Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
premiste emavutundi?

ఈ సంచికలో >> సీరియల్స్

నాదైన ప్రపంచం

nadaina prapancham

గత సంచిక లోని  నాదైన ప్రపంచం సీరియల్ చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.....http://www.gotelugu.com/issue246/670/telugu-serials/naadaina-prapancham/nadaina-prapancham/

(గత సంచిక తరువాయి)... .‘‘మీరే!’’ తాపీగా అంది.
‘‘నేనా?’’ విస్మయంగా అన్నాడు....

‘‘అవును మీరే, మీ బలహీనతే!’’ అతని మీదకి ఒక పాత పేపర్ విసిరి " చూడండి...మీ గురించిన ఆర్టికల్ " అంది.

ప్రపంచంలో క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని వదిలేసారనడానికి చిహ్నంగా ఏవో కొన్ని ఉదాహరణలిస్తూ తన ఉదంతాన్ని కూడా పేర్కొన్నారు. తను ఇవ్వలేదు. కానీ తన ఫ్రెండ్స్ ఎవరో ఈ పని చేసుండొచ్చా?

‘‘ఈ ఇష్యూలో సఫరయింది నేను....నేనెలా మీలో నెగెటివ్ థాట్స్ క్రియేట్ చేశాను?’’ ఆశ్చర్యంగా అన్నాడు.

‘‘కొంచెం కూడా ఆలోచన లేకుండా, ప్రేమించిన అమ్మాయి కిడ్నాప్ అయిందని తెలియగానే, ఆటని వదిలేసి పరుగెత్తారు. కిడ్నాప్ అయిన అమ్మాయిని మీరొక్కరూ రక్షించడం కష్టం. మీరు పోలీస్ రిపోర్ట్ ఇచ్చి స్టేడియంకి వెళ్ళుండొచ్చు. ఆ పని చేయకుండా....గుడ్డెద్దు చేలో పడ్డట్టు జీవిత లక్ష్యాన్ని వదిలేసి పరుగెత్తారు.

ఇది చదివాక నాకు తెలిసింది. ప్రేమకి వున్న పవర్ ఏంటో!....దాన్ని అడ్డుగా పెట్టుకుని గెలవానుకున్నాను.

నేను గెలవడంకోసం కీర్తనని గాయ పరచాలనుకున్నాను.

కానీ కీర్తన గెలుపు కోసం మీరు గాయపడ్డారు. అప్పుడు నాలో అంతర్మధనం ప్రారంభమైంది. ఎవరికీ చెప్పుకో లేక పోతున్నాను.
ఆవేశంతో ఇలా చేశానే గానీ ఈ పరిణామాలు చూస్తుంటే నామీద నాకే అసహ్యం వేస్తోంది.’’ తల వంచుకుంది. కన్నీటిబిందువొంటి ‘‘టప్’’ మని అర చేతిలో పడింది.

ఎలా ఓదార్చాలో తెలీలేదనికి....

‘‘మీకు నేను ఓ సలహా ఇవ్వాలనుకుంటున్నాను....చెప్పనా?’’

‘‘చెప్పండి....’’

‘‘బాగా ఆడండి. గెలిస్తే లోకం కీర్తిస్తుంది. ఓడారా లోకం నిందించదు. అక్కున చేర్చుకుంటుంది. నిజం....కాకపోతే ఇక్కడ పోరాడటమే
ముఖ్యం...అప్పుడు ఓడినా బాధ కలగదు. బలమయిన ప్రత్యర్ధులకి గట్టి పోటీ ఇచ్చామన్న సంతృప్తి దక్కుతుంది.’’ వింటూ జీర్ణించుకోడానికి ప్రయత్నిస్తోంది మణిబిందు. కాసేపు మౌనంగా గడిచి పోయాక...

‘‘ఓ కోరిక తీరుస్తారా?’’ ప్రార్ధనా పూర్వకంగా అంది.

‘‘చేయ గలిగేది అయితే తప్పకుండా!’’

‘‘ఓ వారం రోజులు నా గేమ్ లో లోపాలు చెప్పాలి’’ ఆశగా చూస్తూ అంది.

‘‘సారీ!’’ నిర్మొహమాటంగా అన్నాడు. హర్టయినట్లు తల వంచుకుంది.

‘‘కీర్తన ఒప్పుకోదు. ఎందుకంటే ఆమె నన్ను కోచ్ గా నియమించుకుంది. మా టర్మ్ నేషనల్ గేమ్స్ వరకూ....’’చప్పున తలెత్తి ‘‘ఆ తర్వాత’’ ఆత్రంగా అంది.

‘‘అది నా ఇష్టం’’ మెల్లగా అన్నాడు.

ఆమె మొహం వెలిగి పోయింది. ‘‘నేను అప్పటి వరకూ వెయిట్ చేస్తాను’’ అంటుంటే అయోమయంగా చూశాడు.

కాసేపు కాలేజి విశేషాలూ, వాళ్ళ పేరెంట్స్ గురించి అడిగాడు. ఆమె చెపుతుంటే వింటున్నాడు.

ఎనిమిదిన్నర కాగానే కీర్తన ఆ గది లోకి వచ్చింది. అక్కడ మణి బిందుని చూసి సర్పద్రష్టలా ఆగి పోయింది.

‘‘హలో!’’ స్నేహంగా నవ్వింది మణి బిందు. మొహం చిట్లించుకుంది కీర్తన. గబగబా ప్రణీత్ దగ్గరికి వెళ్ళి ‘‘లేచిన దగ్గర నుంచీ ఇలాగే కూర్చున్నారా? హాస్పిటల్లో కూడా జనాలు మిమ్మల్ని, నన్ను వదిలేలా లేరు’’ తిరస్కారంగా అంది. అంత ఇండైరెక్ట్ గా అనగలిగినందుకు తన మీద తనకే ఆశ్చర్యం వేసింది.

మణి బిందు విని వూరుకుంది గానీ మాటకి బదులు ఇవ్వలేదు.

కీర్తన తను తెచ్చిన టిఫిన్, మిల్క్ ప్రణీత్ కి ఇచ్చింది. ‘‘బిందుకి కూడా ఇవ్వండి కీర్తనా!’’ చెప్పాడు. తలెత్తి రోషంగా ఏదో అనబోయింది. అతని పెదాల మీద నవ్వు చూసి ఏమన లేక ఏదో గొణుక్కుంటూ ఇచ్చింది. వద్దనకుండా తీసుకుంది మణి బిందు. తొమ్మిదింటికి వెళతానని చెప్పి లేచింది మణిబిందు. ప్రణీత్ కి ‘బై’ చెప్పి కీర్తనతో మొదటి సారిగా ‘‘విష్ యూ ఆల్ ది బెస్ట్’’ అంది.

‘‘ఇదో కొత్త డ్రామానా?’’ ఆమె గుమ్మం దాటుతుంటే మెల్లగా అంది కీర్తన.

‘‘చూద్దాం’’ సాలోచనగా చూస్తూ తల పంకించాడు ప్రణీత్.

*********************

భర్తతోనూ, సవతి పిల్లలతోనూ తెగతెంపులు చేసుకుని మృదులా దేవి పుట్టింటికి వచ్చేశాక తన పుట్టింటి వాళ్ళకి తన మీద గౌరవం, భయం, భక్తి తగ్గినట్లుగా తరచూ ఫీలౌతూ వుంది మృదులా దేవి.

దానికి తగినట్లే ఆస్తి కూడా మొత్తం చేజిక్క లేదు. వాటానే వచ్చింది.

అందుకే ఏదో రకంగా ఆ కుటుంబం లోని వాళ్ళ ఆస్థిని తన దాంట్లో కలుపుకోవాని ప్లానేస్తోంది.

అశోక్ దేనికీ లొంగడు. ఆ వాటా రాదు. మిగిలింది ముసలాయన, కీర్తన.....వాళ్ళిద్దరినీ ఎలాగో మభ్య పెట్టి ఏదో ఒకటి చేసి ఆ వాటాలు కొట్టేయాలి. ఆమెకిపుడు ఆస్తి దాహం, అధికార దాహం పట్టుకుంది. పుట్టింట్లో చేజారుతున్న అధికారాన్ని నిలుపుకోవాలి. అందరి ఆస్థి తన దాంట్లో కలవాలి.

అందుకే జగన్నాధంతో మంతనాలాడటం ప్రారంభించింది.

అప్పటికే వాళ్ళు ఓ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. దాన్ని అమలుచేసే అదును కోసం ఎదురు చూస్తున్నారు.

************

అశోక్ ఆఫీస్ వర్క్ లో బిజీగా వున్నాడు. ఎవరొచ్చినా తనని అడిగే లోపలికి పంపమని చెప్పాడు. ఆకాష్ అందుకు ఎక్సప్షన్ అని అందరికీ తెలుసు.

ఆకాష్ ఆఫీస్ లో అడుగు పెట్టగానే సుధాకర్, రమేష్ ను ఎదురయి విష్ చేశారు. తల పంకించి లోపలికి అడుగు పెట్టాడు. తలెత్తి చూశాడు అశోక్. ఆకాష్ ని చూడగానే అతని మొహం వికసించింది. చేతిలో ఫైల్ ని టేబుల్ మీద పెట్టేసి రిలాక్సుగా వెనక్కి వాలుతూ.....

‘‘కమాన్ యార్!’’ సాదరంగా ఆహ్వానించాడు. ఉస్సూరంటూ వచ్చి కుర్చీలో కూర్చుండి పోయాడు ఆకాష్. కీర్తన తనతో బాగానే మాట్లాడిందని మొన్న ఆకాష్ చెప్పిన దగ్గర్నుంచీ కాస్తంత ధైర్యంగా వున్నాడు అశోక్.అలాంటిది ఇప్పుడు ఆకాష్ ఇలా డల్ గా వుండటంతో అతని నొసలు ముడి పడ్డాయి.

‘‘ఏవయింది?’’ టేబుల్ చుట్టివచ్చి, అతని పక్కన ఛైర్ లో కూర్చుని భుజం మీద చెయ్యేసి అడిగాడు. తల విదిలించాడు ఆకాష్. మళ్ళీ ఏదో జరిగింది! అశోక్ నిర్ధారించుకున్నాడు. తను మౌనంగా వుండి పోయాడు.కాసేపటికి తేరుకుని జరిగిందంతా చెప్పుకొచ్చాడు.

‘‘అశోక్! నిజానికి ఇందులో కీర్తన తప్పు ఏముంది? జరుగుతున్న సంఘటనలు అలా వున్నాయి. నేను కీర్తనలో నమ్మకం కలిగించ లేక పోయాను. తనని అనుకుని లాభం లేదు. నాదే తప్పు.

మణిబిందు ఎగ్రెసివ్ గా వెళుతోందని తెలిసీ తనని అదుపు చేయ లేక పోయాను’’ ఆవేదనగా అన్నాడు.

‘‘వూరుకోరా....! కాలం అన్నింటికీ పరిష్కారాలు చూపిస్తోంది. కీర్తనలో నీ పట్ల ప్రేమ వుంది. కానీ దానికి అడ్డుగా లక్ష్యం వుంది. అది నెరవేరనీ ఆ ప్రేమ మీ ఇద్దరినీ కలుపుతుంది.

కాసేపు ఒకరినొకరు ఓదార్చుకుంటూ వుండి పోయారు. ఆఫీస్ కి టైమవుతోందని చెప్పి ఆకాష్ లేచాడు. గుమ్మం వరకూ రాబోతే వారించి తనే బయటకి వచ్చాడు.

తలుపు తీయగానే తుపు దగ్గర తచ్చాడుతున్న శ్రీధర్ గాభరాగా అక్కడ నుంచి తప్పుకోవడం ఆకాష్ దృష్టిలో పడింది. ఆ సంఘటన అతని మనసులో నిక్షిప్తమయి పోయింది.

*******************

ప్రణీత్ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేశాడు. అతను, కీర్తన తమ మామూలు దిన చర్యలో పడి పోయారు. కీర్తన ఇదివరకటి కన్నా కఠోరంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఆధునిక పద్ధతుల ద్వారా ఆమెలో ఫిజికల్ ఫిట్నెస్ ని కాపాడుతున్నాడు ప్రణీత్. ఎన్ని బాధలున్నా, అడ్డంకులున్నా ప్రాక్టీస్ విషయం వచ్చే సరికి అన్నీ మర్చి పోతోంది కీర్తన.

అనుకున్నట్లుగానే నేషనల్ సెక్షన్స్ లో కృష్ణా జట్టుని అలవోకగా ఓడించింది హైదరాబాద్ జట్టు. స్టేట్ లెవెల్ టోర్నమెంట్లో కీర్తన వైఫల్యం వాళ్ళలో బాగా ఆశలు పెంచింది. దేవుడు కరుణించి కీర్తన ఫామ్ ని  కోల్పోతే సెక్షన్స్ లో విజయ ఢంకా మోగించాలని వాళ్ళు ఆశ పడ్డారు.
అయితే అందుకు విరుద్ధంగా కీర్తన, ఆమె టీమ్ మేట్స్ తమ సహజ సిద్ధమైన జోరు కొనసాగించి నేషనల్ గేమ్స్ కి అర్హత సాధించడం తన కళ్ళారా చూసి సంతృప్తి పొందాడు ప్రణీత్.

జట్టు ఇపుడు బలంగా వుంది. టీంలోని సభ్యుందరూ శారీరకంగా, మానసికంగా దృఢత్వాన్ని సంతరించుకున్నారు. గెలవ గానే కీర్తన ప్రణీత్ దగ్గరికి వచ్చి...‘‘ఈ గెలుపు మీకు అంకితం’’ మెరుస్తున్న కళ్ళతో అంది. తల అడ్డంగా ఆడించాడు ప్రణీత్.

‘‘ఏం?’’ ఆశ్చర్యంగా అంది

‘‘నాకు కావలసింది నేషనల్ గేమ్స్ కప్.....’’ అతని స్వరంలో ఎవరి పట్లో కసి....దాహం తీరని పాంధునిలా వున్నాడు ప్రణీత్.

‘‘దానికి చాలా చేరువలో వున్నాం మనం’’ పట్టుదలగా అంది.

*************

టీంలో కర్తవ్య దీక్ష ప్రస్ఫుటంగా గోచరిస్తోంది.

కెప్టెన్ ఆట తీరు సవ్యంగా వుంటే, టీం అందరూ ఆ స్ఫూర్తిని అందుకుంటారా?

కీర్తన తన కొలీగ్స్ కి ఏవైనా చెప్పాల్సి వచ్చినపుడు ముందుగా తన లోటు పాట్లని సరిదిద్దుకునేది. అందుకే ఆమె చెప్పింది మిగతా వారికి వేదంగా వుంటుంది.

సెలక్షన్స్ నుంచి ఆమె ఇంటికి వచ్చిన మర్నాడు, ఆకాష్ కీర్తనని కలవడానికి వచ్చాడు.

అపుడు ఇద్దరూ ఇంట్లోనే వున్నారు. చదరంగం ఆడుతున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ వున్న ఆఇద్దరినీ చూసి అతనికి ఈర్ష్యతో ఒళ్ళు భగ్గున మండింది.

ఆకాష్ ని చూడగానే ముందుగా ప్రణీత్ లేచి నిలబడి...‘‘ప్లీజ్ కమిన్’ఆహ్వానించాడు.

(సశేషం)

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్