Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

టైమ్‌కి విలువ ఇస్తే, టైమింగ్‌ కలిసొస్తుంది

time value

పొద్దున్న లేస్తే చాలు ఉరుకుల పరుగుల జీవితమే. మళ్ళీ రాత్రి నిద్రపోయేదాకా మధ్యలో ఎక్కడా చిన్న 'బ్రేక్‌' కూడా దొరకనంత బిజీ అయిపోతాం. ఎల్‌కేజీ స్టూడెంట్‌ నుంచి పీజీ విద్యార్థి వరకూ ఇదే పరిస్థితి. ఉద్యోగుల సంగతి సరే సరి. క్షణం తీరిక లేనంత బిజీగా ఉండటాన్నే ఇప్పుడంతా కోరుకుంటున్నారు. వారు కోరుకున్నా కోరుకోకపోయినా, లైఫ్‌ మాత్రం మిమ్మల్ని ఖాళీగా ఉంచనివ్వడంలేదు. మరి, ఎప్పుడూ బిజీగానే ఉంటే ఎలా? లైఫ్‌కి కొంత టైమ్‌ ఇవ్వాలి కదా! టైమ్‌ ఒక్కటే కాదు, టైమింగ్‌ కూడా ఇక్కడ ముఖ్యమే. పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్నం లంచ్‌, సాయంత్రం డిన్నర్‌ ఇవి తప్పనిసరి. ఏదో ఒక టైమ్‌లో చేసేస్తే కుదరదు, ప్రతిదానికీ టైమింగ్‌ సరిగ్గా ఉండాలి. లేదంటే ఆ సమయం మళ్ళీ వృధా అయిపోతుంది. తిండి కూడా వృధానే. దాని కారణంగా లేనిపోని అనారోగ్య సమస్యలు వచ్చిపడ్తాయి. తిండి విషయంలోనే ఇంత పెద్ద సమస్య ఉంది!

కాలం విలువ గురించి మాట్లాడమంటే పిల్లలూ, పెద్దలూ గంటల తరబడి క్లాసులు తీసేసుకుంటారు. అలా క్లాసులు తీసుకున్నవాళ్ళంతా టైమింగ్‌ ఫాలో అవుతున్నారా? అంటే లేదు. వాళ్ళు టైమ్‌ని మాత్రమే ఫాలో అవుతారు. ఓ పావుగంట టైమ్‌ దొరికితే చాలు బ్రేక్‌ ఫాస్ట్‌, ఆ సమయానికి కాస్త అటూ ఇటూగా టైమ్‌ దొరికితే లంచ్‌ చేస్తారు. డిన్నర్‌ కూడా అంతే. ఉదయం ఎన్ని గంటలకు బ్రేక్‌ ఫాస్ట్‌ చేస్తారు? అనడిగితే, తొమ్మిది - పది - పదకొండు అని లెక్కలు చెప్తారుగానీ, అది పక్కా లెక్క అయితే కాదు. లంచ్‌, డిన్నర్‌ విషయంలోనూ అంతే. డిన్నర్‌కి బదులు జస్ట్‌ స్నాక్స్‌తో సరిపెడ్తారు ఇంకొందరు. ఎందుకని ప్రశ్నిస్తే, 'బిజీ లైఫ్‌' అనడం మామూలే. కానీ ఈ బిజీ లైఫ్‌ మీ ఆరోగ్యాన్ని ఎంత దారుణంగా దెబ్బ తీసేస్తుందో తెలుసా? డాక్టర్‌ దగ్గరకు ఒక్కసారి వెళితే పరిస్థితి మీకే అర్థమవుతుంది. తిండికే సరైన టైమ్‌ దొరక్కపోతే వ్యాయామం ఇంకెక్కడ చేస్తాం? కుటుంబానికి సమయమెక్కడ కేటాయించగలుగుతాం! అలా బొత్తిగా జీవితంలో మజా లేకుండా పోతోంది బిజీ లైఫ్‌ కారణంగా. అయినా తప్పదు ఎందుకంటే మనం స్పీడ్‌ యుగంలో, ఫాస్ట్‌ ట్రాక్‌ మీద పరుగులు పెడ్తున్నామని నిట్టూర్చడం మామూలే. 
ఒక్కటి మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. టైమ్‌ చాలా విలువైంది. దాన్ని క్యాష్‌ చేసుకోవడం తప్పనిసరి. జీవితానికి కొంత టైమ్‌ కేటాయించడం ద్వారా కూడా క్యాష్‌ చేసుకోవచ్చు. అదే ఆరోగ్యాన్ని మించిన సంపాదన ఇంకేముంటుంది? పొద్దున్నే లేవడం, కాలకృత్యాలు తీర్చుకున్నాక వ్యాయామం చేయడం, తగినంత బ్రేక్‌ ఫాస్ట్‌ - అదీ సమయానికి చేయడం ముఖ్యం. ఆ తర్వాత వర్క్‌లో బిజీ అవడం మామూలే. మధ్యాహ్నం మళ్ళీ టైమ్‌ చూసుకుని లంచ్‌ చేయాలి - అది కూడా శరీరానికి అవసరమైనంత మేర. తిరిగి బిజీ లైఫ్‌. సాయంత్రానికొచ్చేసరికి పావుగంటో, అరగంటో రిలాక్సేషన్‌. రాత్రి 7-8 గంటలు దాటకుండానే డిన్నర్‌ - ఈసారి కొంచెం తక్కువ చేయడం మంచిది. కనీసం 7 గంటల నిద్ర ప్రతి ఒక్కరికీ అత్యవసరం. ఇవన్నీ సరిగ్గా చూసుకోగలిగితే, మీ బిజీ లైఫ్‌కి అర్థం ఉంటుంది. లేదంటారా? అనారోగ్యంతో ఆ తర్వాత తీసుకోలేని టైమ్‌లో రెస్ట్‌ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు బిజీ లైఫ్‌ అన్న మాటకు అర్థం ఉండదు.

మరిన్ని యువతరం
leave and let leave