Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

బుర్రకి కాస్తంత పని చెప్పేద్దామా!

natural human brain Vs smart gadgets

కంప్యూటర్లు, ల్యాప్‌ ట్యాప్‌లు, స్మార్ట్‌ ఫోనుల్లో మెమరీని పెంచుకుంటున్నాం. వన్‌ జీ, టూ జీ.. కాదు కాదు ఇప్పుడు ఫోర్‌ జీ అంటూ గ్యాడ్జిట్స్‌లో మెమరీని పెంచుకుంటూ పోతున్నాం. చిత్రమేంటంటే ఈ ఎలక్ట్రానిక్‌ వస్తువుల్లో మెమరీని మనకి నచ్చినట్లుగా పెంచుకుంటూ పోతున్నాం. కానీ మన బ్రెయిన్‌లో ఉన్న అన్‌లిమిటెడ్‌ మెమరీని మాత్రం పెంచుకోలేకపోతున్నాం. పెంచుకోవడం సరి కదా. ఉన్న మెమరీనే మర్చిపోతున్నాం. ఇదివరకటి రోజుల్లో ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ ఉండేది. ఫోన్‌ నెంబర్లను వందల సంఖ్యలో మన బ్రెయిన్‌లోనే సేవ్‌ చేసుకునేవాళ్లం. ఆలా ఉండేది మన బ్రెయిన్‌ మెమరీ. కానీ ఇప్పుడు మన ఫోన్‌ నెంబర్‌ మనమే గుర్తుంచుకోలేని పరిస్థితి. ఎందుకంటే, అవసరం లేదు. మన మెమరీని ఫోన్‌కి ట్రాన్స్‌ఫర్‌ చేసేశాం కదా. ఇంకెందుకు అనవసరంగా బ్రెయిన్‌ని కష్టపెట్టడం అనుకుంటున్నాం. ఎందుకిలా అవుతోంది? అంటే స్మార్ట్‌గా ఇంకా ఇంకా ఏదో గ్యాడ్జిట్‌ కావాలనుకుంటున్నామే కానీ దాని కంటే ఎన్నో వేల, లక్షల రెట్లు స్మార్ట్‌ అయిన మన బ్రెయిన్‌ని మాత్రం బొజ్జోపెట్టేస్తున్నాం. ఒక్క ఫోన్‌ నెంబర్స్‌ విషయంలోనే కాదు, ఏడాది, రెండేళ్ల క్రితం పరిచయమైన వ్యక్తుల్ని కూడా మర్చిపోతున్న పరిస్థితి. చిన్నప్పటి సరదా సంగతులు గుర్తుండట్లేదు. చిన్నప్పటి సంగతి సరే, నాలుగైదేళ్ల క్రితం జరిగిన సంగతుల్ని కూడా నెమరువేసుకోవడం కష్టంగా మారిపోయింది. చిన్నప్పటి నుండీ కలిసి చదువుకున్న ఫ్రెండ్స్‌ని కాలేజీకొచ్చాక మర్చిపోతున్నాం. మన పక్కనే ఉన్నవారు ఒక విషయం గురించి మాట్లాడుతుంటే, మనం ఏదో లోకంలో ఆలోచిస్తున్నాం. ఈ సమస్యలన్నింటికీ కారణం స్మార్ట్‌ టెక్నాలజీనే. సో ఈ క్రమంలో బ్రెయిన్‌ షార్ప్‌ చేసుకునేదుకు మానసిక వైద్యులను, యోగా వంటి ప్రక్రియలను ఆశ్రయిస్తున్నాం. మన జనరేషన్‌ పరిస్థితే ఇలా ఉంటే ఇక నెక్స్ట్‌ జనరేషన్‌ పరిస్థితి ఏంటి?

ఈ సమస్య నుండి బయట పడాలంటే, పిల్లలకు చిన్నతనం నుండే స్మార్ట్‌ ఫోన్‌లు, కంప్యూటర్లను అప్పగించడంతో పాటు, అవి లేకుండా కూడా చిన్న చిన్న విషయాలను గుర్తుపెట్టుకునే అలవాటు చేయాలి. పెద్ద విషయాలనూ అర్ధం చేసుకునేలా వాళ్ల మైండ్‌ సెట్‌ని మార్చాలి. అందుకోసం వారికి సరదా సరదా కథలు చెప్పాలి. హుషారెత్తించే విషయాలను తెలియచేయాలి. ఆశక్తికరమైన ప్రదేశాలను చూపించాలి. వాటన్నింటినీ మన చేతిలోని చిట్టి సెల్‌ఫోన్‌లలో బంధించడంతో పాటు మన బ్రెయిన్‌లో కూడా గుర్తు పెట్టుకునేలా వారిని ప్రోత్సహించాలి. మనం చిన్నప్పుడు రకరకాల ఆటలు ఆడేవాళ్లం. ఆ ఆటల్లో కొన్నింటిని పిల్లలకు నేర్పించాలి. చిన్నతనంలో మనం ఆడుకున్న ఆటల్లో తెలియకుండానే బోలెడంత నాలెడ్జ్‌ దాగి ఉండేది. కానీ ఇప్పుడు స్మార్ట్‌ టెక్నాలజీతో వారు ఆడే ఆటలు ఏంటబ్బా అంటే కంప్యూటర్లో వీడియో గేమ్స్‌, రేస్‌ గేమ్స్‌ ఎక్స్‌ట్రా.. అంతే. కానీ వీటితో బ్రెయిన్‌ మొద్దుబారిపోవడమే కానీ, ఫాస్ట్‌గా పని చేస్తుందనుకోవడంలో అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదు. అయితే ఈ పోటీ ప్రపంచంలో స్మార్ట్‌ టెక్నాలజీని యూజ్‌ చేయాలి. కానీ దాంతో పాటు ఈ జనరేషన్‌ పిల్లలకి బ్రెయిన్‌కి సహజంగా ఉన్న నాలెడ్జ్‌ని కూడా పదును పెట్టే అవకాశం కల్పించాలి. మన మైండ్‌ కంటే ఏదీ స్మార్ట్‌ కాదనే విషయాన్ని పిల్లలకి అర్ధమయ్యేలా తెలియచెప్పాలి.

స్మార్ట్‌ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేస్తే నిద్రపోతుంది. కానీ మన బ్రెయిన్‌ నిద్రలోనూ పని చేస్తూనే ఉంటుంది. అది స్మార్ట్‌ గ్యాడ్జెట్‌కీ, నేచురల్‌ హ్యూమన్‌ బ్రెయిన్‌కీ ఉన్న తేడా. అందుకే ఎప్పుడూ స్మార్ట్‌ టెక్నాలజీ మీదే ఆధారపడకుండా, బ్రెయిన్‌ పవర్‌ని కూడా యూజ్‌ చేసేలా పిల్లల్ని ఎడ్యుకేట్‌ చేయాలి. బ్రెయిన్‌కి ఎంత పని చెబితే అంత షార్ప్‌ అవుతుంది. అందుకే కొన్ని ఫోన్‌ నెంబర్లు, మరికొన్ని ఇతర ముఖ్య విషయాలను బ్రెయిన్‌లో స్టోర్‌ చేసుకునేలా పిల్లల్ని చిన్ననాటి నుండే ట్యూన్‌ చేయాలి. ఈ పోటీ ప్రపంచంలో టెక్నాలజీ అవసరమే. కానీ ఆ టెక్నాలజీకి మనిషి మేధస్సు తోడైతేనే అద్భుతాలు చూడొచ్చు. మనిషి మేధస్సుకు మరింత పదును పెడితే మరిన్ని అద్భుతాలు సృష్టించొచ్చు. కొత్తతరానికి మనం ఇచ్చే బిగ్గెస్ట్‌ గిఫ్ట్‌ ఇదే అవ్వాలి. స్మార్మ్‌ టెక్నాలజీ ప్లస్‌ స్మార్ట్‌ బ్రెయిన్‌ ఈజ్‌ ఈక్వల్‌ టు అద్భుతం. ఇదే నిజం. 

మరిన్ని యువతరం
girls be care full