Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
kotta samvasaram ...paata katha

ఈ సంచికలో >> కథలు >> మనసులోని మాట

manasuloni maata

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రద్దీ గా ఉంది. చిన్నారి గబగబా ఎస్ 6 కోచ్ ఎక్కి తన సామానులు సర్దుకుని హమ్మయ్య అని నిట్టూర్చింది..పర్లేదు...రైలు కదలడానికి ఇంకా పావుగంట టైము ఉంది అనుకుంది..తమ్ముడు రైల్వే స్టేషన్ కి తోడు వస్తానన్నా విదిలించుకుని వచ్చే సింది...
చిన్నారి తన  స్నేహితురాలి అక్క పెళ్లికి తిరుపతి వెళ్తోంది..మళ్ళీ ఎల్లుండి బయల్దేరి హైదరాబాద్ వచ్చేస్తుంది...ఆట్టే సామాన్లు లేవు..ఒక్క సూటుకేసు తప్ప....నగలు కూడా ఏమి పట్టుకెళ్లట్లేదు...ఏదీ అమ్మ ఒప్పుకుంటేగా!!! అన్ని ఆర్టిఫిషియల్ నగలే నా బ్రతుక్కి...నిరసనగా అనుకుంది తల్లి గురించి..బయల్దేరే ముందు అమ్మ తో ఈ విషయంగా గొడవ పడింది...
ట్రైన్ బయల్దేరింది...ఫోన్ మోగింది..ఎవరా!!.అనుకుని హాండ్ బాగ్ తెరిచి చూస్తే  అమ్మ నుంచి మెసేజ్.. వాట్సాప్ లో వాయిస్ మెసేజ్..విసుగ్గా ఇయర్ఫోన్లు తగిలించుకుని వినడం ప్రారంభించింది...మంద్రంగా అమ్మ గొంతు...
చిన్నారి!! నా మీద కోపమా తల్లీ.... ఎందుకు నీకు అంత కోపం??  ఈరోజు నీకుండే అనుమానాలను అన్నీ తీర్చడానికే ఈ మెసేజ్...
నీకు మూడేళ్ల వయసు లో నా కడుపులో తమ్ముడున్నాడని నీకు నాన్న చెప్పినప్పుడు నీ కళ్ళల్లో కనిపించిన మెరుపులు నేనెప్పటికీ మర్చిపోలేను...తమ్ముడు పుట్టిన తరువాత నీ కేరింతలు...లోకంలోని సంతోషమంతా నీలోనే చూసాను..
ఇద్దరు పెరిగే కొద్దీ మీ ఇద్దరి మధ్యా అనుబంధం నా అపరిమిత సంతోషానికి కారణమయ్యింది..
ఏ తల్లయినా కోరుకునేది తమ కాలం అయిపోయినా పిల్లలు కలిసి మెలిసి చల్లగా ఉండాలనే కదా..
కానీ ఇవ్వాళ నువ్వు నా మనసుని నీ మాటలతో ఎన్ని తూట్లు పొడిచావో గ్రహించావా నాన్నా???
నువ్వు మనసులో ఇంత దుఃఖం పెట్టుకున్నావా??  కాని నీ బాధ కోపం ఎంత అర్థరహితమయినవో నీకు తెలుసా తల్లీ??
 నీవు నగలు అడిగావు....ఒంటరిగా నిన్ను  పెళ్ళికి  పంపడానికి నేను భయపడుతున్నాను అసలే...దానికి తోడు నగలు పట్టుకెళ్తే నీకే మనఃశాంతి కరువవుతుందని నీకు తెలుసా?? 
దానికి నువ్వెన్ని మాటలన్నావు అమ్మని...నాకు తమ్ముడే ఎక్కువ ఇష్టమా...వాడికయితే ఎంత డబ్బయినా ఇస్తానా??? నువ్వు అడిగితే సెల్ ఫోను కొనివ్వలేదు..వాడు అడిగితే కొనిచ్చ్చానా??? అసలు నువ్వు రికమెండ్ చెయ్యబట్టే కదా వాడికి కొన్నాను...
నువ్వు బండి అడిగితే కొనలేదు ఆ వయసులో... మరి వాడికి ఎందుకు కొనిచ్చావు అని అడిగావు... నువ్వు వెళ్ళే రూటు చాలా రద్దీగా ఉంటుంది...అసలే రోజుకొక ఆక్సిడెంట్ గురించి వింటున్నాము...భయం తల్లీ.... వాడు వెళ్ళే రోడ్లు అంత రద్దీగా ఉండవు కాబట్టి...
వాడు మగ పిల్లాడు కాబట్టి రాత్రి వాడు బయటికి వెళ్ళినా ఒప్పుకుంటావు....నేను ఆడపిల్లను కాబట్టి నన్ను వెళ్ళనివ్వవు..ఆడదానివయ్యుండీ నీకు నేనంటే అంత చులకనా అని అడిగావు....చులకన కాదు తల్లీ.... జాగ్రత్త... నా బంగారు తల్లి క్షేమంగా ఉండాలి అని ప్రతి తల్లి పడే తపన..
చిన్నారీ....నీకు నఛ్చినా నచ్చకపోయినా ఒక విషయం చెప్తాను...విను...మన సమాజంలో ఆడపిల్లకు ఇంకా అంత అర్థరాత్రి తిరగగలిగిన పరిస్ధితి లేదు తల్లీ.... నువ్వు నా నిధివి తల్లీ... నిన్ను కాపాడుకోవటం నా బాధ్యత కాదంటావా??
అసలు నాకు నీ మీద నమ్మకం లేకపోతే నిన్ను వంటరిగా పంపుతానా ఈ పెళ్ళికి?? అది నీ మీద ఉండే నమ్మకం....అక్కడ స్టేషన్ కి పెద్దమ్మ కొడుకు రవి అన్నయ్యని నిన్ను రిసీవ్  చేసుకొమ్మన్నానని నీకు కోపం...అది నీ పట్ల తల్లిగా నా బాధ్యత...తప్పదు తల్లీ...
అసలు నువ్వే కాదు....చాలా మంది ఆడపిల్లలు నీలాగే ఆలోచిస్తున్నారు...మేమెందుకు భయపడాలి?? అని...అస్సలు భయపడకూడదు....ఆడపిల్లలు చాలా ధైర్యంగా ఉండాలి...అలా అని కోరి కష్టాలు తెచ్చుకోకూడదు... తల్లిదండ్రులు, పటిష్టమైన కుటుంబ వ్యవస్థ ఉన్న మీరు అత్యంత ధైర్యం కల్గి ఉండాలి...అలా అని కిక్ కోసం కోరి ప్రమాదాలు తెచ్చుకోకూడదు...ఆడపిల్లలు వజ్రాలు...మణి మాణిక్యాలలాంటివారు....నిధి ని ఎవ్వరూ నిర్లక్ష్యం గా పెట్టుకోరు...బీరువా లో దాచుకుంటారు...అర్థమయ్యిందా??
ఈ రోజు నువ్వు నా మీద ఉక్రోషంతో అన్న మాటలు ...నీకు తమ్ముడికి మధ్య భేదాలు కలిగిస్తాయి అని నీకు తోచలేదా?? ఇలాంటి పిఛ్చి ఆలోచన లు ఎప్పుడూ రానివ్వకు..
ఆఖరుగా ఒక మాట చిన్నారీ...నువ్వనుకున్నట్టు నేను ఒక కంట వెన్న ఒక కంట సున్నం పెడితే...ఒక్క కన్నే కన్నీరు కార్చదు తల్లీ.... రెండు కళ్ళూ కన్నీరు కారుస్తాయి...హృదయం నెత్తురు కారుస్తుంది....
ఇవన్నీ నేను నీకు చెప్పినా కోపంలో నీకు అర్థం కాదు...అందుకే ఇలా మెసేజ్ గా పంపిస్తున్నాను...నీ స్నేహితురాలింట్లో బాగా ఎంజాయ్ చెయ్యి...వెళ్ళే ముందు నేను ముద్దు ఇద్దామనుకుంటే విదిలించుకుని వెళ్ళావు...ఇదుగో....ఇప్పుడు పెడ్తున్నాను...''
అమ్మ  ముద్దు శబ్దం వినిపించింది... చిన్నారి కళ్లల్లో నీరు.... ఎవ్వరూ చూడకుండా తల దించుకుంది...
నిజమే...తల్లిదండ్రుల మనస్సుని ఈ కాలం పిల్లలం గమనిస్తున్నామా??? తనని తాను ప్రశ్నించుకుంది....
మనసు చెప్పిన సమాధానం అమ్మకి వాయిస్ మెసేజ్ పంపింది ...".బంగారు అమ్మా.....సారీ..." అని...

మరిన్ని కథలు