సెక్స్ ఎడ్యుకేషన్ చిన్నప్పటినుంచే తప్పనిసరి అన్న మేధావుల సూచనలు భారతీయ సమాజానికి ఎంతవరకు మేలు చేస్తాయి? అన్న చర్చ జరుగుతోంది చాలా కాలం నుండే. దేశంలో పెరిగిపోతున్న లైంగిక దాడుల నేపథ్యంలో మానసిక వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. వాటిల్లో సెక్స్ ఎడ్యుకేషన్ ముఖ్యమైనది. పిల్లలకు సంబంధించిన మానసిక పరివర్తనలో విపరీతమైన మార్పులు వచ్చాయనీ, దానికి కారణం ప్రస్తుత సమాజంలోని 'వెస్ట్రన్ కల్చర్' మేనియా మాత్రమేనని వారంటున్నారు. ఇదివరకటి రోజుల్లో ఓ ఊరికి పొరుగూరికి మధ్యన 'కమ్యూనికేషన్' చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల ఏం జరుగుతున్నా, కమ్యూనికేషన్ రంగంలో వచ్చిన మార్పుల కారణంగా వెంటనే తెలిసిపోతోంది. కాబట్టి వెస్ట్రన్ కల్చర్ మన సంస్కృతిలో భాగమైపోయిందనే వాస్తవాన్ని మనం గ్రహించాలి. ప్రమాద తీవ్రత పెరిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో దాన్నుంచి బయటపడే మార్గాల్ని మనం మన పిల్లలకు తెలియజేయాల్సి ఉంటుంది.
మానసిక నిపుణులు చెబుతున్నదాన్ని బట్టి చిన్న పిల్లలు అంటే, ఊహ తెలిసినప్పటినుంచి 16 ఏళ్ళ వయసు లోపలున్నవారికి, మూడు అంశాల్లో ఖచ్చితమైన అవగాహన కల్పించాలి. అపరిచితులతో జాగ్రత్తగా ఉండటం, మన శరీరం గురించి మనం తెలుసుకోవడం, తల్లిదండ్రులతో ప్రతి విషయాన్నీ చెప్పగలగడం ఆ మూడు ముఖ్యమైన అంశాలు. ఇంకో వైపున చిన్న పిల్లలతో లైంగిక వాంఛ తీర్చుకోవాలనే కామాంధులు పెరిగిపోయారు గనుక, చిన్న పిల్లలకు వారి శరీరంపై పూర్తి అవగాహన కల్పించడం తప్పనిసరి. మూడు ముఖ్యమైన ప్రదేశాల్లో అపరిచితులు కావొచ్చు, తెలిసినవారు కావొచ్చు చెయ్యి వెయ్యగానే, వారించడం, ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయడం చేసేలా పిల్లలకు తర్ఫీదునివ్వాలి. అలా చేయడం ద్వారా పిల్లలపై లైంగిక దాడులు కొంతవరకు తగ్గుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. సమస్య పట్ల పిల్లల్లో అవగాహన పెంచితే, సమస్య తీవ్రత తగ్గడానికి, తద్వారా ప్రమాదాలకు వారు దూరంగా ఉండడానికి ఆస్కారమేర్పడుతుంది.
ముఖ్యంగా ఛాతి భాగం, పిరుదులు, తొడల భాగం ఎట్టి పరిస్థితుల్లో ఎవర్నీ తాకనివ్వకూడదని పిల్లలకు తెలియజేయాలి. ఈ బాధ్యత పూర్తిగా తల్లిదండ్రులే. స్కూళ్ళలోనూ ఈ అంశాలపై విస్తృతంగా ప్రచారం జరగాల్సి ఉంటుంది. తల్లిదండ్రులతోపాటు, టీచర్లు, స్కూలు యాజమాన్యాలు పిల్లల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదుని సీరియస్‌గా తీసుకున్నప్పుడే పిల్లల్ని లైంగిక దాడులకు దూరంగా ఉంచగలుగుతాం. వారి బంగారు భవిష్యత్తుని కాపాడినవారమవుతాం. లైంగిక వాంఛతో రగిలిపోతున్నవారు ముఖ్యంగా పైన చెప్పుకున్న భాగాల్లోనే చిన్నారుల్ని తాకుతుంటారు. అది తొలి దశ. అప్పుడు పిల్లలు అప్రమత్తమైతే, లైంగిక పిశాచులు ముందడుగు వేయడానికి ఇష్టపడరని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు.
దిగ్భ్రాంతికరమైన విషయమేంటంటే చిన్నారుల్లో లైంగిక దాడులకు సంబంధించి మగపిల్లలే ఎక్కువ బాధితులట. కాబట్టి, అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా లైంగిక దాడుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది.
|