Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> బ్రతుకుదెరువు

bratukuderuvu

ఆనంద్ కారు దిగి లోనికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు.తన వెంట స్నేహితుడు జీవన్ కూడా వున్నాడు.అప్పుడు లోపలినుంచి అరవై ఏళ్ళ పార్వతమ్మ తలుపు తీసి చూసి కుడి చేతిని నొసటి మీదుంచుకొని తీక్షణంగా వాళ్ళ ముఖాల్లోకి చూస్తూ "ఎవరు బాబూ మీరు?" అని అడిగింది. ఆవిడకు చూపు కాస్త మాంద్యం.

"నేనే మేడం ఆనంద్ ను!మీరు చెన్నైలో వున్నప్పుడు సారు నన్ను మీ ఇంటికి తీసుకు వచ్చారు.నాడు మీరు నాకు కడుపు నిండా భోజనం కూడా పెట్టారు.తరువాత మీ అపార్టుమెంటులోనే కార్లను కడిగి తుడిచే వుద్యోగం కూడా తీసిచ్చారు" పాత విషయాలను గుర్తుకు తెచ్చాడు ఆనంద్ .

"ఓఁ... నువ్వు కార్లను తుడిచే అబ్బాయివి కదూ... లోనికి రండి బాబూ!"అంటూ ఆహ్వానించింది పార్వతమ్మ.

'పోనీలే!గుర్తుకు తెచ్చుకొంది అంతే చాలు'అనుకొంటూ జీవన్ను తీసుకొని ఆమె వెంట లోనికి వెళ్ళి సోఫాలో కూర్చొన్నాడు ఆనంద్ .
అప్పుడు పార్వతమ్మ "ఇప్పుడే వస్తాను బాబూ"అంటూ లోనికెళ్ళి కోడలితో ఏదో చెప్పి వచ్చి తనూ ఓ కుర్చీలో కూర్చొంది.ఈ లోపు ఆనంద్ తన సారు కోసం ఇంటిని మొత్తం పరికించి చూశాడు .సారు జాడ కనబడలేదు.

"ఏమిటీ!నీ కళ్ళు మీ సారుని అంటే మా వారిని వెతుకుతున్నాయిలా వుంది?!"

"అవును మేడం! మా సారుని చూసి దాదాపు ఏడెనిమిదేళ్ళు అయ్యిందనుకొంటాను"

"ఆవును బాబూ!మా వారు వుద్యోగానికి రాజీనామా చేశారు. వచ్చిన డబ్బుతో మా అబ్బాయికి వుద్యోగం, పాపకు పెళ్ళి చేశాం! వీళ్ళేమో...."అని ఏదో చెప్ప బోతుండగా కోడలు పిల్ల కాఫీ తెచ్చి టీపాయి మీదుంచి లోనికెళ్ళింది.కాఫీ తాగారు.

మళ్ళీ ఆనందే "ఏదో చెప్పొచ్చారులా వుంది మేడం"అని అడిగాడు.

"ఆఁ...అదే నాడు నీలా  మా వాడకి  చిన్న వుద్యోగంలో కుదిరి  స్థిరపడాలని లేదు బాబూ!ఒక్కసారే అందలమెక్కాలన్నది వాడి కోరిక.ఇక తప్పదన్నట్టు వాడికోసం మా వారు నిర్భంధ పదవి విరమణ పొంది  వచ్చిన డబ్బుతో బోలెడు లంచం కట్టి ప్రభుత్వపు రెవెన్యూ శాఖలో వుద్యోగాన్ని తీసిచ్చాం. అలాగే ఎదిగిన పిల్లను ఇంట చాన్నాళ్ళు వుంచుకో కూడదని ఆమె డిగ్రి పూర్తి చేస్తూనే మిగిలి వున్న డబ్బుతో పెళ్ళి చేసిపెట్టి  కన్న బాధ్యతలను తీర్చుకున్నాం.పోతే మావారికి ఆ  ప్రయివేటు కంపెనీలో పెన్షనా పాడా... ఏమి లేదుగా!ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మాకు జబ్బు చేసినా లేక కనీసవసరాలక్కూడా పిల్లల్ని ఎదురు చూసే పరిస్థితి వచ్చింది.  సపరేటుగా వండుకు తినడానికి మాకు ఆర్థిక ఇబ్బందులు అడ్డమొచ్చాయి.ఇక  తప్పని పరిస్థితుల్లో కొడుకూ,కూతుర్ని ఆశ్రయించే నిర్భందానికి లోనైయ్యాం. వాళ్ళే ఏర్పాటు చేసిన  వంతులు వారి పద్దతితో మూడునెల్లు నేను అబ్బాయి వద్ద వుంటాను.

అప్పుడు మావారు వైజాగ్ లో మా అమ్మాయి వద్ద వుంటారు.నాకు అబ్బాయి వద్ద మూడు నెల్లు పూర్తవుతూనే వైజాగ్ వెళ్ళి పోతాను. వారు ఇక్కడికి వచ్చేస్తారు.మొత్తంలో  భార్యభర్తలుగా మేమింకా బ్రతికే వున్నా ప్రైవసీ కోల్పోయి. దూరదూరంగా ఎవరికి వారే నన్నట్టు నిరాధారులుగా బ్రతుకుతున్నట్టు వుంది బాబూ!కాకపోతే  పెళ్ళిళ్ళు, పురుళ్ళు, పబ్బాలని బంధువుల ఇళ్ళలో జరిగే శుభ కార్యాల్లోనే మేమిద్దరం కలుసుకోవడాలు జరుగు తుంటాయి. వారిప్పుడు వైజాగ్ లో మా పాప వద్ద వున్నారు.పోనీ...  నువ్వొచ్చిన పనేమిటో చెప్పనే లేదూ?"తన పరిస్థితిని ఏకరు పెట్టన తరువాత ఆడిగింది పార్వతమ్మ.

"నాకు పెళ్ళి కుదిరింది మేడం.ఇంటర్ వరకు చదువుకొని ఇంటి నుంచి పారిపోయి వచ్చిన నాకు ఉపాధితో పాటు  బ్రతకాలని జీవితం మీద ఆశ కల్పించిన ఆ మహానుభావుడికి మొదటి పెళ్ళి పత్రికను యిచ్చి ఆయన ఆశీర్వాదాలను పొందాలని వచ్చాను"అని జీవన్ చేతిలో వున్న పత్రికను, స్వీటు బాక్సును పళ్ళెంలో వుంచి పార్వతమ్మ చేతికందించి సాష్టాంగపడి నమస్కరించాడు ఆనంద్.ఆశీర్వదించి పైకి లేపింది పార్వతమ్మ. 'వస్తాం మేడం'అంటూ వెళ్ళి కార్లో కూర్చొన్నారు ఆనంద్ జీవన్ లు.

"ఈ కారు నీదా బాబూ"తెలుసుకోవాలని కారు వద్దకొచ్చి అడిగింది పార్వతమ్మ.

"అవును మేడం.ఈ వృత్తిలో బాగా సంపాయించడమే కాదు నేను నాలాంటి మరో ఇద్దరికి ఉపాధి కూడా కల్పించాను.రెండంతస్థుల మేడను ఆధునిక వసతులతో కట్టుకున్నాను.ఈ కారునూ కొన్నాను.బ్యాంకులో కొంత డబ్బును ఫిక్సడ్ లో వేశాను"అంటూ కారు స్టార్టు చేశాడు. ఆశ్చర్యంగా కారు వీధి మలుపు తిరిగే వరకు అక్కడే నిలబడి చూస్తూ వుండి పోయింది పార్వతమ్మ.

"ఏరా!టౌను దాటి దాదాపు వంద కిలో మీటర్లకీవలకు వచ్చి తొలి పత్రికను యిచ్చి వెళుతున్నావ్ !వీళ్ళు అంతటి ముఖ్యమైన వాళ్ళా నీకు?!"అడిగాడు జీవన్ .

"అవునురా.విన్నావుగా!నేనివాళ ఇంతటి ఉన్నత స్థితిలో వున్నానంటే అందుకు కారణం ఆ వృద్ధ దంపతులే!"

"ఎలా?వివరంగా తెలుసుకోవాలనుందిరా"తెలుసుకోవాలన్న కుతూహలంతో అడిగాడు .

"చెపుతాను విను.మా వూరిలో నాకు వుద్యోగం లేదని తేరకే తిని గంగిరెద్దులా వూరు తిరిగొస్తున్నానని రోజూ అమ్మానాన్నలు  తిడుతూ వుంటే  ఓ రోజు చెప్పా పెట్టకుండ ఈ చెన్నైకి పారి పోయొచ్చాను. నాలుగు రోజులకు వున్న డబ్బు ఖర్చయి పోగా ఆకలికి తట్టుకోలేక భిక్షమెత్తుకు తినాలన్న నిర్ణయానికొచ్చాను.సిగ్గు వీడి ఒకింటి ముందాగి   'మాతా కవళం'అని అడిగాడు.

ఒకావిడ  అన్నపు గిన్నెతో బయటికి వచ్చి నన్ను ఏగా దిగ చూసి"ఏరా కుర్రాడివి.బాగున్నావ్ !ఏదేని పని చేసుకొని బ్రతగ్గూడదూ"అని తల మీద మొట్టి తెచ్చిన అన్నాన్ని తిరిగి తీసుకువెళ్ళి పోయింది.ఇలా రెండు మూడిళ్ళలో జరిగింది. అది నాకు అవమానంగా తోచింది.అది దూరంనుంచి గమనించాడు ఆ దయాకర్ సార్! నా దగ్గరకు వచ్చాడు.జాలితో నన్ను చూసి బైకులో కూర్చోమన్నాడు.తనతో ఇంటికి తీసుకు వెళ్ళాడు. వరాండా లోని అరుగు మీద కూర్చోమన్నాడు,తను లోనికి వెళ్ళిపోయాడు.అయిదు నిముషాల్లో నాకు విస్తరి వేసి భోజనం వడ్డించింది పార్వతమ్మ మేడం. ఆవురావురంటూ తిన్నాను.చేతులు కడుక్కొంటుండగా దయాకర్ సారు భోంచేసి వచ్చి అక్కడున్న కుర్చీలో కూర్చొన్నాడు.

"ఆఁ ...చెప్పవయ్యా!నీ వూరూ,పేరు, తతిమ్మా వివరాలను చెప్పు?"అన్నాడు.

"నా పేరు ఆనంద్ సార్ !మా వూరు నెల్లూరు దగ్గర అల్లూరు.ఇంటర్ వరకూ చదువు కొన్నాను. నాకు అమ్మా,నాన్నా,చెల్లి, తమ్ముడు వున్నారు.నాన్న సంపాదనతో ఇల్లు గడవడం  కష్టంగా వుండడంతో నన్ను అక్కడి పొలం పనులకు కూలీగా వెళ్ళ మన్నారు.ఇంటరు వరకూ చదువుకున్న నాకు ఇష్టంలేక వూరికే వున్నాను సార్ !"అని సంశయిస్తూ చెప్పాను.

"అర్థమైంది.అంటే తమరు ఇంటరు వరకూ చదివారు కనుక కూలి పనికి వెళ్ళడం ఇష్టంలేక తిడితే పారిపోయి ఇటు చెన్నైకి వచ్చారన్న మాట.నాకు తెలీక అడుగుతున్నాను.నువ్వు చదివిన ఇంటరుకు కలెక్టరు వుద్యోగం వచ్చుదనుకొంటున్నావా?"

"కాదుసార్ !ఏదేని ఆఫీసులో గుమాస్తా వుద్యోగం చూసుకుందామని..."

"అదీ కష్టమేనయ్యా. చూడూ! పెద్ద వుద్యోగాలు వస్తాయని ఎదురుచూడ్డం సమయాన్ని వ్యర్థం చేసుకోవడం తప్ప మరొకటి కాదు.అందుకే ఏ పనికైనా సిధ్ధపడి వుండాలి. నా దృష్ఠిలో దోపిడి,దొంగతనాలు తప్ప కడుపు కూటికి ఏ పనైనా చెయ్యొచ్చు.నీకు నేనే ఓ పని కల్పించి ఇస్తాను.సంపాదన తక్కువే !కానీ..నువ్వు తెలివి గల వాడివైతే ఆ పని ద్వారా వున్నత స్థాయికి ఎదుగుతావన్నది నా నమ్మకం.చెపుతాను చేస్తావా!నువ్వు  ఓకే అంటే ఇప్పుడే నాఫ్రెండ్సుతో మాట్లాడాలి!"

"ఓకే సార్ ! ఏ పనైనా సరే చేస్తాను!నేను పస్తులుండ కూడదు"చెప్పాను.

"ఓకే!అలా దృఢమైన నిర్ణయం తీసుకోవాలి"అంటూ చేతిలో వున్న సెల్ ఫోన్ నొక్కాడు'హల్లో...'అని ఒకతనితో మాట్లాడాడు.'ఓకే...ఓకే'అంటూ మరో ఏడుగురితో అలాగే మాట్లాడాడు.నేను ఆయన ముఖంలోకి ఆదుర్దాగా చూస్తూ వున్నాను.ఫోన్ పెట్టే చిరునవ్వుతో "చూడు ఆనంద్ !నువ్వు చేయబోయే పని కార్లు కడగడం,శుభ్రంగా తుడిచి పెట్టడం.ఈ గేటెడ్ కమ్యూనిటి అపార్టుమెంటులో దాదాపు రెండు వందల కార్లు వున్నా ప్రస్తుతానికి పది కార్లకు ఆర్డర్లు తెచ్చుకున్నాం.వాటిని వారానికి రెండు సార్లు కడిగి తుడవాలి..కారుకు మాసానికి రెండు వందలంటే ప్రస్తుతానికి నువ్వు నెలకు రెండు వేలు సంపాయించుకోవచ్చు.అవి నీ తిండికి సరిపోతాయ్ !భవిష్యత్తులో పని తీరుని బట్టి నీ ఎదుగుదల వుంటుంది"చెప్పి ముగించాడు సారు.

"అలాగే సార్ !మీ రెలా చెపితే అలా చేస్తాను."అని నా మనస్ఫూర్తిగా చెప్పాను.

"ఓకే!ఓనరు పేరు,ఇంటి నంబరు,టెలిఫోన్ నంబర్లుతో పాటు కారు నంబర్లు కూడా లిస్టు ప్రిపేర్ చేసి వుంచుతాను.సాయంత్రం వచ్చి తీసుకువెళ్ళు.అవును. ఇంతకు నువ్వెక్కడుంటున్నావ్ ?"

"ఓ ప్రెండు గదిలో !ఇక్కడే...దగ్గరలోనే!"

"ఓకే! తక్కువ స్థాయి పనని ఫీలవకు.తెలివి తేటలు, వినయ విధేయతలతో నిజాయితీగా నడచుకుంటే రేపు ఈ సంపాదనే రెండింతలు,నాలుగింతలని ఎంతో సంపాయించుకోవచ్చు"

"అలాగే సార్ !వస్తాను"అంటూ వెళ్ళిపోయాను. రెండవ రోజు నుంచే ఆ పని ప్రారంభించాను.విషయం అలా అలా కార్లు వున్న వాళ్ళందరికీ తెలిసి పోయింది,రెండు మూడు నెలల్లోనే వంద కార్లయ్యాయి.సంపాదనా పెరిగింది. సంవత్సరం తిరక్కుండానే మరో అపార్టు మెంటు వాళ్ళు  వాల్ల కార్లను కూడా శుభ్రం చేసి పెట్టమన్నారు.ఆ పనీ  ఒప్పుకొన్న నేను వూరినుంచి ఇద్దరు బంధులబ్బాయిలను పిలిపించుకొని వాళ్ళకూ ఉపాధి కల్పించాను.నిజాయితీగా పని చేస్తూ గడచిన ఏడేళ్ళలో ఇంతటి వాడనయ్యాను. అయితే పని వత్తిడి వల్ల చాన్నాళ్ళు సారును చూడకుండా వున్న నేను ఓ రోజు పథకం ప్రకారం కృతఙ్ఞతలు చెప్పడానికి సార్ ఇంటికి బయలుదేరి వెళ్ళాను.అయన  అప్పటికే అక్కడ లేరు. నిర్భంద పదవి విరమణతో అన్నీ సర్దుకొని వూరికి వెళ్ళి పోయారని తెలిసింది.అక్కడి వాళ్ళనడిగి అడ్రసు తెలుసుకున్నాను.కాని సందర్భం కలసిరాక వెళ్ళలేక పోయాను.ఆ సందర్భమనేది ఇవాళ నా పెళ్ళి రూపంతో ఇలా కలిసి వచ్చింది"అంటూ కధ మొత్తం వాడితో చెప్పి వూపిరి పీల్చుకున్నాను.

"కరక్టురా!నీ జీవితానికి వెలుగులు నింపి నువ్వు ఇంతటి వాడవైయ్యేందుకు కారకుడైన ఆ మహానుభావుడికి నీ జీవిత పర్యంతం కృతఙ్ఞతగా వుండాలి."

"తప్పకుండారా!నిజానికి నాకు తల్లితండ్రుల్లాంటి ఆ దంపతులు వాళ్ళు  ఇష్ట పడితే ఇద్దరిని నావద్ద వుంచుకోవాలని  డిసైడై పోయానురా!అలా వాళ్ళు ఇష్టపడక పోతే నెలకు కాస్త డబ్బును వాళ్ళ ఆరోగ్యావసరాలాకోసం  బ్యాంకులో వేస్తాను.ఆడబ్బును వాళ్ళకోసమే ఉపయోగిస్తాను.పెళ్ళికి ఇంకో నెలుందిగా! ఈలోపు మనిద్దరం సారును కలుద్దాం"అంటుండగా ఇల్లు చేరుకుంది కారు. కారును పార్కు చేసి ఇంటిలోకి నడిచాడు ఆనంద్,జీవన్ లు.

మరిన్ని కథలు
jati gouravam