆ ఫ్లోర్.
ముందంతా విశామైన హాలు.

రిసెప్షన్, అక్కడో అందమైన అమ్మాయి. 

విజిటర్స్ కోసం సోఫాలు, వాల్ కి సీనరీలు, కాస్ట్ లీ కర్టెన్స్....ఆ హాలులోకి అడుగు పెట్టగానే ఎర్ట్ చేసే ఒక మంచి సువాసన.
బెరుకుగా అడుగు పెట్టింది.

‘‘యస్! వాట్ కెన్ ఐడూ ఫర్యూ!’’ రిసెప్షనిస్ట్ చిరునవ్వుతో అంది.

‘‘ఆకాష్ గారితో మాట్లాడాలి’’ మెల్లిగా అంది.

‘‘ఎపాయింట్ మెంట్ వుందా?’’

‘ఎపాయింట్ మెంట్...?’ మాటకి తడుముకుంది.

‘‘యాక్చువల్లీ! మా ఫ్రెండ్ తీసుకుంది. తన కోసం వెయిట్ చేస్తున్నాను’’ చెప్పింది.

‘‘సిడౌన్ ప్లీజ్!’’ సోఫా చూపిస్తూ చెప్పింది రిసెప్షనిస్ట్.

ఆ హాలులోంచే లోపలి గదులకి ద్వారాలు కనిపిస్తున్నాయి. ఆకాష్ రూమ్ కి కూడా ఆ హాలు నుంచే వెళ్ళాలి.

తన పక్కన కూర్చున్న ఓ పెద్దాయన్ని అడిగింది. ‘‘ఆకాష్ గారు వచ్చారా?’’ అని. ఇంకా రాలేదన్న సమాధానం వచ్చింది.
కాలక్షేపం కోసం అతనే కీర్తనతో మాటలు కలిపాడు. ఆ హాలులో ఇంకా చాలా మంది అతని కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళంతా ఎపాయింట్ మెంట్ తీసుకున్నారట. ఆఖరికి తన పక్కన కూర్చున్నాయనకి కూడా పదిన్నరకి అపాయింట్ మెంట్ వుందంట.

ఆయన చిన్నపుడు ఆకాష్ కి చదువు చెప్పాడట. యిపుడేదో కొడుకు జాబ్ విషయంలో సహాయం చేస్తాడేమోనని అడగడానికి వచ్చారట.
యింత పెద్ద పొజిషన్ లో ఉన్నట్లు ఆకాష్ తనకి ఎప్పుడూ చెప్ప లేదు.

ఆలోచిస్తూ కూర్చుంది. సరిగ్గా తొమ్మిది గంటలకి ఆకాష్ ఆఫీస్ లోకి అడుగు పెట్టాడు. చాలా మంది లేచి నిలబడ్డారు. అతను ఎవరి వంకా చూడటం లేదు. ఎవరన్నా విష్ చేస్తుంటే తలూపుతున్నాడు.

చిరు నవ్వుతో అతనికి ఎదురు వెళ్ళ బోతుండగా జరిగిందా సంఘటన...

అప్పటి వరకూ ఎక్కడ ఉందో, మణి బిందు ఛెంగున అతని వెనక చేరి సుతారంగా ఒక చేతితో కళ్ళు మూసింది. అయినా ఎవరో అతను కనిపెట్టేసాడు.

‘‘ఏయ్!నాటీ!....డోంట్ బి సిల్లీ!’’ అంటూ ఆమె.

ఆమె భుజాల మీద చేతులు వేసి తన రూం లోకి నవ్వుకుంటూ వెళ్ళి పోయాడు.

కళ్ళింతలు చేసి చూస్తుండి పోయింది. ఆ ఆఫీసులో అందరూ ముసి ముసి నవ్వు నవ్వుకుంటూ చూశారు.

మణి బిందు, ఆకాష్ తో...తన ఆకాష్ తో అంత చనువుగా ఉంది. అంటే ఆమె చెప్పిందే నిజమా....? తన కళ్ళే తనని  సగిస్తున్నాయా....? తంతా విపరీతమైన హోరు.

‘‘కూర్చోమ్మా! నీ ఎపాయింట్ మెంట్ కి కూడా టైమున్నది కదా!’’ ఆ ముసలాయన చనువుగా అన్నాడు. విధి లేనట్లు కూర్చుంది.
‘‘చూడ ముచ్చటయిన జంట’’ వ్యాఖ్యానించాడాయన.

‘‘ఎవరా అమ్మాయి...?’’ నూతి లో నుండి వచ్చినట్లుగావుంది స్వరం.

‘‘ఆ అమ్మాయి తెలీదూ....? మణి బిందు, వాలీ బాల్ నేషనల్ ప్లేయర్. ఆకాష్ కి కాబోయే భార్య!’’

మిన్ను విరిగి మీద పడినట్లయింది. ఆకాష్ కి కాబోయే భార్య! అంటే తను భయపడిందే నిజమయిందా?

‘‘మీకు బాగా తెలుసా?’’

‘‘ఎందుకు తెలీదమ్మా! యింతప్పటి నుంచి ఆకాష్ నాకు బాగా తెలుసు. ఏడేళ్ళ కిందట స్విట్జర్లాండ్ వెళ్ళాడు స్టడీస్ కోసం. కొన్ని నెలల కిందటే వచ్చాడు.

ఇండియానే యిష్టమని యిక్కడే ఉండి పోతానని పట్టు బట్టి వచ్చాడంట. వాళ్ళ ఫాదర్ కేమో ఫారిన్ లో నే అతనితో కంపెనీ పెట్టించాలనుంది. ఆకాషేమో ఇక్కడికి వచ్చేశాడు.

‘‘అంటే అతను యిండియాలో చదవ లేదా?’’ వణుకుతున్న గొంతుకతో అంది కీర్తన.

‘ఊహూ! ఇంటర్ అవగానే స్విస్ వెళ్ళి పోయి మొన్నే వచ్చాడు’

‘‘మరి ఆ అమ్మాయి....’’

‘‘మణి బిందా....? తను అతనికి మరదలు. ఆకాష్ కోసమని ముంబాయి నుంచి యిక్కడికి వచ్చేసింది. ఒకటి రెండేళ్ళలో పెళ్ళి చేసుకుంటారనుకుంటా. అమ్మాయికి నేషనల్ గేమ్స్ విన్నర్ కావాలని కోరిక. ఆకాషేమో పెద్ద ఇంట్రెస్ట్ చూపించడు. అతనికి పెద్దగా నచ్చవు ఈ ఆటలు!’’ మామూలుగా అన్నాడాయన.

చివరి మాటలకి మిన్ను  విరిగి మీద పడ్డట్లయింది. ‘‘ఆకాష్ గారికి వాలీ బాల్ గేమ్స్ నచ్చదా?’’ తానేమడుగుతుందో కూడా తెలియకుండా అంది.

‘‘వాలీ బాల్ అనేంటమ్మా....? ఏ గేమ్ చూసేంత తీరిక లేదు. చూశావుగా....యింత మంది జనాలు అతని కోసం చూస్తున్నారు. అతను ఒక్క రోజు వేస్ట్ చేస్తే అక్షరాలా కొన్ని లక్షల రూపాయలు లాస్!’’ చెప్పాడతను.

యింకా అతనేంటో ఆకాష్ సుగుణాలన్నీ చెప్పుకు పోతున్నాడు.

కానీ ఏమీ మైండ్ లోకి వెళ్ళడంలేదు. అతని మాటలే మనసంతా మార్మోగుతున్నాయి.

ఆకాష్ కి మణి బిందు బాగా తెలుసు.కానీ తనకెపుడూ చెప్ప లేదు.తను వాలీ బాల్ ఆడిన నాటి నుంచీ అతనిక్కడ లేడు.

కానీ అతను యిండియాలోనే ఉన్నానని చెప్పాడు. చివరికి, చివరికి అతనికి వాలీ బాల్ గేమే కాదు, ఏ గేమ్ పట్లా ఆసక్తి లేదు.
కానీ వాలీ బాల్ తనకి ప్రాణం అని చెప్పాడు.

ఎందుకు...?

ఎందుకోసం యిదంతా?!

సమాధానం తెలీనంత అమాయకురాలేం కాదు తను. తనని ట్రాప్ చెయ్యడానికే యిన్ని అబద్దాలూ, యింత డ్రామా. అందుకే యిన్ని సార్లడిగినా తనకి వివరాలేమీ చెప్ప లేదు.

లేచి ఆ ముసలాయన ఏదో అడుగుతున్నా వినిపించుకోకుండా వచ్చేసింది.

ఆటోలో ఎలా వచ్చిందో కాలేజీకి తెలియ లేదు. క్లాసులో లెక్చరర్ ఏదో చెపుతున్నారు. ఫ్రెండ్స్ ఓరగా చూస్తున్నారు. ఏదీ బ్రెయిన్ లోకి ఎక్కడం లేదు. మాట మాటకీ ఆకాష్ చేసిన మోసం తల్చుకుంటూంటే మనసు భగ భగా మండుతోంది.

ఆఫ్ట్ రాల్ ఒక ఆడ దాని పొందు కోసం యిన్ని అబద్దాలు చెప్పాలా? తన ప్రాణానికి ప్రాణమైన గేమ్ ని అడ్డు పెట్టుకోవాలా?

ఎదురైతే చెడా మడా దులిపేయాలన్న కోరిక కలుగుతుంది. ఆలోచనల్లోనే లంచ్ బెల్లవడం గమనించ లేదు.

‘‘టీం మేట్స్ చుట్టు ముట్టారు.

‘‘ఏమయింది?’’ ఆత్రుతగా అడిగారు.

బలహీనంగా నవ్వి బొటనవేలు కిందకి చూపించింది.

‘‘నువ్వు తనతో మాట్లాడావా?’’ అడిగారు.

‘‘ఊహూ!....’’ తల అడ్డంగా ఆడించింది.

‘‘మరి?’’

జరిగిందంతా చెప్పింది.

‘‘మైగాడ్! ఆకాష్ యిలాంటి వాడంటే నమ్మ లేక పోతున్నాం. అయినా ఈ డబ్బున్న అబ్బాయిల బుద్దే అంత. అలాంటిలాంటి వాటికి కీర్తన లొంగదని యిలా ప్లాన్ చేసుంటాడు. రాస్కెల్....’’ ఒకమ్మాయి తిడుతుంటే కీర్తన మనసు విలవిల్లాడింది.

అప్పుడర్ధమైందామెకి.

ప్రేమంటే ఏంటో!....

అతను తనని మోసం చేశాడని తెలిసినా అతన్ని తిడితే బాధ కలుగుతోంది.

యిదేనా ప్రేమ....?

యిక యిపుడు అతన్ని మర్చిపోలేకా...

అతని మోసాన్ని భరించ లేకా సంఘర్షణకి లోను కావాల్సిందేనా....?

ఏం చెయ్యాలిపుడు...? అతన్ని మర్చిపోగలదా....? జీవితాంతం తోడుంటాడని భావించిన మనిషి యిలా మోసం చేస్తే ఎలా తట్టుకోవడం?
తలంతా సూదులతో గుచ్చుతున్నట్లు ఒకటే బాధ. హృదయంలో ఎవరో కత్తిని దింపి వెళ్ళారు. కారే ఒక్కొక్క కన్నీటి బిందువూ శరీరంతో పాటు మనస్సునీ నిస్సత్తువకి గురి చేస్తోంది.

‘‘మర్చిపో కీర్తనా!’’

యివన్నీ మర్చి పోయి....గేమ్ మీద దృష్టి పెట్టు....ఆట ఒక్కటే నిన్ను సేద దీరుస్తుంది’’ అందరూ చెప్పారు.

అందరి మాటా మౌనంగా వింది.

‘‘మరీ సెన్సిటివ్ గా ఫీలయి, ఏ అఘాయిత్యమూ చేసుకో వద్దు’’ ముందు జాగ్రత్తగా అంది ఒకమ్మాయి. బల హీనంగా నవ్వింది కీర్తన.

‘‘నాకు ప్రాణాల మీద కన్నా ఆట మీద తీపి ఎక్కువ’’ అంది.

అందరూ చిన్నగా నవ్వారు.

కీర్తన రోజూ లాగే స్టేడియం కి వెళ్ళింది. ప్రాక్టీస్ చేసింది.

(సశేషం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
premiste emavutundi