కుర్చీలో తీరుబడిగా కూర్చుని,పొటాటో చిప్స్ తింటూ,టివి చూస్తున్న శేఖరం ,ఏదో శబ్ధం కావడంతో గుమ్మం వైపు చూశాడు.ఎవరో తలుపుకొడుతున్నట్టనిపించి వెళ్ళి తలుపు తీశాడు.ఎదురుగా తన స్నేహితుడు మూర్తి.చూసీ చూడగానే,ముఖం విప్పార్చి,చిరునవ్వుతో, ఒరేయ్ మూర్తీ నువ్వా.ఎప్పుడొచ్చావ్ హైదరాబాద్ నుండి.అడిగాడు లోనికి ఆహ్వానిస్తూ.
నిన్ననే వచ్చాన్రా .మా మనవడి మొదటి పుట్టినరోజుకి రమ్మని మా అమ్మాయి ఫోన్ చేస్తే వచ్చాను.మా అబ్బాయి బిసినెస్ పనిపై డెల్లి వెళ్ళాడు.లేదంటే వాడే వచ్చేవాడు.నేను విశ్రాంతి తీసుకునేవాడ్ని.వయసు కదా.కాలంతో పెద్ద సాగలేను.అని చెప్తూ వచ్చి, హాల్లో సోఫాలో కూర్చున్నారు మూర్తిగారు.
అవునులే. కొడుకు నీడన ఉంటూ, హాయిగా విశ్రాంతి జీవితం గడుపుతున్నావ్.అయినా,అలా మరీ ఖాళీగా కూడా ఉండకూడదు. అప్పుడపుడైనా ఇలా రాకపోతే ఎలాగూ.
ఖాళీనా?భలే వాడివేరా బాబూ.పొద్దున పాలపేకెట్లు తేవడం,నా మనవరాల్ని స్కూల్లో దిగబెట్టడం,సూపర్ బజార్ కు వెళ్ళడం, కాయగూరల కోసం రైతు బజారుకు వెళ్ళడం ,సాయంత్రం మళ్ళీ నా మనవరాల్ని స్కూల్ నుండి తీసుకు రావడం.ఇలానే నెమ్మదిగా ఓ రోబోలా పని చేస్తుంటే,నన్ను ఖాళీగా ఉన్నానంటావా.అడిగాడు సూటిగా చూస్తూ.
ఆ మాటలు విన్న శేఖరం,ఛీ,ఛీ సిగ్గులేదూ.అన్ని పనులు చేయడానికీ ,మళ్ళీ వాటిని నిస్సిగ్గుగా చెప్పడానికీనూ.అసహనం వ్యక్తం చేసారు శేఖరం గారు.
అదేంట్రా అలా అంటావు.అక్కడికి నేనేదో పెద్ద కాని పని చేసినట్టు.అయినా నువ్వూ రిటైరైన వాడివేగా.నువ్వూ ఇంట్లో అడపా దడపా పనులు చేయవా ఏంటి.మరీ విడ్డూరంగా మాట్లాడతావ్ అడిగారు మూర్తి గారు.
నీలా నేనా.ఛ ఛ,నేనంత చచ్చు కాదు.నా కోడలు,కొడుకు నాతో మాట్లాడడానికే పదాలు వెతుక్కుంటారు.ఇక నాకు పనులు చెప్పడమా,అది వారి దృష్టిలో పెద్ద సాహసం.అంత భయం,భక్తి ,గౌరవం నేనంటే.నీకోటి చెప్పనా.మనం రెటైర్ అయిపోయాకే మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి.ఎందుకంటే,రెటైర్ అయిపోయాడు కదా అనే చులకన భావంతో మనల్ని పూచిక పుల్లల్లా తీసిపారేయగలరు.అందుకే ,మావాడు కానీ మా ఆవిడ కానీ ఓ సలహా చెప్పే ముందే వారి మొహం వాచేలా చీవాట్లు పెడతాను.లేకపోతే,అదే అలుసనుకుని మొదట సలహాగా ప్రారంభమై తర్వాత ఆర్డర్లివ్వడం వరకూ వెళ్తారు.అందుకే ఆదిలోనే వారిని అదుపులో పెట్టాలి.తెలుసుకో.కనుక నువ్వూ నాలా ఉండు. చెప్పారు శేఖరం గారు.
మరీ విడ్డూరంగా మాట్లాడుతున్నావురా శేఖరం .నేను నీలా ఉండాలా.ఎందుకూ.నా కుటుంభ సభ్యులపై నేనే పెత్తనం చేయడానికా.లేక వాళ్ళని పెద్దరికం పేరుతో పొడుచుకు తినడానికా.లేదురా. నేనలా ఎప్పటికీ ఉండలేను.అయినా ఇప్పుడు నేను చేదోడు సాయం చేస్తోంది ఎవరికి.నా కొడుక్కి,కొడలికి,మనవరాలికే.అయినా వాళ్ళకి నేను కాకపోతే ఎవరు చేస్తారు.నేను కొంచెం ఇబ్బంది పడ్డా పర్వాలేదు,నా అనుకున్న వాళ్ళని సంతోషంగా ఉంచాలనుకుంటాను, ఉండాలనుకుంటాను.కనుక నేను ఇలానే ఉండిపోతాను.అయినా మనం ఎన్నో చూసి ఈ వయసుకు వచ్చిన వాళ్ళం.మనం పిల్లల్ని దిద్దాలి కానీ వారిపై యుద్దం చేయకూడదు.నేను వయసులో ఉన్నపుడు మా నాన్నని స్కూటర్ కొనమని ఎంత పోరినా కొనలేదు.చివరికి నేను ఉద్యోగంలో చేరగానే లోన్ పై కొనుక్కున్నాను.మా నాన్నకి కోపం వచ్చి ఓ రోజు మాట్లాడలేదు.తర్వాత ఓ హెల్మెట్ కొనిచ్చి,నలబై స్పీడు లోనే నడుపు.ఎప్పుడూ హెల్మెట్ పెట్టుకో లాంటి ఎన్నో జాగ్రత్తలు చెప్పి,నాకు డబ్బు ఇచ్చి లోన్ క్లియర్ చేసేయమన్నారు.అప్పుడు అర్దమైంది ఆయన మనస్సు.కనుక మనం పిల్లలతో విభేదిస్తే,దానికి ఓ మంచి కారణం ఉండాలి.వారిని మనం చెప్పిన మాటే వినాలని కట్టడి చేయాలనుకున్నపుడు , దాని వెనుక ఓ బలమైన కారణం ఉండి తీరాలి.అంతే కానీ, మన మాటే చెల్లాలన్న అహం,నేను చెప్పినట్టే జరగాలనే పెద్దరికపు పట్టుదలలు మంచివి కావు. ఓర్పు కావాలి శేఖరం.అప్పుడే భంధాలు బలపడతాయి.లేకపోతే బరువైపోతాయి.మన నుండి పారిపోవాలనిపిస్తుంది.మనం వారికి చేయూత అయి నడిపించాలి కానీ గుప్పిట్లో పెట్టుకోవాలనుకోకూడదు.మనం కూడా ఆ వయసులో ఇంచు మించు అలానే ఉండేవాళ్లం కాదా.కనుక అజమాయిషీ వద్దురా చెప్పారు మూర్తిగారు.
నీకింకా చాదస్తం పోలేదు రా.అందుకే ఇలా మాట్లాడుతున్నావ్.నేను ఎంత అజమాయిషీ చేసినా నా కొడుకు నా కొడుకే . నేనంటే అదే ప్రేమ.లేదంటే, నన్ను వదిలి బెంగళూరు వెళ్లడానికి తెగ ఇదై పోయాడు.కోడలు అయితే మరీనూ.ఇక మా ఆవిడ నేను రెటైర్ అయ్యాక జీతం తగ్గుతుంది కనుక, మీరు ఇన్నాళ్లూ కష్టపడ్డారు కనుక, నేను ఉద్యోగం చేస్తా అని ఓ పత్రికలో ఎడిటర్ గా పనిచేస్తోంది.నేను వారిపై అజమాయిషీ చేసినా వారు దాన్ని క్రమశిక్షణ అనే అనుకుంటారు.అదీ మా మధ్య అనుబంధం.అయినా నీ కోడలు,కొడుకూ నిన్నో రోబో లా చూస్తున్నారని నా నమ్మకం.నువ్ లేకపోతే ఎలా ఉన్నావ్ అని కనీసం ఆలోచించరు అని నా విశ్వాసం.చెప్పాడు తేలికగా.
సరేలే శేఖరం.నేను నా ధర్మo నేను నిర్వర్తిస్తున్నాను.చేసిన దానికి ప్రతిఫలం ఆశించను.వారికి ఏది నచ్చితే అదే నాకూ నచ్చుతుంది.కారణం వారు బాధ పడకూడదు.కానీ జాగ్రత్తలు చెప్తాను. శ్రుతిమించనంత వరకూ నా కుటుంబసబ్యులతో నేను ఓ స్నేహితుడిని.ఏమైనా నువ్ కొంత కఠినంగా ఉన్నా నీ కుటుంభ సభ్యులు ఓపిగ్గా ఉండటం ఇక్కడ మంచి విషయం.సరే కానీ, చెల్లెమ్మతో మాట్లాడి చాలా రోజులైంది.ఉండు ఓ సారి ఫోన్ చేస్తాను అంటూ శేఖరం భార్యకి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు.మూడవ రింగ్ కి ఫోన్ లిఫ్ట్ చేసింది శేఖరం భార్య లక్ష్మమ్మ .
ఆ, చెల్లెమ్మా ,ఎలా ఉన్నావ్.
ఏం ఉండటంలే అన్నయ్యా.అలాగే. చెప్పిందామె నీరసంగా.
భలే దానివేనమ్మా.అoత చేస్తూ, ఇంత సాధారణంగా మాట్లాడుతున్నావంటేనే తెలుస్తోందమ్మా నీ గొప్పదనం.లేదంటే భర్త రిటైరైన తర్వాత ,అతని పెన్షన్ ,మరియు అవసరాలు గ్రహించి, ఇలా నువ్వు ఈ వయసులో ఉద్యోగానికెళ్తున్నావ్.
భలే వాడివే అన్నయ్యా.నీకలా అర్ధమైందా.ఆయన ఉద్యోగం చేస్తూ ఆ మాత్రం సమయం ఇంట్లో ఉంటేనే,ఆయన అజమాయిషీతో నన్ను కబడ్డీ ఆడేవారు.అలాంటిది ఇపుడు ఆయన రెటైర్ అయ్యారు.రోజంతా ఇంట్లో ఉంటే నన్ను చెడుగుడు ఆడేస్తారు.అందుకే ఆయనికి ఆమాట ,ఈమాట చెప్పి ఇలా ఉద్యోగం చేస్తూ కొంత మనశ్శాంతిగా ఉంటున్నాను.ఈయన అజమాయిషీ భరించలేక కొడుకూ,కోడలూ బలవంతపు ట్రాన్స్ ఫర్ పెట్టుకుని బెంగళూరు పారిపోయారు.వాళ్ళు ఉన్నన్నాళ్లు ,వారిపై అన్నిటికీ ఆంక్షలే.ఆఖరికి,కొడుకు ఆఫీసు నుండి ఆలస్యంగా వచ్చినా,కోడలు పొద్దునే నిద్ర లేవకపోయినా,అతిధులకి టీ ఆలస్యంగా తెచ్చినా, చెడా మడా తిట్లు.ఆయన మాటే వేదం అంటారు.ఏవిటో .చెప్పిందామె.బరువైన స్వరంతో. ఫోన్ స్పీకర్ ఆన్ లో ఉండడంతో ,తర్వాత చేస్తానమ్మా.అంటూ ఫోన్ పెట్టేశారు మూర్తిగారు.
ఆ ఫోన్ కాల్ విన్న శేఖరం ఆలోచనలో పడ్డాడు.
వస్తానురా అని కదలబోయిన మూర్తిగారికి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి,అమ్మా వచ్చేస్తున్నాను.ఆ బానే ఉన్నాను.అబ్బాయి అడిగాడా .సరే .లేదు చక్కర టీలో కూడా వేసుకోవడం లేదు.వచ్చేస్తానమ్మా అని ఫోన్ పెట్టేసి, నా కోడల్రా అని చెప్పి, మనుషులని గెలవాలంటే ఓర్పు కావలి.కొన్నిటికి ఓర్చుకోవాలిరా శేఖరం .అజమాయిషీ కాదు.ఇప్పటికైనా తెలుసుకో,నీ వారిని దగ్గర చేసుకో. చెప్పి బయటకు నడిచాడాయన.
|