మధ్యాన్నం రెండు గంట లవుతోంది .లంచ్ అయిన తర్వాత ఆఫీస్ లో కూర్చొని ఫైళ్ళు చూస్తున్నాను .ఇంతలొ నా మొబైల్ మ్రోగింది .
''హలో ! మూర్తి గారేనా మాట్లాడేది ?'' ఒక మగ గొంతు వినబడుతోం ది ఆ వైపు నుండి . ఆ గొంతు నేనెప్పుడు విన్నట్లు లేదు .
''చెప్పండి . ఏమిటి విషయం ? " అన్నాను నేను .
నా పేరు యాదగిరి సారూ ! . ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళంట . వాళ్ళకి మేజర్ ఆక్సిడెంట్ అయింది '' నా గుండె వేగంగా కొట్టుకోసాగింది .
'' యాదగిరి గారు ! ఎవరు వాళ్ళ పేర్లు చెప్పగలరా ? ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు మీరు ? '' అన్నాను నేను .
''ఎవరో సూర్యా రావు అంట. మీ స్నేహితుడంట . ఆయన మారుతి ఆల్టో కారుని లారీ టక్కర్ చేసింది . నేను మహాబూబ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్ లో ఉన్నాను . మీ వాళ్ళంతా స్ఫృహ లేకుండా పడి ఉన్నారు . జడ్చెర్ల దగ్గర ఆక్సిడెంట్ అయింది . మీరు వెంటనే వస్తారా ? '' అని మొబైల్ ఆఫ్ చేశాడు .
నాలో సన్నని వణుకు ప్రారంభమయింది . కాళ్ళు చేతులు వణుకు తున్నాయి . నిన్ననే వెళ్ళాడు వాడు కర్నూల్ లో ఏదో పెళ్లి ఉందని . అప్పుడే ఈ ఘోర మైన వార్త వినాల్సి వచ్చింది .
సూర్యా రావు నేనూ ఒకే ఆఫీసు లో పని చేస్తున్నాము . ఆతను పర్చేస్ డిపార్టుమెంటు లో, నేను అక్కౌం ట్సు డిపార్టుమెంటు లో పని చేస్తున్నాము . ఇద్దరమూ ప్రాణ స్నేహితులే అనుకోవచ్చు . వాడు నా చిన నాటి స్నేహితుడే ! లక్కీ గా ఇద్దరం ఒకే కంపనీ లో పని చేస్తున్నాము .
ఆఫీసు లో పర్మిషన్ తీసుకోని నా కార్లో ఇంటికి బయలు దేరాను . మధ్యలోనే శ్రీమతి కీ విషయం చెప్పి రడీ గా ఉండమన్నాను . సూర్య రావు ఇల్లు , నా ఇల్లు పక్క పక్క నే ఉంటాయి . వాడు పెళ్ళాం పిల్లలతో పెళ్ళికి వెళ్లి నట్లున్నాడు . ఓ మై గాడ్ ! పిల్లల కేమైనా అయిందా ! చెల్లెలకి ఎలాగుందో ! భగవంతుడా , వాళ్ళంతా క్షేమంగా ఉండాలి ''అని మనసులోనే మొక్కు కొన్నాను .
ఒక్కొక్క సారి జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురౌతుంటాయి . వాటిని ఎలా ఫేస్ చెయ్యాలో అర్థం కాదు. అప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు . దైర్యంతో అలాంటి పరిస్థుతిల్ని ఎదుర్కొనాలి .
ఇంటికి చేరుతూనే శ్రీమతిని రడీ కమ్మని చెప్పి ,కార్లో ఎక్కి కూర్చొని అత్తాపూర్ ఫ్లై ఓవర్ మీదగా జడ్చెర్ల మెయిన్ రోడ్ మీదకు చేరి కార్ స్పీడ్ పెంచాను . నేషనల్ హై వే గాబట్టి శ్రీమతి మెల్లగా డ్రైవ్ చెయమంటూ ఉంది . దేవుడా దేవుడా అని మొక్కు కొంటు ఉంది పెదాల మీద స్త్రోత్రాల్ని చెప్పుకొంటూ .
ఏది ఎప్పుడు ఏమి జరుతుందో ఎవరు చెప్పలేరు . అంతా దైవ నిర్ణయ మని , విధి లిఖిత మని మనసులో అనుకొంటూ శ్రీమతి తో గూడా ఇదే మాట అన్నాను . తను ఏమి మాట్లాడ లేదు . భయంగా రోడ్డు వంకే చూస్తోంది.
రెండు గంటల్లో జడ్చెర్ల పోలీస్ స్టేషన్ చేరాము. ''ఇక్కడికి ఒక కిలో మీటర్ దూరంలో ఆక్సిడెంట్ అయింది. ఇదే ఆ లారీ , ఆ కార్'' అన్నాడు పోలీస్ . రెండు వాహనాలు బాగా గుద్దు కొన్నట్లున్నాయి . ఆల్టో కారయితే నుజ్జు నుజ్జు అయిపొయింది . ''FIR బుక్ చేశాము. లారీ డ్రైవర్ ని అరెస్టు చేశాము . ఇంతకీ వాళ్ళు మీకేమవుతారు ? అనడిగాడు లోపలున్న సబ్ ఇన్ స్పెక్ట ర్ .
''అత ను నా క్లోస్ ఫ్రెండ్ సర్ .ఇంతకి వాళ్ళు .... ''
''ఎవరో యాదగిరి అంట , బాగా తెలిసిన వాళ్ళే అని అందరిని మహాబూబ్ నగర్ హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు . బాగా దెబ్బలు తగిలాయి '' అన్నాడు ఎస్ ఐ .
వెంటనే వాళ్ళ దగ్గర సెలవు తీసుకోని మహబూబ్ నగర్ కేసి కారుని నడిపాను.
హాస్పిటల్ కి చేరాక ఆ విషాద దృశ్యం చూడలేక పొయ్యాము . సూర్యా రావు , ఆతని భార్య స్పృహ లో లేనట్లున్నారు . బ్లడ్ ని ఎక్కిస్తున్నారు ఇద్దరికీ . ఎక్కడ చూసినా గాయాలే. అప్పటికే బాండేజి అంతా వేసి ఉన్నారు పిల్లలు వెనక సీట్లల్లో ఉన్నారు గాబట్టి , బతికి పొయ్యారు. మమ్మల్ని చూస్తూనే బావురు మని చుట్టు కొన్నారు . వాళ్లకి ధై ర్యం చెప్పి డాక్టర్ గారిని కలిశాను .
''కేసు చాల సీరియస్ మూర్తి గారు .వెంటనే హైదరాబాద్ కి షిఫ్ట్ చెయ్యాలి .లేదంటే ఇద్దరికీ ప్రాణా ప్రాయమే! అతనికి షుగర్ హై ఉంది . బిపి లో లెవెల్ కి పడి పోయింది . ఆమెకు ముఖమంతా గ్లాస్ ముక్కలు ఇరుక్కు పొయ్యాయి . ఎవరో యాదగిరి అని ఆయన రోడ్డు మిద పడి ఉన్నమీ వాళ్ళ నందరిని వ్యాన్ లో ఇక్కడికి తీసుకొచ్చాడు .''అన్నాడు డాక్టర్ గారు.
వెంటనే ఒక వ్యక్తీ చేతుల్లో మందులతో , టిఫిన్ పాకేట్లతో లోపలి కొచ్చాడు .
''ఇతనే యాదగిరి ''అన్నాడు డాక్టర్ గారు.
''నమస్కార మండి . మీరు చాలా సహాయం చేశారు . చాలా థాంక్స్ '' అన్నాను నేను .
''దాని కేముంది సారూ ! మనం వెంటనే వీళ్ళను హైదరాబాద్ కి తీసుకెళ్ళాలి ''అన్నాడు యాదగిరి .
నాకు చాలా భయమేసింది . వెంటనే అంబులెన్సు లు రెండు తెప్పించాను . ఆక్సిజన్ సిలిండెర్ లతో ఇద్దరి ముఖాలకి వెంటిలేటర్ పెట్టారు అక్కడున్న సిస్టర్స్. అన్నీ సర్దుకొన్నాక ,ఒక గంటలో హైదరాబాద్ వైపు బయలు దేరినాము . యాదగిరి ఒక అంబులెన్సు లో కూర్చొన్నాడు . పిల్లల్లిద్దరు మా కార్ లోనే కూర్చొన్నారు . వెక్కి వెక్కి ఏడుస్తున్న వాళ్ళను సముదాయించడం చాలా కష్టంగా ఉంది .
ఆక్సిడెంట్ కేసు గాబట్టి ప్రవేట్ హాస్పిటల్స్ వాళ్ళు చేర్చు కోరన్నారు నా ఫ్రెండ్ . అందుకే నిమ్స్ ఆసుపత్రి కి తీసుకెళ్ళాను . ఎమెర్జెన్సి వార్డ్ లో ఇద్దర్ని అడ్మిట్ చేసాము . యాదగిరి నా పక్కనే ఉండి , అన్ని సహయం చేస్తున్నాడు .రాత్రి పది గంటల సమయంలో పిడుగు లాంటి వార్త వినవలసి వచ్చింది . సూర్యా రావు భార్యను డాక్టర్లు సేవ్ చెయ్యలేక పొయ్యారు . సూర్యా రావు ఇంకా అన్ కాంషియస్ గానే ఉన్నాడు . సూర్యా రావు బంధువుల కందరికీ ఈ దుర్వార్త తెలిసి , మార్చురీ నుండి తీసుకెళ్ళే సరికి మరసటి రోజు ఉదయం పది గంటలు దాటింది .
సూర్యారావు విషయం ఇప్పుడే ఏమి చెప్పలేమని అన్నారు డాక్టర్లు . బిపి , షుగర్ కంట్రోల్ కి వచ్చా యన్నారు.
యాదగిరి ని పిలిచి'' మీరింక రెస్ట్ తీసుకోండి సర్ . మీకు చాలా ఇబ్బంది కలిగింది . మీ ఋణం ఎలా తీర్చు కోవాలో అర్థం గాలేదు '' అని అయన చేతిలో ఒక ఐదు వేల రూపాయలు పెట్ట బోయ్యాను.
యాదగిరి మొహం కొంచెం ఇబ్బందిగా పెట్టి , ''నేను పైసల కోసం ఈ పని చెయ్యలేదు సారూ ! ఆ సమయానికి నేను అక్కడే ఉన్నాను . మానవతా దృష్టి తో నేను వాళ్ళకు సహాయం చేశాను . అంతే గానీ ఏదో ఆశిం చి గాదు. '' అని సుతారంగా నా చెయ్యి వెనక్కి తోశాడు .
నా కప్పుడు అర్థ మయింది . ఇతను మామూలు మనిషి గాదని . ఒక దేవుడి రూపంలో వచ్చిన మనిషని .
వారం రోజుల తర్వాత సూర్యారావు ని డిస్సార్జ్ చేశారు . యాదగిరి కి చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పుకొని అతని అడ్రస్సు వివరాలు అడిగాను . ముందు చెప్పడానికి ఒప్పుకోక పోయినా , రామంత పూర్ , సాయిబాబా గుడిపక్కన మా ఇల్లు అన్నాడు .అతని దగ్గర మొబైల్ ఫొను గూడా లేదు .
సూర్యా రావు భార్య మరణాన్ని తట్టు కోలేక పోతున్నాడు . మానసిక వ్యధతో పిచ్చివాడిలా మారి పొయ్యాడు . ఒక్క రోజు నా దగ్గరికి వచ్చి ఉద్యోగం మానేస్తున్నాని చెప్పాడు . మా పక్క నున్న ఇల్లు గూడా ఖాళీ చేసి పిల్లల్ని తీసుకొని వెళ్లి పొయ్యాడు . మాకు చాలా బాధ వేసింది .
ఒక్కోసారి అనుకోకుండా వచ్చిన సమస్యలు మనుషుల్ని ఎలా కృంగ తీస్తాయో , మానసికంగా వాళ్ళని ఎలా పిచ్చి వాళ్ళని చేస్తాయో సూర్యారావు కథే ఒక ఉదాహరణ .
సూర్యా రావు ని చూసి ఆరు నెలలయింది . గానీ నాకు సూర్యా రావు విషయం కంటే , యాదగిరి గారి మీద ఎక్కువగా నా మనస్సు వెడుతోంది .ఆతను ఎలా ఉన్నాడో , అసలు ఏమి చేస్తున్నాడో అన్న కుతుహలంతో ఒక ఆది వారం రామంత పూర్ సాయిబాబా గుడి దగ్గర వాకబు చేశాను. అక్కడ అతని గురించి చెప్పే వాళ్ళు ఎవరూ లేరు , సరే అని సాయి బాబా గుడి లోని పూజారిని అడిగాను. ''యాద గిరి ఇక్కడే ఉండే వాడండి .ప్రతి రోజు గుడికి ఆరతి సమయానికి వచ్చే వాడు . ఆరోగ్యం బాగాలేదని వాళ్ళ స్వస్థలం నల్ల గొండ కి వెళ్లి పొయ్యాడు . ఇక ఇక్కడికి రానని చెప్పాడు'' అన్నారు పూజారి గారు.
''అడ్రస్సు ఏమైనా చెప్పాడా అండి '' అని అడిగాను నేను.
నల్లోగొండ మునిసిపల్ హై స్కూల్ పక్కనున్న బస్తి లో ఉంటానని చెప్పాడు '' ఆన్నారు పూజారి గారు .
సరే నని మళ్ళి ఇంటి ముఖం పట్టాను .
ఒక్క రోజు అనుకోకుండా సూర్యా రావు దిగ బడ్డాడు. మనిషి చాల హుషారుగా ఉన్నాడు . కళ్ళల్లో గూడా వెలుగు కన్పిస్తోంది . బాగా డబ్బులున్న అమ్మాయిని మళ్ళి పెళ్లి చేసుకోన్నానని , పిల్లలిద్దర్ని విజయ వాడ హాస్టల్ లో చేర్పించానని , ఇప్పుడు వైజాగ్ లో జాబ్ చేస్తున్నానని చెప్పాడు .
''సరే నువ్వు బాగుంటే మాకు అదే చాలు రా ''అన్నాను నేను.
''సరే నీ ప్రాణాలు కాపాడిన యాద గిరి అనే అతను నీకు గుర్తుందా ?'' అని అడిగాను.
తల అడ్డంగా ఊపాడు గుర్తు లేదంటూ .
''అతన్ని కలవడానికి రామంత పూర్ వెళ్ళాను . ఎక్కడో నల్గొండ లో ఉన్నాడంట . మనం తప్పని సరిగా అతన్ని చూడడానికి వెళ్ళాలి . వస్తావా ?''అని అడిగాను .
''ఒరేయ్ మూర్తి ! దారిన పొయ్యే దానయ్యల్ని నెత్తి కెక్కించు కొన్నా వంటే నీ పని గోవిందా అవుతుంది . నీ పని నువ్వు చూసుకొంటే నువ్వు బాగు పడతావు '' అని చెప్పి వెళ్లి పొయ్యాడు వాడు .
ఆశ్చర్య పొయ్యాను నేను. ముక్కు మొహం తెలియని వాళ్ళ ప్రాణాల్ని రక్షించడమే గాకుండా వారం రోజుల పాటు మనతోనే ఉండి ఏమీ ఆశించ కుండా వెళ్ళిన ఒక మానవతా మూర్తి ని గురించేనా వీడన్నది . నాకు దుఃఖం పొంగు కొచ్చింది . సూర్యా రావు అంటే ఆసహ్యం వేసింది . ఎలాగైనా యాదగిరి ని కలవాలనే దృఢ సంకల్పం నాలో కలిగింది .
కొన్ని రోజుల తర్వాత ఓ ఆది వారం నల్లగొండ కి బయలు దేరాను . మునిసిపల్ హైస్కూల్ పక్కనున్న బస్తి లో విచారించాను . యాదగిరి ఉన్న ఇంటికి ఒకతను తీసుకెళ్ళాడు . ఒక చిన్న పెంకుటిల్లు . ఇంట్లో ఎవరు లేరు . ఒక నులక మంచం మిద చిక్కి శల్యమై పడి ఉన్న యాదగిరి కనబడ్డాడు . యాదగిరి తొందరగా పోల్చుకోలేక పోయినా , అన్ని వివరించే సరికి గుర్తుకు తెచ్చుకొని సంతోషించాడు . వారం రోజుల పాటు అక్కడే ఉండి , యాదగిరిని మంచి హాస్పిటల్ కి తీసుకెళ్ళి సపర్యలు చేశాను . మనిషి వారం రోజుల్లో బాగా తేరు కొన్నాడు .యాదగిరి పెళ్లి చేసు కోలేదు , నా అనే వారు లేరు . వారం రోజుల తర్వాత ఒక ఐదు వేల రూపాయలు చేతిలో పెట్టి ,అవసరం ఉంటే నాకు వాకబు చెయ్యమని నా అడ్రస్సు , ఫోన్ నంబర్ ఇచ్చాను . యాదగిరి కళ్ళల్లో కన్నీళ్ళు ధారా పాతంగా జారుతున్నాయి .
ఈ ప్రపంచలొ ఋణాను బంధాలు చాలా విచిత్రంగా ఉంటాయి . యాదగిరి ఎవ్వరో! నేనెవ్వరో ! గాని ఏదో అనుబంధం మా ఇద్దరినీ కట్టి పడేస్తోంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంభంధాలే అన్న మాట మా ఇద్దరిమధ్య నిజం గాదని పించింది. ఎక్కడో ఎందుకో ఎవరో మనకు కొందరు తారస పడుతుంటారు.ఎన్నో జన్మల నుండి మనకు వారితో అనుబంధం వుందనిపిస్తుంది.వాళ్ళు చెప్పిన కొన్ని వాక్యాలు మన జీవితాలనే మారుస్తాయి.వాళ్ళతో రెండు క్షణాల పరిచయం మన ఎద లోతుల్ని తట్టి లేపుతాయి.జీవన సత్యాలు కొన్ని మనకు అసత్యాలుగానే అన్పిస్తాయి.అపరిచిత వ్యక్తుల అవ్యక్త సహాయాలు మనం ఇట్టె మరచిపోతాము.వాళ్ళ కోసం మనం మళ్లీ వెతికినావాళ్ళు మాయ మైపోతారు
వాళ్ళే నేమో మనుషుల్లో తిరిగే దేవుళ్ళు !
సరిగ్గా ఆరు సంవత్సరాల తరువాత…
సూర్య రావు మళ్లి మా ఇంటికి వచ్చాడు . ఈ సారి కడు దైన్యంగా కనిపించాడు . మాసిన గడ్డం, పాలిపోయిన ముఖం, కళ్ళ కింద నల్లటి చారలు , పాత బడి నలిగి పోయిన బట్టలు తో కన బడ్డాడు .
'' రాజులా ఉండే వాడివి . ఏమిటి ఇలా నల్ల పూస అయి పోయ్యా వు?'' అని అడిగాను . వాడి కి దుఃఖం పొంగుకొచ్చింది .
''నా జీవితం లో అన్ని విషాదాలే రా ! ధన వంతుల అమ్మాయి అని పెళ్లి చేసు కొంటే , అది ఎవరో బొంబాయి సినిమా డైరెక్టర్ వలలో పడి ముంబయి కి చెక్కేసింది . ఇక నా పిల్లల్ని హాస్టల్ చేర్పించినా చెడు సహవాసాలు మరిగి ఇంటర్ కోర్సు గూడా నాలుగు సార్లు ఫెయిల్ అయి కూర్చొన్నారు . ఏం చెయ్యాలో దిక్కు తోచ డం లేదు '' అని అన్నాడు .
''భయ పడద్దురా సూర్యా ! కష్టాలు కల కాలం ఉండవు . కష్టాలు మనుషుల కు కాక పొతే మానులకు వస్తాయా ?'' దిగులు పడుతున్న వాణ్ణి చూస్తే జాలేసి , కొన్ని ధైర్య వచ నాలు చెప్పాను.
''మరి నీ పిల్లలు .. ''
''నా పిల్లలు ఎం ఎస్ అని అమెరికా కి వెళ్లారు . వాళ్లకి అమెరికన్ యూనివర్సిటీ తరపున స్కాలర్ షిప్ గూడా దొరికింది . పెద్ద వాడికి కాంపస్ సెలక్షన్ లో జాబ్ గూడా వచ్చింది '' అన్నాను నేను .
''ఎలాగయినా నువ్వు అదృష్ట వంతుడువిరా!'' అన్నాడు వాడు
''నువ్వు మనసున్న మనిషి వి రా అందుకే దేవుడు నీకు మేలు చేశాడు ''
''మనందరికంటే ఒక గొప్ప మనసున్న మనిషని నువ్వు చూడడానికి గూడా నోచు కోలేదు రా ! అది నీ దురదృష్టం”
''ఎవరతను ''ఆశ్చర్యంగా చూశాడు సూర్యా రావు నా వైపు .
''యాదగిరి గారు'' అన్నాను నేను.
సూర్యా రావు కళ్ళల్లో ఉబికి వస్తున్న కన్నీటిని గమనిస్తూనే ఉన్నాను నేను .
|