'జనవరి 1 నుండి నేను సిగరెట్ తాగను..' జనవరి 1 నుండి నేను బిరియానీకి టాటా బైబై చెప్పేస్తాను..జనవరి 1 నుండి కూల్ డ్రింక్స్ మానేస్తాను.. పలానా వ్యసనాలను ఈ జనవరి 1 నుండి విముక్తి కల్పించేస్తాను అంటూ.. న్యూ ఇయర్ వస్తుందంటే చాలు, తమకున్న చెడు వ్యసనాలకు గుడ్‌బై చెప్పేయాలనీ, కొత్త నిర్ణయాలు తీసుకోవాలనీ, కొత్త జీవితం స్టార్ట్ చేయాలనీ భావిస్తూ ఉంటారు. అదీ న్యూ ఇయర్ స్పెషాలిటీ. అయితే అలాంటి నిర్ణయాలకు చాలా కొద్ది మంది మాత్రమే స్టిక్ ఆన్ అవుతారు. చాలా మంది మొదటి రోజే తప్పుతారు. అయితే అలా తప్పకుండా అనుకున్న నిర్ణయాలను పాఠించాలనుకుంటే ఓ ప్రణాళికను ఖచ్చితంగా పాఠించాలి. ఈ ప్రణాళికలో ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోవాలి. వాటిని ఎలా అమలు చేయాలి.. అనే వాటి కోసం సరదాగా కాసేపు చర్చించుకుందామా!
కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి వయసుతో సంబంధం లేదు. ఐదో క్లాస్ చదివే పిల్లాడి నుండీ, అరవై ఏళ్ల ముసలోడి దాకా కొత్త ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే వయసుతో పాటే, వారి నిర్ణయాల్లోనూ తేడా ఉంటుంది అంతే. అయితే పిల్లలు ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దలు వారికి తగిన సూచనలివ్వాలి. వాటిని ఓ అలవాటుగా చేసుకునేందుకు తగిన ప్రేరణ కల్పించాలి. ఇక యువత విషయానికి వస్తే, వీరికిచ్చే సలహాలు మరింత భిన్నంగా ఉండాల్సిన అవసరముంది. ఎందుకంటే మనం ఇచ్చే సలహా వారికి ఓ క్లాస్ పీకినట్లుగా ఉండకూడదు. కొంత అనుభవం ఉన్నవారికి సలహాతో పని లేదు. అయితే పలానా నిర్ణయం తీసుకుంటున్నాం అందులో మీ సలహా కావాలని ఆడిగేవారికి మాత్రమే మీకు తోచిన ఓ మంచి సలహా ఇచ్చేందుకు ప్రయత్నించండి. యువతలో కొంతమంది చెడు వ్యసనాలకు బానిస అయిన వాళ్లుంటారు. రకరకాల కారణాల దృష్ట్యా వారు ఆ వ్యసనాలకు అడిక్ట్ అవ్వాల్సి వస్తుంది. అలాంటి వారి విషయంలో మీరిచ్చే సలహా చాలా జాగ్రత్తగా ఉండాలి. ధైర్యం చెబుతూ, ఎడ్యుకేట్ చేస్తూ ఏమాత్రం వారిని నొప్పించకుండా ఉండేలా మీరు ప్రయత్నం చేయాలి. ఏ ఏజ్ గ్రూప్ వారికైనా కాలం విలువ తెలియాలి. గడిచిపోయిన కాలం తిరిగి రాదు. కానీ గడిచిన కాలంలో తాము కోల్పోయిన జీవితం గురించి వారికి రిమైండ్ చేయండి. ఆ రకంగా వారిని చెడు మార్గం నుండి మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేయొచ్చు.
కాలం విలువ తెలుసుకుంటే, తద్వారా వచ్చే ఫలితాలు చాలా బాగుంటాయి. పోయిన కాలాన్ని ఎలాగూ తిరిగి తీసుకురాలేం కాబట్టి, ఆ ట్రాన్స్ నుండి బయటపడేందుకు కొన్ని సూచనలు పాఠిస్తే సరి. ముందున్న కాలం మంచి ఫలితాల్ని అందిస్తుంది. చెడు అలవాట్ల నుండి విముక్తి పొందాలనే ఆలోచన ఉన్నవారు, ఇవి పాఠించండి. ఓ మంచి పుస్తకం చదవడం, నలుగురికి సాయం చేయడం వీలైనంతలో, పిల్లలతో ఆటలాడడం, కొత్త కొత్త వ్యాయామాలు ట్రై చేయడం, ఆధ్యాత్మిక ఆలోచనలు చేయడం లాంటి వాటిలో మీకు ఎన్ని వీలైతే అన్ని ట్రై చేసి చూడండి. మీ మెదడుకు రీ ఫ్రెష్‌మెంట్ ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలకి సరికొత్త బలం చేకూరుతుంది. ఎంత చెప్పినా, 'మారాలి' అనే ఆలోచన ఖచ్చితమైనది, కఠినమైనదిగా ఉంటే తప్ప మారడం కష్టం. మారితే మాత్రం చెడు నుండి మంచి వైపుకు మార్గం సులభతరం కావడంతో పాటు, తద్వారా కొత్త జీవితపు సువాసనల్ని ఆస్వాదించేందుకు అవకాశం కలుగుతుంది. అయితే మనం ఎంచుకున్న దారి మంచిదా చెడ్డదా అనే నిర్ణయం బట్టి ఈ మార్పు ఉంటుంది. మంచి ఆలోచనలు, మంచి నిర్ణయాలు చేయండి. న్యూ ఇయర్‌ని సరికొత్తగా ఆహ్వానించండి.
|