ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖపట్టణం జిల్లాలో ఓ యాచకురాలిపై ఓ వ్యక్తి అత్యాచారానికి తలపడిన సంఘటన ఇటీవల కలచి వేసింది. నడిరోడ్డుపై పట్టపగలే అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది. ఈ తతంగాన్ని చూసి, అడ్డకోబోయేదానికి బదులు, కొందరు ఈ తతంగాన్ని తమ సెల్ ఫోన్లలో షూట్ చేసి, సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి, పైశాచిక ఆనందాన్ని పొందారు. మనిషిలో పెరిగిపోతోన్న పైశాచికత్వానికి అచ్చమైన నిదర్శనం ఈ సంఘటన. అత్యాచారానికి పాల్పడిన వాడితో సమానంగా ఇలా ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రతీ ఒక్కరినీ శిక్షించాల్సి ఉంది. అయితే ఇది ఇంకా చిన్న ఘటనే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకు మించిన సంఘటనలు చాలా చాలా జరుగుతున్నాయి సోషల్ మీడియా వేదికగా. అమ్మాయి ఫోటోలతో అబ్బాయిలు అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. ఆ రకంగా ఫ్రెండ్‌షిప్ అంటూ అమ్మాయిల్ని ఎట్రాక్ట్ చేస్తున్నారు. ముగ్గులోకి దించుతున్నారు. తీరా దిగినాక తెలుస్తుంది అసలు సంగతి. వారి బుట్టలో పడక తప్పడం లేదు. తర్వాత బ్లాక్ మెయిల్స్. బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆ రకంగా అమ్మాయిల్ని లొంగదీసుకుని అసభ్యకరమైన వీడియోలతో వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ వేధింపులకు తాళలేక అమ్మాయిలు ఆత్మహత్యలే శరణ్యమనుకుని తృణ ప్రాయంగా తమ నిండు జీవితాల్ని బలి చేసుకుంటున్నారు. ఈ తరహా ఘటనలు ఇటీవల కాలంలో చాలానే వింటున్నాం.
ఇంకో తరహా ఘటనలు తీసుకుంటే, పార్కుల్లో విచ్చలవిడి శృంగారానికి యువత అలవాటు పడిపోతోంది. ఆ బహిరంగ శృంగారం సోషల్ మీడియాకి ఎక్కుతోంది. ఈ అవమానం తట్టుకోలేక కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, మరో పక్క, తమ పిల్లలు చేసిన అకృత్యాలకి, అవమానంతో పరువు పోతుందని తల్లి తండ్రులు కూడా ఆత్మ హత్యలకు పాల్పడుతున్నారు. ఇంకో దారుణమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఆన్‌లైన్ వేదికగా సోషల్ మీడియాలో చాలా ఛాలెంజ్‌లు కనిపిస్తున్నాయి. డెత్ గేమ్స్ తరహాలో ఉంటున్నాయవి. అవే 'బ్లూవేల్' తరహా గేమ్స్. వీటి అంతిమ లక్ష్యం చావు. మానసికంగా ఇమ్‌బ్యాలెన్స్ ఉన్నవారు ఈ తరహా గేమ్స్‌కి అడిక్ట్ అవుతున్నారు. చివరికి తమ ప్రాణాలను కోల్పోతున్నారు. తమ తల్లితండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగులుస్తున్నారు. ఇలాంటి వాటికి ఎవరు బాధ్యత వహిస్తారు. ఒకరి తలరాతను శాసించే హక్కు వీరికి ఎవరిచ్చారు? పెరుగుతున్న టెక్నాలజీతో ఎన్నో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నాం ఓ పక్క. మరో పక్క ఇలా దిగిజారిపోతున్నాం. దీనికంతటికీ కారణం విచ్చల విడిగా ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం ఓ కారణంగా చెప్పక తప్పదు.
ఇంకో రకంగా పోర్న్ సినిమాలు యువతని చెడు మార్గం వైపు ప్రోత్సహిస్తున్నాయి. అవి సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయనే చెప్పొచ్చు. గతంలో ఈ తరహా సినిమాలకు కొంచెమైనా అడ్డుకట్ట ఉండేది. కానీ పెరిగిన టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్స్ వినియోగంతో ఎవరి చేతిలోనైనా ఈ సినిమాలు ఈజీగా అందుబాటులో ఉంటున్నాయి. వీటిపై ప్రత్యేకంగా అడ్డుకట్ట వేసేందుకు అవకాశాలు లేకపోతోంది. ఇంత జరుగుతున్నా ఎవ్వరూ ఈ అకృత్యాలపై వినిపించాల్సిన స్థాయిలో తమ గళం వినిపించడం లేదు. ఇంటర్నెట్ ప్రభావం మానవాళికి మేలుతో పాటు, కీడు కూడా చేస్తోంది. నైతిక విలువలు లేని సమాజాన్ని తయారు చేస్తోంది. ఈ పతనానికి బాధ్యులెవరు? సోషల్ డెత్స్‌కి మందు వేయడం ఎలా? ఇది జరగాలంటే సమాజంలోంచే మార్పు రావాలి. చిన్నప్పటి నుండే తల్లి తండ్రులు పిల్లల్ని కనిపెట్టాలి. స్కూళ్లు, కాలేజీల యాజమాన్యం కూడా అప్రమత్తంగా ఉండాలి. నేరాలకు కౌన్సెలింగ్‌తో పాటు శిక్షలూ కఠిన స్థాయిలో ఉండాలి. లేదంటే యువత అత్యధికంగా ఉండే మన భారతదేశం, ఆ విలువైన యువతని కోల్పోవాల్సి వస్తుంది.
|