Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
satyamevito

ఈ సంచికలో >> కథలు >> అనగనగా ఓ వాన

anaganagaa o vaana

నల్లగా...దట్టంగా.. మేఘాలు.

నీలాకాశం కింద నలుపెక్కి...బరువెక్కి...ఇప్పుడో అప్పుడో చినగడానికి సిద్ధంగా ఉన్న పేద్ద గోనె సంచుల్లా ఊగుతున్నాయి! అప్పటి దాకా ఎక్కడున్నాయో...ఇంత లోనే ఎలా వచ్చాయో... కదలి పోతాయో... కరిగి పోతాయో.  తనపై అలుముకున్న... పులుముకున్న మబ్బుల్ని చూడగానే నగరం వెన్ను వణికింది.  సాయంత్రం 5 గంటలకే కటిక చీకట్లు ...మబ్బుల్ని చిల్లు పొడిచి చినుకుల్ని కసి దీరా నేల కేసి కొట్టేందుకు కుట్ర కుట్రగా కమ్ముతున్నాయి.

దఢేల్‌...!!

పిడుగులు ఒక్కసారిగా పగిలినట్టు భయంకర శబ్దం. మేఘం సంచి సర్రున  చిరిగి పోయింది.  చినుకులు పై నుంచి  బాణాల్లా వేటాడుతూ వెంటాడుతూ...జనాలు కంగారుగా రాసుకుంటూ తోసుకుంటూ పరుగులు తీస్తున్నారు. ఉగ్రంగా... మహోగ్రంగా...ఆకాశ గంగ దుముకుతోంది. డీటీహె చ్‌ సౌండ్‌లా చినుకుల చప్పుడు . బస్సుల రంకెలు...కారుల కుయ్యో మొర్రలు వినిపించనంతగా శబ్దిస్తూ  చినుకులు!

––– –––  ––––

పంజాగుట్ట బస్టాప్‌. చినులు మేకుల్లా గుచ్చుతున్నాయి. ఉండి ఉండి వీస్తున్న ఈదురు గాలికి చినుకులు ఓ వైపుగా ఒరిగి పోతున్నాయి. పార్టీ పిరాయిస్తున్న నేతల్లా. బస్టాప్‌ గా పిలుచుకునే చెప్పుల దుకాణం ముందు జనాలు. పైసా బేరం లేదు...షాపు ముందు జనం జాతర. వర్షం అంతకంతకు విజృభిస్తుంటే ఓనరు మాత్రం ఏం చేస్తాడు. అటూ ఇటూ కదులుదామంటే అష్ట దిగ్బంధం! కుడి వైపు చిన్న సైజు కొండలా  ఓ మహానుభావుడు... ఎడం వైపు ఓ  మాటి మాటికీ చేతుల్తో చినుకుల్ని తరిమేస్తున్న పట్టుచీరావిడ! ముందేమో సరిగ్గా ముక్కుకు తలానిస్తున్న మిస్టర్‌ ఉద్యోగం!  చెవికి ఫోన్‌...తలూపుతున్నప్పుడల్లా వెనకటి క్రాపు వెంట్రుకొకటి తుప్పుపట్టిన మేకులా... ముక్కుకు రాసుకుంటోంది. తుమ్ముదామంటే చుట్టు పక్కల తలలు! అసలు ఈ ఉద్యోగంని కాదు వీడికి కటింగ్‌ చేసిన ఆ వెధవాయిని వాయించాలి! కనీసం  వీడు గుండు కొట్టించుకున్నా బావుణ్ను.  ఆ తిరుపతికో ...ద్వారకా తిరుమలకో... యాదగిరి గుట్టకో నీ వెంట్రుకల్ని ఇచ్చేసుకోవయ్యా మిస్టర్‌ ఉద్యోగం ప్రమోషన్‌ గ్యారంటీ వచ్చుద్ది . కనీసం  నీ వెనకోళ్లకి ఇరిటేషన్‌ అయినా తగ్గుద్ది. ఏంటో ఈ చెత్తాలోచన్లు! చీకాకు పెరిగితే ఇంతేనేమో!!

–––

ధారాళంగా వర్షం. కుంట్ల జలపాతంలా!!

రోడ్డుపై మడుగు కడుతున్న నీళ్లు. ఒబెసిటీతో బాధపడుతున్న మనిషిలా మెట్రోబస్సు బరువుగా మడుగులో ఈదుకుంటూ వచ్చింది. వెనక గొట్టం నుంచి దట్టంగా పొగ .అందరిపై నల్ల దుప్పట్లా పరచుకుంటోంది. బస్సు చూడగానే గుంపు జనం ఒక్క సారిగా కదిలాం. రాసుకుంటూ...తోసుకుంటూ... తిట్టుకుంటూ!  చేతిలో లంచ్‌ బ్యాగ్‌ గట్టిగా పట్టుకుని గుంపు చీల్చుకుంటూ  బస్సు డోర్‌ వద్దకి చేరుకున్నా. బైటెంతో లోపల అంతే జనం! సీనియర్‌ సిటిజన్స్‌ సీటు ఒకటి ఖాళీగా ఊరిస్తోంది. పంటి బిగువున శక్తి కూడ దీసుకున్నా!  అబ్బా నాకాలు ... ఏంటి తొక్కేస్తున్నారు... ఆగవయ్యా కనపడట్లా... ఎవ్వడేమన్నా బేఖాతర్‌! అర్జునుడికి చెట్టు కొమ్మపై పక్షి కన్నుమాత్రమే కనిపించినట్టు నాకు సీటు తప్ప మరేదీ కనిపించట్లేదు...వినిపించట్లేదు. కాస్త దగ్గరవగానే చేతిలో బ్యాగు సీటులోకి గిరవాటేశా! హమ్మయ్యా సీటు దొరికినట్టే. పక్కన ఓ అమ్మాయి కూచోనుంది. నా అవస్థ చూసి ‘అంకుల్‌ ఆ సీట్లో నీళ్లు...’ అంది. అర క్షణం ఆలోచించా... పంజా గుట్ట నుంచి కొత్త పేట. నో ఆప్షన్‌.. సీట్లో కూలబడ్డా! స్పాంజి  సీటులోంచి నీళ్లు ఒక్క సారిగా ఊరి ప్యాంటుకు చల్లగా తాకాయి.  బోర తెరచుకుని  విండో గ్లాసు. చినుకులు లోనికి వచ్చేస్తున్నాయి. రెండు చేతుల్తో డోర్‌ లాగుతున్నా. ‘అది రాదంకుల్‌’ పక్కనున్న అమ్మాయి . మళ్లీ సీట్లో కూలబడ్డా.  సీటు కింద తడికి...పక్కనుంచి గుచ్చుకుంటున్న చీదర చినుకులకి శరీరం ట్యూన్‌ అయింది. అయినా బస్సులో సీటు దొరకబుచ్చుకోవాలంటే అంత వీజీ కాదు. దానికి బోల్డెంత అదృష్టం...కాసింత టెక్నిక్‌ ఉండాలి. ఇంతలో  డోర్‌ వద్ద కొండల్రావ్‌...అదే చిన్నసైజు కొండలా బండాయన కనిపించాడు. వెనకాల జనం గోల గోల . వీడు ఓపట్టాన డోర్లోంచి రావట్లేదు. బైట వర్షంలో జనాలు అసహనంగా. లోపల్నుంచి ఎవరో  చేయి పట్టి లాగేశారు. ఓ పేద్ద లగేజీలా బస్సులో పడ్డాడు. కొండల్రావ్‌ని తోసుకుంటూ జనాలు బిల బల వచ్చేశారు.  ఎదర సీట్లో  ఆరు సార్లు కిందకి దిగాలని సీట్లోంచి లేచి కూర్చొన్న ఆవిడ మరో సారి లేచింది. పక్కనే నిలుచున్న పట్టు చీర కోపంగా  ‘వెళ్లాలంటే వెళ్లు...ఎన్నిసార్లలా లేచి కూచోడం...’అంటోంది అసహనంగా!

–––

బస్సు కదులుతోంది భారంగా అటూ ఇటూ ఊగుతూ! వర్షం కుమ్ముతునే ఉంది.

రోడ్డు కిరువైపులా మోతెక్కి పారుతున్న నీళ్లు . .కొట్టుకు పోతున్నట్టు కార్లు...మోటారు సైకిళ్లు...ఆటోలు...జనాలు. నీళ్లలో మెరుస్తున్న సిటీ లైట్లు . ఈ వర్షం ఓ పట్టాన తగ్గేట్టు లేదు. రాత్రి వచ్చిన వర్షం...బంధు గణం ఓ పట్టాన పోవని అమ్మ అంటూండేది. సీటు వెనక్కి ఆనుకున్నా వీపుకు నీళ్లు తగులుతున్నాయి.  సోమాజీ గూడా... కండక్టర్‌ కేకలు. “ టికెట్‌ తీసుకోండి...పాస్‌ చూపించండి...నెక్ట్స్‌ స్టాప్‌ చెకింగ్‌...” నవ్వొచ్చింది. వీడి బండపడ! అసలే వర్షం ఉతికి ఆరేస్తుంటే...చెకింగ్‌ ఏంట్రా బాబూ!  బస్సాగింది. నలుగురు దిగారు...పది మంది ఎక్కారు! ఓ ముసలావిడ ఆపసోపలు పడుతూ వస్తోంది. పక్కనున్న అమ్మాయి వైపు జాలిగా చూశా! ఆ పిల్లా బిక్కుబిక్కుమంటూ చూసి కళ్లు మూసుకుంది...దొంగ నిద్ర! పాపం ప్లాన్‌ ఫెయిల్‌... సరిగ్గా ఆ ముసలావిడ వచ్చి నిలుచుంది. వెనకాల కూతురు కామోసు...‘హలో...’ అమ్మాయిని కదిపింది. క్షణం తర్వాత సీట్లో ముసలావిడ...నీరసంగా నిలుచున్న అమ్మాయి.   వర్షంలో పూర్తిగా తడిసిన ముసలావిడ వణికి పోతోంది.

‘అమ్మా... తుడుచుకోవే...’కూతురు నాప్‌కిన్‌ ఇచ్చింది.

‘చలిగా ఉందే...’

‘ఎందుకుండదూ...చెబితే విన్నావా. ఎలా బడితే అలా తిరగొద్దనీ’’

‘నాకేం తెలుసే వర్షం వస్తుందనీ’

‘... ఇంట్లో మూలలో కూర్చొని నావల్ల కాదే. పొద్దు పోదు’

‘ఆ...ఇప్పుడు పోతుందిగా. ఇల్లు  చేరే సరికి అర్ధ రాత్రో అప రాత్రో ’మాటల్లో భరించ రానంత విసుగు.

ముసలావిడకు ఏడు పదుల వయసనుకుంటా...చర్మం ముడతలు దేరినా...నిమ్మ పండు ఛాయ! ఆ కళ్లల్లో ఎన్నెన్ని ఆకాంక్షలో! అంత తడి లోనూ చుట్టు పక్కల జనాల్ని చూసి మురిసి పోతోంది. లైఫ్‌ రీఛార్జి చేసుకుంటోందేమో!

–––

ఉన్నట్టుండి బస్సు ఆగింది తూగింది. డ్రైవరు ఫ్రంట్‌ బ్రేక్‌ కొట్టినట్టున్నాడు. జనాలు తూలారు. పర్సు లోంచి డబ్బు తీద్దామనుకున్న ఓ అమ్మాయి దబేల్న పడింది. అరెరె...అయ్యయ్యో... పడి పోయింది...పడి పోయింది... చుట్టు పక్కలోళ్లు లేవదీస్తున్నారు. ఆ అమ్మాయి పర్వా లేదని వారిని సున్నితంగా తప్పించు కుంటోంది.

‘కాస్త చూసి నడపొచ్చుగా...ఫ్రంట్‌ బ్రేకు వేసేయడవే!’ కొండల్రావ్‌ కేకెట్టాడు.

‘అమ్మాయి ఏం తాక లేదుగా...’ పక్కామె అడుగుతుంటే...ఆ వైపున నిల్చున్న పట్టు చీర...‘అరె మోచేతికి దెబ్బ తాకినట్టుందే’ పరామర్శతో కూడిన ఆరా. అసలే మర్యాద పోయినట్టు ముడుచుకు పోయిన ఆ అమ్మాయి కళ్లల్లో విసుగు. ఏం మాట్లాడక పైన స్ట్రిప్‌ పట్టుకుంది.

–––

బస్సు కదలట్లేదు. కొంప దీసి రిపేరా? ద్యావుడా!

సీట్నుంచి కాస్త లేచి చూశా. బస్సు ముందర బైకు. వాడు తన ముందున్న ఆటో వాడితో గొడవ పెట్టుకున్నాడు. హోరు వర్షంలో  ఇద్దరూ అంత కన్నా హోరుగా వాదించుకుంటున్నారు. బస్సు వెనక పది స్కూటర్లు...మరో పది ఆటోలు...ఓ రెండు మూడు లావు పాటి బస్సులు ..బొయ్‌...బొయ్‌...అంటున్నాయి. కండక్టరు కిందకి దిగి వారిద్దరికి సర్ది చెప్పి దారి చేశాడు. హమ్మయ్యా బస్సు కదిలింది. వర్షం తన పని తాను చేసుకు పోతోంది.

–––

‘క్యుములోనింబస్‌ మేఘాలట! అవి వచ్చాయంటే కుమ్మేస్తాయంతే!’ వెనక గుంపులో ఒకాయన అంటున్నాడు.

‘ఆ ఏం నింబస్సో! అయినా  సిటీలో కురిసి ఏం లాభం...పొలాల్లో కురవాలి గానీ’ ఎవరా అని తల తిప్పి చూశా! అరె మన ఉద్యోగం! ఏం సెబితిరి...ఏం సెబితిరి...ఆర్డరేసినట్టు వర్షం వస్తే ఎంత బావుణ్నో!

‘మీకు తెలుసా...ఈ క్యుములోనింబస్‌ మేఘాలు అప్పటికప్పడే తయారవతాయట! కొండల్రావ్‌ ఉవాచ!

‘ఇనస్టంట్‌ కాఫీ లాగానా...’ మిస్టర్‌ ఉద్యోగం వెటకారం.

‘అలాంటిదే అనుకోండి. గత వందేళ్లుగా నగరంలో అక్టోబర్‌ నెలల్లో ఇలాంటి వర్షం పడ లేదట’ విజ్ఞానంతో యిరగ దీస్తున్నాడు కొండల్రావ్‌. పేపర్‌ని కరకరా నవిలి మింగేసిన సమాచారాన్ని మాటలకు పట్టించేస్తున్నాడు.

––––

‘చిట పట చినుకులు పడుతూ ఉంటే...’ వెనక సీట్లో ఓ మిడిలేజి శాల్తీ బాన పొట్టేసుకుని మొబైల్‌లో పాట ఆస్వాదిస్తున్నాడు. హెడ్‌ సెట్‌ పెట్టుకు చావచ్చుగా...పోనీలే పాత పాట బాగానే ఉంది. అయినా వీడి టేస్టుకు మెచ్చుకోవాలి. సరిగ్గా వర్షం చూసి పాట పెట్టాడు గురుడు. వానా వానా వందనం...వానొచ్చిందంటే వరదొస్తది...కురిసింది వానా...చినుకులా జారి... ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా..గాన లహరి లో వళ్లు తేలి పోతోంది.

‘ఏయ్‌...రేపు క్యాంపస్‌ డ్రైవ్‌ ’

‘ఎవరు చెప్పారే’

‘నీ మొహం...మెసేజ్‌ చూస్కో లేదా...’

‘వాట్సప్‌...ఫేస్బుక్‌ తప్ప మరేం చూడదే అది...’

‘అరె...ఇప్పుడే వచ్చింది...చచ్చాం ప్రిపేరు కాలేదు కదే’

‘ సర్లే మనం ఎప్పుడయ్యాం...’

‘రేపు కూడా ఇలాగే రెయినొస్తే బావుణ్ను...’

‘ఇప్పుడు తడిసింది చాల్లేదేవే’

‘కాదే పిచ్చి మొహమా...డ్రైవ్‌ పోస్ట్‌ పోన్డ్‌ డ్యూ టు హెవీ రెయిన్‌... అంటూ మెసేజ్‌ వచ్చేస్తుందిగా...’

నవ్వులు పువ్వులు పూస్తున్నాయి. బీటెక్‌ గుంపు చేరినట్టుంది. పాటలకు కోరస్‌ లా కబుర్లు.

కిటికీ వైపు తడుస్తున్న ఎడం చేయి మొద్దు బారుతోంది. ఛా...బస్టాప్‌ ఎప్పుడొస్తుందో??

–––

కోఠీ వచ్చింది. కోటి కలల కోఠీ! మరి ఇప్పుడో... సిటీ నలు మూలలా షాపింగ్‌ మాల్స్‌. అయినా సరే ఈస్ట్‌ మన్‌ కలర్‌ సినిమా హీరోయిన్‌లా పాత అందాలతో మెరిసి పోతుంటుంది. ఈ మాయ దారి వాన నీళ్లు కోఠీ సందు సందునా చొచ్చుకు పోతున్నాయి. షాపుల్లో ...బిల్డింగుల్లో నీళ్లు...మోటర్లేసి తోడుతున్నారు. మళ్లీ లోపలికి వచ్చేస్తున్నాయి. చెరువుల్ని మింగేసిన ఆ బిల్డింగుల్లో ఎంత తరిమేస్తున్నా నీళ్లు చొరబడుతునే ఉన్నాయి. తప్పి పోయిన  పిల్లలు తల్లిని వెదుక్కొంటున్నట్టు.  ఫుట్‌ పాత్‌ బిజినెస్‌ టార్పాల్‌ ముసుగేసుకుంది. సెకండ్‌ హాండ్‌ పుస్తకాల షాపులు వరసగా. అన్నీ బీటెక్‌ పుస్తకాలే! అప్పుడెప్పుడో  పాత పుస్తకాల షాపులన్నీ ఒకే చోట...ఇంగ్లీష్, తెలుగు నవలలకు కొదవే లేదు. అక్కడే  రా.రా. లేఖలు పుస్తకం దొరికింది. కొట్టోడు పది చాలంటున్నా, పదిహేను చేతిలో పెట్టా! నన్నో ఫూల్‌ లా చూశాడు. ఎందుకో పది రూపాయలకే రాచమల్లు గారిని ఇంటికి పిలుచుకెళ్లడం సరి కాదనిపించింది. అంత వర్షంలోనూ వేడి వేడి మిర్చీ పొట్లంలా గోకుల్‌చాట్‌ ఘుమ ఘుమ లాడుతోంది. ఎప్పుడూ బాక్సాఫీసు బద్దలయిన సినిమా టాకీసులా ఉండేది. వర్షం కదా జనాలు పలచగా కనిపిస్తున్నారు. డివైడ్‌ టాక్‌ సినిమా రష్‌లా!  తడిసి ముద్దయిన ఓ నలుగురు పిలగాళ్లు చాలా శ్రద్ధగా కుల్ఫీకి చుట్టిన ఉల్లి పొర లాంటి తెల్ల కాయితాన్ని ఊడ దీస్తున్నారు. జుర్రుకో బోయే తియ్యందనాన్ని ముందుగా ఆస్వాదిస్తున్నారు. అక్కడక్కడా పడి ఉన్న ఉల్లి పొర తెల్ల కాయితాలు వర్షంలో తడుస్తూ మెరుస్తున్నాయి. మరో ఇద్దరు ఇంత వర్షంలోనూ  చేతిలో కుల్ఫీతో ఫొటో తీసుకుంటున్నారు.
ఓహ్‌...కుల్ఫీ తో సెల్ఫీ! వాటే లవ్‌ లీ థాట్‌!

కరిగి నీరై పారి పోయిన యవ్వనం గుచ్చుకుంటోంది. గుండెలో ఖవ్వాలి.

–––

గుంజుకుంటూ గింజుకుంటూ మరో అరగంట వర్షంలో కరిగింది.

చాదర్‌ ఘాట్‌...సిటీ లోని బాటిల్‌ నెక్‌ ప్రాంతాల్లో ఇదొహటి. బస్సు కుడి వైపు మలుపు తిరిగి కాజ్‌వే పై జారింది. బస్సు...కారు...ఆటో...బైకు...ఒక్కొక్కటిగా వరసగా జారుతున్నాయి. ట్రాఫిక్‌ జామ్‌ ఇప్పట్లో తెగేలా లేదు. కోఠీలో ఓ మోస్తరు వాన చాదర్‌ ఘాట్‌ బ్రిడ్జి వద్ద పదునెక్కింది. నల్లా గొంతులో  నల్ల సముద్రంలా వాహనాలు కదులుతున్నాయి. కుంజరయూధంబు దోమ కుత్తుక జొచ్చెన్‌...! దోమ గొంతులోకి ఏనుగుల మంద అనేగా! ఆ తెనాలి రామ లింగడికి చాదర్‌ ఘాట్‌ లాంటి బ్రిడ్జేదో తగిలుంటుందేమో! బస్సు ఎడం వైపు మలిపింది. ఎదర రైలు బ్రిడ్జిపై మెలికలు తిరిగిన మిన్నాగు లా మెట్రో లైను. పక్క సీట్లో నిమ్మ పండు చాయ ముసలావిడ బైట కనిపించే ఏ దృశ్యాన్ని వదలట్లేదు. ఇంతింత కళ్లేసుకుని చూస్తోంది. పాపం ఎన్ని రోజులైందో బైటి ప్రపంచం చూసి. ఈ ముసలి తనం ఉందే..తన్ని తగలేయాలి...ఛ! లేవాలన్నా...కూచోవాలన్నా...తినాలన్నా...పడుకోవాలన్నా.. అన్నింటికీ అడుక్కోవాల్సిందే! అప్పుడే కోరికలు యవ్వనంలా  మెరుస్తుంటాయి... గోల పెడుతుంటాయి. నల్గొండ చౌరస్తా రాగానే  బీటెక్‌ బ్యాచి బిల బిల మంటూ దిగింది.
అయ్యో... వసంతం వెళ్లి పోయిందా...!!

––––

కొత్త పేట ఫ్రూట్‌ మార్కెట్‌ ...దిగాల్సిన స్టాప్‌. సీట్లోంచి లేచా... ముసలావిడ చంద మామ లా నవ్వుతూ లేచింది. సో గ్లామరస్‌.. మాంఛి వయసులో ఉన్నప్పుడెలా ఉండేదో...ఎంత మంది పిల గాళ్లను తిప్పుకుందో. వర్షం జోరు తగ్గినా సన్నగా చినుకులు...చీకాకు పెట్టేందుకు ఎంత అవసరమో అంత! ముసలామెను కూతురు జాగ్రత్తలు చెబుతూ దించింది.  ‘నాగోల్‌...నాగోల్‌...’  షేర్‌ ఆటోలు తడుస్తూ ...డ్రైవర్లు అరుస్తూ..!

తప్పని సరిగా తడుస్తూ నడుస్తున్నా.  వెనక నుంచి  కొత్త కారు సర్రున దూసుకొచ్చింది. పక్కకు పరిగెత్తా.  దబాల్న ఏదో పడ్డ చప్పుడు.  అమ్మా....అమ్మా! వెనుదిరిగి చూశా. నిమ్మ పండు రంగు ముసలావిడ పడి పోయింది. కూతురు కంగారుగా అరుస్తోంది. కారు  కాస్త ముందెళ్లి ఆగింది. డోర్‌ తెరచి యువకుడు కంగారుగా వచ్చాడు.  క్షణం ముందు బస్సులో చూశా... ఇప్పుడు రోడ్డుపై అచేతనంగా! కూతురు వెర్రిగా ఏడుస్తోంది. వర్షం జాలిగా కురుస్తోంది. ఒక్క సారిగా షాక్‌ కొట్టినట్టయింది. ఆ యువకుణ్ని జనాలు గుంపేశారు. ఈ లోగా రెయిన్‌ కోటు వేసుకున్న పోలీస్‌ ప్రత్యక్షమయ్యాడు. చేతిలో ఫోన్‌! వర్షంలో నిగ నిగ లాడుతున్న కారు ఏమీ తెలీని నంగనాచిలా నిలుచుంది. నంబర్‌ ప్లేట్‌ పై పసుపు స్టిక్కర్‌...దాని పై జారుతున్న నీటి చుక్కలు. కడుపులో చేయి పెట్టి దేవినట్టు ఫీలింగ్‌. నిలువ బుద్ది కాలేదు.  గుంపు దాటుకుని నడిచా. తల దిమ్ముగా ఉంది. షేర్‌ ఆటో ఎక్కగానే..‘భయ్యా ఇప్పుడైనా పోనీ రాదే...’ పాసింజరు వేడుకోలు. ఓకే కాకా

రైట్‌...రైట్‌...రోడ్డెక్కించాడు.

అపార్ట్‌మెంట్‌ వచ్చింది. కరెంటు లేదు. అటో దిగి భారంగా కదిలాను. వానొచ్చెనంటే వరద...డ్రైవ్‌ పోస్ట్‌ పోన్‌...అంకుల్‌  నీళ్లు... తెలుసా క్యుములోనింబస్‌... టికెట్‌...టికెట్‌... చెకింగ్‌ ఉంది సార్‌...అంతా  రీమిక్స్‌లాగా బుర్రలో తిరుగుతూ తిమ్మిరి తిమ్మిరిగా ఉంది.
ఇంత గందర గోళం లోనూ నిశ్చలంగా నిమ్మ పండు రంగు ముసలావిడ  బొమ్మ మెరుస్తోంది. ఆశలన్నీ తీర్చుకున్నట్టు. అప్పడ్దాకా పెదాలపై విరిసిన నవ్వు తాలూకు పరిమళం అత్తరులా మనసును తాకుతోంది. రెండు గంటల  వాన గుండెలోజ్ఞాపకలాల జల్లుల్ని చిలకరించింది. గుమ్మం ముందు నిలవ గానే నిస్సత్తువ ఒక్క సారిగా తీసేసినట్టయింది. తడిసిన తలపుల్ని  ఒడిసి పట్టుకుంటూ  చినుకు తునకలా ఇంట్లో అడుగు పెట్టా!

పక్కింటి కుర్రాడు గుక్క తిప్పుకో కుండా అరుస్తునే ఉన్నాడు.

‘రెయిన్‌ రెయిన్‌ గో అవే...కమ్‌ అగైన్‌ అనదర్‌ డే...’

మరిన్ని కథలు