Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> అదో పిచ్చి మాలోకం

ado picchi maa lokam

సిటీలో చెల్లెలి సంరక్షణలో వుండి టెన్త్ క్లాసు చదువుకొంటున్న తన పిల్లాడ్ని చూసోచ్చిన తరువాత తిరుగు ప్రయాణమౌతోంది యమున.

"అక్కా!ఇంకో రెండు రోజులుండి వెళ్ళకూడదూ?!"గదిలో అన్ని సర్దుకొని చీర కట్టుకొంటున్న అక్కను అడిగింది జమున.

"అదేం కుదరదమ్మా!ఇప్పటికే ఆలస్యమైంది.ఇదుగో ఇటు దగ్గరకు రా!మరీ ఈ మగాళ్ళను అంటే మీ బావగారినీ,అదిగో ఆగదిలో కూర్చొని సైలెంటుగా ఏ ఫ్యాషన్ టి,వి లోనో పిచ్చి పిచ్చి బొమ్మల్ని చూసి ఆనందించే మీ ఆయనలాంటోళ్ళను అలా ఫ్రీగా వదిలేయకూడదు.అందుకు తగ్గట్టు నీకు పెళ్ళయి ఇన్నేళ్ళయినా పిల్లలు లేరాయే!అందుకే ఎంచక్కా అతగాణ్ణి కొంగున ముడి వేసుకోవాలి.అర్థంకాలే....అలా నీ అందాలను కనబడీ కనబడననట్టు చూపుతూ వయ్యారాలు పోతూ వుండాలి.అప్పుడు అతను నీ చుట్టే తిరుగుతుంటాడు.

"కర్మ...కర్మ..ఏం మాటలవి!నిజం చెపుతున్నాను. మాకు పిల్లలు లేరనేకాని మా వారికి నేనే లోకం." అమాయకంగా అంది జమున.

"ఏమో! అతగాడి వాలకం నాకలా అనిపించలే!ఎప్పుడు ఏ ఆడది కనబడుద్దా అలాగే మింగేద్దామా అన్నట్టుంటాయి అతని చూపులు.అసలు ఇలాంటి విషయాల్లో మహర్షి విశ్వామిత్రుడంతటివాడు సైతం బోల్తా పడ్డాడే!వీళ్ళేమాత్రం.ఇంటి వంటకు దూరమైతే హోటలే గతన్నట్టు మనం వీళ్ళను మన కనుసన్నల్లో వుంచుకోకపోతే రకరకాల వేశాలేస్తూ మనకు దూరమైపోతారు.ఎందుకు చెపుతున్నానంటే మొన్నటికి మొన్న అతగాడు రాత్రి ఎనిమిది గంటల సమయంలో వెనుక మాలుగా ఈ గది కొచ్చి నన్ను వాటేసుకొని టపీమని ముద్దు పెట్టుకొని తరువాత ముఖంలోకి చూసి'సారీ వదినగారూ'అంటూ అమాయకంగా వెళ్ళి పోయాడు తెలుసా?"

"అలాగా!పాపం వారు నన్ననుకొన్నారేమోనక్కా!"సాధారణంగా అంది జమున.

"ఓహో!మరంతకు ముందు రోజు హల్వా,బోలెడు మల్లెపూలు తీసుకొని ఈ గదికే వచ్చారెందుకూ?

"అయ్యో రామ!మా గదనుకొని వచ్చుంటారులే!అయినా వారికిప్పుడు అలాంటి  కోరికలు అంతగా లేవక్కా"భర్తను సమర్థించింది జమున.

"పిచ్చి మొహమా!ఇంత పెద్ద విషయాన్ని ఎంత తేలిగ్గా తీసుకున్నావ్ !అక్కను కనుక చెపుతున్నా! ఇదిగో...నలభైకి పైబడ్డ మగాళ్ళకు ఇలాంటి కోరికలు విరివిగా పుట్టుకొస్తాయ్ !అప్పుడు మనసును ఎటంటే అటే పోనిస్తారు.కనుక మీ బావగారి విషయంలో నేను జాగ్రత్తలు తీసుకున్నట్టు నువ్వూ తీసుకోవాలి. మరిదిగారి వాలకం నాకు సందేహాన్ని తెప్పిస్తుందమ్మా.తరువాత నీ ఇష్టం"అని చెల్లెలికి హితబోధ చేస్తుండగా బైకును స్టార్టు చేసి"వదినగారూ!ఆలస్యమౌతుంది.త్వరగా రండి"అని కేకేశాడు జయకృష్ణ.

"అమ్మో...అతగాడి బైకులో నేను వెళ్ళనమ్మా.ఆటోలో వెళతా!"ఆందోళనతో అంది యమున. జమున మెల్లగా నవ్వి"అలాగే"అని అటు తిరిగి"ఏమండీ!ఆటోని పిలిపించండి.అక్కయ్య అందులో వెళుతోందట"అంది భర్తతో.

"ఓకే...మీ ఇష్టం."అని అటు రోడ్డున వెళుతున్న ఆటోని పిలిచాడు జయకృష్ణ.

మరిది ముందు సిగ్గుపడుతూ వొంటినిండా చీరను కప్పుకొని ఆటోలో కూర్చొన్న యమున మళ్ళీ చెల్లెలిని దగ్గరకు పిలుచుకొని"అమ్మాయ్! ఎందుకైనా మంచిది మీ ఆయన విషయంలో కాస్త జాగ్రత్త వహించు"అని కళ్ళసైగలతో మెల్లగా ఒత్తి పలికింది. ఆటో కదిలింది.

జయకృష్ణ జమునల పెళ్ళి జరిగి పన్నెండేళ్లు.జమున అదృష్టం పల్లెటూరిలో పుట్టి పెరిగిన తనకు పట్టణ వాసి,పేరున్న కంపెనీలో గుమాస్తా వుద్యోగం చేస్తున్న జయకృష్ణ భర్తగా దొరికాడు.అది ఆమే పూర్వజన్మ సుకృత ఫలంగా భావించింది.అయితే ఆమెకు పెళ్ళయి ఇన్నేళ్ళయినా తన కడుపు పండలేదన్న దిగులు మాత్రం వెంటాడుతూ వుంది.అందుకు తగ్గట్టు అక్క తన భర్తను గూర్చి అలా లేని పోనివి చెప్పిన తరువాత పిల్లలు లేని కొరత తన కాపురానికి గొడ్డలి పెట్టవుతుందేమోనని భయపడింది.

జమున డిగ్రి చదివింది.ఇంటిలో వూరికే వుండడం ఎందుకని వుద్యోగానికి వెళతానని ఎన్నో సార్లు భర్త జయకృష్ణను అడిగింది.తను వద్దన్నాడు.కనుక భర్త అభియిష్టం మేరకు హాయిగా ఇంటి పనులతో,భర్త సేవలో తరించి పోతూ కాలాన్ని వెళ్ళబుచ్చుతుందామె!
ఇలాంటి సమయంలో వూరినుంచి వచ్చిన అక్క తన భర్తను గూర్చి బలమైన విషభీజాన్ని తన మనసులో నాటి వెళ్ళింది వూహించుకోలేక పోయింది.ఎందుకైనా మంచిదని భర్త కోరినట్టు వుంటూనే తనమీద ఓ కన్నేసి వుంచాలన్న నిర్ణయం తీసుకొంది.భర్తను క్రీకంట చూస్తూ ఏమీ మాట్లాడకుండా అలాగే వెళ్ళి మంచంమ్మీద పడుకొంది.

బైకును పార్కు చేసి గదిలోకి ప్రవేశించిన జయకృష్ణ"ఏమిటి అదోలా వున్నావ్ ? మీ అక్క వెళ్ళిపోయిందన్న దిగులా?"ప్రక్కన కూర్చొంటూ అడిగాడు పైన చెయ్యివేస్తూ జయకృష్ణ.

"దిగులా...నాకెందుకూ?ఆ దిగులేదో మీకే వుండాలి మరి."చెయ్యిని ప్రక్కకు నెట్టి అటు తిరిగి పడుకొంది జమున.

"ఏమిటీ అదోలా మాట్లాడుతున్నావ్ ?"

"ఏదోలా... ఎంచక్కా వాటేసుకొని ముద్దు పెట్టుకొన్నట్టా!మా అక్కయ్య చెప్పిందిలే!"

"అయ్యోరామ! అదా సంగతి. వదినగారు నీ నైటీలో కనబడే సరికి నువ్వేననుకొని....అయినా ఆవిడకు సారీ చెప్పానుగా!"అంటూ తన వేపుకు తిప్పుకున్నాడు.అప్పుడు జమున కళ్ళవెంట కన్నీటి ధారలు.

"ఏయ్ !వాట్ ఈజ్ థిస్ !ఏడుస్తున్నావా?"

"మరి .మా అక్క  నాపై తనకున్న ప్రేమతో విషయాన్ని చెప్పి మిమ్మల్ని జాగ్రత్త పరచుకో మంది. ఇంకొక్కర్తయితే మిమ్మల్ని లొంగదీసుకునేదే"

"అలాని చెప్పి నన్ను నీ చెప్పు చేతల్లో వుంచుకోమంది కదూ!?"కన్నీళ్ళు తుడుస్తూ "ఓసి పిచ్చి మోహమా!అది తెలీక జరిగిందే!అయినా చక్కగా చెక్కు చెదరని అందగత్తెవు నా భార్యవు నువ్వుండగా నిన్ను కాదని....అబ్బే!అస్సలు వూహించలేను."అంటూ తన బాహువుల్లోకి లాక్కొన్నాడు.ఇంకేమి మాట్లాడలేని జమున అప్పుడే ఐసై కరిగి పోయింది.

"నిజంగా నేనంటే మీకంత ప్రేమాండీ!"భర్త గుండెలమీద  రాస్తూ గోముగా అడిగింది.

"ఆఁ...చచ్చేంతమ్మా"అంటూ అదరంమ్మీద చిలిపిగా చుంబించాడు జయకృష్ణ.

*********

పది రోజుల తరువాత రైతు బజారులో....

"అమ్మాయ్ !నువ్వు జమునవు కదూ?"జమునకు తెలిసిన ఓ పెద్దావిడ అడిగింది.

"అవునాంటీ!మిమ్మల్ని చూసి చాన్నాళ్ళయ్యింది.బాగున్నారా?

"ఏం బాగోలేమ్మా!మావారు యాత్రలకని వెళ్ళి మూడునెల్లు.ఇంకా రాలేదు. ఒంటరిగా వుంటున్నాను.ఒంటరి తనమే ఓ నరకం తెలుసా ! పోని...ఉదయం మీ వారి బైకులో ఓ అమ్మాయిని చూశాను. పిల్ల బంగారపు బొమ్మలా వుంది.మీ చెల్లెలా?"అడిగింది పెద్దావిడా.

"నాకు చెల్లెళ్లు లేరాంటీ.అక్క మాత్రమే!ఈ మధ్యే వచ్చి వెళ్ళింది."అని జవాబైతే చెప్పింది కాని వెంటనే భర్త మీద సందేహం రాగా తనకు తానే మనసులో వూగి  పోయింది.ఆ సంగతిని వెంటనే తేల్చుకోవాలన్న ఆదుర్దాతో "వస్తానాంటీ!"అంటూ ఆటోలో ఇంటికి  వెళ్ళి పోయింది.
ఆటో దిగి ఇంట్లోకి నడుస్తూ హాలు,రెండు పడగ్గదులూ,స్టోర్ ,కిచ్చన్ గదులను ఓ సి,ఐ.డి లా చూస్తూ లోనికెళ్ళింది.జయకృష్ణ కనబడలేదు.కాని ఎక్కడినుంచో ఆడమగలు మాట్లాడుకునే మాటలు మాత్రం వినిపిస్తున్నాయ్ .ఎక్కడ అన్నట్టు పైకి చూసింది.ఆ మాటలు టెరాస్ మీదినుంచి వినబడుతున్నై.కూరల సంచిని అక్కడే డైనింగ్ టేబుల్ మీద గీరాటేసి చకచకా పైకెళ్ళింది.ఇంకేముంది...అక్కడి సన్నివేశాన్ని చూసి అదిరి పోయింది జమున. ఓ పాతికేళ్ళ అమ్మాయి చేతిలో జయకృష్ణ చేయి వుంది ఏదో భరోసాతో హామీ ఇస్తున్నట్లు.

"నువ్వేం బయపడకు లాస్యా!నీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను.నన్ను నమ్ము."అంటున్నాడు జయకృష్ణ.

"అదీ... మీరు అక్కగారికి చెప్పకుండా చేస్తే మోసం చేసినట్టు కాదా?"భయం కనుబరుస్తూ అంది లాస్య.

"దానికెలా తెలుస్తుంది.నేను చెప్పనుగా!అయినా అదో పిచ్చి మాలోకం"

ఆ మాటను వింటూనే జమునకు కోపం కట్టలు తెంచుకుంది.తనొచ్చింది కూడా గమనించకుండా కొనసాగే వాళ్ళ సంభాషణకు అడ్డు తగులుతూ "ఏమండీ!నేను పిచ్చి మాలోకమా?నన్ను రైతు బజారుకు వెళ్ళనిచ్చి మీరిక్కడ వేస్తున్న వేశాలివేనా?ఎవరీ అమ్మాయ్ ?చేతిలో చెయ్యుంచి ఏదో ప్రమాణం చేయించు కొంటున్నట్లుంది!?"

జమునను చూసిన లాస్య ఏదో సర్దుకొన్నట్టు జయకృష్ణ చేతిలో నుంచి తన చేతిని విడిపించుకొని బరబర మెట్లు దిగి వెళ్ళి పోయింది.
జయకృష్ణ మెల్లగా జమున దాపు కొచ్చి భజంమ్మీద చెయ్యేసి"వచ్చి చాలా సేపయ్యిందా?"కూల్గా అడిగాడు.

"అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి"చెయ్యి తొలగించుకొని కాస్త కోపంగా అంది జమున.

"ఆ అమ్మాయి మా ఆఫీసులో పని చేసే ఆనంద్ గాడి పెళ్ళాం.వాడు నాకు మంచి స్నేహితుడు.వాళ్ళ భార్యాభర్తల మధ్య ఏవో  తగాదాలు వస్తే వాడు కోప్పడి వాళ్ళింటికి వెళ్ళి పోయాట్ట.వాణ్ణి సమాధాన పరచి ఇంటికి తీసుకు వచ్చే ఏర్పాట్లు చెయ్యమంటే డిష్కస్ చెద్దామని ఇంటి వరకూ బైకులో తీసుకు వచ్చాను. పాపం...తనకు నేనే దిక్కని...ఛ...మనమే దిక్కని ఏడుస్తోంది. రా... క్రిందకు వెళదాం"అంటూ రెండడుగులు వేశాడు.

"ఆగండి! అంటే ...భార్యభర్తల మధ్య తగాదాలు తీర్చేంతటి ఘటికులా మీరు!"ముఖం మూడు వంకలు త్రిప్పుతూ అడిగింది.

"ఆఁ...ఏదో 'లా' చదివిన అనుభవం.అపారమైన తెలివి"నవ్వుతూ అన్నాడు.

"అబ్బా పోజిచ్చి మరీ బుకాయించకండి.ఆ అమ్మాయికీ మీకు ఎలాంటి సంబంధం లేదా?"

"అస్సలు లేదు.నన్ను నమ్ము జమునా!అయినా అప్సరసలా అందమైన భార్యవు నువ్వుంటే పనికిరాని వాళ్ళకోసం పాకులాడుతానా!"అంటూ అమాంతం కౌగిట్లోకి తీసుకున్నాడు భార్యను.వెంటనే ఐసై పోయిందామె.

"నిజమా అండీ!నాకేదో భయమేసి..."తొలగిన పైటను సర్దుకోవటానికి ప్రయత్నించింది జమున.

"నువ్వు ప్రతి సారి ఇలాగే అవుతావు.ఇదిగో!పేరుకే నేను కృష్ణుణ్ణి.నిజానికి ఏకపత్నీ వ్రతుడు ఆ శ్రీరామ చంద్రుడు లాంటి వాణ్ణి తెలుసా?"అంటూ కౌగిట్లో గట్టిగా బంధించాడు.ఆమె కిమ్మనకుండా తనలోకి వొదిగి పోయింది.

*********

ఆ రోజు భోజనాల వేళప్పుడు భర్తకు కొసరి కొసరి వడ్డిస్తోంది జమున. జయకృష్ణ కూడా భార్య వంటను పొగుడుతూ భోంచేసి చెయ్యి కడుక్కొంటూనే టవలుకు బదులు తన పమిట చెంగును అందించిందామె! చేతులు తుడుచుకొని జమునను పొదివి పట్టుకునే సమయంలో 'సార్ పోస్టు' అన్న కేకతో భర్త చేతులనుంచి విడిపించుకొని పరిగెత్తినట్టు వెళ్ళి సంతకం పెట్టి కవరందుకొంది జమున.

"ఏమిటది...కవరా? నీ పేరా వచ్చింది కదూ!?ఓపెన్ చేసి చదువు.సంతోషంతో తనమునకలై పోతావ్" అన్నాడు జయకృష్ణ.

"అవునండి.మీ కంపెనీ నుంచి నా పేరా వచ్చిందీ కవరు..ఏమిటిది?"అంటూ ఓపెన్ చేస్తుండగా "అది నిన్ను వుద్యోగానికి రమ్మని పంపిన అప్పాయింట్ మెంటు ఆర్డర్ "అన్నాడు ఠీవితో.

కవరు ఓపెన్ చేసి చూసి సంతోషంతో వుక్కిరి బిక్కిరై పోతూ"అవునండి.జీతం ఇరవై వేలట.అయితే నాకు వుద్యోగం కావాలని నేను అప్లై చేయలేదే! ఎలా వచ్చిందండి?"అమాయకంగా అడిగింది.

"ఉద్యోగం చేయాలని ఆశ పడ్డావుగా!అయ్యగారి ఇన్ఫ్లూయన్స్ తో బాసును సంప్రదించి రప్పించానులే! వచ్చే సోమవారమే మా ఆఫీసులో జాయినవ్వాలి.సంతోషమేగా!"గొప్పగా ఫీలవుతూ అన్నాడు.

"ఎంతో సంతోషం.నిత్యం నన్నూ,నా భవిష్యత్తును గూర్చి ఆలోచించే మీరు చాలా గొప్పవారండి .ధ్యాంక్స్"

"అంతేనా!ఒక్క  ము....ఇక్కడిచ్చుకోవా?!"అడుగుతుంటే "చీ"అంటూ వెళ్ళిపోయి కవరు దేవుడి ముందుంచి దణ్ణం పెట్టుకొంది జమున.
జమున వుద్యోగంలో జాయినయ్యింది.అదృష్టం కొద్ది భర్త జయకృష్ణ ప్రక్క సెక్షనే తనది. రోజూ వుదయం లేవడం టిఫన్ తో పాటు వంట చేసుకోవడం తినడం  భర్తకు తనకూ క్యారియర్లు కట్టుకోవడం బైకులో వెళ్ళడం సాయంత్రం తిరిగి ఇంటికి రావడమంటూ హాయిగా కుదిరి పోయింది జమునకు ఆ జీవితం.

ఇక సెలవు రోజుల్లో సినిమాలకు,షికార్లకు తక్కువలేదు.ఎప్పుడూ భర్తతోనే వున్నట్టుండే ఆ లైఫ్ స్టయిల్ తనకు బాగా నచ్చింది.
ఇలా సంవత్సరం గడిచి పోయింది.

ఓ రోజు ఖాళీగా వున్న వాళ్ళ ప్రక్కింటికి ఒకావిడ అద్దెకు దిగింది.ఆమెకు భర్త లేడు.కాని అజంతా శిల్పాన్ని తలపించే విధంగా ఓ అందమైన కూతురు వుందని కాల్ టాక్సీ లోంచి ఆమె దిగి లోనికి వెళుతుంటే చూశాడు జయకృష్ణ. చూసిన వెంటనే ఆ సుందరిమీద మామూలుగానే మనసు పారేసుకున్నాడు.ఎలాగైనా సమయం చూసుకొని ఆ అమ్మాయితో మాటలు కలుపుకొని తన్నుగూర్చి చెప్పుకోవాలనుకొన్నాడు.అది వెంటనే జరగాలని పధకం వేసుకొన్నాడు.

"ఏమిటి నన్ను ఆటోలో వెళ్ళమంటున్నారు.ఆఫీసుకు మీరు రారా?"రెండు క్యారియర్లు టేబుల్ మీద వుంచుతూ అడిగింది జమున.

"తలెందుకో నొప్పిగా వుంది జమునా!ఝండూ బాం రాసుకున్నా.తగ్గితే మధ్యహ్నం వస్తానులే"అంటూ జమున ముందే లప్పెడు ఝండూబాంను రెండు వ్రేళ్ళతో తీసుకొని నొసలుకి,వొంటికి పూసుకున్నాడు. "సరే!తగ్గితేనే రండి.వస్తానండి."అంటూ బ్యాగు తీసుకొని రోడ్డుపైకి నడిచిండి జమున ఆటో కోసం.ఆటోలో కాస్త దూరం వెళ్ళిన జమునకు ఆఫీసులో తనకున్న అలిమిరా  కీసు మరచి పోయి బెడ్ రూంలో తలగడ క్రింద వుంచింది గుర్తుకొచ్చింది.వెంటనే ఆటో అబ్బాయిని ఆటోని వెనక్కు తిప్పమంది.

అప్పుడు ఇంటి వద్ద జయకృష్ణ ప్రక్కింటికి కొత్తగా వచ్చిన అజంతా శిల్పం బట్టలారేసుకోవడానికేమో బట్టల బక్కెట్టుతో పైకెళుతుంటే  గమనించాడు.వెంటనే అయిదు నిముషాల్లో స్నానమదీ చేసి డ్రస్ చేసుకొని గుభాలించే సెంటు పరిమళంతో అందాన్ని ఓ సారి అద్దంలో చూసుకొని సినిమా హీరో పోజుతో టెరాస్ మీది కెళ్లాడు 'నా హృదయంలో నిదురించే చెలీ' అన్న పాటను పాడుకుంటూ. అదా సుందరి గమనించలేదు. వాల్యూం పెంచాడు. నో రెస్పాన్సు.పాటను రీవైండ్ చేసి పాడాడు.నో ఛాన్సు.మళ్ళీ పాడుతూ వున్నాడు.

అంతలో ఇంటికి తిరిగొచ్చిన జమున తలుపులు  బార్లా తెరచి వుంచిన ఇంట్లోకి చూసి పాట వినిపిస్తున్న వేపు వింటూ టెరాస్ మీదికి వెళ్ళింది .తన్మయత్వంతో పాటను రాగయుక్తంగా పాడుతున్నాడు జయకృష్ణ ఆ  సుందరి తన్ను చూడాలన్న వుద్దేశ్యంతో.  కాని బట్టల్ని ఆరేసిన సుందరి బక్కెట్టుతో క్రిందికి దిగి పోతుంటే విస్తుపోయన జయకృష్ణ చూపుల్ని అలా తిప్పాడు.ఇంకేముంది ఎదరే జమున!.

"ఏంటి...ఆఫీసుకువెళ్ళలేదా?"గుటక మింగుతూ అడిగాడు జయకృష్ణ.

"లేదు.ఇకపై కూడా వెళ్ళను.మిమ్మల్నీ  వెళ్ళ నివ్వను. ఓ నేల సెలవు పెట్టించి హౌస్ అరెస్తులో వుంచి నన్నే చూస్తూ వుండేలా చేస్తాను.అదే మీకు నేనిచ్చే పనిష్మెంటు.రండి క్రిందకు" రాటుదేలిన ఆడదానిలా అంటూ చెయ్యి పట్టుకొని బరబరా లాక్కెళుతుంటే కసాయి వాడితో వెళ్ళే గొర్రెపిల్లలా వెనకాలే నడుస్తూ "అది...అది...మరి..." అన్నాడు జయకృష్ణ ఏదీ చెప్పలేక.

"కూర్చొండి"అని చెప్పి సెల్ ఫోన్ తీసుకొని నంబర్లు నొక్కి "హల్లో! నేనేనండి జయకృష్ణ భార్యను.ఆఁ...ఆఁ... జమున్నే!ఆఁ...మావారికి మెడ్రాస్ 'ఐ'. అవునండి. వారు ఆఫీసుకు రాలేరు.పదిహేను రోజులు సెలవు రాసుకొండి. ఆఁ...వారు జాయినయ్యేటప్పుడు డాక్టరు సర్టిఫికేటు సమర్పిస్తారులెండి.ఓకే...పెట్టేస్తున్నా."అని ఫోన్ కట్  చేసి కోపంగా జయకృష్ణ ముఖంలోకి చూసింది.

"అదికాదు జమునా...."ఏదో చెప్పబోయాడు జయకృష్ణ.

"బస్ !అప్సరసవు, అందమైన భార్యవు, చెక్కు చెదరని అందం  నీదంటూ నన్ను పొగిడి పారేసి లొంగదీసుకోను ఇక  ప్రయత్నించకండి. అయినా మీకు నేనేం తక్కువ చేశానండి.ఇలా ఆడాళ్ళవెంట పడుతున్నారు!ఆ రోజు మా అక్క, ఇంకోరోజు మీఫ్రెండు భార్య, ఈ రోజు ప్రక్కింటమ్మాయని అందరికీ దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నారు. ఇక వూరుకోనండి.నాకు పనొద్దు.మీకు పని పోయినా పర్వాలేదు.వున్న ఆస్తంతా కరిగి పోయినా బాధపడను. నాక్కావలసిందల్లా మీరు నాతోనే వుండడమే! ముందులా లక్షణంగా వండి పెడతాను.తిని నేను చెప్పినట్టూ వింటూ ఇంట పడుండండి చాలు"అని భర్తకు ఎదరే కూర్చొంది తన్ను నోరు తెరవనీకుండ. అప్పుడు కదలకుండా అలాగే కూర్చొన్న జయకృష్ణ కాస్త ఇబ్బంది పడ్డాడు. కాని మరుసటి రోజునుంచి అది తనకు మామూలైపోయింది.లేవడం,బ్రష్ చేసుకోవడం,పెట్టింది తినడం,పేపరు చదువుకోవడం,టి.వీ చూడ్డం వరకే పరిమితమైయ్యాడు. వాటికి మాత్రమే అలవాటు పడ్డాడు జయకృష్ణ.  రెండు వారాలు గడిచాయి.ఓ రోజు వున్నట్టుండి వాళ్ళ బాసు కారొచ్చి ఇంటి ముందాగింది.ఆయన్ను చూస్తూనే ఆశ్చర్యంతో వెళ్ళి రిసీవ్ చేసుకొంది జమున.లోనికొచ్చిన బాసు ఎప్పుడూ హీరోలా కనబడే జయకృష్ణను బనీను,మొలకు తుండు గడ్డతో,గీకని గడ్డంతో  సోఫాలో కూర్చొని వుంది చూసి బిత్తర పోయాడు.అంతలో మంచినీళ్ళు తెచ్చి యిచ్చింది జమున.  నీళ్ళుతాగి గ్లాసును ప్రక్కన పెడుతూ "ఏమిటమ్మా ఇదంతా... హీరోలా  వుండే కృష్ణను పేద పనిమనిషిలా తయారు చేశావు.మీ మధ్య జరుగుతున్న తతంగాన్నంతా తెలుసుకొనే వచ్చాను.పాపం!జయకృష్ణను అలా వుండాలని ఆదేశించావు కదూ?"అన్నాడు. "అది సార్ ..."అంటూ మభ్య పెట్టాలన్న వుద్దేశ్యంతో ఏదో చెప్పబోయాడు జయకృష్ణ.

"బస్ ! మీరూరుకొండి. .నేను చెప్పుకొంటాను . సార్ !మీరు నాకు తండ్రిలాంటి వారు.కధ మొత్తం వినండి.న్యాయం చెప్పండి.వీరు మునుపటిలా లేరు సార్ ! పేరుకు తగ్గట్టు మారిపోయారు.అంత వరకూ ఏదో జరిగి నా కొంప కోల్లేరవక ముందే మేల్కొన్నాను. వీరు ఈ మధ్య అమ్మాయిల వెంట పడుతున్నారు సార్ ! అందుకే సెలవు పెట్టించాను.నేను కూడా పని మానుకొంటాను సార్ !బయటి ప్రపంచానికి సంబంధం లేకుండా వీరిని ఇంట్లోనే...నాతోనే వుండేలా చేసుకొంటాను.అప్పుడు కాని వీరికి తిక్క కుదరదు"అంటూ ఆవేశంతో చెప్పి పమిటను నోటికడ్డుంచుకొని ఏడ్వసాగింది జమున.

"ఏమిటమ్మా నువ్వంటున్నది.ఈ మాత్రానికే వుద్యోగాలు మాని ఇంట్లో కూర్చొంటారా? ఇదిగో! మీ పెద్దల ఆస్తిని తింటూ మొత్తం కరగదీసుకొండి నాకెలాంటి అభ్యంతరం లేదు.కాని వున్న ఉద్యోగాలను వదులుకో కూడదమ్మా!ఇందు వల్ల మీకు జీతమే పోతుంది. కాని కంపెనీ యజమానినైన నాకు బోలెడు నష్టం వస్తుంది.ఎలాగంటే నువ్వొచ్చిన వేళా విషేశమో,లేక కస్టమర్ల వద్ద నువ్వు నడుచుకునే విధానమో తెలియదు  కాని నాకిప్పుడు ఉత్పత్తితో పాటు లాభాలు కూడా బాగా వస్తున్నాయి.ఇక జయకృష్ణ కల్లకపటమెరుగని ఒఠ్ఠి బోలా మనిషి. సిన్సియారిటి, ఫంక్టువాలిటీ, హానెస్టులకు మారుపేరు.అందుకే నేను మిమ్మల్నిద్దర్ని అంత సులువుగా వదులుకోలేను. ఇక నీ బాధ నాకర్థమైయ్యింది.మీ ఆయన లాంటి వీక్ నెస్ ప్రతి మగాడిలో వుంటుందమ్మా.అది కేవలం ఆడదాన్ని చూసి ఆనందించడం వరకే తప్ప ద్రోహానికి చోటుండదు. మొత్తానికి మగాడ్ని తొట్రిలకుండా ఆడది... అంటే నువ్వే తెలివిగా జాగ్రత్తలు తీసుకొని జయకృష్ణను నీ చెప్పు చేతల్లో వుంచుకోవాలి.జయకృష్ణా!నువ్వుకూడా కనబడ్డ ప్రతి ఆడదాని వెంట సొల్లు కార్చుకుంటూ వెంట వెళ్ళి కూడదయ్యా! వున్న దాంతో తృప్తి పడాలంతే!కనుక రేపటినుంచి ఇద్దరూ మునుపటిలా మళ్ళీ  ఆఫీసుకు వస్తున్నారు. రావాలి.మీకు మరో శుభ వార్త. మీ ఇద్దరికి చెరో రెండు వేలు ఇంక్రిమెంట్ల రూపంతో జీతాన్ని పెంచుతున్నాను. ఒకే!"అంటూ ఓ సుదీర్ఝమైన ఉపన్యాసాన్నిచ్చి బయటికి నడిచాడు బాసు.
బాసు మాటల్ని అవగాహనతో విన్న భార్య భర్తలిద్దరూ ఒకరి ముఖాలనొకరు చూసుకొన్నారు. జమున

'సారి అండీ! మిమ్మల్ని ఇలా గృహనిర్భంధంలో వుంచినందుకు నన్ను క్షమించరూ'అని కళ్ళతోనే అడిగింది. 'పర్వాలేదు జమున !నిజానికీ నువ్వనుకొన్నట్టు నేను అలాంటి మనిషిని మాత్రం కాను.నాకు  సర్వం నువ్వే'అన్నట్లు దగ్గరకొచ్చాడు జయకృష్ణ.

 

 

మరిన్ని కథలు
vaanademudaa