Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

ప్రేమిస్తే ఏమవుతుంది?

premiste emavutundi?

గత సంచికలోని ప్రేమిస్తే ఏమవుతుంది సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.....http://www.gotelugu.com/issue237/651/telugu-serials/premiste-emavutundi/premiste-emavtundi/

(గత సంచిక తరువాయి)...  గాయత్రిని అనుమానించడం తన  పెంపకానికే అవమానం అన్నట్టుగా మాట్లాడిన భర్త ఆ రోజు నుంచి అదోలా మారడం గమనించింది అన్నపూర్ణ..     

ఇంట్లో పూర్వం కన్నా తక్కువగా మాట్లాడడం, ఉదయం పూర్వం కన్నా త్వరగా బయలుదేరడం , వెళ్తూ, వెళ్తూ“ ఆటోలో వెళ్తూన్నాను గాయత్రీ నిన్ను కాలేజ్ దగ్గర దింపి వెళ్తాను ఉండు “  అంటూ బాగ్ తీసుకుని బయలుదేరుతున్న కూతురుని ఆపి తనతో తీసుకువెళ్ళడం,  ఆఫీస్ నుంచి త్వరగా రావడం  వస్తూనే ఒక్కసారి ఇల్లంతా పరికించి గాయత్రి ఇంకా రాలేదా అని అడగడం ఇదంతా  వింతగా అనిపిస్తోంది అన్నపూర్ణకి..

ఆ రోజు గాయత్రి చాలా బుద్ధిమంతురాలు, శేషు అన్యాయంగా నా కూతురి మీద నేరాలు చెప్పాడు అనగానే నిజమే కాబోలు అనుకుంది. కాని ఆయన వాలకంలో వచ్చిన మార్పు చూస్తుంటే ఆయన మనసులో ఏముందో అర్ధం కావడం లేదు .. ఏదో జరిగిందని అదేదో చెప్పకుండా మౌనంగా , శాంతంగా నివురు కప్పిన నిప్పులా ఉన్నాడని మాత్రం అర్ధం అవుతోంది.. ఈ నిప్పు ఏదో ఒక క్షణంలో భగ్గుమని మండుతుందని కూడా అనిపిస్తోంది. పోనీ వివరంగా అడుగుదామంటే భయం.. అందుకే జరుగుతున్నదంతా ఒక ప్రేక్షకురాలిలా చూస్తూ ఉండిపోడం తప్ప చేయగిలిగింది ఏమి లేదు అనే నిర్ణయానికి వచ్చింది అన్నపూర్ణ.

 గాయత్రికి మాత్రం తండ్రి తనని వెంట పెట్టుకుని తీసుకెళ్ళి కాలేజ్ దగ్గర దింపడం, ఇంటికి రావడం కొంచెం ఆలస్యం అయితే అనుమానంతో చూడడం చాలా చిరాగ్గానూ, అంతరాంతరాల్లో కొంత భయంగానూ  ఉంది.. దీని వలన తను రమేష్ ని కలుసుకునే అవకాశం లేకుండా పోవడం అటుంచి కనీసం ఇది వరకులా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి నోట్స్ తెచ్చుకోవాలి అని అడగడానికి కూడా భయంగా ఉంది..

ఇప్పటికే పది రోజులు అయింది అతడిని కలిసి.. రమేష్ రెండు, మూడు సార్లు తన కోసం వీధి దాటి రోడ్డు మీదకు వచ్చి నిలబడి ఎదురుచూడడం తండ్రి పక్కన కూర్చుని ఆటోలో వెళ్తున్నప్పుడే గమనించింది.. అతను ఏమనుకుంటున్నాడో తన గురించి అని చాలా దిగులుగా ఉంది .. అసలే మాటి మాటికి నువ్వు బేకార్ అంటుంటాడు.

అసలు అకస్మాత్తుగా తండ్రి అలా మారడానికి కారణం కూడా ఊహించలేకపోతోంది.. తనని నమ్మినట్టు నటించాడా నాన్న..నిజంగా నమ్మలేదా.. నటించడం దేనికి? లేదు నాన్న తనని అనుమానించలేదు.. శేషు పెదనాన్నే ఎవరినో చూసి తను అనుకున్నాడని చెప్పాడు.. మరి ఎందుకీ కాపలా? గాయత్రికి అసహనం రోజు రోజుకి  పెరిగిపోతూ మనశాంతిని హరించేస్తోంది .

” ఆ రోజు నీ మీద నాకు నమ్మకం ఉందమ్మా ... నువ్వుతప్పు చేయవని నాకు తెలుసు అన్న మనిషి ఇప్పుడెందుకు ఇలా బాడిగార్డ్ లా వెంట వస్తున్నాడు.. తనేం చిన్నపిల్లా అసలు కాలేజ్ కి నాన్నతో వెళ్ళడం ఏంటి?  మొదటసారి స్కూల్ కి వెళ్తున్న ఐదేళ్ళ పాపాయిని తీసుకువెళ్తున్నట్టు  తనని అలా తీసుకువెళ్ళడం ఏంటి? రేపటి నుంచి తను అలా వెళ్ళకూడదు రాను అని చెప్పాలి..నామానాన నేను వెళ్తాను అని చెప్పాలి... గట్టిగా నిర్ణయించుకుంది గాయత్రి.

ఎందుకైనా మంచిది ముందుగా అమ్మకి చెప్పి తరవాత నాన్నకు చెప్పాలి అనుకుంటూనే ఇంటికి వచ్చింది.

హాల్లో రోజులాగే టి వి చూస్తూ తండ్రి కనిపిస్తాడని ఊహించింది కానీ ఇవాళ ఎందుకో కోటేశ్వరరావు ఇంకా ఇంటికి రాలేదు. గాయత్రి ఇల్లంతా ఒకసారి కలయ తిరిగి చూసి తల్లిని అడిగింది “ నాన్న రాలేదా ఇంకా..”

“ రాలేదు ఏం “ అంది అన్నపూర్ణ .

“ ఏం లేదమ్మా ఊరికేనే అడిగాను అంటూ ఒకసారి గేటు వైపు తొంగిచూసి అంది “ మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి ఒక గంటలో వస్తాను నాన్న అడిగితే చెప్పు...”

“ ఎవరా ఫ్రెండ్” అనుమానంగా చూసింది అన్నపూర్ణ .

 గాయత్రికి చిర్రెత్తుకొచ్చింది తల్లి కళ్ళల్లో కనిపించిన అనుమానం చూడగానే ... ఏంటి వీళ్ళ ఉద్దేశం ? మరీ తననిలా గిరిగీసి పెంచడం ఏంటి? తనేం చిన్నపిల్లా!!.. ఇదిలాగే సాగనిస్తే తను ఈ ఇంట్లో ఒక బందీ కావాలి .. కుదరదు అలా జరక్కూడదు...తనకి స్వేఛ్చ కావాలి.. తన తోటి వాళ్ళంతా ఎలా ఉంటున్నారు? తనెలా ఉంటోంది? ఈ కాలంలో ఎవరన్నా తనలాగా పరికిణి,  వోని వేసుకుని కాలేజ్ కి వెళ్తున్నారా? పంజాబీ డ్రెస్ లు, లాంగ్ స్కర్ట్ లు, జీన్స్ ప్యాంటులు ... ఇదేంటి పాత సినిమాల్లో లాగా ఈ పరికిణి ఏంటి? అయినా తను ఎదురు చెప్పలేకపోతోంది.. నాన్నకి చాదస్తం బాగా ఎక్కువైంది చిన్న పిల్లలని తీసుకుని వెళ్లినట్టు కాలేజి కి వెంటపెట్టుకు వెళ్ళడం ఏంటి? అసలీ బందిఖానా జీవితం ఏంటి? తిరగబడాలి తప్పదు తిరగబడాలి..

అందుకే కొంచెం అసహనంగా అంది “ నా క్లాస్ మేట్  అమ్మా .. అసలేంటి ఈ మధ్య మీ ఇద్దరూ నన్నిలా కాపలా కాస్తున్నారు.. నామీద నమ్మకం లేదా ... నేనెక్కడికి వెళ్తాను ? ఆయన చూస్తే రోజు నన్ను కాలేజ్ దగ్గర దింపి వెళ్తున్నాడు.. ఇంకా నయం అక్కడే కూర్చుని వెంట పెట్టుకుని ఇంటికి కూడా తీసుకొస్తే సరిపోతుందిగా ... నాకంటూ ఫ్రీడం లేదా.. “

అన్నపూర్ణ  కూతురి వైపు నిశితంగా చూసింది.“ ఏం  ఫ్రీడం కావాలి నీకు ? స్నేహితులతో ఎక్కడికి పడితే అక్కడికి తిరిగే ఫ్రీడం కావాలా?“

గాయత్రి పది రోజుల నుంచి మనసులో అణచిపెట్టుకున్న కోపం  బూస్ మంటూ పైకి లేచింది.. దొంగని దొంగ అంటే వొప్పుకోక పోగా ఒకటికి రెండు  సార్లు అంటే తిరగబడే ప్రమాదం ఉంది. ఇప్పుడు అదే జరిగింది. అసలే పది రోజులుగా రమేష్ ని  కలిసే అవకాశం దొరకడం లేదు, కనీసం మాట్లాడుకునే అవకాశమూ లేదు, దానికి తోడు ఇప్పుడు అన్నపూర్ణ అలా సూటిగా ప్రశ్నించే సరికి  రెచ్చిపోయింది.

“ఏంటమ్మా మాటిమాటికి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నావు అంటున్నారు.. ఆ రోజు మీరేగా శేషు పెదనాన్న చెప్పింది పొరపాటు అయి ఉండచ్చు అన్నారు ..మళ్ళి అనుమానమా... అంత అనుమానం అయితే కాలేజ్ మానేస్తా ... పెళ్లి చేసేయండి.. పిల్లల్ని కంటూ వాళ్ళని పెంచుకుంటూ పడిఉంటా. లేదంటే ఇక్కడే అంట్ల గిన్నెలు తోముకుంటూ కూర్చుంటా అంతే కాని ప్రతిక్షణం నన్నిలా అనుమానిస్తూ ఇంట్లో నుంచి బయటికి కదలనివ్వకపోతే విసుగు పుట్టి ఏటన్నా పారిపోతా.“

అన్నపూర్ణ కూతురి ఆవేశానికి అవాక్కై చూస్తూ ఉండిపోయింది.

గాయత్రి మళ్ళి అంది” ఒక్కసారి బయటకు వచ్చి మారుతున్న ప్రపంచాన్ని చూడండి.. ఈ కాలంలో ఎవరన్నా నాలాగా ఉంటున్నారా.. మంచి డ్రెస్ లు లేవు, ఒక ఫాషన్ లేదు, సరదాగా ఫ్రెండ్స్ తో ఎక్కడికి వెళ్ళనివ్వరు.. చదువుకోకపోతే పెళ్లి కాదేమో అని చదివిస్తున్నారు.. లేకుంటే నా మొహాన అదికూడా ఉండేది కాదు..ఛి వెధవ బతుకై పోయింది.” విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయి తన గదిలో దూరి తలుపేసుకుంది.. ఆలా వేసుకోడంలో కోపం ప్రదర్శిస్తూ తలుపు గట్టిగా చప్పుడు అయేలా వేసింది.

అన్నపూర్ణ మ్రాన్పడి చలన రహితంగా కూర్చున్న చోటే బిగుసుకుపోయింది..

ఇది గాయత్రేనా .... తన కూతురు నోరులేని గాయత్రేనా .. ఆడపిల్లలకి అణకువ, వినయం, ఉండాలని పద్దతిగా పెంచిన గాయత్రేనా.. ఏమైంది దీనికి?“ బెలూన్ని కాలి కింద అణచి ఉంచినంత సేపే .... కాలు కొంచెం పక్కకి జరిగితే .... ఆడపిల్ల కూడా అంతే.. దాన్ని హద్దుల్లో ఉంచు .. నీకు చేతకాకపోతే నేను చూసుకుంటా” అని గాయత్రిని కాలేజ్ లో చేర్పించిన కొత్తల్లో భర్త ఇచ్చిన వార్నింగ్ గుర్తొచ్చింది ఆవిడకి.

కాలేజ్ లో చేరిన కొత్తల్లో “మా కాలేజ్ లో అందరమ్మాయిలు పంజాబీ డ్రెస్ లు వేసుకుంటున్నారు.. నన్ను చూసి నవ్వుతున్నారు నాకూ డ్రెస్ లు కుట్టించు” అంటూ పేచి పెట్టింది గాయత్రి. అప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ పిచ్చి వేషాలు వేయడానికి వీల్లేదు అని చెప్పేశాడు కోటేశ్వరరావు. అయితే నేను కాలేజ్ కే వెళ్ళను అంటూ రెండు రోజులు పంతంగా ఇంట్లోనే ఉండిపోయింది. వెళ్ళకపోతే మానేయమను అన్నాడే కాని డ్రెస్ లు వేసుకోడానికి ఒప్పుకోలేదు. అప్పుడు ఇచ్చిన వార్నింగ్..

ఇప్పటివరకు అలాగే అణచే ఉంచాననే అనుకుంది.. అయితే గాయత్రి ఇవాళ ఇంత ఎదురుతిరిగి మాట్లాడడానికి కారణం ఏంటి ? ఎంతకాలం నుంచి దాని మనసులో ఈ ఇంటి నిబంధనల పట్ల అసంతృప్తి ఉంది? ఈ నిబంధనలు తనకి మాత్రమే కాదే ... కార్తికేయ ఎలా ఉంటాడు? వాడేనాడన్నా ఇలా ఎదురు తిరిగాడా? ఇది ఎందుకు ఇలా తయారైంది..  ఏదో ఉంది... పంజరంలో ఉన్న పక్షి రెక్కలు విదిలిస్తోంది ... పంజరం నుంచి  బైట పడి ఎగరాలనుకుంటోంది ... ఎక్కడికి? అది తెలుసుకోవాలి... ఎలా? బుజ్జగించి అడగాలా... నచ్చచేప్పలా.

అన్నపూర్ణ ఆలోచనల్లో ఉండగానే కార్తికేయ ఇంట్లో అడుగుపెట్టాడు. వస్తూనే “ ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు.. పిలిస్తే పలక్కుండా “ అన్నాడు.

ఆవిడ ఉలిక్కిపడి కొడుకువైపు తేరిపార చూసింది. నిరాడంబరంగా మామూలు ప్యాంటు, మామూలు షర్ట్ , కొబ్బరి నూనె రాసుకుని పైకి దువ్వుకున్న క్రాఫ్.. ఈ కాలం పిల్లాడేగా వీడు కూడా.. వీడెందుకు ఎప్పుడూ జీన్స్ ప్యాంటు అడగలేదు.

“ ఏంటమ్మా ఏమాలోచిస్తున్నావు?”  చిరునవ్వుతో అడుగుతున్న కొడుకు వైపు చూసి సన్నగా నవ్వి “ఏం లేదురా” అంటూ వంట గది లోకి వెళ్ళింది.

కార్తికేయ బట్టలు మార్చుకోడానికి గది వైపు వెళ్లి తలుపు వేసి ఉండడం చూసి తల్లి దగ్గరకు వచ్చి అడిగాడు “గదిలో ఎవరున్నారమ్మ ?:

అన్నపూర్ణ  పాలగిన్నె స్టవ్ మీద పెడుతూ నెమ్మదిగా చెప్పింది “గాయత్రి ..”

“ గాయత్రా.. తలుపు ఎందుకు వేసుకుంది?”  ఆశ్చర్యంగా అంటూ తిరిగి గది వైపు వెళ్లి డోర్ మీద వేళ్ళతో కొడుతూ గాయత్రీ  తలుపు తీయి “ అన్నాడు గట్టిగా.

కార్తికేయకి చెల్లెలు వ్యవహారం ఈ మధ్య చిరాకుగా ఉంది.

రెండు బెడ్ రూమ్ లు ఉన్న ఆ ఇంట్లో అన్నపూర్ణ , కోటేశ్వరరావు ల గది ఒకటి.. అన్నా చెల్లెళ్ళు చదువుకోడానికి పడుకోడానికి ఒక గది.. కానీ ఈ మధ్య గాయత్రి ఆ గది కేవలం తనది మాత్రమే అన్నట్టు ప్రవర్తిస్తూ ఎక్కువ సేపు గదిలో తలుపులేసుకుని కూర్చుంటోంది.. కార్తికేయ గదిలోకి రాగానే మొహం చిట్లిస్తోంది.. పైగా చదువు కూడా బాగా నిర్లక్ష్యం చేస్తూ అందరు పడుకోగానే ఒక్కతి వెళ్లి టి వి  ఆన్ చేసి అర్ధరాత్రి దాకా చెత్త ప్రోగ్రామ్స్ చూస్తోంది.   తండ్రి ఇచ్చిన సూచనలు పాటించి ఈ మధ్య చాటు, మాటుగా గాయత్రిని గమనిస్తూనే ఉన్నాడు కార్తికేయ.. కాకపోతే గాయత్రి అదృష్టం …ఎప్పుడూ రమేష్ తో ఉన్నప్పుడు అతని దృష్టిలో పడలేదు.పడి ఉంటే కధ వేరుగా ఉండేది..

మరోసారి తలుపు తట్టబోతుంటే గభాల్న తోసుకుని మొహం మట, మట లాడిస్తూ బైటికి వచ్చింది.

ఆమెని చూసి విసుగ్గా అడిగాడు “ఎప్పుడూ ఎందుకు తలుపేసుకుని కూర్చుంటావు... ఆ గది నాది కూడా.”

“తీసుకో.... నువ్వే తీసుకో నేనసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతా “ మండిపడింది.

“అమ్మా ఈవిడకి ఏమైంది.... పిచ్చి గాని పట్టిందా” తల్లికి వినిపించేలా అరిచి లోపలికి వెళ్ళిపోయాడు కార్తికేయ.

అన్నపూర్ణ కాఫీ కప్పుతో వచ్చి కార్తి ఇదిగో కాఫీ అంటూ కప్పు టేబుల్ మీద పెట్టి గాయత్రి వైపు సీరియస్ గా చూస్తూ అంది “ నీకేం పిచ్చి పట్టిందా..  ఎందుకు అఘాయిత్యం చేస్తున్నావు.. నువ్వు ఎంత గింజుకున్నా ఇంతే.. ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి .. వాటి పరిధిలో బతకాల్సిందే ఎవరైనా.. నువ్వు అఘాయిత్యం చేసినంత మాత్రాన పరిస్థితి మారదు అర్ధమైందా. “

“నాకు తెలుసు.. అన్నీ తెలుసు.. నేనూ మారను “  అంటూ గబా, గబా హాల్లోంచి బైటికి వెళ్లి చెప్పులేసుకుంది.

“ఎక్కడికే” గట్టిగా అడిగింది అన్నపూర్ణ .

“నాకు పనుంది ... “

“ఏం పని ఈ వేళప్పుడు.. మీ నాన్నగారు వచ్చే టైం అయింది. “

“అయితే....”

“అయితేనా”  నిర్ఘాంతపోయి చూసింది అన్నపూర్ణ ..

ఆవిడ చూపులకి కొంచెం బెదిరిన గాయత్రి  తన ఆవేశాన్ని అణచుకుంది...ఒక్క క్షణం ఆవిడకి సమాధానం చెప్పకుండా  గేటు దగ్గరకి వెళ్లి గేటు తెరిచి అక్కడే నిలబడి వీధిలో ఆడుకుంటున్న పిల్లల వైపు చూస్తూ నిలబడిపోయింది.

ఇంతే వయసులో ఆగిపోతే ఎంత బాగుండేది.. ఆడపిల్లలకి ఎదుగుతున్నాకొద్దీ హద్దులు గీస్తుంటారు ఎందుకో.  అయినా ఈ చాదస్తాలన్నీ ఈ ఇంట్లోనే.. తన క్లాస్ మేట్స్  అందరూ ఎంత ఫ్రీగా ఉంటారు.. అమ్మాయిలూ అబ్బాయిలు కలిసి రోజు పక్కనే ఉన్న పిస్తా హౌసేకి వెళ్లి అవి, ఇవి తింటూ కబుర్లు చెప్పుకుంటారు.. తను వాళ్లతో కలవాలని ఎన్నోసార్లు అనుకుంది.. కానీ ఎవరూ తనని పిలవరు.. అందుక్కారణం తన డ్రెస్సింగ్ ..తనని వెలేసినట్టు చూస్తారు.. ఈ కాలంలో ఈ డ్రెస్సింగ్ ఏంటి గాయత్రీ నువ్వు మారాలి అంటుంటారు.. మారాల్సింది తను కాదు.. అమ్మా, నాన్న.  ఆలోచనలో ఉన్న గాయత్రి ఉలిక్కిపడింది .. తన మీద ఏదో పడింది.. గుబుక్కున జరిగి వోని చేత్తో దులిపింది.. తన కాలికింద పొడుగ్గా చుట్టిన కాగితం .. వొంగి తీసుకుని తలెత్తి ఆ కాగితం వచ్చిన వైపు చూసింది. కొంచెం దూరంగా వాళ్ళ ఇంటి వైపు వెళ్తున్న రమేష్ వెనక్కి చూస్తున్నాడు గాయత్రి వైపు. ఆమె దృష్టి తనవైపు పడగానే  కళ్ళతో సైగ చేశాడు .. గాయత్రి పెదాలు బిగించి చేతిలో ఉన్న కాగితం చూసింది. నెమ్మదిగా తిరిగి లోపలి నడిచి గేటు వేసింది.

లోపల రగులుతున్న అగ్నిపర్వతం లా కూర్చుని ఉంది అన్నపూర్ణ.  


(సశేషం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
nadina prapancham