ఈ ఉరుకుల పరుగుల జీవితంలో భర్తతో సమానంగా భార్య కూడా ఆర్ధిక భారం మోయాల్సి వస్తోంది. భర్తతో పాటు భార్య కూడా ఉద్యోగానికి వెళ్లాల్సి వస్తోంది. భర్తతో సమానంగా భార్యలు కూడా ఈ రకంగా అన్నింటా రాణిస్తున్నారు. పురుష అహంకార సమాజం నుండి ఈ మార్పు కొంత రిలీఫ్ ఇచ్చినట్లే అనుకోవాలి. ఈ సంగతి పక్కన పెడితే, భార్యా భర్తలిరువురూ ఉద్యోగాలకు వెళ్లడంతో, పొద్దు పొద్దున్నే వంట చేసుకునే టైం లేని కొంత మంది ఇంట అసలు పొయ్యి వెలగడమే గగనమైపోతోంది. మరికొందరయితే, హడావిడిలో ఉడికీ ఉడకని వంటకాలతో బాక్సులు సర్దుకుని ఉద్యోగాలకు బయలుదేరాల్సి వస్తోంది. ఈ రెండింట్లోనూ ఏ కారణం తీసుకున్నా హెల్త్ ప్రోబ్లమ్స్ చిట్టా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇంట్లో వంట మానేసి బయటి ఫుడ్ రెగ్యులర్‌గా తీసుకోవడం ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తూనే ఉంది. అలాగే హడావిడి వంట కారణంగా మన శరీరానికి అందాల్సిన ఎన్ని పోషకాలు అందాల్సి స్థాయిలో అందుతున్నాయో ఒక్కసారి బేరీజు వేసుకోవల్సిన పరిస్థితి. ఇవన్నీ ఇలా ఉంటే, వారమంతా కష్టపడి వీకెండ్స్‌లో వంట చేసుకోవాలంటే అదో రకం సమస్య. ఇలాగయితే ఎదగాల్సిన పిల్లల పరిస్థితి ఏంటి..? పిల్లల కోసం, రకరకాల రుచుల కోసం, ఈజీ కుకింగ్ అంటూ డిఫరెంట్ ఫ్లేవర్స్‌తో మార్కెట్లో అనేక రకాల ఫుడ్ ఐటెమ్స్ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ప్రోసెసింగ్ చేసిన ఈ ఫుడ్ ఐటెమ్స్‌తో పిల్లల ఆరోగ్యానికి నష్టమే తప్ప లాభం లేదు. అందుకే ఈ పద్ధతి కొంచెం మారాలి. మారాలంటే న్యూ టెక్నిక్ యూజ్ చేయాల్సిందే! అదేంలో తెల్సుకుందామా!
ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే ఉన్న ఒకే ఒక మార్గం. మగమహరాజులే. పూర్వ కాలంలో వంట మనుషులు అంటే మగవారే. ఆ కాలానికి సంబంధించి, నలభీముడు.. తదితర వంటగాళ్ల పేర్లు అప్పుడప్పుడూ బామ్మ నోటనో, తాత నోటనో వినే ఉంంటాం. అంటే ఆడాళ్లే వంట చేయాలి. మగవారు తిని పెట్టాలి అనే ఆలోచన ఎప్పుడో లేదు. ఆనాటి పరిస్థితు దృష్ట్యా వంట మగవారికి కొత్తేమీ కాదు. పూర్వ కాలం నుండీ పురుషుడి చేతికి వంట అలవాటుంది. అందుకే పురుషోత్తములారా! ఒక్క క్షణం కొంచెం కొత్తగా ఆలోచించి చూడండి. సరదాగా వంటగది వైపు ఓ లుక్కేసి.. గరిటె తిప్పి చూడండి. మీకే తెలుస్తుంది. 'ఆడుతూ పాడుతూ వంట చేస్తుంటే ఆలపూ సొలుపేముంటది. ఇద్దరమొకటై గరిటె తిప్పితే ఎదురేమున్నది. రుచికరమైన వంటలకు కొదవేమున్నది..' అదే మీరు ట్రై చేసి చూడండి. ఇలా చేయడం వల్ల మీ శ్రీమతిలో నూతన ఉత్సాహాన్ని, ప్రేమనూ మీరు పొందొచ్చు. వీకెండ్‌ని సరదాగా ఇలా ఇద్దరూ కలిసి వంటని ఎంజాయ్ చేయండి.
వంట అంటే కేవలం తినడానికే కాదండోయ్. వంట చేయడంలో కొత్త కొత్త అనుభూతులు కూడా పొందవచ్చని ఓ సర్వేలో తేలింది. భార్యా భర్తలిద్దరూ కలసి వంట చేయడంలో వారి మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది. పిల్లలతో రిలేషన్స్ స్ట్రాంగ్ అవుతాయి. వంట అంటే ఏదో పొద్దున్నించి సాయంత్రం దాకా కష్టపడిపోయే పని కూడా కాదాయె. ఏదో ఒక గంట అలా సరదాగా టైం కేటాయిస్తే చాలు. బోలెడంత ఆరోగ్యం. శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ఆరోగ్యం కూడా తెచ్చిపెడుతుంది ఈ ప్రక్రియ. భార్యా భర్తలిద్దరూ కలిసి వారంలో ఓ రోజైనా వంట చేయడంపై వచ్చే ఆనందంపై బోలెడన్ని సర్వేలు కూడా జరిగాయి. ఇలా చేయడం వల్ల భార్యా భర్తల మధ్య మనస్పర్ధలు తగ్గుతున్నాయనీ, సంబంధ బాంధవ్యాలు పెరుగుతున్నాయనీ ఈ సర్వేలో తేలింది. వంట చేయడానికి ఇష్టపడే వారిలో ఆడాళ్ల కంటే మగాళ్ల సంఖ్యనే ఎక్కువనీ కూడా ఈ సర్వే తేల్చింది. అయితే సమయం దొరక్క వంటగదిని దూరం పెడుతున్నామంటూ కొందరు మగ పురుషులు చెబుతున్నారు. కానీ సమయం దొరక్కపోవడమనేదే ఉండదు. స్మార్ట్ ఫోన్‌లో ప్రొఫైల్ ఛేంజ్ చేసేందుకు చేసే సెర్చింగ్‌కి తీసుకునే టైంని వంట కోసం కేటాయిస్తే చాలు.అప్పుడొచ్చే కిక్కే వేరప్పా!. అందుకే మగమహారాజులూ మీరూ కిచెన్ కింగ్స్ కావచ్చు. జస్ట్ వన్స్ ట్రైల్ ఇట్!
|