ఏంట్రా పొద్దున్నే మీ అమ్మని సతాయిత్తన్నావు .కళ్ళు నులుముకుంటూ లేచాడు సూరయ్య.
ఆ మాటలకి,అతని భార్య లచ్చవ్వ , ఏం లేదయ్యా. ఈయాల ఆడి కాలేజీ పిల్లగాల్లంతా కలిసి పిక్నిక్కికీ పోతన్నారంట. కూడా ఆడపిల్లలు కూడా వత్తారంట.పాత చొక్కాలు ఏసుకెళ్ళేది ఎట్టా అంటన్నాడు.అన్నిట్లోకి బావున్న ఓ చొక్కాకి జేబు కాడ కన్నం ఉంది.ఎలకలు తిరుగుతున్నై కదా ఇంట్లో.ఈ సిరుగు కనబడకుండా కుట్టమని పేణo తీత్తనాడు.చెప్పిందామె ,తన చేతిలోని చొక్కాకున్న చిరుగుని సూరయ్యకి చూపుతూ.
ఆ,ఆ ,అర్దమైనాది.ఆవ్ అంటూ ఓ క్షణం ఆవలించి,పైకి లేస్తూ,ఆ సొక్కా ఏసుకు పోవాలంటే కట్టవే.అది మీ అమ్మేటి కుడతాది కానీ,తానం సేసిరా.ఇద్దరం అంగడికి పోదాం.ఆడ, ఆ రావుడి గాడి కొట్లో కొత్త సొక్కా కొంటాలే .కానీ ఒరే అయ్యా,మళ్ళీ సంవచ్చరo వరకూ కొత్త సొక్కా అడగమాక .చెప్పాడు సూరయ్య,తను పడుకున్న చాపని చుట్టేసి ఓ మూలగా పెట్టేస్తూ.
తండ్రి మాట వింటూనే చంద్రం కళ్ళు మెరిసాయి.కొత్త చొక్కా.అబ్బా.భలే.కొత్త చొక్కా కొనుక్కుని రమా రమి మూడేళ్లు కావస్తోంది.ఎప్పుడూ ఆ వేసిన చొక్కాలే.వేసి వేసి విసుగు వచ్చేసింది.అవునూ ఇంతకీ ఏ రంగు చొక్కా కొనుక్కోవాలి.అని ఆలోచిస్తున్నవాడల్లా ,అమ్మో, నాన్నా అంగడికెళ్దామన్నాడుగా .ఆలస్యం అయిపోతుంది అనుకుంటూ,త్వర త్వరగా స్నానం చేసి తయారయిపోయాడు.తర్వాత తండ్రితో కలిసి,ఆ పల్లెటూళ్లోనే పెద్ద అంగడికి బయల్దేరాడు.దారిలో రోడ్డు పక్కగా ఆపి ఉన్న కొత్త ఆటోని చూస్తూ,ఒరే అయ్యా,ఇట్టాంటి ఆటొ కొనుక్కోవాలనుందిరా.ఇంకా ఎంతకాలం ఆ బస్సు కాంప్లెక్సుల్లో పేలాల పేకెట్లు అమ్ముతాను.రోజు రోజుకీ కొనేవోడే కరువైపోతుంటేను.అంటూ ఆ ఆటొని ప్రేమగా తాకాడు సూరయ్య.
ఏంటి నాన్నా నువ్వు.ఆ ఆటొ కి ఉన్న మురికి నీ చేతికి అంటగలదు.ముట్టుకోకు.చెప్పాడు చంద్రం.తర్వాత ఇద్దరూ,అంగడిలో రాములు బట్టల దుకాణం అన్న బోర్డు ఉన్న కొట్టు దగ్గర ఆగారు.ఇద్దరూ దుకాణంలోకి వెళ్లారు.
ఏం కావాలి.అడిగాడు రాములు,వారి వంక కొంచెం చిరాగ్గా చూస్తూ.
మా అబ్బాయికి ఓ కొత్త సొక్కా కావాలి.కొంచెం తక్కువలో.అంటే నూటెబై అలా.కానీ పేషనుగా ఉండాలి.మావోడు పట్నం గవర్మెంట్ కాలేజీలో ఇంటెర్మిడేట్ సదువుతున్నాడు మరి.చెప్పాడు చిన్న నవ్వుతో పిల్లాడిలా మురిసిపోతూ.
సరే,సరే .అని సైజు కనుక్కుని కొన్ని చొక్కాలు బయటకు తీసాడు.వాటిలో పసుపు రంగుపై నల్ల గీతల చొక్కా చాలా నచ్చింది చంద్రానికి.నాన్నా ఈ చొక్కా చాలా బావుంది చెప్పాడు సంతోషంగా.
అట్టనా .అయితే అదే తీసుకోయ్యా.ఆ సొక్కా ఎంత రాములూ.?
అదయితే మరో ముప్పై ఎక్కువవుద్ది.అంటే మొత్తం నూటఎనబై రూపాయిలు.చెప్పాడు.
సరే రాములు, అట్టనే.కానీ పేలాల పొట్లాలు అమ్మేసాక, సాయంకాలం తెచ్చి ఇచ్చేత్తాను.ఇప్పుడు నాకాడ నూటెబై మాత్రమే ఉంది.కొంచెం సూడు.ఎందుకంటే మా వోడు ఆడి స్నేయితుల్తో కలిసి పిక్కినికికి ఎల్తన్నాడు.చెప్పాడు సూరయ్య చిన్న చిరునవ్వుతో బ్రతిమాలుతున్నట్టుగా.
పో,పోరా చావు గిరాకీ.పొద్దునే ఎదవ నాంచుడు బేరాలు.ఇదే పట్నంలో అయితే ఎయ్యి రూపాయిలు.కాపోతే అందంగా అద్దాల గదుల్లోనూ,చల్ల గదుల్లోనూ పెట్టి అమ్ముతార్రా సూరిగా.పో పోరా.అని విసుగుతుండగానే,నాన్నా నాకు ఈ చొక్కా వద్దు.దీనికి రెండు బొత్తాలు లేవు.పైగా కాలర్ దగ్గర కూడా కొంచెం మాసింది.అంటూ ఆ చొక్కాని తండ్రికి చూపాడు చంద్రం.
సుసావా రాములు.సొక్కాలో ఎన్ని లోపాలున్నాయో .వాడేసిన బట్టలు గానీ మాకు అమ్మాలని సూత్తనావ.మాకు నీ సొక్కా వద్దూ.నీ కొట్టూ వద్దూ.రారా అయ్యా. మనం వేరే దుకాణానికి పోదాం.అంటూ లేవబోయాడు సూరయ్య.
ఏంట్రా సూరిగా.అలా లేచెల్లిపోబోతున్నావ్.పాత స్టాకు కదా.చిన్న లోపాలుంటాయి.కోప్పడకురా .సరే ముప్పై రూపాయిలకేటుంది కానీ ,నువ్వడిగిన ఆ నూటెబైకే తీసుకెళ్లు.గుండీలేగా.ఏవోటి కుట్టుకుంటే చొక్కా బంగారంలా ఉంటాది.చెప్పాడు రాములు,కాస్త దిగువ స్వరంతో బ్రతిమాలుతున్నట్టు.
ఆ మాటలకి సూరయ్య,సరే అట్టనే కానీ.ఏరా అయ్యా నీకు సరేనా మరి అడిగాడు చంద్రాన్ని.
సరే నాన్నా.చెప్పాడు చంద్రం ముక్త సరిగా.ఆ చొక్కా తీసుకుని,ఇద్దరూ దుకాణం లోనుండి బయటికి వచ్చారు.ఏరా అయ్యా .ఆ చొక్కాకి సరిపడా రంగు బొత్తాలు మనింట్లో ఏడున్నాయి.మన టేలరు అప్పలరాజు కాడికి పోదామా ,సక్కగా కుట్టిపెడతాడు.అడిగాడు.
ఎందుకూ నా దగ్గర అచ్చం అలాంటి గుండీలు ఉన్నాయిలే చెప్పాడు చంద్రం.
అట్టనా. నీ కాడ అలాంటి గుండీలు ఎలా.అడిగాడు ఆశ్చర్యంగా.
ఎలా అంటే ఇలా అంటూ రెండు బొత్తాలని తీసి తండ్రికి చూపాడు చంద్రం.
ఇంకా ఆశ్చర్యపోతూ, అరె, అదే రంగు అదే రకం బొత్తాలు నీకెట్టా వచ్చాయి.
ఎలా అంటే ఇందాక ఆ రాములు నిన్ను ముప్పై రూపాయిల గురించి అన్ని మాటలనేసరికి నాకు బాగా బాధనిపించింది.ఈ చొక్కా వద్దని చెప్పాలనిపించింది.కానీ మామూలుగా వద్దంటే,కొనే స్తోమత లేనపుడు ఎందుకు రావడం లాంటి సూటి,పోటు మాటలు అంటాడనిపించి,రెండు బొత్తాలు తీసేసి,ఈ బొత్తాల్లేని చొక్కా మాకు వద్దనే వంకతో,మన ఆత్మాభిమానం దెబ్బతినకుండా మనo బయటపడొచ్చని అలా చేశా నాన్నా.కానీ వాడు తగ్గించి మనకే ఇస్తాడనుకోలేదు.చెప్పాడు చంద్రం,తండ్రి వంక కాస్త బెరుకుగా చూస్తూ.
ఆ మాటలు విన్న సూరయ్య ,నువ్వు కూడా నాలనే ఆలోసించావ్.అంటూ చిన్నగా నవ్వేసి, ఆ కాలరు మాపింది నేనే.ఇందాక ఆటొ ముట్టినప్పుడు చేతికైనా దుమ్ముని కొంచెం చొక్కాకి రాసి,మురికిగా ఉంది మాకొద్దు అనే వంకతో బయటపడొచ్చని నేనూ అలా సేశా.కానీ యాపారం సేసేవోడు లాభం సూసుకుంటాడుగా.సాయంత్రం ఆడికి ఎదోటి సెప్పి ఆ ముప్పై ఇచ్చేస్తారా అయ్యా.దీనిని బట్టి నువ్వు అర్దం సేసుకోవాల్సింది ఏటంటే మనం సేతనైతే ఒకరికి సాయపడాల లేదా మానేయాల .అంతే కానీ , ఏ వ్యక్తి ఆత్మాభి మానాన్నీ
దెబ్బతీసేలా, కించపరిచీలాగా మాట్టాడకూడదు.మనలాగే ఎంతో బాధపడతారు .సూరయ్య చెప్తూ నడక ప్రారంభించగానే ,చంద్రం అనుసరించాడు.
|